
“నువ్వెక్కే రైలు జీవితకాలం లేటు!” అనడంతో పక్కకి తిరిగి చూసాడు పరాంకుశం. “నేను ఎక్కే రైలు లేటా! అయ్యో ఇది పార్క్ అని అనుకుంటున్నాను! కాదా!” “కాదు! ఈ లోకం ఒక రైల్వే స్టేషన్! ఇక్కడ రైలు ఎప్పుడూ లేటే! “అవునా! ఇంతకీ మీరు ఎవరు?” “నేనా! నేను విశ్వానికి మిత్రుడిని!” “అవునా! మీరు ఏం చేస్తూ ఉంటారు?” “నేనా! ఈ లోకంలో కుళ్ళుని కడిగేస్తా!” “అలాగా! అయితే సైడ్ కాలవలు క్లీన్ చేస్తారా!” “కాదు! కవిని! మాటలనే మంచినీళ్ళతో క్లీన్ చేస్తా!” “ఓ! వాటర్ డిపార్ట్మెంటా!” అంటూ పక్కకి తిరిగి చూసాడు!అతడులేడు!’’ఏంటోఈమనుషులు!మాట్లాడుతూనే ఉంటారు వెళ్ళిపోతారు అనుకుంటూ పక్కకి తిరిగి చూసాడు. ఎవరో అమ్మాయి ఏడుస్తోంది. “ఓఅమ్మాయీ! ఎందుకు ఏడుస్తున్నావు? “నా బాధ ఎవరికీ చెప్పలేను! నన్ను విశ్వం మోసం చేశాడు!” “అయితే విశ్వం మంచివాడు కాదన్నమాట!” “అస్సలు కాడు!” అంటూ ఎటో వెళ్లిపోయింది!” “అయ్యో! ఏమైందో ఏమో!” అనుకుంటూ పక్కకి తిరిగి చూసాడు. ఎవరో వ్యక్తి! చాలా ఆవేశంగా ఉన్నాడు. “నేను వాడిని బతకనివ్వను”కోపంగా అన్నాడు “ఎందుకూ?” ఆశ్చర్యంగా అడిగాడు పరాంకుశం “వాడు నన్ను మోసం చేసి నా డబ్బులు కొట్టేశాడు! వాడి జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి మరీ కొడతాను!” “ఎవరిని!” “వాడినే! విశ్వాన్ని!” “ఓ! విశ్వాన్నా!” అంటూ పక్కకి చూసాడు కనపడలేదు! ఏంటి వీళ్లు! సరిగ్గా అర్థమే కారు! మాట్లాడుతారు! వెళ్ళిపోతారు! ఛ…ఛ…! పక్కన ఎవరో కూర్చున్నారు మళ్ళీ! “మీరెవరు?” అడిగాడు పరాంకుశం “ఫోన్లో సిగ్నల్ లేదు!” అన్నాడు ఎటో చూస్తూ! “నేను ఫోన్ గురించి అడగలేదు కదా!” ఆశ్చర్యంగా అన్నాడు పరాంకుశం. “ఆయన డిటెక్టివ్! అందుకే మీరు ఒకటి అడిగితే ఆయన మరొకటి చెప్తున్నాడు!” గొంతు తగ్గించి చెప్పాడు శనక్కాయలు అమ్ముకునే ఆయన. “ఓహో! అదన్నమాట సంగతి!” మరింత రహస్యంగా అన్నాడు పరంకుశం. డిటెక్టివ్ దగ్గరికి ఒక అతను వచ్చాడు. “వాడు ఇక్కడే ఉన్నాడు! ఈవేళ విశ్వాన్ని ఎలాగైనా పట్టుకుని తీరాలి” అన్నాడు డిటెక్టివ్ ‘“ఓ! మీరు విశ్వం కోసం వెతుకుతున్నారా!” అన్నాడు పరాంకుశం “అవును! అతని గురించి మీకేం తెలుసు? చెప్పండి!” అన్నాడు డిటెక్టివ్ “నేను చూడలేదు కానీ కొన్ని గుర్తులు అయితే చెప్పగలను! కానీ అతను మీకెందుకు?” “ఎందుకంటే అతడు ఉగ్రవాది! చెప్పండి అతని గురించి!” అంటూ ఎదురుగా ఉన్న వ్యక్తి కేసి చూసి కన్ను గీటాడు. “ఆపరేషన్ స్టార్ట్!” అన్నాడా వ్యక్తి. “మీరు చెప్పండి! మా ఆర్టిస్ట్ స్కెచ్ వేస్తాడు. పరాంశం చెప్పడం ప్రారంభించాడు. “అతడు ఒక కవికి మిత్రుడు! ఇంకా ఒక అమ్మాయిని మోసం చేశాడు! మరొక వ్యక్తిని మోసం చేసి అతని డబ్బులు కొట్టేశాడు! అందుకే అతన్ని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొడతానన్నాడు!” “అంటే అతనికి పొడువాటి జుట్టు ఉండి ఉండాలి!”అన్నాడు డిటెక్టివ్. “ఎవరికి?” “అదే విశ్వానికి!” “అవును! అంటే అతను చాలా మోడరన్ గా ఉండి ఉంటాడు!” అన్నాడు పరాంకుశుం. “ఇంకా అతను స్టూడెంట్ లా ఉండి ఉంటాడు” అన్నాడు డిటెక్టివ్. “కరెక్ట్! ఒక అమ్మాయిని మోసం చేశాడంటే అతను అందంగా ఉండి ఉంటాడు! ఇంకా ఎవరినో మోసం చేశాడంటే అతని కళ్ళల్లో క్రౌర్యం ఉండి ఉంటుంది! ఇంకా ఉగ్రవాది అంటున్నారు గా! అతడికి పొడుగాటి గడ్డం! ఓ కత్తిగాటు! ఒక ఉలిపిరి కాయ! ఇవి ఉంటాయి మొహంలో!” “ఎగ్జాక్ట్లీ!” ఆనందంగా అన్నాడు డిటెక్టివ్. స్కెచ్ తయారైందిమరో అరగంటలోనే ఉగ్రవాది విశ్వాన్ని పట్టుకున్నారు. అందరూ పరాంకుశాన్ని అభినందించారు. కాసేపట్లో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. “బాబాయ్! ఇవతలకు రావద్దని చెప్పానా! ఎందుకు వచ్చారు? క్షమించండి!ఆయన మా బాబాయ్! మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా! కొద్దిగా మెంటల్ గా స్ట్రయిన్ అవ్వడంతో ట్రీట్మెంట్ లో ఉన్నారు!” అంటూ పరాంకుశాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాడు. డిటెక్టివ్ అవాక్కయ్యాడు. “మెంటల్ కండిషన్ సరిగ్గా లేని అతని ద్వారా ఉగ్రవాదిని పట్టుకున్నారా బాబూ!” నవ్వుతూ అన్నాడు శనక్కాయలు అమ్ముకునే అతను.