సాహో వాట్సప్ - తాళ్ళూరి చంద్రశేఖర్

saho whatsapp

హోటల్లో టిఫిన్ తిని కాఫీ త్రాగుతుండగా అన్నాడు విక్రం “ ఈ వాట్సప్ కాదుగానీ ప్రశాంతంగా ఉన్న కుటుంబాలలో కలతల్నీ, కలహాలనీ రేకెత్తిస్తోంది. మొగుడొక ఫోను, పెళ్ళామొక ఫోను తీసుకుని వాట్సప్ మెసేజీలు చదవడం, పోస్ట్ చేయడంలో నిండా మునిగిపోయి ఒకరితో మరొకరు తీరికగా మాట్లాడుకోవటమే మానేశారు.”

దానికి వంత పాడాడు సాగర్ “అవునవును . అంతేకాదు, పిల్లలు కూడా ఈ వాట్సప్ వ్యామోహంలో పడి చదువులను బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. పగలనక, రాత్రనక ఈ మోజులో పడి కళ్లను, బుర్రలను పాడు చేసుకుంటున్నారు. ఒకటో, అరో సందేశాలు తప్పించి అంతా చెత్తే. ఆ చెత్తంతా పోగేసుకొని బ్రతుకులను ఆగమాగం చేసుకుంటున్నారు.”

అవధాని మటుకు ఏమీ మాట్లాడకుండా తన కప్పులోని కాఫీ త్రాగుతూ కూర్చున్నాడు. అది గమనించిన విక్రం అడిగాడు “ఏమిటి మాట్లాడకుండా కూర్చున్నావు. మేము చెబుతున్నది నచ్చలేదా? వాట్సప్ మీద నీ అభిప్రాయమేమిటో?”

అవధాని ఒక చిరునవ్వు నవ్వి అన్నాడు “మీ అభిప్రాయాలతో విభేదిస్తున్నానని అనను కానీ వాట్సప్ తో నా అనుభవం వేరుగా ఉంది. అందుకే ఎటువంటి వ్యాఖ్యానం చేయకుండా కూర్చున్నాను.”

“అంత భిన్నమైన అనుభవం ఏమిటబ్బా. కొంచెం మా చెవిని కూడా పడెయ్యి. విని తరిస్తాము” ప్రశ్నకు కొంచెం వ్యంగ్యం కూడా జోడించి అడిగారు విక్రం, సాగర్ లు.

ముఖం మీద మందహాసం చెరగకుండా వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి గొంతు సవరించుకున్నాడు అవధాని.

కొన్ని నెలల క్రితం ఒక ప్రముఖ దిన పత్రిక ప్రచురించే ఆదివారం అనుబంధ సంచికలో ప్రతి వారం ఒక సమకాలీన విషయం మీద రచన చేసే బాధ్యతను తీసుకున్నాను. ఆ రచనలు వ్రాసుకోడానికి ప్రశాంతంగా ఉంటుందని మా ఇంటికి సమీపంలో ఉండే ఒక ఉద్యానవనానికి ప్రతి ఆదివారం వెళ్ళేవాడిని. అక్కడే దట్టంగా చెట్లున్న ఒక మారుమూల ప్రదేశంలో కూర్చుని నా రచనలు చేసుకునేవాడిని.

ఆ ఆదివారం కూడా అలాగే ప్రొద్దుటే ఆ ప్రదేశానికి వెళ్ళి రాసుకోవడం మొదలెట్టాను. పది గంటల ప్రాంతంలో చుట్టూతా కలకలం వినిపిస్తే ఏమిటా అని తలెత్తి చూశాను. నాకు దాపులోనే దట్టమైన ఒక చెట్టు క్రింద పచ్చిక బయళ్ళ మీద ఒక పదిహేను మంది స్త్రీ, పురుషులు తాము తెచ్చుకున్న తినుబండారాలు సర్దుకోవడంలో నిమగ్నులై ఉన్నారు. నలుగురయిదుగురు మినహాయించి అందరూ షష్టిపూర్తి దాటిన వాళ్ళ లానే ఉన్నారు. బహుశా ఏదైనా సంస్థలో రిటైరైన వాళ్లై ఉంటారనుకున్నాను. సహోద్యోగికెవరికైనా వీడ్కోలు ఇవ్వడానికి ఇలాగ కలిశారేమోనని భావించాను.

నా మానాన నేను వ్రాసుకుంటూ ఒక కంట వాళ్ళ చర్యలు గమనించసాగాను. ముందస్తుగా అందరూ తాము తెచ్చుకున్న టిఫిన్లు తిని, కాఫీలు త్రాగి జంపఖానాల మీద సెటిలయ్యారు. అందరూ ఆశీనులయ్యాక ఒక పెద్దాయన లేచి నుంచుని మిగతావారి నుద్దేశించి “ మిత్రులారా! ఈ ప్రధమ వార్షికోత్సవ సందర్భాన మనమందరం ఇక్కడ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. మనలో కొంత మందికి ఇంతకు ముందే పరస్పర పరిచయాలున్నా చాలా మందికి మిగతా వారు తెలియక పోవచ్చు. అందుకే ముందస్తుగా అందరినీ తమని తాము పరిచయం చేసుకోవలసిందిగా కోరుతున్నాను.” అన్నాడు.

ఆయన కూర్చోగానే ప్రౌఢ వయసులో ఉన్న ఒకావిడ లేచి తన పరిచయం చేసుకుంది “ నా పేరు డాక్టర్ రాజేశ్వరి. గైనకాలజిస్ట్ ని.

నా ప్రక్కన కూర్చున్న మా ఆయన డాక్టర్ సూర్యకిరణ్ జనరల్ ఫిజిషియన్. ఇద్దరం కలిసి ఒక క్లినిక్ నడుపుతున్నాము.

వారానికి మూడు రోజులు రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు వెళ్ళి పల్లె ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తుంటాము”.

హర్షధ్వానాల మధ్య ఆ భార్యా భర్తల పరిచయం ముగియగానే వారి ప్రక్కనే కూర్చున్న మరొకావిడ లేచి “ నా పేరు పద్మజ. ప్రఖ్యాత రచయిత, పాత్రికేయులు స్వర్గీయ రఘుచంద్ర గారి తనయను. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేశాను. ఆధునిక తెలుగు సాహిత్యం మీద పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటాను” అంది. ఇంకొకావిడ లేచి “నేను యూనివర్సిటీ లైబ్రరీలో లైబ్రేరియన్గా పని చేసి రిటైరయ్యాను. ప్రస్తుతం మరికొందరు మిత్రులతో కలిసి ఒక బుక్ బ్యాంకును నిర్వహిస్తున్నాను. మా బ్యాంకు ద్వారా దాతల వద్ద నుండి పుస్తకాలు, గ్రంధాలు స్వీకరించి వాటిని అవసరమైన వాళ్లకు ఉచితంగా సరఫరా చేస్తాము” అంది. మరొకాయన లేచి “ నేనొక మిమిక్రి కళాకారుడిని. ప్రస్తుతం సంఘ దురాచారాలను రూపు మాపటానికి ప్రభుత్వం పల్లెల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో నా ప్రదర్శనలను ఇస్తున్నాను” అన్నాడు. ఇంకొకాయన లేచి “వృత్తి రీత్యా నేనొక ఇంజనీర్ని. ప్రవృతి రీత్యా రచయితని. ఉద్యోగ విరమణ తరువాత రచనా వ్యాసంగాన్ని కొన సాగిస్తున్నాను” అన్నాడు.

ఆ తరువాత మరొకావిడ లేచి తనని పరిచయం చేసుకుంది “నా పేరు అనూరాధ. నా ప్రక్కన కూర్చున్నది మా అక్క ఇందువదన. ఆ ఎదురుగా కూర్చున్నది మా బావ గారు. మేము అయిదుగురు అక్కాచెల్లెళ్ళం. అందరికన్నా చిన్నదాన్ని కావటం వల్ల నేను మగరాయుడులా పెరిగాను. అందరూ మగరాయుడుని పదే, పదే ఎగతాళి చేయడంతో పట్టుదలగా కూచిపూడి నాట్యం, వీణా వాద్యం నేర్చుకుని ప్రదర్శనలనిచ్చే స్థాయికి చేరుకున్నాను”. మరో మహిళ లేచి “ నా పేరు వేదవతి. బ్యాంకు లో పని చేస్తున్నాను. అక్కడ కూర్చున్న మా వారు ఎయిర్ ఫోర్సు లో పని చేస్తున్నారు. నాకు భరత నాట్యంలోనూ, లలిత సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది” అంది.

అందరి పరిచయాలూ అయిపోగానే వారిలో కొంతమంది తమకు ప్రావీణ్యం ఉన్న కళలను ప్రదర్శించారు. కొందరు లలిత గీతాలు పాడితే, మరికొందరు భక్తి పాటలు గానం చేశారు. ఒకాయన కవిత్వం చెబుతే, మరొకాయన మిమిక్రీ చేసి చూపించాడు. ఆ విధంగా ఆటపాటలు, ఛలోక్తులతో దాదాపు రెండు గంటలు కాలక్షేపం చేశారు. అందరూ ఆ కార్యక్రమాలన్నీ ఆస్వాదిస్తూ హర్షధ్వానాలతో తమ సంతోషం వ్యక్తం చేశారు. వారిని, వారి ఉల్లాసాన్ని చూస్తుంటే ఎంతో హాయనిపించింది. ఆ రెండు గంటలు అందరూ చిన్న పిల్లలైపోయి ఎంతో ఆనందాన్ని అనుభవించారు. ఆ తరువాత అందరూ తాము తెచ్చుకున్న తినుబండారాలతో భోజన కార్యక్రమం కానిచ్చారు.

భోజనానంతరం అందరూ పిచ్చాపాటిలో మునిగి పోయారు. నేను నా రచనలో మునిగి పోయాను. కొద్దిసేపటికి ఎవరో పిలిచినట్టై తలెత్తి చూస్తే ఎదురుగా ఆ బృందంలో మొదటగా కార్యక్రమానికి అంకురార్పణ చేసిన పెద్దాయన నిలుచుని ఉన్నాడు. ఆరడుగుల స్పురద్రూపి. నేను తలెత్తి చూడగానే “మాస్టారూ! ఏమనుకోకపోతే మీరు కూడా ఈ తినుబండారాలు తీసుకోండి. వచ్చినప్పటినుంచీ చూస్తున్నాం. మీరేమీ ఆహారం తీసుకున్నట్టు లేరు” అన్నాడు చిరు మందహాసంతో. ఆయన చేతిలో రకరకాల తిను బండారాలు పెట్టి ఉన్న ఒక విస్తరాకుల పళ్ళెం ఉంది. మరొక చేతిలో మంచి నీళ్ళు నింపిన గ్లాసు. వాటిని తీసుకుని నా కృతజ్ఞతలు చెప్పాక ఆయన్ని అడిగాను “మాస్టారూ! ఏమనుకోకపోతే ఒక ప్రశ్న. మీరందరూ ఎవరు? మీ ఈ సమావేశానికి కారణం ఏమిటి? ఎందుకిక్కడ ఈ విధంగా సంబరాలు జరుపు కొంటున్నారు?”

దానికాయన నవ్వి “ముందుగా నా పరిచయం చేసుకోనివ్వండి. నా పేరు చంద్రమౌళి. ఎల్లైసీలో ఆఫీసరుగా పనిచేసి రిటైరయ్యాను. అక్కడ కూర్చున్న వారిలో చాల మటుకు నాలాగే ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళే. పిల్లలు వారి, వారి జీవితాలలో ఎక్కడెక్కడో స్థిరపడి పోతే, ఉద్యోగ విరమణ తరువాత భార్యా భర్తలు మాత్రమే మిగిలిపోయి

ఉబుసుపోకకు వేర్వేరు వ్యాపకాలలోనూ, సాంఘిక కార్యక్రమాలలోనూ పాలుపంచు కొంటున్న వాళ్ళు. ఒక సంవత్సరం క్రిందట నేను, మరో మిత్రుడు సూర్యదేవర కలసి “ఆటాపాటా- మాటామంతీ” అనే వాట్సప్ బృందాన్ని మొదలెట్టాము. సంగీత, సాహిత్యాల మీద మక్కువ ఉండి, మంచి అభిరుచులున్న మరికొంత మంది క్రమంగా మా బృందంలో చేరారు. ఒక సంవత్సర కాలంగా ఈ బృందం ద్వారా అందరం సన్నిహితులమైనా ఒకరినొకరు కలుసుకునే భాగ్యం ఈ రోజే కలిగింది. మా బృందం ముఖ్యోద్దేశం తెలుగు భాషని, సంస్కృతిని, సంగీత సాహిత్యాలను, ఇతర కళలను మధించి ఆనందించడం, ఆనందింప చేయటం. ఎవరికి తెలిసిన మంచి విషయాలు వారు మిగతా వారితో పంచుకుంటూ ఈ సంవత్సర కాలంలో అందరం ఒకరికొకరు ఎంతో చేరువయ్యాము. ఒంటరితనం అనేది మా దరిదాపులకు కూడా రాకుండా చేయగలిగాము. మా జీవితాలలో ఒక విధమైన నూతనోత్సాహం, కలివిడితనం, పరిపూర్ణత సమకూరి జీవితాలకు ఒక గమ్యమంటూ ఏర్పడింది. మా దైనందిన జీవితాలలో నిస్తేజతను పూర్తిగా దూరం చేసుకోగలిగాము” అన్నాడు.

ఆయన మాటలకు, చెప్పిన తీరుకు నేనెంతో ముగ్ధుడినయ్యాను. నన్ను నేను పరిచయం చేసుకుని నన్ను కూడా వారి బృందంలో చేర్చుకోమని అడిగాను. ఆయన వెంటనే నన్ను వారి బృంద సభ్యుల దగ్గరకు తీసుకుని వెళ్ళి పరిచయం చేశాడు మన బృందంలో చేరుతున్న మరో క్రొత్త సభ్యుడంటూ.

ఇది జరిగి దాదాపు ఆరు నెలలైంది. అప్పటినుంచీ ఆ బృందం కార్యకలాపాలలో నేను కూడా క్రియాశీలకంగా పాల్గొంటున్నాను. ఈ ఆరు నెలల సానిహిత్యంతో నాకు అవగతమైన దేమిటంటే ఆ రోజు చంద్రమౌళి గారు నాకు చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదనేది. ఆయన చెప్పినట్లే ఆ బృంద సభ్యులందరూ ప్రతి రోజు ఎన్నో క్రొత్త, క్రొత్త విషయాలు మిగతా వారితో పంచుకుంటారు. ఛలోక్తులు, భక్తి ప్రవచనాలు, కథలు, కథానికలు, పురాణాలు,

సంగీతం, నాట్యం, సాహిత్యపు చమక్కులు, ఆటపాటలు, ఆధ్యాత్మిక విషయాలు, జీవిత సత్యాలు – ఒకటేమిటి వారు ముచ్చటించుకునే విషయాలకు ఆకాశమే హద్దు. ఎటువంటి పరుష వాక్యాలు వాడకుండా, అశ్లీలతకు ఏ మాత్రం తావివ్వకుండా, కుటుంబమంతా ఒక చోట కూర్చుని ఆనందంగా ఆస్వాదించే విషయాలను వారు ముచ్చటించుకుంటారు. ఒకరిమీద ఒకరు ఛలోక్తులు వేసుకోడం, సరదాగా వాదులాడుకోవడం వారికి పరిపాటి. ఒకరి నుంచి మరొకరు ప్రేరణ పొందుతూ క్రమంగా అందరూ ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. అందరిలో సుస్పష్టంగా కనిపించే లక్షణాలు వారి కళాపిపాస, ఉత్తమాభిరుచులు, సామాజిక స్పందన, శుభ దృక్పథం.

ఈ ఆరునెలల కాలంలో మేమందరం మరో రెండు సార్లు కలుసుకున్నాం వేర్వేరు సభ్యుల ఇళ్ళల్లో. ఆ సమావేశాలు కూడా ఎంతో ఆహ్లాదకరంగా జరిగాయి.

*********

చెప్పడం ముగించి గొంతు సర్దుకున్నాడు అవధాని.

“తమ్ముళ్లూ! ఇప్పుడు చెప్పండి వాట్సప్ గురించి నేనేం చెప్పాలో. కూరలు తరిగే కత్తిని కుత్తుకలు కోయడానికి కూడా వాడవచ్చు. అయితే తప్పు కత్తిదెలా అవుతుంది. అది ఉపయోగించే వారి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి నూతన ఆవిష్కారం సదుద్దేశంతో చేసినదే. అయితే వాటి ఉపయోగం వాటిని మనం వినియోగించుకునే తీరులో ఉంటుంది. వాటి దుర్వినియోగాన్ని అరికట్టగలిగితే ప్రతి ఆవిష్కారాన్ని మానవ పురోగతికి ఉపయోగించుకోవచ్చు. వాట్సప్ కూడా అంతే. సక్రమంగా ఉపయోగిస్తే అంతకు మించిన సౌకర్యం వేరొకటి ఉండదు.”

అతడి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్టు తలాడించారు విక్రం, సాగర్లు.

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి