పిచ్చివాడి చొక్కా - కృష్ణ చైతన్య ధర్మాన

mad man's shirt

కిట్టుకి పదకొండేళ్ళు. అతని తల్లిదండ్రులు బస్ ప్రమాదంలో మరణించారు. వారికి దగ్గర బంధువులు ఎవ్వరూ లేక పోవటంతో ముందుగా కిట్టుని అనాధాశ్రమంలో ఉంచాలని పోలీసులు నిర్ణయించారు. కానీ ఈలోగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి తాను కిట్టు కుటుంబానికి ఉన్న ఏకైక బందువని ఏదో ఋజువు చూపించి ఆ అబ్బాయిని తాను పెంచుకుంటానని చెప్పి తీసుకుని పోయాడు. అతని పేరు చిన్నయ్య. చిన్నయ్య భార్య పేరు అప్పలమ్మ. వీరికి ఒక పదేళ్ల కొడుకు ఉన్నాడు.
నిజానికి వారు కిట్టుని దత్తత తీసుకుంది కేవలం అతనితో చాకిరీ చేయించుకోడానికి మాత్రమే. ఇంటి పనులన్నీ అతనితో చేయించుకునేవారు. బడికి కూడా పంపించడం మానేసి దగ్గర్లో ఉన్న అడివికి పంపించి కట్టెలు కొట్టుకుని రమ్మనేవారు. ఇంటికి వచ్చాక అందరూ తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు అతనికి పెట్టేవారు. అలా ఎంత హింసించినా కిట్టు వారిని ప్రేమతో అభిమానించేవాడు.
ఒక రోజు ఎప్పటి లాగానే కిట్టు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. అది మే నెల కావడంతో ఎండ బాగా ఎక్కువగా ఉంది. కొంత సేపు పని చేసిన తరువాత కిట్టు విశ్రాంతికై ఒక మఱ్ఱి చెట్టు క్రింద కూర్చున్నాడు. ఆ ముందు రాత్రి అతను తుడుస్తూ ఒక గాజు గ్లాసు పగలగొట్టినందు వలన అప్పలమ్మ అతనికి భోజనం పెట్టకుండా రాత్రంతా ఇంటి బయట ఉంచి తలుపులు గడియ పెట్టింది. ముందు రాత్రి నిద్ర లేనందు వలన అతను ఆ చెట్టు నీడన నిద్ర పోయాడు. కొన్ని ఘడియలు గడిచాక ఏదో శబ్దం వలన అతనికి మెలుకువ వచ్చింది. తను లేచి చూసే సరికి పక్కనే ఒక పిచ్చివాడు కూర్చుని ఉన్నాడు. అతగాడి పొడవైన జుట్టు, మాసిన గడ్డం మరియు చిరిగిన దుస్తులు చూసి కిట్టుకి భయమేసింది. కానీ ఆ పిచ్చివాడు తనకి ఆకలిగా ఉందని సైగ చేసాడు. అది గమనించిన కిట్టు తాను ఇంట్లో తెలీకుండా తెచ్చుకున్న రొట్టె ముక్కను అతనికి ఇచ్చేసాడు. అది ఆతృతగా లాక్కుని ఎంతో ఇష్టంగా తిన్నాడు ఆ పిచ్చివాడు. ఎంతో ఆనందంగా ఒక నవ్వు నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళి పోయాడు.
కొన్ని రోజుల తరువాత మళ్లీ విశ్రాంతి కోసం కిట్టు ఆ మఱ్ఱి చెట్టు క్రిందకి వచ్చాడు. అతను కనులు మూసి సేద తీరుతుండగా ఏవో మాటలు అతనికి వినిపించ సాగాయి.
"చిన్నవాడివే గానీ... ఎంత మంచి వాడివో!"
ఉలిక్కి పడుతూ లేచిన కిట్టు అటూ ఇటూ చూసాడు. కానీ ఎవ్వరూ కనిపించ లేదు. మళ్లీ కళ్ళు మూసాడు. మళ్లీ మాటలు...
"నా క్రింద ఇప్పటి వరకు ఎన్నో వందల మంది సేద తీరారు. కానీ నీలాంటి గొప్ప వాడిని నేను ఎప్పుడూ ఎవ్వరి లోనూ చూడ లేదు. చిన్న వాడివే కానీ ఎంత మంచి వాడివో!"
మళ్లీ ఉలిక్కి పడి లేచాడు కిట్టు. ఆ మాటలు చెట్టు తొర్రలో నుంచి రావడం చూసి ఆశ్చర్య పోయాడు.
"ఏంటీ మర్రి చెట్టు మాట్లాడుతుంది?"
"ఆహ్! అవును నేనే మాట్లాడుతున్నాను. నాకు నువ్వు ఎంతో బాగా నచ్చావు. నీ మంచి తనానికి నేను నీకోక కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్నాను," చెప్పింది మఱ్ఱి చెట్టు.
"ఏంటది?"
"నా మొదలు క్రింద చాలా బంగారం దాచి ఉంచాను. నన్ను నరికి, వ్రేళ్లతో సహా పీకి నువ్వు ఆ బంగారం తీసుకో!" అని చెప్పింది మఱ్ఱి చెట్టు.
"అయ్యో! ఎంత మాట? నేను ఎండిన కొమ్మలను మాత్రమే నరుకుతాను. నీవు పచ్చగా, నిండుగా ఉన్నావు. ఎంతో మందికి నీడనిస్తున్నావు. కేవలం బంగారం కోసం నిన్ను చంపమంటావా? అది ఎప్పటికీ జరగని పని. నాకేమీ నీ బోడి బంగారం అవసరం లేదు!" అని చెప్పి వెళ్లబోయాడు కిట్టు.
"ఆగు, ఆగు!" అరిచింది మఱ్ఱి చెట్టు గట్టిగా. "నిజానికి నా మొదలు క్రింద బంగారం ఏమీ లేదు. నిన్ను మరో సారి పరీక్షిద్దామని అలా చెప్పాను. నువ్వు సామాన్యుడివి కావు. నన్ను నీ మంచి తనంతో మైమరిపించావు. ఇప్పుడు నిజంగానే నీకొకటి ఇస్తా! అది నీ జీవితాన్నే మార్చేస్తుంది."
కిట్టు ఆశ్చర్య పోతూ విన్నాడు. ఇంతలో మఱ్ఱి చెట్టు ఒక కొమ్మను తన తొర్రలో పెట్టి ఒక చొక్కాను బయటకు తీసింది. అది చాలా పాతగా ఉంది. కానీ కిట్టుకి దానిని ఎక్కడో చేసినట్టుగా అనిపించింది.
" ఈ చొక్కానా? ఇది ఆ పిచ్చి వానిదే కదా? దీనితో నేనేమి చేసుకుంటాను? ఇంతకీ అతను ఎక్కడికి పోయాడు? పాపం! అతనికి భోజనం పెట్టే వారు కూడా లేనట్టున్నారు. అతను మళ్లీ కనిపిస్తాడేమోనని రోజూ రొట్టె ముక్కలు పట్టుకుని వస్తున్నాను. అయినా అతని చొక్కా ఇక్కడికి ఎలా వచ్చింది?" అని ఆపకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు కిట్టు.
"హ హ హ..... పిచ్చివాడా?" గట్టిగా నవ్వుతూ చెప్పింది మఱ్ఱిచెట్టు. "అతడు పిచ్చి వాడు కాదు. అతడు దేవుడంట! అతనే చెప్పాడు. ఆరోజు నువ్వెళ్ళి పోయాక ఇక్కడకు వచ్చి నాతో చెట్ల భాషలో మాట్లాడాడు. నీ మంచి తనానికి మెచ్చి నీకీ చొక్కా ఇవ్వమన్నాడు. కానీ అది ఇచ్చే ముందు నిన్ను ఇంకో సారి పరీక్షించమన్నాడు. నేను నీతో నీ భాషలో మాట్లాడ గలగడానికి కూడా అతనే కారణం."
ఇది విని కిట్టు ఎంతో ఆశ్చర్య పోయాడు. అలాగే సంబర పడ్డాడు.
"కానీ ఏముంది ఈ చొక్కాలో?" అడిగాడు కిట్టు.
"ఏమో, నాకేమి ఎరుక? నేనేమైన తొడుక్కున్నానా ఏమిటి?" చెప్పింది మఱ్ఱి చెట్టు.
మాట్లాడుతూ ఆ చొక్కాని తొడుక్కున్నాడు కిట్టు. "ఇప్పుడు ఏమి చెయ్యాలి?" అన్నాడు.
"ఏమో! ఆ చొక్కా వేసుకోగానే నీకు సూపర్ పవర్స్ వచ్చేస్తాయేమో? ఏదైనా ప్రయత్నించు," అని చెప్పింది మఱ్ఱి చెట్టు.
చెట్టు పైకి ఎక్కి అక్కడి నుంచి దూకాడు కిట్టు. క్రింది పడేలోగా మఱ్ఱిచెట్టు తన కొమ్మతో పట్టుకుంది.
"ఊప్స్! జస్ట్ మిస్! నేను పట్టుకోకుంటే నీ పరిస్థితేంటి?" చెప్పింది మఱ్ఱి చెట్టు.
"సినిమాల్లో సూపర్ హీరోస్ ఇలానే ప్రయత్నిస్తారు మొదట్లో."
ఆ తరువాత చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు కిట్టు. మఱ్ఱి చెట్టు కూడా చాలా సలహాలు ఇచ్చింది. కానీ ఒక్కటి కూడా సఫలం కాలేదు.
"దీని బదులు దేవుడు నన్ను సింహంలా మార్చేసినా బాగుణ్ణు!" అని అన్నాడు కిట్టు. అలా అనగానే అతను నిజంగానే సింహంలా మారి పోయాడు.
"హేయ్! హేయ్! నువ్వు నిజంగానే సింహంలా మారి పోయావు!" ఆశ్చర్యంతో చెప్పింది మఱ్ఱి చెట్టు.
"నిజమా?" అనుకుంటూ తనని తాను చుసుకుంటూ సంబ్రమాశ్చర్యానికి గురయ్యాడు కిట్టు.
"ఇప్పుడు ఇంకొకటి కోరుకో!" అనింది మఱ్ఱి చెట్టు ఆతృతగా.
"నేను కోతిలా మారాలి!" అన్నాడు కిట్టు. వెంటనే అతను కోతిలా మారి పోయాడు. అప్పుడు వారిద్దరికీ ఆ చొక్కా ప్రత్యేకత తెలిసొచ్చింది.
ఆ రోజు నుంచి కిట్టు ఆ చొక్కాను తన చుట్టూ ఉండే పేదల అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించే వాడు. తన స్వార్ధానికి కాకుండా మంచి విషయాలకు ఉపయోగించేవాడు.
ఏ పరిస్థితుల్లో ఉన్నా రోజుకి ఒక్క సారైనా ఆ మఱ్ఱి చెట్టు దగ్గరకు వెళ్లి దానితో కబుర్లు చెప్పుకునే వాడు కిట్టు.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు