ఆర్టీసీ కథలు 2- తాళాలు కనపడలేదు - Kodali sitarama rao

RTC Kathalu.2 Taalaalu kanabadaledu

ఆర్టీసీ కధలు 2 తాళాలు కనపడలేదు మదనపల్లిలో సీనియర్ క్లర్కుగా పనిచేస్తున్నప్పుడు నేను చెక్కులు ,కార్మికుల జీతాల చెల్లింపులు చూస్తుండేవాడిని. అందువల్ల బీరువా,కేష్ చెస్టు తాళాలు నా దగ్గిరే వుండేవి. నేనూ నా సహాధ్యాయి ఓబులరెడ్డి కొన్నాళ్ళు ఒకే గదిలో వుండేవాళ్ళం. ఆ తరువాత అతనికి పెళ్లి అయ్యి వేరే కాపురం పెట్టేడు. నన్ను తరుచూ భోజనానికి పిలిచేవాడు.

అదికాదు విషయం. రెండు సందర్భాలలో నా తాళాలు కనపడలేదు. ఒకసారి ఏ జీ ఆఫీసునించి మా డిపో ఆడిట్ చేయటానికి నలుగురు ఉద్యోగులు వచ్చారు. వాళ్ళు మా హెడ్ క్లర్కుగారిని కలిశారు. వాళ్ళ మంచీ చెడు చూడాలని నా పేరు సూచించారు. నాకేమీ తెలియదు ఆ విషయాల గురించి. అప్పుడు వాళ్లే చెప్పారు . వాళ్ళ వసతి ,భోజన సదుపాయాలు చూడాలని. నాకు అటువంటివి తెలియవు అని చెప్పా . వాళ్ళకి అర్థమైపోయింది పెద్దాయన తప్పించుకునేందుకు నన్ను ఉపయోగించుకున్నాడని.సరే వాళ్ళ బాధ వాళ్ళే పడ్డారో యేమో నాకు తెలియదు కానీ ఆ పదిహేనురోజుల్లో వాళ్ళతో బాగా సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత చాలా కాలం వాళ్ళు ఎక్కడో అక్కడ కలుస్తుండేవారు.పాపం వాళ్ళే నా టిఫిన్ ,భోజనం ఖర్చులు భరించేవారు. వారోరోజు హార్సిలీ హీల్సు చూడాలి అన్నారు. మా డి యెమ్ గారి జీపు రిపేరు లో వుంది . దాంతో ఓ ఆదివారం ఉదయం వాళ్ళు నలుగురు, నేనూ ,మా ఆఫీసు బోయ్ బస్సులో బయలుదేరాము. మా ఆఫీసు బోయ్ ఓ దుప్పటి తెచ్చాడు. అక్కడికి చేరుకుని టిఫిన్ చేసి ,కొండంతా తిరిగాము. సినిమా షూటింగులు జరుగుతున్నాయి. అవి చూసాము. మధ్యాన్నం భోచేసి చల్లగా వుండటంతో కాసేపు పడుకుందాం అన్నారు .సరే దుప్పటి పరిచి పడుకుని లేచాక టీ తాగి ,మళ్ళీ షూటింగులు చూసి బయలుదేరదాము అనుకుని బస్సుకోసం చూస్తే షూటింగులున్నాయని తెలిసి వచ్చిన జనం బస్సునిండా .ఆఖరికి డ్రైవర్ సీటు వెనక కూడా నించున్నారు . ఆడా మగా తీడా లేదు . అలా రెండు బస్సులు వదిలేశాము

. చీకటి పడ్డాక తెలిసింది ఇంక బస్సులు రావని. దేవుడా అనుకుంటూ ఆ రాత్రి అక్కడే పడుకోవాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు. విపరీతమైన చలి. పైగా ఉండేందుకు చోటు లేదు . ఆరు బయట పడుకోవాలి . సరే అక్కడ చపాతీలు తిని ఓ రెసిడెన్షియల్ స్కూల్ వుంది . ఆ ప్రిన్సిపాల్ ని బతిమాలి వరండాలో మా వాడు తెచ్చిన దుప్పటి కప్పుకుని పడుకున్నాం. తెల్లారుతూనే తెలిసిన కబురు బస్సులు నడవటం లేదు అని . ఆ రోజు ముప్ఫై ఒకటో తారీకు . నేను ఆఫీసుకు వెళ్ళి చెక్కులు రాయాలి . మరునాడు కార్మికులందరికీ జీతాలివ్వాలి . తాళాలు నా దగ్గిర వున్నాయి గదిలో . నాకు కంగారు మొదలైంది . వాళ్ళతో చెప్పాను నేను కాలినడకన కొండ దిగిపోతాను మీరందరూ నెమ్మదిగా రండీ అని . వాళ్ళు కూడా వస్తామన్నారు . అలా అందరం అడ్డ దారుల్లో కొండ దిగాం. రోడ్డు మీదకి వచ్చేసరికి బస్సులు లేకపోవటం వల్ల జీపులు కూడా రద్దీగా వున్నాయి . మొత్తానికి ఓ జీపులో వాళ్ళని లోపల చేర్చి మేమిద్దరం ఫుట్ బోర్డు మీద నిలబడి అడంగు చేరాం. అప్పటికి మా అఫీసు టైము అయిపోయింది. ఆదరా బాదరా రూముకొచ్చా . నా రూము తాళాలు పగలగొట్టి వున్నాయి .గోళ్ళేనికి తాడు మూడేసి వుంది. గుండె బేజరైంది. దొంగతనం జరిగింది. గదిలో చూస్తే తాళాలు లేవు . నా ఆలోచనలు పరి పరి విధాల పోయాయి. ఆ రోజుతో నా ఉద్యోగం పోయినట్టే. నా కుటుంబం పరిస్తితేంటి. గబగబా మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని ఆఫీసుకు వెళ్లా. అప్పటికి డి ఏం గారు రాలేదని అర్ధమైంది . కొంత ఉపశమనం కలిగింది . ముందు గదిలో వున్న మా అక్కౌంటెంటుగారు పలకరిస్తున్నా రెండో గదిలో మా ఓబులరెడ్డి టేబులు దగ్గిరకి వెళ్లా. అవాక్కయ్యా. అతని టేబులు మీద చెక్కు బుక్కూ ,దాని సంబంధిత రికార్డులు వున్నాయి . ఎలా సంభవం . కొంపదీసి తాళాలు బీరువాకే వదిలేశానా శనివారం. మా ఓబులరెడ్డి అన్నాడు ‘ సారీ రామా రావు ,నువ్వు రాలేదని నీ రూము తాళాలు పగలకొట్టించి ,ఆఫీసు తాళాలు తీసుకొచ్చా . చెక్కులు రాయాలి కదా . డోంట్ వర్రీ . టేక్ రెస్టు . ఈ పూటనేను రాస్తాలే చెక్కులు .’ అన్నాడు . అప్పుడు ఎంత ఆనందంగా వుంటుంది మీరు ఊహించగలరా . ఓబులరెడ్డి తో నా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది.

మరిన్ని కథలు

Manavatwam parimalinche
మానవత్వం పరిమళించే ....
- డా:సి.హెచ్.ప్రతాప్
Civic sense
సివిక్స్ సెన్స్
- డా:సి.హెచ్.ప్రతాప్
Saraina Empika
సరైన ఎంపిక.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Marina gunde
మారిన గుండె.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Mullunu mulluthone
ముల్లును ముల్లుతోనే
- డా:సి.హెచ్.ప్రతాప్
నీకెంత ? నాకెంత ? .
నీకెంత ? నాకెంత ? .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు