
రేడియోలో వాతావరణ హెచ్చరికలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో
తీరానకి రెండు వందల మైళ్ల దూరంలో ఆవర్తన ద్రోణి ఏర్పడి
దక్షిణ తీరం వైపు గంటకు యాబై మైళ్ల వేగంతో ముందుకు
సాగుతోంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారి
తీరాన్ని దాటవచ్చు. తీరంలో ఎల్లో జండా ఎగరవేయడమైంది.
మత్యకారులు సముద్రం మీదకు చేపల వేటకు వెళ్లవద్దని
హెచ్చరించడమైంది.
రేవు పోలవరం మత్యకార గ్రామంలో ఆందోళన మొదలైంది.
గ్రామం నుంచి సముద్రం మీద చేపల వేటకు వెళ్లిన తండ్రి కొడుకులు
రామయ్య, సోములు తిరిగి రాలేదు. వారితో వెళ్లిన మిగతా వారు
గ్రామానికి తిరిగి వచ్చినా వాళ్లిద్దరూ రాలేదని కుటుంబ సబ్యులకు
ఒకటే ఆరాటం. తుఫాను సమయంలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను
ఎదుర్కోటం వారికి కొత్త కాదు కాని ఈసారి వాళ్లిద్దరూ వెనక్కి
తిరిగి రాకపోవడంతో గ్రామంలో ఒకటే చర్చ.
విషయం కోస్టుగార్డు వారికి తెలియచేయడం జరిగింది. వారు
తప్పిపోయిన మత్యకారుల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు.
సముద్రంలో తుఫాను కారణంగా అలల వత్తిడి ఎక్కువై సెర్చ్
ఆపరేషనుకు ఆటంకం ఏర్పడుతోంది.
మూడురోజులు గడిచిపోయాయి. సముద్ర తుఫాను దిశ మారి
వేరొకవైపు మళ్లిపోయింది.
పోలవరం మత్యగ్రామంలో విషాదదం నెలకొంది. తండ్రీ కొడుకులు
సముద్ర తుఫానులో చిక్కుకుని ఎటుపోయారో లేక బ్రతికున్నదీ
చనిపోయిందీ నిర్ధారించలేకపోతున్నారు.
సముద్ర జలాల్లో తుఫాను గాలులు తగ్గు ముఖం పట్టడంతో
కోస్టుగార్డు సెర్చ్ ఆపరేషనుతో పాటు అన్ని తీరాల కోస్టు గార్డులకు
బోటు వివరాలతో సమాచారం పంపడం జరిగింది.
తమిళ నాట ఒక గ్రామతీరంలో ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో
కొట్టుకు వచ్చినట్టు అతనికి ప్రథమచికిత్స జరిపి హాస్పిటల్ కు
తరలించినట్టు సమాచారం తెల్సింది.
అక్కడి కోస్టుగార్డు సిబ్బంది హాస్పిటల్ మానేజ్మెంటుతో
మాట్లాడి అపస్మారక స్థితిలో వచ్చిన వ్యక్తి వివరాలు, ఫోటో
పోలవరం కోస్టుగార్డు సిబ్బందికి పంపగా ఆ వ్యక్తి రామయ్యగా
తెల్సింది.
తమిళనాట హాస్పిటల్లో చికిత్స అనంతరం కోలుకున్న రామయ్య
బతికే ఉన్నందుకు గ్రామంలో ఆనందం కలిగింది. మరి సోములు
గతి ఏమైందో తెలియక అయోమయ స్థితి ఏర్పడింది.
కోస్టుగార్డు ఎన్ని ప్రయత్నాలు చేసినా సోములు ఆచూకీ
దొరకలేదు. తుఫానులో చిక్కుకుని సముద్రంలో మునిగి చనిపోయి
ఉంటాడని నిర్ధారణ కొచ్చారు. గ్రామంలో విషాద ఛాయలు
అలముకున్నాయి.
ఆరోగ్యం బాగుపడిన. తర్వాత తమిళనాట నుంచి రామయ్యను
రేవుపోలవరం గ్రామానికి తీసుకు వచ్చి సంబరం చేసుకున్నా
సోములు ఆచూకీ తెలియక శోకసంద్రంలో ఉండిపోయారు
మత్యకార గ్రామప్రజలు.
శ్రీలంక వెల్తున్న సరుకుల ఓడ సముద్ర జలాల్లో బోటు మీద
తలకి గాయంతో అపస్మారక స్థితిలో ఒక వ్యక్తి ఉండటం షిప్
సిబ్బంది చూసి తమ వద్ద ఉన్న సాధనంతో ఆవ్యక్తిని షిప్ లోకి
చేర్చి వైద్య చికిత్స చేయడం జరిగింది.
శ్రీలంక షిప్ సిబ్బంది చేసిన చికిత్స కారణంగా సోములు ప్రాణాలు
దక్కినా తలకి తగిలిన గాయం కారణంగా జ్ఞాపక శక్తిని పోగొట్టు
కున్నాడు.
షిప్ సిబ్బంది అడిగిన ప్రశ్నలకు వివరాలు చెప్పలేక పిచ్చివాడిలా
చూస్తున్నాడు. శ్రీలంక హార్బరుకు చేరిన షిప్ సిబ్బంది అక్కడి
పోలిసు స్టేషన్లో అప్పగించారు.
ఏ దేశ పౌరుడో ఏ భాషవాడో తెలుసుకోలేక అతడి ముఖ
కవళికలు దేహ దారుడ్యాన్ని బట్టి అతడు మత్యకారుడై ఉంటాడని
హార్బరుకు అనుసంధానంగా ఉన్న కోస్టుగార్డు పోస్ట్ సిబ్బందికి
అప్పగించారు. అతని వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు.
పూర్తిగా స్వస్తతకు వచ్చిన సోములు మెల్లగా అక్కడి మత్యకార
కుటుంబాలలో కలిసి సముద్రం మీద చేపల వేటకు వెల్తున్నాడు.
తన వేష భాషలు మరిచిపోయాడు. సోములు పేరు సైమన్ గా
మారింది.
శ్రీలంక మత్యకార కుటుంబాలలో కలిసిపోయి వారి వేషభాషలకు
అలవాటు పడ్డాడు. స్ఫురద్రూపి ఆజానుబాహుడు సోములు
అనబడే సైమన్ వారి దైనందిన దినచర్యలో పాల్గొంటున్నాడు.
మత్యకార కుటుంబంలోని అమ్మాయితో వివాహం జరిగి
ఇద్దరు పిల్లలకు తండ్రి అయాడు.
కాలగమనంలో ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి.
అక్కడ రేవుపోలవరంలో రామయ్య కొడుకు సోములు
తుఫానులో చిక్కి సముద్రంలో ములిగి చనిపోయినట్లుగా
అనుకున్నారు.
ఒకసారి కోస్టుగార్డు ఆఫీసు సిబ్బందిలో సీనియర్ ఆఫీసర్
అంతర్జాతీయ సముద్ర రక్షణ దళ సమ్మేళనంలో పాల్గొనడానికి
శ్రీలంక కోస్టుగార్డు ఆఫీసుకి వెళ్లడం జరిగింది.
అక్కడ పనిచేసే సిబ్బందిలో సోములు అనబడే సైమన్ ను
చూడటం జరిగింది. అతని ముఖ కవళికలు సముద్ర తుఫానులో
తప్పిపోయిన సోములు ఫోటోతో పోలి ఉన్నాయి. అతన్ని
దగ్గరకు పిలిచి వాకబు చెయ్యగా తనకేమీ తెలియదని చెప్పేడు.
తన పేరు సైమన్ గా చెప్పేడు కాని చేతి మీద సోములు అని
పచ్చబొట్టు తెలుగులో కనబడుతోంది.
అక్కడి సిబ్బంది ద్వారా సైమన్ వివరాలు సేకరించగా సోములు
తల గాయంతో అపస్మారక స్థితిలో సముద్రంలో షిప్ సిబ్బంది
రక్షించి హార్బరుకు తీసుకు రాగా వైద్య చికిత్స తర్వాత ఆరోగ్యం
కోలుకున్నప్పటికీ మతి స్తిమితం కోల్పోయి గతం మరిచిపోయినట్టు
తెల్సింది.
గడిచిన ఇరవై సంవత్సరాల క్రితం రేవు పోలవరం వద్ద జరిగిన
సముద్ర తుఫానులో చిక్కి చనిపోయాడనుకున్న సోములు
చావుబతుకుల మద్య శ్రీలంక షిప్ సిబ్బంది ద్వారా రక్షింపబడి
తలకి తగిలిన గాయం వల్ల మతిస్థిమితం కోల్పోయి గతం
మరిచినట్టు ఆ సీనియర్ కోస్టుగార్డు ఆఫీసర్ తెలుసుకున్నాడు.
తర్వాత సోములు శ్రీ లంకలో బతికే ఉన్నాడన్న వార్త తెలిసి
రేవు పోలవరం మత్యకార గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది.
సమాప్తం