జీవిత పరమార్థం - రంగనాధ్ సుదర్శనం

what is life

అమెరికా నుండి వచ్చి నెలరోజులు అయింది. దైవదర్శానాలు , చుట్టాలు , స్నేహితుల పలకరింపులు పూర్తి అయ్యాయి.

మరో వారం రోజుల్లో తిరుగు ప్రయాణం, రాత్రి భోజనాలయ్యాక అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము.

గతంలో నాన చెప్పన మాటలే మళ్లీ చెపుతున్నాడు.

నాన ఆనంద్ ఈ మధ్య మా ఆరోగ్యాలు అంత బాగోవటం లేదురా, ఉన్నది నువ్వొక్కడివే, మేమా.. అక్కడికి రాలేము, మనకున్నది చాలదా, మాకు దూరంగా ఉండటం అవసరం అంటావా..ఒకసారి ఆలోచించు నానా అన్నాడు.

నాన్నా ఇక్కడుండి ఏం చెయ్యమంటారు నన్ను నా వల్ల కాదు , అంటూ ముక్తసరిగా ముగించి, రేపు నేను హైద్రాబాద్ వెళుతున్నానని చెప్పి నా గదిలోకి వెళ్లాను.

నా బాల్య స్నేహతుడు వాసు ఇప్పుడు హైదరాబాదు లో ఉంటున్నాడని తెలిసింది, గతంలో వచ్చినప్పుడు కూడా వాణ్ణి కలవటం కుదరలేదు, కానీ ఈసారి వాణ్ణి ఎలాగైనా కలవాలని, మరో స్నేహితుని దగ్గర వాడి అడ్రస్ తీసుకున్నాను.

మరునాడు ఉదయమే హైద్రాబాద్ బయలుదేరాను, కారు స్పీడ్ ఎనబై దాటనీయవద్దని డ్రైవరుకు చెప్పి కళ్ళు మూసుకున్నాను.

ఒక్కసారిగా... చిన్ననాటి విషయాలు గుర్తుకొచ్చాయి.
*****************
వాసు నేను ఒకే క్లాసు , బెంచమెట్స్ కూడా క్లాసులో ఎప్పుడు వాడే ఫస్ట్, చిన్నప్పుడే వళ్ళ నాన పోయారు, పేద కుటుంబం నా బుక్స్ తీసుకువెళ్ళి చదువుకునేవాడు.

ఆటల్లో కూడా వాడున్న టీమ్ ఖచ్చితంగా గెలిచేది.

చిన్నప్పుడు వాసు న్యూస్ పేపర్ తో పతంగులు తయారు చేసేవాడు, అలాగే వెదురు బొంగుతో రంగులు చిమ్మే గొట్టం , అగ్గిపెట్టె ఫోన్లు, సిగరెట్ అట్టలతో చార్మినార్ బొమ్మ లాంటివి చేసి అందరికీ ఇచ్చేవాడు.

టెన్త్ తరువాత ఇద్దరం విడిపోయాం, నేను హైద్రాబాదు లో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్ళాను.

వాడు ఊరిలోనే డిగ్రీ పూర్తి చేశాడు.
ఆ తరువాత వాళ్ళమ్మ కూడా జరిగిపోయిందిని, వాడు హైదరాబాద్ వెళ్లి పోయాడని తెలిసింది.

సుమారు పదకొండేళ్ల తరువాత మళ్ళీ ఇప్పుడే కలువబోతున్నాం.

పెద్దగా కష్టపడకుండానే అడ్రస్ దొరికింది.

"వాసు మొబైల్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్"

గ్లాస్ డోర్ వెనకాల కూర్చొని వాసు ఎవరితోనో మాట్లాడుతున్నాడు.

సర్ప్రైజ్ చేద్దామని నేను ఫోన్ కూడా చెయ్యకుండా వచ్చాను.,

డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాను, లోపల విశాలంగా ఉంది పది వరకు నెట్ కేబిన్స్ ఉన్నాయి, పక్కనే నలుగురైదుగురు పిల్లలు మొబైల్స్ రిపేర్ చేస్తున్నారు.,

నన్నుచూడగానే వాసు ఆశ్చర్యంతో ఒరేయి ఆనంద్ ఎన్నాళ్ళకురా అంటూ లేచి వచ్చి నన్ను ఆలింగనం చేసుకున్నాడు.

ఏరా.. మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చావు, అమెరికా నుండి ఎప్పుడొచ్చావు అన్నాడు వాసు.

నా సంగతి సరేరా, నువ్వెలా ఉన్నావ్ ముందు చెప్పు అన్నాను,.

రారా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ తన క్యాబిన్ లోకి తీసుకెళ్లాడు.

ఫోన్ చేసి రహీమ్ చాచా ....దోస్త్ వచ్చిండు స్పెషల్ ఇరానీ చాయ్ ఔర్ థండా పాని బిజావో అన్నాడు వాసు.

నాకేంటిరా చాలా బాగున్నాను ,
నీ సంగతి చెప్పు అమ్మా, నాన ఎలా ఉన్నారు, భాభీ పిల్లలు ఎలా ఉన్నారు అన్నాడు.

అందరం బాగున్నాం రా అన్నాను. ,

ఈ లోగా వాసు ఫోన్ రింగయ్యింది,

నమస్తే ఎండీఓ సార్ బాగున్నారా.,

ఓ.కే.

కానీ వాసు నువు షాప్ లోనే ఉన్నావా?

ఉన్నాన్ సార్.

సరే షాప్ ముందే ఉన్నా వస్తున్నా.,

రండి సార్.. అన్నాడు వాసు.,

వచ్చిన వ్యక్తిని గౌరవంగా లోనికి ఆహ్వానించాడు వాసు.,

రమ్మంటే నేనే వచ్చే వాణ్ణి కదా సార్, మీరిక్కడిదాక వచ్చారు.,అన్నాడు వాసు.

పర్వాలేదు వాసు ..బర్త్ డే ఇన్విటేషన్ కార్డ్, వీడియో ప్రోమో చాలా బాగున్నాయి.,

మేడం మస్తు ఖుషి అయ్యింది,
వాసు కి చాలా.. చాలా థాంక్స్ చెప్పమంది.

అలాగే ఫంక్షన్ వీడియో కూడా నిన్నే మాట్లాడమని చెప్పింది.
ఆ బాధ్యత కూడా నీదే వాసు.

మంచిది సార్ అలాగే., అన్నాడు వాసు.

ఇదిగో వాసు ఈ డబ్బులుంచు అని ఐదు వేలు వాసు చేతిలో పెట్టాడు.,

అరే... వద్దు సార్ ఇన్నెందుకు వేయ్యి రుపాయలు చాలు ..
అంటూ మిగిలిన నాలుగు వేలు బలవంతంగా తిరిగి ఇచ్చాడు వాసు.

ఇంతలో రహీమ్ చాచా చాయి, నీళ్లు తీసుకొని వచ్చిండు.

సార్ చాయి తగి పోదురు కూర్చోండి అన్నాడు వాసు.

రహీమ్ చాచా నీకెందుకు తక్ లీఫ్ నువ్వెందుకు వచ్చినవ్ ...చోటుగాన్ని పంపొచ్చుగా అన్నాడు వాసు.,

అరే వాసు బేటా.. నీకు చాయి తేవడం కంటే నసీబ్ ఏముంటుంది చెప్పు ...అంటూ నీళ్లు తాగాక అందరికి చాయ్ పోసి ఇచ్చిండు.

అన్నట్టు వాసు నువ్ చెప్పిన ఫాతిమా కు షాది ముభారరక్ చెక్ వచ్చింది., వచ్చి తీసుకోమని చెప్పు.

అలాగే ఆ రాజమ్మ కు కూడా పింఛను బ్యాంకులో పడ్డది తీసుకొమ్మని చెప్పు అంటూ ఏండీఓ సార్...వస్తా వాసు అంటూ లేచాడు.,

సార్ ..వీడు ఆనంద్ అని నా బెస్ట్ ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చిండు అని పరిచయం చేసిఒడు,

నైస్ టు మీట్ యూ అంటూ ఏండీఓ ఆనంద్ తో చేయి కలిపి, వాసు లాంటి స్నేహితుడు దొరకడం అదృష్టము బాబు అంటూ బైటికి నడి చాడు.

రహీమ్ చాచా ముబారఖ్ హో ఫాతిమా చెల్లమ్మ కు పెండ్లి డబ్బుల చెక్ వచ్చిందట ఇప్పుడే సార్ చెప్పిండు అన్నాడు వాసు.,

షుక్రియా వాసు బేటా అల్లా భలా కరేగా, యా అల్లా..సొబ్ తీరే మెహర్బాని బేటా..అంటూ కళ్ళ నీళ్లు తుడ్చుకుండు..రహీం చాచా..

అన్నట్టు బేటా... ఇయ్యాల మీ ఇంటికాడ వంట బంద్, ఫాతిమా బిర్యాని ఎక్ధం చేస్తది,

ఇంటికి చోటు గానితో పంపిస్తా వద్దనొద్దు బేటా, అంటూ వెళ్లిపోయాడు.

అరే వాసు ఇంతకు పిల్లలు ఎంతమంది ఎంచేస్తున్నరా.... అన్నాను.,

ఇద్దరు పాపలు , పెద్దది ఫస్ట్ క్లాస్ చిన్నది ఇప్పుడే స్కూల్ కు వెళుతుంది రా ..అన్నాడు వాసు.

అరేయ్ వెంకట్గా.. ఈ అపార్ట్మెంట్ లో పనిచేసే రాజక్క ను పిలువురా అని చెప్పి, ఆనంద్ ఒక్క అర్థగంట కుర్చోరా..ఇంటికి వెళదాం అని,... అరేయ్ అందరూ ఇటురాండి అంటూ పిల్లలందరిని పిలిచిండు వాసు.

అరేయ్ శ్రీను సాయి రామ్ అపారట్మెంట్స్ వాళ్ళకి ఇవ్వాళ వాట్సప్, స్కైప్ కోచింగ్ క్లాస్ ఉంది అందరికీ అర్థం అయ్యేలా తెలుగులో చెప్పు అన్నాడు.

అన్నా ఆ ముసలి వాళ్ళంతా వాసన్నే రావలంటారు నువ్వే వెళ్లన్నా.

నేను వాళ్లకు ఫోన్ చేసి చేప్తాను గాని నువ్వెళ్లరా అన్నాడు వాసు.

అరేయ్ నర్సి నువ్వు పుష్ప మేడం వాళ్ళ ఇంటికి వెళ్లూ వాళ్ళు కు ఇవ్వాళ యూట్యూబ్ కోసం వంటల షూటింగ్ ఉంది తీసి రారా.

ప్రేమ్ నువ్వు లేబర్ కాలని కి వెళ్లు వాళ్లకు హాట్ స్టార్ యాప్ డౌన్లోడ్ చేసి డైలీ సీరియల్స్ స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా టీవీ కి కనెక్ట్ చేసా ఏలా వస్తుందో చూసిరా.

అరేయ్ నువ్వు రంగనాథ్ గారు ఒక స్టోరీ రాసి ఇచ్చారు కదా ...దానిని సిస్టంలో అప్లోడ్ చేసి రంగనాథ్ గారి బ్లాగ్ లో పోస్ట్ చెయ్యి, డ్రాఫ్ట్ లో ఉంచు నేను చూసి పోస్ట్ చేస్తాను..

అంతా వెళ్ళండిరా అన్నాడు.

ఇంతలో ఒక ఆడమనిషి ..వాసయ్య నువ
సల్ల గుండాలె తండ్రి ..నా అయుసు కూడా పోసుకొని నిండు నూరేళ్ళు సల్ల గుండు నాయనా, నాకు పించిన్ వచ్చిందట గదా,
ఆ వార్డ్ మెంబరు ముండకొడుకు ఐదు వేలు అడిగిండు బిడ్డ, దిక్కు మొక్కు లేక పాచి పనులు చేసుకునే దాన్ని యాడతెద్దును బిడ్డ అంది.

ఆమె మాటలకు అడ్డమొస్తూ, రాజక్కా పనైంది కదా ...ఇప్పుడు అయన్నీ ఎందుకు సక్కగ బ్యాంక్ కు పోయి డబ్బులు తెచ్చుకో పో.. అన్నాడు వాసు.

రాజమ్మ వాసు కాళ్ళ మీద పడి లేచింది.,
అరే వద్దక్కఇట్లా చేయొద్దు,

నువ్వు మా అక్కవు కదా...,

అక్కలు ఏడనైన తమ్ముని కాళ్ళు మొక్కుతర చెప్పు అన్నాడు.

వాసు నువ్ దేవిడివయ్యా... అంటూ రొండు చేతులెత్తి మొక్కింది..

ఆ పెద్దావిడ నా వైపూ తిరిగి,

అయ్యా నువ్వేవరిఓగాని మా వాసయ్య దేవుడయ్యా ..,

పోయిన నెల జరం వచ్చి వొళ్ళు తెలవకుండా పడివుంటే దవాఖానకు తోల్కపోయి మందులిప్పించి నయం చేపిచ్చిండు, దిక్కుమొక్కు లేనిదాన్నని రోజు నాకు డబల్రొట్టెలు పాలు తెచ్చిచ్చిండు బిడ్డా...
కొడుకులెక్క చూసుకుండు తండ్రి..

నాయినా....వాసయ్య వత్త బిడ్డ
మొదటి జీతంల నుండి నీకు జిలేబి కొనుక్కొస్త బిడ్డ అంటూ వెళ్లి పోయింది.

ఆమె పోగానే మరో మహిళ వాసు దగ్గరికి వచ్చింది.,

లక్ష్మి అక్కా ఇప్పుడే ప్రేమ్ గాన్ని పంపిన టీవీ ఎట్లుందో చూడమని.. , ఏంసంగతక్కా ఇట్లొచ్చినవ్.,

తమ్మి వాసు.. థాంక్స్ అయ్యా,

నీ వల్ల మా లేబర్ కాలనీలో టీవీ సీరియళ్లు చూస్తున్నం,

ఆ కేబుల్ టీవీ బట్టెబాజ్ గాడు ఇంటికి రొండు వేలు కడితే బాక్స్ పెడ్తనన్నడు, నెల నెలా మూడు వందలు కట్టమన్నడు, మా చేత నయ్యిద్దా తమ్మీ, నువ్ కనెక్షన్ పెట్టుకుంటే పొద్దనక పనిచేసే మాకు ఆయింత సంతోషం కరువయ్యేది అంది.

అన్నట్లు,తమ్మీ ...రేపు మా కాలనీలో బోనాలు అమ్మకు మొదటి పూజ మా వాసు తమ్మీ చెయ్యాలని అనుకున్నం, రేపు అందరికీ బోజనాలక్కడే ,

తమ్మీ మర్చి పోకు మరదలు పిల్లల్ని కూడా తోల్కరా, వస్త తమ్మీ అంటూ వెళ్ళిపోయింది.

ఇంతలో పదిమంది చిన్న పిల్లలు క్యూ లో వచ్చి షాప్ ముందు నిలబడ్డారు.,

వాసు వాళ్ళంతా ఎవర్రా అన్నాను. ,

వీళ్లంతా లేబర్ కాలని పిల్లలు రా,.రోజు ఈ టైమ్ కి వీళ్లకు ఇంటర్నెట్ గేమ్స్ ఉచితంగా నేర్పిస్తాను అందుకే వచ్చారు.

అరేయ్ అందరూ రండిరా కూర్చొని అడుకోపొండి అన్నాడు వాసు.

పిల్లలంతా బిర బిరా.. లోనకు వెళ్లారు.

ఇంతలో ఒక పెద్దాయన భార్య తో సహా వచ్చి శుభపత్రిక ఇచ్చాడు.

నమస్తే సార్ బాగున్నారా , చెల్లెమ్మ పెళ్లికి నాకు కార్డ్ ఎందుకు సార్, చెప్పకున్నా వస్తానుగా.. అన్నాడు వాసు.

నువ్వొక్కడివే వేస్తే సరిపోదొయ్, అమ్మాయి పిల్లలు అంతా రావాలి అందుకే అమ్మ కూడా వచ్చింది.

ఇదిగో ఇందులో మీ అందరికీ కొత్తబట్టలు కొన్నాము అంటూ బలవంతంగా ఒక బ్యాగ్ వాసు చేతిలో పెట్టాడు.

అన్నట్టు వాసు ఈ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఉంచు, మనం అనుకున్న రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఇంకా చెల్లెలు ఇచ్చిన లిస్ట్ లో ఉన్నయన్ని ఆన్ లైన్లో రేటు చూసి ఆర్డర్ పెట్టు..,

పెద్దమ్మాయి కి మనం ఇలా ఆన్లైన్ లో కొనడం వలన ముప్పయి వేల వరకు సేవ్ అయ్యాయి , మరి నేను వస్తా వాసు అంటూ వెళ్లి పోయారు.

అరేయ్ షాప్ కట్టేసి ఇంటికి రారా ...

నేను వెళుతున్నాను,.. అంటూ పదరా ఆనంద్ ఇంటికి వెళ్లి మాట్లాడు కుందాం అంటూ నా సమాధానం కోసం చూడకుండానే నా చెయ్యి పట్టుకొని లేపాడు వాసు.

ఇల్లు దగ్గరే రా పద నడుద్దాం అంటూ ఇద్దరమూ మాట్లాడుకుంటు నడుస్తున్నాము.

అరేయ్ వాసు ఈ వాట్స్ ఆప్ కోచింగ్ వగైరా ఏంట్రా అన్నాను.

ఇక్కడ అపారట్మెంట్స్ లో ఉండే వాళ్ళంతా పెద్ద వయసు ఉన్న వాళ్లురా, ఎక్కువ మంది పిల్లలు విదేశాలలో ఉన్నారు, వాళ్లకు నెట్ బ్యాలన్స్ వేయడం, వాట్స్ ఆప్ లో, స్కైప్ లో ఎలా మాట్లాడాలో, తెలుగులో మెసేజ్ లు ఎలా పెట్టాలో నేర్పిస్తాను, మనకు కూడా కొంచెం డబ్బులొస్తాయి, వాళ్లకు ఫేస్ బుక్ అకౌంట్, ఆన్లైన్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, వాళ్లకు టికెట్స్ బుక్ చేయడం, వాళ్లకు అవసరమైన నాకు చేతనైన అన్ని సహాయాలు చేస్తుంటాను ఇవన్నిటికి మినిమం చార్జీ తీసుకుంటాను రా..

ఇక్కడ పనికన్నా నమ్మకం ముఖ్యం రా అంటూ చెప్పసాగాడు వాసు.

అన్నట్లు మన శంకరం మాస్టా రు కూడా ఇక్కడే ఉంటున్నాడురా , ఇదేరా మన ఇల్లు అంటూ గేట్ తీసి లోనికి దారి తీసాడు వాసు.,

ఇల్లు చాలా పెద్దది విశాలంగా ఉంది. ఇంటి ముందు ఖాళీగా ఉన్న ఓపెన్ హాల్ లో డిన్నర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇందాకటి షాప్ లో ఉన్న పిల్లంతా అక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎదురుగా వస్తున్న శంకరం మా చిన్నప్పటి మాస్టారు నీ చూసి నమస్కారం చేశాను, ఆప్యాయంగా పలకరించాడు, నీ పేరు ఆనంద్ కదూ... అన్నాడు మాస్టారు.,

అవును మాస్టారు అన్నాను.,

వాసు వాడి భార్య పిల్లలను పరిచయం చేసి, ఆ గదిలో నీకు ఏర్పాటు చేశారు, ఫ్రెష్ అయి రారా భోంచేద్దాం అంటూ చెప్పగానే, నేను పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళాను, నాతో పాటే శంకరం మాస్టారు వచ్చాడు.,

ఫ్రెష్ అయ్యాక మాస్టారు మీరేంటి ఇక్కడ అన్నాను.,

అదో పెద్ద కథరా, ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు, నా భార్య పోయాక చాలా ఒంటరి నాయ్యాను, పిల్లలు కూడా చుట్టాలకు మల్లె వచ్చి పోయే బంధువు లాయ్యారు, ఇంత ఆస్తి ఉన్న తృప్తి లేదు, తీవ్రమైన మనస్తాపంతో, ఆత్మ హత్యా ప్రయత్నం చేశాను, విధి లిఖితం వీడు కాపాడాడు.

అప్పడి నుండి ఇక్కడే ఉంటున్నాను, వాసు మనుషుల్లో దేవుడురా..

వీణ్ణి చూశాకే బ్రతుకు మీద ఆశ కలిగింది, వాడు నన్నేకాదు రా.. ఇందాక కింద చూసిన షాపులో పిల్లలంతా అనాదలేర, వాళ్ళందరికీ అన్ని వాడేరా , వాళ్ళు చదువుకుంటూ షాప్ లో పని నేర్చుకుంటూ వుంటారు.

ఈ పిల్లలతో పాటు ఈ కాలని, లేబర్ కాలని పిల్లందరికి రోజు కూర్చోపెట్టి చదివిస్తుంటానురా అన్నాడు మాస్టారు.

ఎక్కడో అమెరికాలో డబ్బును మాత్రమే సంపాదించి నంత మాత్రాన ఏం ప్రయోజనం రా, తాను బ్రతుకుతూ పదిమందికి ఉపయోగ పడ్తెనే జన్మకు సార్థకత రా అన్నాడు మాస్టారు.

మరి ఇంత ఖర్చు వాడేలా భరిస్తాడు మాస్టారు అన్నాను.

అంతా వాడి మంచితనం, నిజాయితి రా ,ఈ ఏరియా లోని చిన్న ఆఫీసు నుండి కాలెక్టర్ ఆఫీసు వరకు స్టేషనరీ వాడే సప్లై చేస్తాడు, షాపు కూడా బాగా నడుస్తోంది, పైగా ఈ ఏరియాలోని చిన్న షాప్ మొదలు మాల్స్ వరకు ఎదోరుపంలో వీడికి సహాయం చేస్తూనే ఉంటారు.

నువ్వే చూస్తావు గా ..ఈ రోజు నువ్వొచ్చావని, ఈ పిల్లల ద్వారా తెలిసినట్టుంది, ఎన్నిరకాల వంటలు, పళ్లు, ఫలహారాలు, జ్యూసులు ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చి పోతున్నారు, అదిరా వాసంటే అన్నాడు.

నిజంగా నా జీవితంలో ఇంత రుచికమైన భోజనం, ఇన్ని వెరియటీలతో తిని ఎరుగను, నాకన్నా డబ్బులో, చదువులో వాసు తక్కువైనా, ఈనాడు వాడు తాను బ్రతుకుతూ, పదిమందిని బ్రతీకిస్తున్నా డు.

భోజనాలు ముగిశాక అందరిదగ్గర సెలవు తీసుకొని ఇంటికి బయలు దేరాను.

నానా నాతో అన్న మాటలు, శంకరం మాస్టారు చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి, నా మనసును కమ్మిన పొరలు ఒక్కోటిగా తొలగి పోయాయి.

ఒక స్పష్టత వచ్చింది.,

అమ్మా, నాన్నలను చూసుకుంటూ, పదిమందికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి ,అమెరికా లో సంపాదించే డాలర్లలో లేదని అర్థం అయ్యింది.

జన్మకు సార్థకత చేకూర లంటే ఇక ఇక్కడే ఉండాలని గట్టిగా నిర్ణయించు కున్నాను.,

ఈ విషయాన్ని నానకు ఫోన్ లో చెప్పి కళ్ళు మూసుకున్నాను, హాయిగా నిద్ర పట్టింది.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు