వృద్ధాప్యం వరమా ? శాపమా? - మద్దూరి నరసింహమూర్తి

Vruddhapyam varama? sapama?

మోహన్ రావు, రమణమూర్తి, కరుణాకరం మరియు చంద్రశేఖరం – నలుగురు వయోవృద్ధులైన స్నేహితులు -- ప్రతీ రోజూ సాయంత్రం వారి దినచర్యగా పార్కులో కలుసుకొని, పార్కులోనే గుండ్రంగా రెండు సార్లు తిరిగొచ్చి ఒక సిమెంట్ బెంచీ మీద కూర్చొని, గంట నుంచి గంటన్నర పిచ్చాపాటి మాట్లాడుకొని, మరొకసారి పార్కులోనే గుండ్రంగా రెండు సార్లు తిరిగి ఎవరింటికి వారు వెళ్లిపోవడం అలవాటు.

ఈరోజు కూడా అలాగే వారు మాటలాడుకొనేందుకు ఉపక్రమించినప్పుడు –

మోహన్ రావు : “ఈరోజు మా మనవడు బడినుంచి వచ్చి నాకు ఒక ప్రశ్న వేసేడు.

రమణమూర్తి : “ఏ తరగతిలో చదువుతున్నాడు నీ మనవడు”

మోహన్ రావు : “ఎనిమిదో తరగతి చదువుతున్నాడు”

కరుణాకరం : “ఇంతకీ నీ మనవడు వేసిన ప్రశ్న ఏమిటి”

మోహన్ రావు : “వృద్ధాప్యం వరమా ? శాపమా? అని”

చంద్రశేఖరం : “ఎనిమిదో తరగతి చదువుతున్న నీ మనవడు ఆ ప్రశ్న వేయడమేమిటి”

మోహన్ రావు : “రెండు రోజుల తరువాత వాడి బడిలో ఆ విషయం మీద వక్తృత్వ పోటీలున్నాయట.

నేను జవాబు చెప్పి ఎలా మాట్లాడాలో చెప్తే, వాడు ఆ పోటీలో పాల్గొంటానంటున్నాడు”

కరుణాకరం : “ఇంతకీ నువ్వు ఏమని జవాబు చెప్పేవు”

మోహన్ రావు : “మీ అభిప్రాయాలు కూడా తెలుసుకొవొచ్చు అనిపించి, రాత్రికి చెప్తానని ఇటు వచ్చేసేను.

మీ అభిప్రాయాలు చెప్తారా కాస్తా”

రమణమూర్తి : “ఇందులో పెద్దగా ఆలోచించవలసింది ఏముంది, వృద్ధాప్యం తప్పకుండా శాపమే”

కరుణాకరం : “అవును, ఎవరు కాదన్నా, వృద్ధాప్యం శాపమే”

చంద్రశేఖరం : “నా ఉద్దేశంలో వృద్ధాప్యం వరమే, మరి నీ అభిప్రాయమేమిటి”

మోహన్ రావు : ”మీరు ముగ్గురూ మీ అభిప్రాయాలు చెప్పేరు. ధన్యవాదాలు. నా అభిప్రాయం ప్రకారం -

వృద్ధాప్యం వరమా ? శాపమా? అన్న ప్రశ్నను సర్వ సాధారణం చేయలేము. ఒకరికి

వరం అవొచ్చు, మరొకరికి శాపం అవొచ్చు. అంతే కాక, ఒకరికే కొంత కాలం వరం

అవొచ్చు, మరి కొంత కాలం శాపం అవోచ్చు”

చంద్రశేఖరం : “నువ్వు చెప్పేది వింటూంటే, నీ ఆలోచనలు పూర్తిగా వినాలనిపిస్తోంది. నీ ఆలోచనలు

వివరంగా చెప్పు”

మోహన్ రావు : “మీరేమంటారు” అంటూ మిగతా ఇద్దరినీ అడిగేడు.

రమణమూర్తి & కరుణాకరం : “మాకు కూడా నీ ఆలోచనలు వినాలనే ఉంది, వివరంగా చెప్పు”

మోహన్ రావు : “సరే, వృద్ధాప్యం వచ్చిన మనిషికి ఎటువంటి బరువు బాధ్యతలు బాదరబందీలు లేకుండా

ఉంటే, ఉన్నా వాటిని పంచుకొనేందుకు సంతానం రూపంలోనో మరో విధంగానో తోడు ఉంటే, అవసరమైనంతవరకూ ఆర్ధిక సదుపాయానికి ఎటువంటి లోటు లేకూడా ఉంటే - ఆ మనిషికి వృద్ధాప్యం పూర్తిగా వరమే.

పూర్తి చేయవలసిన బాధ్యతలు బాదరబందీలు ఉంటూ, వాటిని నెరవేర్చేందుకు తగిన

ఆర్ధిక వెసులుబాటు లేకపోగా బరువు బాధ్యతలు పంచుకొనేందుకు తోడు కూడా లేని

మనిషికి వృద్ధాప్యం పూర్తిగా శాపమే.

అంతేకాదు, ఒకే మనిషి –

తన వృద్ధాప్యంలో కూడా బరువు బాధ్యతలు మోస్తూ, వాటిని పంచుకొనేందుకు ఒక తోడు

కూడా లేక, ఒంటరిగానే ఆ బరువు బాధ్యతలు తీర్చుకుంటూ, వదుల్చుకుంటూ, అందుకు

కావలసిన ఆర్ధిక సదుపాయం వెదుక్కుంటూ గడిపినంతకాలం అతనికి వృద్ధాప్యం శాపంగానే తలుస్తాడు.

అదే మనిషి – ఎప్పుడైతే ఆ బరువు బాధ్యతలు తీర్చుకొని కానీ, వదల్చుకొని కానీ, ఆర్ధిక

సదుపాయం కోసం ఎటువంటి వెదుకులాట లేకుండా గడపగలిగే రోజులలో వృద్ధాప్యం వరంగానే తలుస్తాడు.

అంటే, ఒక మనిషికి వరమైన వృద్ధాప్యం మరొక మనిషికి శాపం కావొచ్చు.

అంతేకాక, ఒకే మనిషికి వృద్ధాప్యంలో కొన్ని రోజులు శాపంగా భావింప వలసి వస్తే, మరి కొన్ని రోజులు వరంగా భావించే అవకాశం రావొచ్చు.

అందువలన వృద్ధాప్యం వరమా శాపమా అన్న ప్రశ్నకు సార్వజనిత సమాధానం లేదు, ఉండే అవకాశం ఎంత మాత్రమూ లేదు.

చంద్రశేఖరం : “నువ్వు చెప్పినది విశ్లేషిస్తే -- బరువు బాధ్యతల మాట అలా ఉంచితే, ఏ మనిషికైనా ఆర్ధిక వనరులకు కొదవ లేకపోతే వృద్ధాప్యం వరం అనిపిస్తుంది. అలా కాక, ఆర్ధికంగా లోటు ఉంటే ఏ మనిషికైనా వృద్ధాప్యం శాపంగా అనిపించక తప్పదు అన్నమాటేగా”

రమణమూర్తి & కరుణాకరం : “మోహన్ రావు చెప్పినది, నీ విశ్లేషణ వింటూంటే ‘ధనమూలమిదం

జగత్’ అన్న మాటను వృద్ధాప్యంలో ‘ధనమూలమిదం వరం యా

శాపం’ అని అన్వయించుకోవాలన్న మాట”

మోహన్ రావు : “తప్పు, ధనం ఒక్కటే వృద్ధాప్యంను వరమని కానీ శాపమని కానీ నిర్ణయించలేదు.

రమణమూర్తి : “అంటే, ఇంతవరకూ నువ్వు చెప్పినదంతా ‘వట్టి హుళక్కు’ అన్నమాట”

మోహన్ రావు : “కాదు, వృద్దాప్యంను వరమని కానీ శాపమని కానీ నిర్ణయించేది ధనం ఒక్కటే కాదు

అన్నది నా భావం”

కరుణాకరం : “అంటే, వృద్దాప్యంను వరమని కానీ శాపమని కానీ నిర్ణయించే విషయంలో ధనం ఒక్కటే

కాక ఇంకా ఏవేవో కారణాలు ఉన్నాయంటావు”

చంద్రశేఖరం : “ఇంకెందుకు ఆలస్యం, అవేంటో కూడా సెలవివ్వు”

మోహన్ రావు : “నేను చెప్పేది జాగ్రత్తగా విని మీరు నాతో ఏకీభవిస్తారో లేదో తరువాత చెప్పండి.

మనిషి అన్నవాడు ఎవడైనా ‘వినా దైన్యేన జీవితం’ ప్రసాదించమని ప్రతీ రోజూ దైవాన్ని

ప్రార్ధిస్తూనే ఉంటాడు కదా. అంటే, ఆరోగ్యకరమైన జీవితం వృద్ధాప్యంలో వరం కాగా

అనారోగ్యకరమైన జీవితం వృద్ధాప్యంలో శాపమని అర్ధం కదా”

చంద్రశేఖరం : “అది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం. గట్టిగా ఆరోగ్యంగా ఉంటేనే వృద్ధాప్యంలో ఒక్కొక్కప్పుడు రోజులు గడవడం కష్టం. అలాంటిది అనారోగ్యంతో ఉంటే వృద్ధాప్యంలో రోజులు గడవడం బహు కష్టం”

కరుణాకరం : “అందుకే, చాగంటి గారు తన ప్రసంగాలలో – ‘ఎవరైనా తమ కాలకృత్యాలు తమంతట

తాము తీర్చుకోలేక ఇతరుల మీద ఆధారపడే పరిస్థితికి దిగజారితే, ఆ మనిషి జీవితానికి

అంతకంటే పెద్ద శాపం ఇంకే ముంది’ – అని చెప్తూ ఉంటారు.

మోహన్ రావు : “అంటే, వృద్ధాప్యం వరం అవడానికైనా శాపంగా మారడానికైనా ధనంతో పాటూ ఆరోగ్యం

కూడా అతి ముఖ్యమైనది అని తేలింది కదా. ఇంకా, కొన్ని కారణాలు ఉన్నాయి”

రమణమూర్తి : “నేను చెప్తాను వినండి. వృద్ధాఫ్యంలో మాటలాడేందుకు మరో మనిషి లేకుండా ఏకాకి జీవితం గడపవలసి వస్తే, అది కూడా పెద్ద శాపంగానే పరిగణించాలి. ఎందుకంటే, అలా ఉన్న మనిషికి కొన్నాళ్ళకు మెదడు పూర్తిగా మొద్దుబారి పోయి, ఏమీ గుర్తుకు రాక, మాటలాడడం కూడా మరచిపోయే అవకాశం ఎక్కువ అని వైద్యులు వారి పరిశోధనా పత్రాలలో తెలియచేస్తూ, వీలైనంతమట్టుకు స్నేహితులతోనో బంధువులతోనో తరచుగా మాట్లాడుతూ ఉండండి అని వృద్ధులకు సూచిస్తూనే ఉన్నారు. వైద్యుల ఆ సూచనలు పాటించాలంటే ఇంట్లో తనవాళ్లు బయట స్నేహితులు అంటూ ఉండాలికదా. అలా ఎవరూ లేనప్పుడు వృద్ధాప్యం శాపంగానే పరిణమిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు”

మోహన్ రావు : “అంటే, తోడుగా తనవారు బంధువులు స్నేహితులు ఉన్నవారికి వృద్ధాప్యం వరం, అలా

లేనివారికి వృద్ధాప్యం శాపం అని తీలింది కదా.

చంద్రశేఖరం : “ఆ విషయంలో మనం నలుగురం అదృష్టవంతులం”

--- చంద్రశేఖరం అలా అనగానే నలుగురు స్నేహితులు గుండె నిండుగా నవ్వుకున్నారు ---

కరుణాకరం : “అంటే, వృద్ధాప్యం వరం అవడానికైనా శాపంగా మారడానికైనా ధనం ఆరోగ్యంతో పాటూ

ఇంట్లో తనవారు కానీ, బంధువులు కానీ, బయట స్నేహితులు కానీ తోడుగా ఉండడం

అతి ఆవశ్యకం అని గమనించాలి”

మోహన్ రావు : “ధనం ఉన్నా లేకున్నా, ఆరోగ్యం కూడా అంత మాత్రమే అయినా, భర్తకు భార్య ఆలాగే

భార్యకు భర్త తోడుగా ఉన్నంత కాలమూ వారిరువిరికి వృద్ధాప్యం వరమనే చెప్పాలి. కానీ,

వారిద్దరిలో ఎవరు ముందుగా చనిపోయినా, తరువాత బ్రతికున్న వారికి మిగిలిన జీవితం

శాపమనే చెప్పాలి. ఆ జీవితం ఎవరికి వారికి అనుభవైకవేద్యమే కానీ వివరింప శక్యము

కాదు”

రమణమూర్తి & కరుణాకరం & చంద్రశేఖరం (మోహన్ రావు తో) : ఇప్పుడు నువ్వు చెప్పినది మాత్రం

అక్షర లక్షలు విలువ చేసిన మాటలు. మన నలుగురిని ఈ విషయంలో భగవంతుడు

వరప్రసాదులుగా మిగిల్చినందుకు మనం ఎనిమిది మంది ఆయన యెడల ఎంతో

కృతజ్ఞతతో మసలుకోవాలి”

రమణమూర్తి : “నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, చెప్పనా”

మోహన్ రావు : “చెప్పు చెప్పు”

రమణమూర్తి : “మనం సంతానం విషయం మరచిపోయేం”

కరుణాకరం : “అంటే, వివరంగా చెప్పు”

రమణమూర్తి : “వృద్ధాప్యంలో సంతానం ఉంటే వరం లేకపోతే శాపం. అయితే, అక్కరకు రాని సంతానం

ఉంటే కూడా శాపమే. అలా అక్కరకు రాని సంతానం ఉంటే, భార్యాభర్తలు తమలో తాము

కుమిలి పోవడమే కాక, ఊళ్ళోవారి దెప్పిపోతలు కూడా భరించడం వృద్ధాప్యంలో అతి పెద్ద

శాపం”

చంద్రశేఖరం : “వృద్ధాశ్రమాలలో ఉన్న వారి పరిస్థితి మరీ అధ్వాన్నం. ఎందుకంటే, అలాంటి చోట

ఉన్నప్పుడు – ఎన్ని సదుపాయాలు ఉన్నా, దగ్గర అవసరానికి ఎంత డబ్భు ఉన్నా,

ఎంత ఆరోగ్యం ఉన్నా, తోడుగా జీవిత భాగస్వామి ఉన్నా కూడా, ఎడతెరిపిలేని ఆలోచనా

పరంపరలతో గడుపుతున్న వృద్ధాప్యపు జీవితాన్ని మనసు శాశ్వతమైన అతి పెద్ద

శాపంగానే పరిగణిస్తుంది. అందుకు విరుద్ధంగా, స్వంత సంతానంతో పూరి గుడెసలో

ఉన్నా కూడా సంతృప్తి చెందిన మనసు వృద్ధాప్యాన్ని వరంగానే స్వీకరిస్తుంది”

రమణమూర్తి : “మోహన్ రావు, నీ మనవడి ధర్మమా అని మనం నలుగురం ఈరోజు ఈ సంధ్యా

సమయాన్ని చక్కగా గడిపి, మన జీవితాలను మనమే పరీక్షించి చూసుకున్నామన్న భావన కలిగింది. ఈ ఆలోచనలు సజీవంగా ఉండగానే, ఈరాత్రే నీ మనవడికి జాగ్రత్తగా తరిఫీదు ఇచ్చి వక్తృత్వ పోటీకి పంపించు. మన ఆలోచనలన్నీ సరైనవే కాబట్టి, నీవు సరిగ్గా బోధించి పోటీకి పంపుతే, నీ మనవడు బహుమతి సాధించడం ఖాయం. అప్పుడు నువ్వు మా అందరికీ కుటుంబ సమేతంగా పెద్ద పార్టీ ఇచ్చి తీరాలి”

మోహన్ రావు : “తప్పకుండా. ఆ నెపంతో మన నాలుగు కుటుంబాలు కలిసి సంతోషంగా గదుపుదాం. అయితే ముందుగా, మీరంతా నా మనవడు బహుమతి సాధించాలని దీవించండి”

--- “నీ మానవడికి మా దీవెనలతో బహుమతి, మాకు నీ సొమ్ముతో పెద్ద పార్టీ దొరకేలా చేయమని మేము భగవంతుడిని వేడుకుంటున్నాము” --- అని మిగతా ముగ్గురూ అనగానే ---

నలుగురూ మనసారా సంతోషంగా నవ్వుకుంటూ ఎవరిళ్ళకు వారు బయలుదేరేరు.

**శ్రీరామ**

మరిన్ని కథలు

Adigite cheptaa
అడిగితే చెప్తా
- కొడవంటి ఉషా కుమారి
Evaru takkuva kaadu
ఎవరూ తక్కువ కాదు!
- రాము కోలా దెందుకూరు
Sahajeevanam
సహజీవనం
- ప్రభావతి పూసపాటి
Amalina prema
అమలిన ప్రేమ
- పోరండ్ల సుధాకర్
Day care
డే కేర్
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Dhaniyalu raju heart story
ధనియాలు రాజు హార్ట్ స్టొరీ
- కలం పేరు: బామాశ్రీ రచయిత పేరు: మామిడిశెట్టి బాలాజీ
Rushabhudu Dwividudu
బుషబుడు - ద్వివిధుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు