సర్జికల్ స్ట్రైక్ - డి వి డి ప్రసాద్

surgical strike

అప్పుడే హుషారుగా ఈలవేసుకుంటూ ఇంటికొచ్చిన బంగార్రాజు దిగులుగా సోఫాపైన కూర్చున్న అక్క భాగ్యలక్ష్మిని చూసి ఠక్కున ఆగిపోయాడు. ఈలకూడా హఠాత్తుగా దానంతటదే ఆగిపోయింది నోరెళ్ళబట్టి చూడడంతో. తన అక్క భాగ్యలక్ష్మిని అలా ఎప్పుడూ చూడలేదు బంగార్రాజు మరి. ఎప్పుడూ కళకళ లాడుతూ సో ఫాలో కూర్చొని టివికేసి తదేకంగా చూసే భాగ్యలక్ష్మే తెలుసు అతనికి. టివి సీరియల్స్ అంటే అంతపిచ్చి ఆమెకి. ప్రస్తుతం టివి ఆన్‌లో ఉన్నా అమె దానికేసి చూడకుండా దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉంది.

"అక్కాయ్!...ఏమిటా పరధ్యానం? అసలు నువ్వేనా? ఏం జరిగింది, ఎందుకలా దిగులుగాఉన్నావు?" అని ప్రశ్నలవర్షం కురిపించాడు బంగార్రాజు.

బంగార్రాజు మాటలతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిపడింది భాగ్యలక్ష్మి. బేలగా చూసింది తమ్ముడివైపు. అలా దిగాలుపడి తనవైపు చూస్తున్న భాగ్యలక్ష్మిని చూసేసరికి గుండె తరుక్కుపోయింది బంగార్రాజుకి.

"ఎమిటి అక్కా! నీకొచ్చిన కష్టమేమిటి? నీ తమ్ముడు బంగార్రాజుని నేనుండగా నీకు దిగులెందుకు చెప్పు?" అన్నాడు అక్కని జాలిగా చూస్తూ.

తమ్ముడు భరోసా ఇచ్చినాక ఆమెకి దుఃఖం ఇక ఆగలేదు. కళ్ళమ్మట నీరు జలజల రాలసాగేయి. దాంతో బంగార్రాజు చలించిపోయి మరింత రెచ్చిపోయాడు.

"చెప్పు అక్కా! నీకింత కష్టం కలిగించినవారెవరు? కొంపతీసి బావ కాదుకదా?" అనుమానంగా అడిగాడు. అయినా ఏమీ జవాబు చెప్పక వెక్కుతోంది భాగ్యలక్ష్మి. కొద్దిసేపు తర్వాత తేరుకొని కళ్ళు తుడుచుకుంది భాగ్యలక్ష్మి.

"ఇప్పుడు చెప్పు అక్కా!" అన్నాడు బంగార్రాజు.

"ఏం చెప్పమంటావురా తమ్ముడూ!...నాన్న నా గొంతు కోసాడు ఇలాంటి వాణ్ణి నాకు కట్టబెట్టి. మీ బావగారు రోజూ పేకాటలో మునిగితేలుతున్నారు. ఆఫీసులో పెండింగ్‌పనులున్నాయని మొన్న శనివారం, నిన్న ఆదివారంకూడా వాళ్ళ స్నేహితుల ఇంట్లోనే రోజంతా పేకాడుతూ కూర్చున్నారు. ఇవాళే నాకు మన పనిమనిషి ద్వారా తెలిసింది. రోజూ ఆఫీస్‌నుండి లేటుగా వచ్చి ఓవర్‌టైం చేస్తున్నానని చెప్పేవారు. వెర్రిబాగులదాన్ని, నమ్మేసాను. ఇప్పుడే అసలు సంగతి తెలిసింది, రోజూ ఎక్కడో ఒకచోట స్థావరం ఏర్పరచుకొని రాత్రి తొమ్మిది, పది గంటలవరకూ పేకాడుతున్నారని." అంటూ ముక్కు చీదింది భాగ్యలక్ష్మి.

ఆ మాటవిని నిర్ఘాంతపోయాడు బంగార్రాజు. తను సరిగ్గా చదువుకోవడంలేదని, సినిమాలు, షికార్లకి వెళుతున్నాడని, నాటకాల్లో వేషాలు వేస్తున్నాడని రోజూ ఆడిపోసుకొనే బావ పాపారావు అసలు స్వరూపం ఇదా అని అనుకొని విస్తుపోయాడు బంగార్రాజు. ఇప్పుడు బంగార్రాజు తనకో కొత్త ఆయుధం దొరికింది బావని బ్లాక్ మైల్ చేయడానికని సంతోషించాడు. అయితే ఇప్పుడు అందుకు తగిన సమయం కాదని గుర్తించినవాడై అక్కని ఓదార్చడానికి పూనుకున్నాడు. 'అక్కకి టివి సీరియల్ పిచ్చి, బావకి పేకాటపిచ్చి. తన టివి పిచ్చిలోపడి బావ సంగతి మరచింది.' అని మనసులోనే అనుకున్నాడు బంగార్రాజు. అంతలోనే తక్షణకర్తవ్యం గుర్తుకువచ్చి అక్కని ఓదార్చాడు.

"ఊరుకో అక్కా! బావ సంగతి నాకొదిలేయ్! నేను చూసుకుంటాగా! నేనే ఏదో ఉపాయం ఆలోచిస్తాగా! బావ వచ్చిన తర్వాత మాత్రం ఈ విషయం ఏమీ ఎత్తకేం? నీకీ విషయం ముందే తెలుసని తెలిస్తే మాత్రం ఇంక అంతే సంగతులు,మరి నీ విషయం పట్టించుకోకుండా అక్కడే రోజంతా ఉండిపోగలడు సుమా!" అక్కని హెచ్చరించాడు బంగారాజు.

కళ్ళు తుడుచుకొని బంగార్రాజు వంక అపనమ్మకంగా చూసింది భాగ్యలక్ష్మి.

"ఈ నాటకాలరాయడేంటి, వీడి వల్లేమవుతుందని ఆలోచిస్తున్నావా? చూడు నేనెలా నరుకొస్తానో అటుపక్కనుండి." అన్నాడు బంగార్రాజు.

తమ్ముడి భరోసాతో తత్కాలికంగా కాస్త ఉపశమనం కలిగింది భాగ్యలక్ష్మికి.

తన తమ్ముడివల్లేమవుతుందని ముందు అనుకున్నా ఏ పుట్టలో ఏ పాముందో, అలాగే ఏ బుర్రలో ఏ ఐడియా ఉందోకదా అని ఊరుకుంది.

****

ఆ మరుసటి రోజు సాయంకాలం ఆరుగంటలకి ఆఫీస్‌వదిలిన తర్వాత పాపారావు తన స్నేహితుడు అప్పారావింటికి బయలుదేరాడు. అప్పటికే అతని తత్తిమా స్నేహితులందరూ అక్కడికి వచ్చేసారు. అప్పారావు భార్య ఓ రెండురోజులైంది పుట్టింటికెళ్ళి. మరో వారంవరకూ తిరిగిరాదు. అందుకే అందరూ అప్పారావింటిలోనే ప్రస్తుతం తమ స్థావరం ఏర్పర్చుకున్నారు.

ఆట మంచి రసవత్తరంగా ఉన్నప్పుడు కాలింగ్‌బెల్ మోగింది. 'రావలసిన స్నేహితులందరూ వచ్చారుకదా మరి ఇప్పుడెవరొచ్చినట్లు? ఉదయం వేళైతే ఏ పాలవాడో, పేపర్‌వాడో లేకపోతే ఏ పౌడర్లు అమ్ముకునే సేల్స్‌మాన్ కావొచ్చేమోగాని ఈ వేళప్పుడొచ్చే వారెవరబ్బా?' మనసులోనే అనుకున్నాడు అప్పారావు.

అందరూ ప్రశ్నార్థకంగా అప్పారావువైపే చూడసాగారు. ఈలోపున మరోసారి బెల్ మోగింది. ఆలోచనల్లోంచి బయటపడి లేచివెళ్ళి తలుపు తీసాడు అప్పారావు. అంతే!...తలుపు తీసిన అప్పారావు వచ్చిన వ్యక్తిని చూసి పెద్దపులిని చూసినట్లు జడిసిపోయి వణికిపోతున్నాడు.

అప్పారావు అలా చలిజ్వరం వచ్చినవాడిలా వణికిపోవడం చూసిన పాపారావు తదితరలకు ఏమి అర్థం కాలేదు. ఇప్పటివరకు బాగున్నాడు ఇంతలోనే ఏం జరిగినదబ్బా అనుకున్నారు.

అంతలోనే తలుపు బార్లా తెరుచుకొని లోపలకు ప్రవేశించిన సదరు శాల్తీని చూసి అందరికీ మిడిగుడ్లు పడ్డాయి. ఆ వచ్చింది ఏవరో కాదు అప్పారావు భార్య చంద్రకాంతం. పేరు సౌమ్యంగా ఉన్నా మనిషిమాత్రం సినిమాల్లో సూర్యకాంతం టైపే. వారం పదిరోజులలో వస్తుందనుకున్న చంద్రకాంతం ఇలా హఠాత్తుగా ఊడిపడటం అప్పారావసలు ఊహించుకోలేదు. వస్తున్నట్లు కనీసం ఫోనైనా చేయలేదే అని అనుకున్నాడు.

అప్పారావు మనసులో మాట కనిపెట్టేసినట్లు, "ఫోన్ చెయ్యకుండా ఇలా హఠాత్తుగా వచ్చేసినందుకు మీకు కంగారుగా ఉందా? ఫోన్‌చేస్తే జాగ్రత్తపడిపోదామనే? ఇలా ఉన్నట్లుండి రావడంవల్లే కదా మీ అసలు బండారం బయటపడింది. అమ్మో, అమ్మో!...ఇంకా మీరెంతో బుద్ధిమంతులనుకున్నాను. అసలు విషయం తెలీక నేరకపోయి పుట్టింటికి వెళ్ళాను. పెళ్ళాం ఊరెళితేనే ఈ మగవాళ్ళబుద్ధి బయటపడుతుందని మా స్నేహితురాలంటే ఏమో అనుకున్నాను. నిజమేనన్నమాట! ఈ పేకాటక్లబ్ మన ఇంట్లోనే ఏర్పరచుకున్నారన్నమాట." అంటూ అప్పారావుని ఛడామడా వాయించింది చంద్రకాంతం.

ఆమె నోటిదురుసు తెలిసిన మిత్రబృందం అప్పారావుని అతని ఖర్మకి వదిలేసి అక్కణ్ణుంచి చల్లగా జారుకున్నారు, అప్పారావు పేకాట మితృలుగా తమకీ తగిన సత్కారం జరుగుతుందేమోనని భయపడి.

మరో రెండుమూడు రోజులదాకా ఆ మిత్రులు పేకాట ఊసెత్తితే ఒట్టు. ఇదేమి తెలియని భాగ్యలక్ష్మి ఆ తర్వాత రోజు తన భర్త పాపారావు ఆఫీస్‌నుండి తిన్నగా ఇంటికి రావడంతో ఒకింత ఆశ్చర్యానికి గురైనా ఇంటుపట్టున అతను ఉండడంతో చాలా అనందించింది. అయితే ఆ అనందం ఎన్నోరోజులు నిలవలేదు. రెండుమూడు రోజులు పేకాట ఆడకపోయేసరికి చేతులు తెగ దురద పెట్టసాగాయి. అయితే ఈ దురదకి డాక్టర్లు కూడా ఏమీ చేయలేరని, పేకాడితేనే చేతుల దురద తీరుతుందని గ్రహించిన పాపారావు మళ్ళీ తన మితృలని లైన్‌లో పెట్టాడు. పాపారావు మాట కోసమే ఎదురుచూస్తున్న వాళ్ళందరూ కూడబలుక్కొని ఈ సారి తమ స్థావరాన్ని ఇంకో చోటకి మార్చి తమ కార్యకలాపాలు యధావిధిగా సాగించారు.

గత రెండుమూడు రోజులుగా అక్క ప్రశాంతంగా టివీ వీక్షణలో లీనమైపోవడం గమనించి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు బంగార్రాజు. పాపారావు మిత్రబృందాన్ని చెదరగొట్టడానికి తను పన్నిన ఉపాయం ఫలించిందని చెప్పి, అక్కని మెప్పించాడు బంగార్రాజు. ఆమె సంతోషంలో భాగం పంచుకోవడానికి అక్కవద్ద డబ్బులు సంపాదించి మరీ సినిమాకి చెక్కేసాడు బంగార్రాజు ఆ మరుసటి రోజు.

అయితే సినిమానుంచి ఇంటికి తిరిగివచ్చి ఖంగుతిన్నాడు, ఎందుకంటే ఇవాళనుండి మళ్ళీ షరా మామూలే! భాగ్యలక్ష్మి మళ్ళీ మొహం వేళ్ళాడేసుకొని కూర్చుంది. రాత్రి పదిగంటలు దాటినా ఇంకా పాపారావు పత్తా లేడు.

"ఇలా లాభంలేదు, తమ్ముడూ!...ఇంక అతన్ని నిలదీయాల్సిందే! ఇవాళ తాడో, పేడో తేల్చుకోవలసిందే!" ఆవేశంగా అంది భాగ్యలక్ష్మి. అక్క అన్నంత పనీ చేస్తుందోమోనని భయపడ్డాడు బంగార్రాజు. అందుకే సముదాయిస్తూ అన్నాడు, "పాపం!...బావకి ఇంకో అవకాశం ఇయ్యు అక్కా, అలాగే నాకు కూడా!" అని అక్కని బతిమిలాడాడు బంగార్రాజు. తన పథకం సరిగ్గా పారనందుకు ఈ సారి ఇంకొంచెం ఆలోచించాడు బంగార్రాజు. ఈ సారి ఇలాకాదని ఇంకో ఉపాయం ఆలోచించాడు బంగార్రాజు.

ఆ తర్వాత రోజు సాయంకాలం ఆరయ్యేసరికి పాపారావు మిత్రబృదం ముందుగా నిర్ణయించుకున్న స్థావరం చేరుకొని ఆట మొదలెట్టేసారు. ఏ అవాంతరం లేకుండా తమ ఆట సాగుతున్నందుకు వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇంతలో తలుపు చప్పుడైంది. అలా తలుపు చప్పుడవడతో అక్కడున్న అందరి గుండెలు మళ్ళీ పీచుపీచు మన్నాయి, మళ్ళీ ఏం ఉపద్రవం ముంచుకొస్తుందోనని. మళ్ళీమళ్ళీ ఎవరో తలుపులు దబదబ బాదడంతో అందరికీ భయం వేస్తున్నా తలుపు తీయక తప్పింది కాదు పాపారావుకి. అయితే తలుపు తీసి వచ్చిన వ్యక్తిని చూసేసరికి నోటమాట రాలేదు పాపారావుకి. అతని మిత్రబృందానిదీ అదే పరిస్థితి. ఆ వచ్చింది మరేవరో కాదు ఆఫీసులో పెద్దపులిగా పేరుపొందిన వాళ్ళకి స్వయాన బాసైన వీరభద్రరావుది. పేరుకి తగ్గట్టే వీరభద్రరావు ఆఫీసులో చండశాసనుడు.

వీరభధ్రరావుని చూస్తూనే అందరికీ ముచ్చెమటలు పోసాయి. అయితే ముందుగా పాపారావే తేరుకున్నాడు.

"సార్!...ఆఫీస్‌పనులన్నీ పూర్తి చేసాకే ఇక్కడికి వచ్చాము. పనులేవీ పెండింగ్ ఉంచలేదు సార్! ఇవాళ ఒక్కరోజూ ఏమీ తోచక ఇలా కూర్చున్నాము అంతే!" అన్నాడు నసుగుతూ.

"నసుగుతారెందుకయ్యా! ఇది ఆఫీస్ కాదుకదా! మీరు పేకాడితే నేనొద్దంటానా?" అని పెద్దగా నవ్వి, "సరే! నాకూ ముక్కలెయ్యండి." అన్నాడు వీరభద్రరావు కూర్చుంటూ.

అలా తను కూడా కూర్చోడంతో పాపారావు తదితరులందరూ నిర్ఘాంతపోయారు. అయితే ఇక్కడ వాళ్ళకో పెద్ద చిక్కొచ్చి పడింది. బాస్‌ని, అందులో పులిలాంటి వీరభద్రరావు దగ్గర పేకాటలో గెలిస్తే ఇంకేమైనా ఉందా?! రేపొద్దున్న తమ బతుకు బస్టాండవదూ? ఆ భయంతోనే అందరూ కోరికోరి అతన్నే గెలవనిచ్చారు, లేకపోతే కొరివితే తల గోకున్నట్లే అని భయపడి! వాళ్ళదగ్గర ఉన్నదంతా ఊడ్చేసిన తర్వాత, "వస్తానోయ్! మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమమేదైనా పెట్టుకుంటే నన్ను పిలవడం మరవకండేం?" అన్నాడు లేస్తూ. తలుపు వద్దకు వెళ్తూ మళ్ళీ వెనుదిరిగి అన్నాడు, "నేను ఇక్కడకి ఎలా వచ్చాననుకుంటున్నారా? మీరందరూ ఇక్కడ పేకాడుతున్నరని నాకు ఓ ఫోనొస్తే ఇక్కడకి వచ్చాను. నేనిక్కడకొచ్చి మీతో ఆడేనని నన్ను తక్కువ అంచనా వేసుకోకండి. అన్ని చోట్ల టాంటాం చేసేరు సుమా, జాగ్రత్త! దీన్ని అలుసుగా తీసుకొని బ్లాక్‌మయిల్ చేస్తే మాత్రం, ఇక ఇంతే సంగతులు. తోకలు కట్‌చేసి శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను, ఖబర్దార్!" అని తలుపు తీసుకొని వెళ్ళిపోయాడు వీరభద్రరావు.

అతను వెళ్ళిపోయిన తర్వాత ఓ పెద్ద గాలివాన వెలిసినట్లైంది. మిత్రులు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. చేతిలో డబ్బులైపోయాక చేసేది లేక అందరూ ఇంటిదారి పట్టారు.

ఆ రోజు పాపారావు కాస్త త్వరగానే ఇంటికి తిరిగొచ్చేసరికి, అక్కవైపు తిరిగి 'చూసావా, నా ప్రతాపం.' అన్నట్లు కాలరెగరేసాడు బంగార్రాజు. భాగ్యలక్ష్మి కూడా తమ్ముడివైపు ప్రశంసాపూర్వకంగా చూసింది. అయితే ఈసారికూడా మూణ్ణాళ్ళ ముచ్చటే అవడంతో ఖంగు తిన్నాడు బంగారాజు. అక్క దగ్గర తలకొట్టేసినట్లైంది బంగార్రాజుకి. ఈ సారి పట్టుదల మరింత పెరిగింది బంగార్రాజుకి.

“ఇంతకాలం తప్పించుకున్నా, ఇక మరి తప్పించుకోలేడు బావ! ఇక బ్రహ్మాస్త్రం ప్రయోగించాలి. సర్జికల్ స్ట్రైక్ ఒక్కటే మార్గం. " అన్నాడు బంగార్రాజు.

"ఏం చేస్తావో ఎంటో?" నిరాశగా అంది భాగ్యలక్ష్మి సోఫాలో కూలబడి.

ఈ సారి తమ స్థావరం మరింత పకడ్బందిగా ఏర్పాటు చేసుకున్నారు పాపారావు అతని మిత్రులూను. ఈ సారి వారి స్థావరాన్ని కనుగొనడానికి కొంచెం ఎక్కువ కష్టపడవలసి వచ్చింది బంగార్రాజుకి. అయినా రెండు రోజుల్లో దాని ఆచూకి కొనుగొన్నాడు. తన పథకం అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాడు. 'ఈ సారి ఏకంగా సర్జికల్ స్ట్రైకే! దెబ్బకి ఆ మిత్రబృందం పేకాట వదిలేయాల్సిందే! ఇక జన్మలో మరి పేకాట జోలికి వెళ్ళరు. తన సర్జికల్ స్ట్రైక్ దెబ్బ అలాంటిది మరి.' మనసులోనే అనుకొన్నాడు బంగారాజు.

ఆ సాయంకాలం అక్క భాగ్యలక్ష్మి క్రమం తప్పకుండా చూసే సీరియల్ రెండువేలో ఎపిసొడ్ చూస్తూంటే తనూ సోఫాలో కూర్చొని నిద్రలోకి జారుకున్నాడు బంగార్రాజు.

ఇంతలో కాలింగ్‌బెల్ మోగింది. ఆ మోతకి నిద్రాభంగమై కళ్ళుతెరిచాడు బంగార్రాజు. సీరియల్ మధ్యలో ఉండగా కాలింగ్‌బెల్ నొక్కినవాడిమీద చిరాకుపడుతూ వెళ్ళి తలుపు తీసిన భాగ్యలక్ష్మి అ వచ్చినవాళ్ళని చూసేసరికి నోటమాట రాలేదు. ఆమెకి మిడిగుడ్లు పడ్డాయి. ఈ లోపల ఇంట్లోకి బిరబిర వచ్చేసారు వారందరూ. అందులో ఒకడు పోలీస్ ఇన్సిపెక్టర్, మిగతా నలుగురు కానిస్టేబిల్స్. వాళ్ళని చూసేసరికి బిక్కచచ్చిపోయింది భాగ్యలక్ష్మి. వాళ్ళని చూస్తూనే లేచి నిల్చున్నాడు బంగార్రాజు. ఆ తర్వాత భాగ్యలక్ష్మి వైపు చూసి ఆమె భయపడుతుండడం గమనించి, "అక్కా! భయపడకు. వాళ్ళు నిజం పోలీసులు కారు. వాళ్ళందరూ నా స్నేహితులు, మేమందరం కలిసి నాటకలేస్తూంటాం. బావని పోలీస్ వేషంలో వెళ్ళి బాగా భయపెట్టి బెదిరించి రమ్మని నేనే పంపాను. దెబ్బకి బావ ఇంక పేకాట జోలికి వెళ్ళడు. సర్జికల్ స్ట్రైకా, మజాకానా!" అన్నాడు నవ్వుతూ బంగార్రాజు.

"ఏమిటి కామేష్! పని పూర్తైంది కదా!" అన్నాడు బంగార్రాజు ఆ ఇన్సిపెక్టర్‌ని ఉద్దేశించి.

"లేదు బంగార్రాజు, కొంప మునిగింది! ఆ విషయమే నీతో చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. మేము నువ్వు చెప్పినట్లు అక్కడకి వెళ్ళేంతలో నిజం పోలీసులే వాళ్ళమీద దాడి చేసారు. మేము దూరమునుండి చూసేసరికే వాళ్ళని పోలీస్ వేన్ ఎక్కించారు. అందులో మీ బావతో పాటు అతని స్నేహితులు కూడా ఉన్నారు." అన్నాడు కంగారుగా కామేష్.

కామేష్ చెప్పిన మాట విని నివ్వెరపోయాడు బంగార్రాజు.

"హార్నీ! మనమేదో ఉత్తుత్తి సర్జికల్ స్ట్రైక్ చేసి బావని జడిపించి పేకాట మానిపిద్దామనుకుంటే, నిజంగానే సర్జికల్ స్ట్రైక్ జరిగిందా? కాగల కార్యం గంధర్వుడు తీర్చడమంటే ఇదేనన్నమాట! అక్కాయ్! ఇక మరి నువ్వు దిగులు చెందకు! మన వల్ల ఇక పని కాదని పాపం పోలీసులే ఆ బాధ్యత తీసుకున్నట్లు ఉంది." అన్నాడు బంగార్రాజు.

"ఏడిచావు, చేసింది చాలు. పాపం మీ బావ ఏం అవస్థ పడుతున్నారో ఆ పోలీస్ స్టేషన్‌లో? వెంటనే వెళ్ళి మన విశ్వనాధం లాయర్ మావయ్యని తీసుకొని అక్కడికి వెళ్ళి బావని విడిపించుకు రా!" అని బంగార్రాజుని తరిమింది భాగ్యలక్ష్మి.

"ఏంటో, ఈ అక్క! పోనీ మనవల్ల కాని పని పోలీసుల వల్ల తీరుతుందన్న వినదు కదా!" అంటూ వాపోతూ వీధిలోకి పరిగెట్టాడు బంగార్రాజు. అతనివెనుకే వీధిలోకి వెళ్ళిపోయారు అతని స్నేహితులు.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు