చాన్నాళ్ళ తర్వాత మావూరి సంక్రాంతి సంబరాలు చూద్దామని సంక్రాంతికి వారం రోజుల ముందే నేనూ నా శ్రీమతి హైదరాబాద్ నుండి కారులో బయలు దేరాము. వూరి పొలిమేర లో కట్టిన "ప్లెక్సీ''లు చూసి కొద్ది నిమిషాలు ఆనందా శ్చర్యాలకు లోనయ్యాను! వూరి లోకి ప్రవేశించే రహదారి వద్ద రెండు వైపులా కాంక్రీటు పిల్లర్స్ తో నిర్మించిన సింహద్వారములు స్వాగత తోరణాలు తో కళకళలాడుతున్నాయి! "రామయ్య'' గారి శిలా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేయుచున్న అతిథులకు స్వాగతం .. సుస్వాగతం.! అది మా మా నాన్న గారి పేరే! సంక్రాంతి సంబరాలు కూడా మరిచి నాన్నగారి గారి శిలా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో ఆ గ్రామంలోని యువకులంతా తలమునకలై ఉన్నారు!
"తలలో నాల్కయై జనం గుండెలో నిలిచి పోయిన మహానుభావుడనీ పేదల పెన్నిధి అనీ,మంచితనానికి మారుపేరనీ, ఆపద్భాందవుడనీ ఇలా మా నాన్న గారి గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే ఆ మహాను భావుడు మా నాన్న గారే నని మా వూరి ప్రజల ముందు గర్వంగా చెప్పుకోలేని దురద్రృష్టవంతుడిని .కారు వూరి పొలిమేర లోనే ఆపి మా వూరి వైపు నేనూ నా శ్రీమతి అడుగులు వేసాము. నెల రోజుల క్రితమే మా వూరినుండి ఈ కార్యక్రమానికి అవసరమైన నిధుల సేకరణ కోసం పట్టణం వచ్చిన మా వూరి యువకులను గేటు బయట నుండే నేను ఇంట్లో లేనని సెక్యూరిటీ గార్డు చేత చెప్పించి పొమ్మన్నాను. ఇప్పుడు ఇదంతా చూసాక నాలో నేనే పశ్చాత్తపడుతున్నాను. వారు మా నాన్న గారి శిలా విగ్రహ ఆవిష్కరణ కై పడుతున్న శ్రమను గుర్తించలేక పోయినందుకు నాలో నేనే సిగ్గు పడుతున్నాను
ఇక్కడ మా వూరిలో మా నాన్న గారి పేరు స్మరించుకొన్నవారే తప్ప మమ్మల్ని పట్టించుకొన్నవారుగానీ, గుర్తు పట్టిన వారు గానీ దాదాపు గా ఎవరూ లేరనే చెప్పాలి. ................. సివిల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాకు పట్టణం లోనే పేరు మోసిన కాంట్రాక్టర్ గారి అమ్మాయి తో నా వివాహం జరిగాక, మా నాన్న గారిని ఆ పల్లెటూరి లోనే విడిచి మా వూరి తో సంబంధాలు తెంచుకొని ధనమే సర్వస్వమనుకొని కావలసిన దానికన్నా ఎక్కువ సంపాదించాలనే దురాశతో ఇరవై ఏళ్ల క్రితం పట్టణం వచ్చేసిన నాకు మా నాన్న గారి చివరి చూపుకు కూడా నోచుకోవడానికి అవకాశం లేక బంధువులెవరెవరినీ హైదరాబాద్ పిలవలేక ఈవెంట్ మేనేజ్మెంట్ వారి సహకారంతో కర్మకాండలన్నీ పట్టణంలోనే జరిపించుకొన్నాను. అనుబంధాల విలువలు తెలియక కాంక్రీటు జంగిల్స్ లో యాంత్రిక జీవనాన్ని సాగిస్తూ కరెన్సీ కట్టలతో అనుబంధాన్ని పెంచుకొని ఆస్తులు పోగేసుకున్న నాకు ఈ వూరి లోఅడుగు పెట్టిన తర్వాత నాలో ఏదో వెలితిగా అనిపించింది. వ్యాపారమే వ్యసనము గా మార్చుకొని పట్టణం లో బ్రతికేస్తున్న నన్ను ఇపుడు ఈ వూరి లో గుర్తించిన బంధువులూ దూరమయ్యారు! యోగ క్షేమాలు అడిగే స్నేహితులూ కరువయ్యారు. కనీసం మా అబ్బాయి గురించైనా అడిగే ఆత్మీయులూ కరువయ్యారు ఎక్కడ విన్నా రామనామ స్మరణ లా మా నాన్న గారు రామయ్యగారి గురించే! రామయ్య గారు వూరికి చేసిన మంచి పనులు గురించే!! అటువంటి గొప్ప వ్యక్తి రామయ్య గారి కొడుకును నేనేనని ఎలా చెప్పు కోను ? దూరం గా వున్న ఒక పెద్దాయన నన్ను గుర్తు పట్టాడేమో....
" జీవశ్చవంలా బ్రతుకు తూ చచ్చిన వారు కొందరైతే చనిపోయి బ్రతుకు తున్న మహానుభావులు మరి కొందరు ..మాకు వినిపించేలా అంటూ మా వైపు అదోలా చూస్తూ మా నాన్న గారి శిలా విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి కాబోలు పూలమాల చేత్తో పట్టుకుని బయలు దేరాడు! ఆ సభకు విచ్చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు మా నాన్న గారి శిలా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తుటే అక్కడ మావూరే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన అశేష ప్రజల కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశమంతా మార్మోగిపోయింది! గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వచ్చిన నాయకులు, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు మా నాన్న గారి సేవా నిరతి గురించి,దాత్రృత్వం గురించి కొనియాడుతుంటే ...మా నాన్న గారి ఆస్తులకు వారసులమయ్యామే గాని ఆయన ఆశయాలకు వారసులం కాలేక పోయామనే ఆత్మ న్యూనతా భావం నా హృదయాన్ని తొలిచి వేసింది! ఆ వేదిక దగ్గరకు వెళ్ళే అర్హత కూడా నాకు లేదని నా అంతరాత్మే నన్ను పదే పదే నిందిస్తున్నట్లనిపించింది .
ఇదంతా నా ప్రక్కనే వుండి గమనిస్తున్న నా శ్రీమతి "చేసుకొన్న వారికి చేసుకున్నంత !ఇకపదండి పట్టణం పోదామంటూ కారు స్టార్ట్ చేయమంది! నా కళ్లలో పెల్లుబికిన కన్నీటి ని నా శ్రీమతి కి కనబడనీయకుండా కారుని వెనుకకు మళ్లించి పట్టణం వైపు పోనిచ్చాను.ఆ రోజు నన్ను గుర్తు పట్టిన ఆ పెద్దాయన నాకు వినిపించేలా అనే మాటలు పదే పదే నా మెదడులో లో రిపీట్ అవుతుంటే మా నాన్న గారు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఒక పదిశాతమైనా ఈ వూరి కోసం చేయాలనిపించింది. ఆ రాత్రి నా ఆలోచనలకు ఒక ఆక్రృతి ఏర్పడింది. ...ఆ ఆకృతి ని ఆచరణ రూపంలోకి తేవడానికి ఎంతో సమయం పట్టలేదు. ........ ....... ..... ...... ..... అక్కడికి సరిగ్గా ఒక ఏడాది లోపే RCT..RCT...RCT... ఇపుడు ఎక్కడ విన్నా ఇదే పేరు..."రామయ్య చారిటబుల్ ట్రస్ట్ '' Ramayya Charitable Trust. ....R.C.T ఆ రోజు మా స్వంత వూరు లోనే మాకు జరిగిన అవమానం గురించి మా నాన్న గారు రామయ్య గారి సేవా కార్యక్రమాల గురించి అమెరికా లో వున్న మా అబ్బాయి రామ్మోహన్ తో ఆ రాత్రి వీడియో కాల్ చేసి మాట్లాడాను. నా కోరిక మన్నించి మా అబ్బాయి అమెరికాలో మంచి హోదాలో వున్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి మా వూరిని దత్తత తీసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మా నాన్న రామయ్య గారి మరో రూపంగా సేవాకార్యక్రమాల లో అడుగు ముందుకు వేస్తున్నాడు! మా అబ్బాయిని చూసిన వారంతా రామయ్య గారు మళ్ళీ మన గ్రామం కోసం జన్మించారు అంటుంటే ...మా అబ్బాయి రూపంలో మళ్ళీ మా నాన్న రామయ్య గారికి చూసినంత సంబర పడ్డాను! నేను చేయలేని సంక్షేమ కార్యక్రమాలు మా అబ్బాయి రామ్మోహన్ చేస్తుంటే ఆనాడు మా నాన్న గారు చేసిన సేవాకార్యక్రమాలు స్వయంగా చూసినంత ఆనంద పడుతున్నాను మా అబ్బాయిలో మా నాన్న గారిని చూసుకుంటూ నేనూ నా శ్రీమతి పట్టణాన్ని శాశ్వతముగా విడిచి ఇపుడు మా స్వంత వూరి లోనే సంతోషంగా గడిపేస్తున్నాము! ప్రతీ ఏటా మా నాన్న గారి జన్మదిన వేడుకలు జరుపుతూ మా నాన్న గారి ఆశయాలకు వారసుడవుతూ మా అబ్బాయి చుట్టుప్రక్కల గ్రామాల్ని కూడా దత్తత తీసుకుని మా నాన్న గారి ఆశయాలు నెరవేరుస్తున్నాడు! ఇపుడు ఎక్కడ చూసినా .. ఎక్కడ విన్నా ...రామయ్య చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలే ! మా గ్రామ యువజన సంఘాల సహకారము తో మా నాన్న రామయ్య గారి ఆశయాలకు అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడు. రామయ్య గారి మనుమడు స్థాపించిన స్వచ్చంద సేవాసంస్థ గా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన R.C.T......రామయ్య చారిటబుల్ ట్రస్టు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది.. "పాతికేళ్ళు కాదు వందేళ్లైనా మీ తాతయ్య రామయ్య గారు మన వూరి ప్రజల హృదయాల్లో చిరంజీవిగానే వుంటా''రని...గతంలో నన్ను చిన్నచూపు చూసి ఎద్దేవా చేసిన పెద్దమనిషే మా అబ్బాయి భుజం తట్టి ప్రశంసిస్తుంటే ... ఆ క్షణం లో ఆనంద భాష్పాలతో నా కన్నులు చెమ్మగిల్లినాయి..!! -----------------

