జూన్ లో మదనపల్లిలో డిపో మేనేజర్ ఆఫీసులో చేరిన మూడు రోజులకి ఆ డిపో స్థానిక యూనియన్ నాయకులు వచ్చారు నన్ను కలవటానికి. పరిచయాలయ్యాక చెప్పారు. నాగేశ్వర రావు గారు నా గురించి రాశారని. ఆయన మా నాయకులు. మన కమిటీ మీటింగులకి వస్తూవుండండి అని వెళ్ళిపోయారు. ఆర్టీసీలో చాలా యూనియన్లు వున్నాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్ స్వతంత్ర సంఘం. అది కార్మికులందరికి సంబంధించినది. దానికి అనుబంధంగా ఆఫీసు ఉద్యోగుల కోసం మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ ఏర్పడింది. దాని ప్రధాన కార్యదర్శి ఎం నాగేశ్వర రావు గారు.
ఆయన హైదరాబాదులో వుండేవారు. కొన్ని కారణాల వల్ల ఆయన విజయవాడకి వచ్చారు. మా ఆఫీసులోనే పనిచేసేవారు. అందువల్ల వారితో సాన్నిహిత్యం బాగా వుంది. ఆ కారణంగా నేను యూనియన్ నాయకత్వ బాధ్యతలలో లేకపోయినా వారికి నా గురించి నాయకుడనే రాశారు. ఆ ఆఫీసులో మా అక్కౌంటెంట్ గారు,హెడ్ క్లర్కు గారు తప్ప అందరం మూడేళ్ళ అనుభవం వున్నవాళ్ళమే. కొద్ది రోజుల ముందు అనంతపురం డిపోలో ఇద్దరు కార్మికులు గేరేజీలోనే కొట్టుకున్నారు. వారిద్దరూ వేరువేరు యూనియన్ల వారు. ఐతే డి ఎం గారు ఒక యూనియన్ సభ్యుణ్ణి సస్పెండ్ చేశారు. అక్కడి యూనియన్ నాయకుల విన్నపం పట్టించుకోలేదు. వారు తమ నిరసన తెలిపారు చాలా రోజులు శాంతియుతంగా. ఫలితం లేకపోవటంతో సమ్మె చేశారు. పాక్షికంగా బస్సులు ఆగిపోయాయి. సమస్య రీజినల్ మేనేజరుగారు పరిష్కరించాలి. ఆయనా పెద్దగా కృషి చేయలేదు. సమస్య తీవ్రమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నియూనిట్లలోనూ నిరసనలూ , ఒక రోజు సమ్మెలూ జరుగుతున్నా యి.
రాష్ట్ర స్థాయి నాయకత్వం ఎం డీ గారి దృష్టికి తీసుకువెళ్లింది. డిమాండ్ ఏమిటంటే రెండోవాడినీ సస్పెండ్ చేసి విచారణ చేయండి. లేదా మా సభ్యుడి సస్పెన్షన్ ఎత్తేయండి. ఆయనా పెద్దగా స్పందించలేదు. దానితో మా యూనియన్ రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకి పిలుపు నిచ్చింది. మేనేజిమెంటుకూడా తీవ్రంగా పరిగణించి తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. ప్రోబేషన్ పూర్తి కానివారిని ఉద్యోగంలోంచి తీసేస్తామని, ప్రమోషన్లో వున్నవారిని పాత ఉద్యోగానికి పంపిస్తామని ఆ ఆదేశాలు. మా ఆఫీసులో మొత్తం పదిహేను మందిమి వున్నాము. సమ్మె చేయటానికి సిధ్ధంగా లేరు ఎవ్వరూ మేనేజిమెంటు ఆదేశాలవల్ల. అయితే నేనూ , మా అక్కౌంటెంటు గారు ఎలాగైనా సమ్మె చేయాలని. ఆ సాయంత్రం ఒక సమావేశం నిర్వహించాము. అందులో వివరించాము సమ్మె ఎందుకు చేయాలో. ‘మన కోసం పోరాడే మన సంఘం పిలుపు మనం పాటించకపోతే రేపు ఆ నాయకత్వానికి మేనేజిమెంటు దృష్టిలో విలువేముంటుంది. మనలని సమ్మె చేయమని చెప్పిన సంఘమే మన మంచి కూడా చూస్తుంది. మనకే ఆపద రానీయదు.ఇంతవరకూ ఎప్పుడూ సమ్మె చేయకుండానే మనకోసం పోరాటం చేసింది ఇంతవరకూ మన సంఘం. ఇప్పుడు సమ్మె చేయమందంటే అర్ధం చేసుకోవాలి.’ మొత్తానికి అయిస్టంగానే వొప్పుకున్నారు.మరు నాడు ముందే ఆఫీసు దగ్గిరకి చేరుకున్నాము. అందరినీ ఆపాను ఆఫీసుకు వెళ్ళకుండా. ఈ లోగా డి ఎం గారు వచ్చారు.
మా వాళ్ళందరూ ఆయన దగ్గిరకి వెళ్లారు . నేనూ , మా అక్కౌంటెంటు గారు దూరంగానే వున్నాము. ఆయన మమ్మల్ని చూస్తూ వాళ్ళకి వివరించారు యాజమాన్యం ఉద్దేశ్యం. చర్యలు తీవ్రంగా ఉంటాయి . ఎక్కడినుంచో వచ్చిన వారి మాటలు విని చెడి పోకండి. ఎక్కడి నుంచో వచ్చింది మేమే. మళ్ళీ వాళ్ళతో ఒక సమావేశం జరిపి ధైర్యం చేకూర్చాము. రెండు రోజులు సమ్మె జరిగింది. మూడో రోజు ఆఫీసుకి వెళ్ళే సరికి మా హెడ్ క్లర్కు గారు మండి పడుతున్నారు మా మీద. ఆయన అక్కడ వున్న పేపరు కట్టలు, లేఖలు చూపించి ‘ మా జీవితాలు నాశనం చేసేశారు మీ ఇద్దరూ. ఇదుగో నాకు రివర్షన్, మీ అందరికీ ఊష్టింగూ ఇమ్మని ఆదేశాలు.’ వెంఠనే నేను స్టెనో గారి గదినుంచీ యూనియన్ ఆఫీసుకి ఫోన్ చేశా. ‘వాళ్ళు చెప్పారు కంగారు పడకండి. మన వాళ్ళు వాటికి సమాధానాలు తయారు చేశారు. మీకు అందగానే సంతకాలు చేసి ఇవ్వండి. ఎటువంటి చర్యలూ వుండవు .మనవాళ్ళు ఎండీ గారితో కూడా సంప్రతింపులు జరుపుతున్నారు.’ నేను ఆ సాయంత్రం బయలుదేరి హైదరాబాదు వెళ్ళాను .
యూనియన్ ఆఫీసులో మా డిపోకి సంబంధించిన పేపర్లు పట్టుకుని తెల్లారి ఆఫీసుకు వచ్చా. సాయంత్రానికి మా యూనియన్ నాయకత్వం చర్చల వల్ల అన్ని తీవ్ర చర్యలు ఉపసంహరించుకుంటున్నట్టు సమాచారం కూడా వచ్చింది. టెలెక్సు ద్వారా మేనేజిమెంటు కూడా అదే విషయం తెలియచేసింది. మా వాళ్ళందరూ సంతోషించారు. అందరం కలిసి టీ,బిస్కట్ తీసుకున్నాం. అనంతపురంలోని కార్మికుడిని కూడా సస్పెన్షన్ ఎత్తివేసి ,ఇరువురి మీదా ఎంక్వయిరీ వేశారు@

