Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Apart (Mentality) by Phanibabu Bhamidipaati

ఈ సంచికలో >> శీర్షికలు >>

అహం బ్రహ్మాస్మి - జయలక్ష్మి జంపని

Aham Brahmasmi

హృదయములో నేను, నేను అంటూ ఒక పదం నిత్యమూ నిరంతరం ఉదయిస్తూ ఉంటుంది. ఆ పరబ్రహ్మమే నేను రూపంగా స్పురిస్తోంది. గిన్నెలో నీళ్లు పోసి పొయ్యిమీద పెడితే నీళ్లు బాగా కాగాక శబ్దం వస్తుంది. అగ్నియే గిన్నె ద్వారా నీటిలో ప్రవేశించి ఆ శబ్దం చేస్తోంది. నీటిలో అగ్నిదేవుని కంటే వేరుగా ఇంకో వేడి లేదు. అదే విధంగా హృదయంలో ప్రవేశించి పరబ్రహ్మ నేను నేను అని పలవరిస్తూ ఉంటాడు. నేను యొక్క మూలాన్ని గ్రహిస్తే అదే ఆత్మ సాక్షాత్కారం. కాబట్టి హృదయంలో ప్రవేశించి, అంటే మనస్సును స్వరూపంలో విలీనం చేసి ఆత్మ నిష్టులం అయి ఉండటమే కర్తవ్యం.

మనస్సు ఇంద్రియాలనే కిటికీల గుండా సంసారములోకి పరిగెత్తుతుంది. వ్యక్తి మనస్సు అనే రధం ఎక్కి సంసారంలో తిరుగుతూ ఉంటాడు. మనం ధ్యానం చేయాలి. ధ్యానం  ద్వారా ఈ కిటికీలను ముసివేస్తే మనస్సు బయటకు వెళ్ళలేదు. అపుడు మనస్సు అంతర్ముఖమవుతుంది. ఈ ధ్యానమే దహర విద్యగా చెప్పబడింది. ఈ ధ్యానం సక్రమంగా కొనసాగాలంటే శ్రవణ, మననాలు ఉండాలి. గృహస్తులు తమ ధర్మాన్ని పాటిస్తూనే ఈ సాధనను కొనసాగించాలి. మనస్సు ఒకదాని నుండి ఇంకొక దానిలోకి పరుగులు పెడుతూ ఉంటుంది. కాబట్టి ధ్యానం ఆటంకం అనుకోకుండా సాధన చేయాలి. అంతిమంగా సాధకుడు తన స్వరూపాన్ని తెలుసుకుని జీవన్ముక్తుడు అవుతాడు.


మానసికమయిన శక్తిని, సమయాన్ని కేటాయించి భగవంతుని ఆరాధించే వారు సాధకులని అనబడతారు. సాధకులు నాలుగు రకాల కర్మలను ఆచరిస్తూ వుంటారు.

మొదటిది కాయిక కర్మ. మనం చేసే పూజలను కాయిక కర్మలు అంటారు.

రెండవది వాచిక కర్మ. మనం చేసే పారాయణాలు, స్తోత్ర పఠనాలు వాచిక కర్మ. మనం భగవంతునిఫై చేసే ప్రేమయే భక్తి. వ్యాపారస్తునికి ధనంఫై , భోగికి భోగాలఫై ప్రేమ ఉంటుంది. అటువంటి ప్రేమ భక్తునకు భగవంతునిఫై ఉండాలి. కట్టు, బొట్టు, జుట్టు, ఫై ఫై బహ్యపు గుర్తులు భక్తికి సంకేతం కావచ్చు. కానీ అవి మాత్రమే భక్తి కాదు. భగవద్గీతలో కృష్ణుడు 12వ అధ్యాయములో భక్తుని లక్షణాలను వర్ణించాడు. అందులో బాహ్య చిహ్నం ఒక్కటి కూడా లేదు. వాటికి ప్రముఖ స్థానమిస్తే హృదయంలోని అనురాగ రూపంలో ఉండే భక్తి మీద ఏకాగ్రత తగ్గుతుంది. మనస్సులోని ప్రేమకు భక్తి అని పేరు. 


మూడవది యోగం. మనం దేహంతో కర్మను, మనస్సుతో భక్తిని చేస్తాము. దేహాన్ని, మనస్సు ను నిలబెట్టేది ప్రాణం. యోగ ప్రక్రియలో ఆసనంలో కుర్చుని ప్రాణాయామం చేస్తుంటే మనస్సు ప్రాణంలో ఐక్యం అవుతుంది. దాని ద్వారా దేహానికి ఒత్తిడి కలిగి మనస్సుకి కూడా యోగాభ్యాసం ద్వారా మంచి విశ్రాంతి, మనస్సుకు శాంతి లభిస్తాయి. యోగాభ్యాసం వలన మనస్సు యొక్క చంచలత తగ్గి మనస్సు, ఇంద్రియాలు వశం అవుతాయి.

నాల్గవది జ్ఞానం. జ్ఞానం లేకుండా ఏ పని చేసినా, సాధన చేసినా  దాని ఫలితం తక్కువే. ఏ పని అయితే పూర్తిగా తెలుసుకుని చేస్తామో అది మరింత శక్తివంతం అవుతుంది. రామ నామం జపించిన దాని మహిమను తెలుసుకుని, ఆస్వాదిస్తూ జపించాలి. చుట్టూ భక్తులు లేకపోతే సాధకుడు. చుట్టూ భక్తులు ఉంటె గురువు. గురువు అని ముద్ర పడ్డవారు శిష్యులకు బోధ చేస్తూ ఉండాలి. వ్యక్తి యొక్క అంతర స్వరూపం జ్ఞానమే కానీ కర్మ కాదు. గీతలో కృష్ణుడు భక్తిని, కర్మను చాలా వివరించి చెప్పాడు. అన్నమయంలో కర్మ,  ప్రాణమయమ్  లో  యోగం, మనోమయం లో భక్తి, విజ్ఞాన మయంలో జ్ఞానం, ఆనంద మయంలో  వ్యక్తిత్వం ఉంది, అంతిమంగా వీటన్నిటికీ అతీతంగా పరమాత్మ తత్వం ఉంది. ఆ తత్వాన్ని చేరే ఉపాయమే హృదయస్థలం. 


కర్మల ద్వారా కోరికలు తీర్చుకోవడం వలన సంసారానికి మరింత బలం వస్తుంది . కోరికలు తీరే కొలది కొత్త కొత్త కోరికలు పుట్టుకువస్తాయి.  ఫైగా కోరికల నుండి భయాలు పుడతాయి. ఆ భయాలను దూరం చేయడానికి మరికొన్ని కర్మలు చేయాల్సి వస్తుంది . ఈ సాధనాలన్నీ నదులు సముద్రంలో కలుస్తున్నట్లు ఆత్మ నిష్ఠ అనే పరమార్థంలో విలీనమవుతాయి. ఆ పరమార్థాన్ని చేరుకోలేని సాధన, సముద్రాన్ని చేరని నది యొక్క గమనం లాగా  వ్యర్థం.

కల్లోలితమై ఉండే మనస్సులో ఒత్తిడి పెరిగి అనేక రోగాలకు కారణమవుతుంది  మన శరీరం. మధుమేహం , కీళ్లనెప్పులు, చర్మ వ్యాధులు ఇవన్నీ మానసిక వత్తిడి నుండే ఆవిర్భవిస్తాయి. చాలా వ్యాధులకు మనస్సు కారణం అవుతోంది. మనస్సును నిర్మలంగా ఉంచుకుని ధ్యానం చేస్తూ ఉంటె కొత్త రోగాలు రావు. ఉన్నవి తగ్గుతాయి. ఎక్కడికి వెళ్లినా మనస్సు మనతోనే  ఉంటుంది కాబట్టి మనం అంతర్ముఖులం అయి వీలయినంత మౌనం పాటిస్తూ ధ్యానాన్ని బాగా సాధన చేయాలి.

మనం ఇంద్రియ భోగాల ప్రాధాన్యతను అనుసరించి జీవితం గడిపితే మనస్సులో ప్రశాంతత చిక్కటం దుర్లభం . ఎందుకంటే సంసారిక భోగాలలోకి ప్రవేశించేటప్పుడు చాలా ఆకర్షణీయంగా, మధురంగా ఉంటాయి. కానీ వాటిలో చిక్కిన తర్వాత బయట పడటం చాల కష్టం. భోగలాలసత మనిషిని పతనం అంచులోకి నెట్టివేస్తుంది. భోగాలు మనిషిని శారీరకంగా, మానసికంగా క్రుంగదీస్తాయి. కాబట్టి మనం మనస్సుని నియంత్రించడం అభ్యసిస్తే సంసారిక కర్మలు సులభమవుతాయి.
 

మన మనస్సు రాగ ద్వేష కలుషితంగా ఉండటం వలన మనకు ఇవేమీ అనుభవానికి రావడం లేదు. అందువలన మనం చేయాల్సిందల్లా మనస్సు యొక్క వేగాన్ని తగ్గించి మన హృదయం చెప్పేది వినాలి. అపుడు హృదయంలో బ్రహ్మానందమే వెళ్లి విరుస్తుంది. ఇదే కర్మ, భక్తి, ఇదే యోగము, ఇదే జ్ఞానము.

మరిన్ని శీర్షికలు
aadarsham small story