"పెళ్లయి పదేళ్లయిందండి, ఇంక మనకు పిల్లలు పుట్టే అవకాశం
లేదు. ఎన్ని దేవుళ్లకి మొక్కినా ఎన్ని పూజలు వ్రతాలు చేసినా
ఆ దేవుడికి కనికరం కలగలేదు. ఎన్ని దైవక్షేత్రాలు, ఎందరు బాబాల్ని
దర్సనం చేసినా ఫలితం లేకపోయింది. నేను గొడ్రాలిగానె ప్రాణం
వదలాలేమో? ఇంట్లో చిన్నారి ఆటపాటలు చూసే భాగ్యం లేదు"
భార్య మనోవేదన విన్న ప్రకాశరావు మనసు తల్లడిల్లిపోతోంది.
భగవంతుడి దయవల్ల వ్యాపారం పుంజుకుని ఆస్థులు కూడబెట్ట
గలిగాను. అందం అనుకూలవతైన భార్య అన్నపూర్ణ తన జీవిత
భాగస్వామిగా రావడం ఆమె దయాగుణం, మంచిమనసుతో ఎందరో
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, అనాథ శరణాలయాలకు
సహాయపడుతు సమాజంలో మంచి పేరు తెచ్చుకుంది. అందరూ
అన్నపూర్ణను నిజంగా కాశీ అన్నపూర్ణే అని పొగుడుతుంటె గర్వంగా
అనిపిస్తోంది. అన్ని సౌకర్యాలు ఉన్నా వారసుడు లేడని, మా ఇంట
ఏనాటికైన బాబో పాపో పుట్టి బుడిబుడి నడకలతో చిన్నారి
ఆటపాటలతో భావి జీవితం సాగిపోతుందనుకున్న మా ఆశలు నిరాశలవుతున్నాయి." ప్రకాశరావు మనసు తల్లడిల్లిపోతోంది.
" ఎంతోమంది సీనియర్ డాక్టర్లకు చూపి ఎన్ని మందులు వాడినా
ప్రయోజనం లేక పదేళ్లు గడిచిపోయాయి. ఇంక మాకు సంతాన
ప్రాప్తి లేనట్టు డాక్టర్లు కూడా నిర్ధరణ చేసేసారు. చివరకు బాబునో
పాపనో దత్తత తీసుకోవడమే నయమని సూచన చేసారు.
ఇంతకన్న దురదృష్టం ఏంఉంటుందని " బాధపడసాగాడు.
రోజులు మెల్లగా గడుస్తున్నాయి.
ఒకసారి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రవచనాలు చెప్పే శాస్త్రి గారు
"దూర్వాశ మహాముని శాపంతో భూలోకంలో బ్రహ్మకు పూజనీయ
క్షేత్రాలు లేవని , ఒక్క రాజస్థాన్ రాష్ట్రంలో పుష్కర్ క్షేత్రంలో బ్రహ్మ
కుండంలో కార్తీక పౌర్ణమి రోజున దంపతులిద్దరు పుణ్యస్నానాలు
చేస్తే ఫలితం ఉండవచ్చని " ఆశా దీపాన్ని వెలిగించారు.
అలాగే రాజస్తాన్ లోని అజ్మీర్ లోని ఖ్వాజా మొయినుద్దీన్ కిస్తీ దర్గాను
దర్సించి చాదర్ కప్పి మనసులోని కోరికలు చెప్పుకుంటె ఫలిస్తాయని
ఎవరో చెప్పడంతో దారిలోని అజ్మీర్ దర్గాను దర్సించుకోడానికి
ప్రకాశరావు, అన్నపూర్ణ దంపతులు బయలుదేరారు.
రాజస్థాన్ అజ్మీర్ ఖ్వాజా మొయినుద్దీన్ దర్గాను దర్సించుకుని సమాధి
మీద చాదర్ కప్పి పెద్ద కడాయిలాంటి తినుభండారాలు చేసే పాత్రలో ధనకానుకలు సమర్పించి మనసులోని కోరికలు విన్నవించుకున్నారు.
అక్కడి నుంచి పవిత్ర పుష్కర్ క్షేత్రానికి బయలుదేరారు.
పష్కర సరస్సులో స్నానం చేసి బ్రహ్మ దేవుడి దర్సనం చేసుకుని
పెద్దలకు పిండప్రదానం చేయించి వారు విడిది చేసిన వసతి గృహానికి చేరుకుని భోజనం ఏర్పాట్లలో ఉన్నారు ప్రకాశరావు దంపతులు.
ఇంతలో సుమారు మూడు సంవత్సరాలు వయసున్న కుర్రాడు వచ్చి
ఆకలని చేత్తో సంజ్ఞ చేస్తున్నాడు.
ప్రకాశరావు దంపతుల మనసు కరిగిపోయింది. ఒంటి మీద సరైన
బట్టలు లేకుండా పోషణలేక బక్కచిక్కిన ఆ కుర్రాడి వాలకం చూస్తె
తిండి తిని ఎన్నాళ్లైందో అనిపిస్తోంది.
వారు ఆ కుర్రాడిని దగ్గరకు పిలిచి కూర్చోబెట్టి కావల్సిన వస్తువులతో
కడుపు నింపి ఆకలి తీర్చేరు. ఆకలి తీరిన తర్వాత వాడి ముఖంలో
కళ చూసి ఆనందపడ్డారు.
" ఈ అబ్బాయిని మనం పెంచుకుందామంది" అన్నపూర్ణ.
"ఎవరి అబ్బాయో మనకి ఏం తెల్సు. వద్దులే " అన్నాడు ప్రకాశరావు.
ముద్దుగా బాగున్నాడు. సంరక్షణ చేస్తే తేరుకుంటాడు.వాడి వివరాలు
తెల్సుకోమంది.
సాయంకాలం వారి తిరుగు ప్రయాణం. వారు బసచేసిన విడిది
యజమానికి విషయం తెలియచేసారు.
" ఇటువంటి ఆనాథ పిల్లలు ఇక్కడ తిరుగుతూనె ఉంటారని,
యాత్రికులు పెట్టే తినుబండారాలతో వాళ్ళ జీవితాలు సాగిపోతుంటాయని
తర్వాత ఏ సాధు మఠాల్లోనో నౌకర్లుగా బతికేస్తారని" చెప్పేడు.
తాము ఈ కుర్రాడిని వెంట తీసుకెళ్లి పెంచుకుంటామని విడిది
యజమానికి చెప్పగా మీరు ఏక్ నాథ్ బాబా మఠంలో సంప్రదించమని
చెప్పేడు.
ప్రకాశరావు దంపతులు దగ్గరలోని ఏక్ నాథ్ బాబా ఆశ్రమంలో
వాకబు చేస్తే" ఇటువంటి అనాథ పిల్లలు పగలు పుష్కర ఘాట్లో
సంచరించి రాత్రిళ్ళు ఇక్కడ పడుకుంటారని" చెప్పేడు.
తాము ఈ అబ్బాయిని వెంట తీసుకెళ్లి పెంచుకుంటామని చెప్పి
ఆశ్రమానికి డొనేషన్ గా కొంత డబ్బు ముట్టచెప్పి ఎటువంటి కాగిత
రాతకోతలు లేకుండా ఆ అబ్బాయిని వెంట తీసుకువచ్చారు.
పుష్కర క్షేత్రం నుంచి దత్తత తీసుకున్నామని బంధువులకు,
సన్నిహితులకు చెప్పి ఆప్యాయంగా పెంచుకోసాగేరు.
సిద్ధాంతి గారిని పిలిపించి ఘనంగా మోహన్ గా నామకరణం
చేసారు.
సరైన తిండిపోషణ జరగడంతో పుష్టిగా అందంగా కనబడుతున్నాడు
మోహన్. తర్వాత వాడికి ఉపనయనం కావించారు.
వాడిని కార్పొరేట్ స్కూల్లో ప్రవేశం కలిగించారు.
ఆధ్యాత్మిక భావాలతో హిందూ సంప్రదాయ వేష భాషలతో
సింధూర తిలకధారణతో స్మార్టుగా కానొస్తున్నాడు మోహన్.
తమ ఇంట చిన్న పిల్లల ఆటపాటలు లేవని నిరాశపడిన
ప్రకాశరావు దంపతుల ఇంట ఆ ముచ్చట నెరవేరిందని
ఆనందపడ్డారు.
దినదిన ప్రవర్ధమానంతో మోహన్ పెరుగుతు చదువుతో పాటు
తండ్రి వ్యాపార కార్యకలాపాలు చక్కపెడుతున్నాడు.
ఇప్పుడు మోహన్ కి పాతిక సంవత్సరాలు వచ్చాయి.
చదువు పూర్తయి ఆధ్యాత్మిక భావాలతో పాటు ఆధునిక
పోకడలతో చలాకీగా ఉంటున్నాడు.
తండ్రి వ్యాపార కలాపాలు చూస్తు చేతోడుగా ఉంటున్నాడు.
ఒకసారి మాటల సందర్భంలో తను రాజస్థాన్ పుష్కర్ క్షేత్రం
నుంచి దత్తతగా ప్రకాశరావు దంపతులు పెంపకానికి తెచ్చిన
విషయం బయటపడింది.
అప్పటి నుంచి తన అసలు తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు
పెంపకానికి ఇచ్చినట్టు తెలుసుకోవాలని ఉత్సుకత మొదలైంది.
తను వివరాలు అడిగినా పెంచుకుంటున్న అమ్మానాన్నలు
నిజం చెప్పరని అనుమానంతో తనే ఆ నిజం తెలుసు
కోవాలనుకున్నాడు.
వ్యాపార నిమిత్తం ఒకసారి రాజస్థాన్ జోధ్ పూర్ వెళ్ల వల్సి
వచ్చింది. అదే అదునుగా పుష్కర్ క్షేత్రం వెళ్లి తన పుట్టు
పూర్వోత్తరాలు తెలుసుకోవాలనుకున్నాడు మోహన్.
పష్కర్ క్షేత్రం చేరి హోటల్లో బసచేసి తనని దత్తత ఇచ్చిన
బాబా ఏక్ నాథ్ ఆశ్రమ వివరాలు తెలుసుకుని వాకబు
మొదలెట్టాడు.
వార్ధక్యంలో ఉన్న బాబా ఏక్ నాథ్ ఇరవై సంవత్సరాల
క్రితం జరిగిన సంఘటన జ్ఞప్తికి తెచ్చుకుని ఒక మద్రాసీ
కుటుంబం వచ్చినట్టు , అనాథగా తిరుగుతున్న కుర్రాడిని
పెంచుకుంటామని ఆశ్రమానికి కొంత డబ్బు విరాళమిచ్చి
వెంట తీసుకెళ్లినట్టు చెప్పాడు.
ఆ అబ్బాయి అనాథగా తిరగడానికి కారణం అన్వేషించగా
పుష్కర్ దగ్గర పూలమాలలు అమ్మే ముస్లీం కుటుంబాల
ద్వారా తెల్సిన విషయమేమంటె అజ్మీర్ దర్గా దగ్గర బిచ్చ
మెత్తుకునే మతి స్థిమితం లేని యువతిని ఎవరో గర్భవతిని
చేసి పుష్కర్ వద్ద వదిలేస్తె తాము చేరదీసి పోషణ చేస్తె
మగపిల్లాడికి జన్మ నిచ్చినట్టు, ఆ అబ్బాయి పేరు మొయినుద్దీన్
అని తర్వాత ఆ కుర్రాడిని తీసుకుని ఎటోపోయిందని చెప్పేరు.
మతిస్థిమితం లేని ఆ యువతి కుర్రాడితో ఇటువస్తె వాడికి
బువ్వ పెట్టేవారని తర్వాత కొన్నాళ్లకు బుడ్డోడిని వదిలి పోతే
ఇక్కడే అడుక్కు తింటు తిరిగేవాడని తెల్సింది.
తన కొడుకు కోసం అప్పడప్పుడు వచ్చి పోతుంండేదని తర్వాత
కొద్ది రోజులు కనబడలేదని ఆశ్రమ నిర్వాహకులు చెప్పేరు.
ఆ బాబును మద్రాసీ దంపతులు వెంట తీసుకుపోయిన తర్వాత
మళ్లా వచ్చి కొడుకు కోసం వెతికేదని ఆపైన పిచ్చిగా మాట్లాడుకుంటు
కొడుకు మీద బెంగతో చచ్చిపోయిందని ఆమె గుర్తులు కూడా ఏమీ
లేవని నిర్వాహకులు వివరంగా చెబితే అసలు విషయం తెల్సి
ఖిన్నుడయాడు మోహన్.
"ఐతే తను ముస్లిం యువతికి పుట్టిన అనాథబిడ్డ మొయునుద్దీన్,
మోహన్ గా కలవారింట పెరిగి పెద్దయినట్టు గ్రహించాడు."
ఆకటి అలములతో తిరిగే తనని దేవతల్లాంటి ప్రకాశరావు దంపతులు
బంగారు జీవితాన్ని ప్రసాదించి తమ కన్ననబిడ్డలా చూసుకుంటు
పెంచారని, మురికి కూపంలోంచి తనను బంగారు ఉయ్యాలలో
పడవేసారని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మనసులో.
మనిషికి మతాలు కాదు మానవత్వం ముఖ్యమని గ్రహించాడు.
ప్రకాశరావు దంపతులు తనకు పెంపుడు అమ్మనాన్నలు కాదు
దైవస్వరూపులు. వారి మనసు ఎప్పుడూ కష్టపెట్టకూడదు.
తనకు జన్మ వృత్తాంతం తెలిసిన సంగతి ఎట్టి పరిస్థితుల్లోను
వారికి చెప్పకూడదు. జీవితాంతం వారికి ఆనందాన్నే కలిగించాలి.
బాధ పెట్టకూడదని దృఢ నిశ్చయానికొచ్చాడు మోహన్.
సమాప్తం

