
"ఎంత మోసం చేశావ్ అత్తయ్యా! ఎన్నో టీవీ సీరియల్స్ చూసి, నిద్రలేని రాత్రులు గడిపి, మానసిక ఒత్తిడి తట్టుకుంటూ నేను వేసుకున్న ప్లాన్‌ను మొత్తం తలక్రిందులు చేశావు కదా!" ఆక్రోశంతో ఊగిపోతూ అరిచింది కోడలు.
"నీలాగే నేనూ ఎన్నో తెలుగు టీవీ సీరియల్స్ చూశాను. ప్రతి పాత్రలో నన్ను నేను చూసుకుంటూ, ఎన్నో కలలు కన్నాను. చివరకు అవే నన్ను కాపాడాయని అర్థమైంది. ఆ మాత్రం తెలియదా నీకు?" సర్ది చెప్పింది అత్తగారు. "అయినా అత్తయ్యా! వంటగదిలోకి వెళ్లిన వెంటనే కాలయాపన చేయకుండా గ్యాస్ స్టవ్ వెలిగించాలని తెలియదా నీకు?" కోపంగా అడిగింది కోడలు. "వెలిగించాలనుకున్నాను, కానీ ఈలోపల కరెంటు పోయింది. అందుకే ఆగాను," అంది అత్త. "అయ్యో అత్తయ్యా! నీవు గ్యాస్ స్టవ్ వెలిగించడం లేదని చూసి, ఆ కరెంటు తీసింది నేనే!" అని కోడలు ఒప్పుకుంది. "చీకట్లో ఏమీ కనిపించదని నీవు అగ్గిపుల్ల గీస్తావని, లీక్ అయిన గ్యాస్ అంటుకుని నీవు 'హరి' అంటావని ఆత్రంగా బయట కూర్చొని చెవులు రిక్కించి విన్నాను." "నేనూ అదే అనుకున్నాను కోడలు పిల్లా," అన్నది అత్త.
"చీకట్లో చిరుదీపం సీరియల్ గుర్తొచ్చి, కరెంటు వచ్చేవరకూ బయట కూర్చొని, నిన్నటి ఎపిసోడ్ గుర్తు చేసుకుంటూ, ఇక ఏం జరుగుతుందో ఆలోచిస్తూ కూర్చుండిపోయాను." అత్తగారిని కొరకొరా చూస్తూ, "అవునా! నా దరిద్రం కాకపోతే, చీకట్లో నీవు ఏం చేస్తావో చూద్దామని వచ్చి అగ్గిపుల్ల గీసింది నేనే కదా! ముందూ వెనకా ఆలోచించకుండా! మట్టిబుర్ర నాది!" అంది కోడలు. "సరిపోయిందిలే!" అన్నది అత్త. "నన్ను పైకి పంపాలని గ్యాస్ లీక్ ప్లాన్ చేసి, నీతోపాటు నీవూ వచ్చావు కదా! సరే, వచ్చే జన్మలోనైనా మంచిగా ప్లాన్ చేసుకో." "తెలవారుతుంది, ఎవరి స్థానాల్లోకి వాళ్లం వెళ్లిపోదాం, పద!" అనుకుంటూ తమ సమాధుల్లోకి దూరిపోయారు. అత్తకు మించిన కోడలు, కోడలుకు మించిన అత్త.