Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Vantillu - Totakura Pulusu

ఈ సంచికలో >> శీర్షికలు >>

భోజన ప్రియులు - బన్ను

bhojana priyulu

ఓ సారి హాలిడేస్ కి నేను, ఓ మీడియా మిత్రుడితో కలిసి గోవా వెళ్ళాను. అక్కడ ప్రముఖ రెస్టారెంట్ 'బ్రిట్టోస్' అని భాగా బీచ్ లో వుంది. అక్కడ కూర్చున్నప్పుడు అతను 'నేను భోజన ప్రియుడినండీ... రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం భోజన ప్రియులు కాదు' అన్నాడు

"ఎందుకు? ఆయన సరిగ్గా భోం చేయరా?" అనడిగాను. దానికాయన నవ్వి.. మీకో సందర్భం చెబుతా వినండి అంటూ "ఓ సారి నేను, వర్మ గారు, మరో రచయిత 9గంటలకి సినిమా డిస్కషన్ లో కూర్చున్నాము. సమయం మధ్యాహ్నం 3 అవుతోంది. కానీ 'లంచ్' గురించి వర్మ గారు అస్సలు మాట్లాడటం లేదు. మాకు కడుపులో ఎలుకలు మొదలయ్యాయి. ఇక ఉండలేక 'సార్.. లంచ్ చేసి కంటిన్యూ చేద్దామా?' అని అడిగేశాం. ఆయన 'యా' అంటూ బెల్ కొట్టి భోజనం ఇక్కడే పెట్టేయమ్మా అని వచ్చిన అబ్బాయికి ఆర్డరేశారు. ఆ అబ్బాయి నాలుగు రకాల కూరలు, పప్పు, రసం, పచ్చళ్ళు, పొడులు, రోటీలు, రైస్, పెరుగు, అన్నిటితో టేబుల్ నింపేశాడు. రాము గారు ప్లేటు తీసుకొని 5 రోటీలు, చికెన్ కర్రీ వేసుకొని గబగబా తీసేసి చేతులు కడిగేసుకున్నారు. మేము పొడులతో ప్రారంభించి, పెరుగన్నంలో ఆవకాయ నంజుకొని ముగించాము. " అన్నారు.

"అదేమిటీ ఆయన భోజన ప్రియులు కాదన్నారు కదా.. మరి బాగానే భోం చేశారంటున్నారు?"  (నా దృష్టిలో ఎక్కవగా తినేవాళ్ళు భోజన ప్రియులు).

"కాదండీ ఆయన ఆకలిని ఆపుకోడానికి తిన్నారు. మేము భోజనాన్ని ఆస్వాదిస్తూ తిన్నాము. అదీ తేడా!" అన్నారు.

అప్పుడర్థమైంది 'ఫుడ్ లవర్ ' అంటే ఫుడ్ ని లవ్ చేస్తూ తినటమని!

చిన్నప్పుడు మా తాత గారు చెప్పిన ఒక సూక్తి గుర్తొచ్చింది. "కొందరు తినడానికి బ్రతుకుతారు. మరికొందరు బ్రతకడానికి తింటారు" అని...!!!

మరిన్ని శీర్షికలు
mirchi music awards south 2012