“బామ్మా! జాగ్రత్త! బస్టాండ్ కి శివ వస్తాడులే!” అన్నాడు రవి బామ్మని బస్సు ఎక్కిస్తూ. “అలాగే లేరా! నాకేమైనా తెలియని ఊరా ఏంటి!” నవ్వుతూ అంది బామ్మ. “నువ్వు అలాగే అంటావు! అసలు నాకు సెలవు దొరకలేదు గాని లేకపోతే నేనే వచ్చేవాడిని!” దిగులుగా అన్నాడు రవి. “బస్సు బయలుదేరుతుంది కానీ నువ్వు బయలుదేరు!” మనుమడు రవి తో అంది బామ్మ. “అయ్యో! నీ చేతిలో నా మరచెంబు తిరిగి పట్టుకుపోతావా ఏంటి? అలా డ్రైవర్ దగ్గర పెట్టు!నేను తరువాత తీసుకుంటాను లే!” అంది బామ్మ. “అలాగే లే!” అంటూ మరచెంబు డ్రైవర్ పక్కన పెట్టాడు.
బస్సు బయలుదేరింది. చుట్టూ చూసింది. ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిలు కనిపిస్తున్నారు! డిగ్రీలు చదువుతున్న వాళ్ళమో! పక్కన ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు. చల్లగా గాలి వేస్తూ ఉండటంతో మనసుకు ఆహ్లాదంగా అనిపించింది! ఏవో ఆలోచనలలోకి జారుకుంది బామ్మ. కాసేపటికి పక్కన ఉన్న అమ్మాయిలు ఏదో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది. ఏమిటా! అని చూస్తే వెనకల కూర్చున్న వాడు అమ్మాయిల భుజం మీద చెయ్యి వేస్తున్నాడు! ఇంకా ఏదో అంటున్నాడు కూడా! అమ్మాయి భుజం మీద వేసిన చేతిని గట్టిగా లాగి సిగలో పెట్టుకున్న పిన్నుతో గట్టిగా గుచ్చింది బామ్మ. “అమ్మా! నెప్పి!” గట్టిగా అరిచాడు వెనకాల కూర్చున్న వాడు అరుపుకి బస్సులో అందరూ ఉలిక్కిపడ్డారు. బస్సు సడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్. “ఏం అమ్మ గుర్తొచ్చిందా!” సీరియస్ గా అంది బామ్మ. “ఏమైంది?” అందరూ కంగారుగా అడిగారు. “ఏమో!” అంటూ చేతిలో ఉన్న వేరుశనగపప్పు నోట్లో వేసుకుంది బామ్మ. “ఏమో ఏంటి! పిన్నుతో గట్టిగా గుచ్చ లేదా! రక్తం కూడా వస్తోంది!” కోపంగా అన్నాడు. “మరి నువ్వు అమ్మాయిల భుజం మీద చెయ్యి వెయ్యలేదా! మరి వాళ్లంతా ఎంత బాధపడి ఉంటారు! పైగా కామెంట్స్ కూడా చేస్తున్నారు! రా!రా! నా ముందుకి! తేల్చుకుందాం!” చేతి కర్ర పట్టుకుని నిటారుగా నిలిచింది బామ్మ. చేతికి కారుతున్న రక్తం ఒకవైపు, చుట్టూ ఉన్న వాళ్ళు అసహ్యంగా చూడటం ఒకవైపు, ఏమీ అనలేక అనకుండా ఉండలేక నానా ఇబ్బంది పడుతున్నాడు కుర్రాడు! “భలే బామ్మవేలే!” అంటూ బస్సు స్టార్ట్ చేశాడు డ్రైవరు. “ఇదిగో అబ్బాయి! నా సంచిలో పసుపు ఉంది ఇస్తాను! ఆ అబ్బాయికి పెట్టు!” అంటూ పసుపు తీసి అందించింది వెనక కూర్చున్న వాళ్లకి! బామ్మ దయకి అందరూ చిన్నగా చిరునవ్వు నవ్వారు. కాసేపు బాగానే నడిచింది బస్సు. వెళ్లి మరచెంబు తెచ్చుకుందామా అనిపించింది బామ్మకి! కర్ర పట్టుకుని నెమ్మదిగా లేచింది.
అవతలి సీట్లో ఇద్దరు అబ్బాయిలు ముందు సీట్లో కూర్చున్న అమ్మాయిలని కాళ్లతో కాళ్లు తగిలిస్తున్నారు అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు చేతిలో కర్ర తీసి ఇద్దరి కాళ్ళ మీద గట్టిగా వేసింది. “వామ్మో! వాయ్యో!”అంటూ గట్టిగా అరవడంతో అందరూ అరుపు వచ్చిన వైపు చూశారు బస్సు మామూలుగానే సడన్ బ్రేక్ తో ఆగింది. “ఏమైంది!” అందరూ కంగారుగా అడిగారు! “ఏం లేదు! నా కర్ర పెట్టుకుందికి చోటు లేక వీళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాను! ఆపాటికే అరుస్తున్నారు చూడు!” అమాయకంగా అనింది బామ్మ. “ఏం కాదు! మా కాళ్ళ మీద నువ్వు కర్రతో కొట్టలేదు!” కోపంగా అన్నాడు ఒక అబ్బాయి. “నేనా!” ఆశ్చర్యంగా అంది బామ్మ! “ఆ! నువ్వే!” కోపంగా అన్నాడు మరొక అబ్బాయి. “మీ కాళ్లు మీ ముందున్న అమ్మాయిల కాళ్ళు తోక్కడం నా కర్ర చూసింది అందుకే అదేమో మీ కాళ్లు తొక్కింది!” బామ్మ వెక్కిరింతగా అంది బామ్మ. “ఓహో! భలే బామ్మవేలే!” అంటూ బస్సు స్టార్ట్ చేశాడు. బస్సులో అందరూ నవ్వడంతో ఆ అబ్బాయిల మొహాలు మాడిపోయాయి. “హలో బామ్మ! నా పేరు సాకేత్! మీరు ఎలా ఇలాంటి సాహసాలు చేస్తున్నారు?” ఆశ్చర్యంగా అడిగాడు. “అంతా మనవాళ్లే అనే భావం ఉండటం వల్ల!” “మీరు ఏం చదివారు బామ్మ?” అన్నాడు సాకేత్. “చదువా! ఏదో వానాకాలం చదువులే! షేక్స్పియర్ నవలలూ చదువుతాను, కీట్స్ పోయిట్రీని చదువుతాను! ఇంకా తెలుగులో అన్ని నవలలు చదువుతాను! ఈ మధ్యనే తమిళం నేర్చుకుంటున్నాను! చాలా ఈ వివరాలు!” నవ్వుతూ అంది బామ్మ. “అబ్బో! ఏం గొప్పలు చెబుతుందో బామ్మ!” వెనకాల నుంచి ఎవరో కిచ కిచ నవ్వారు. బామ్మ మొహం ఎర్రబడింది. “పోనీ కీట్స్ పోయెట్రీ చెప్పమంటావా! లేకపోతే షేక్స్పియర్ నవలలు గురించి డిస్కస్ చేద్దామా!” గంభీరంగా అడిగింది బామ్మ. వెనకాల నుంచి సౌండ్ లేదు. “నువ్వు పుట్టుకతో చిన్నవాడివి! అజ్ఞానంలో వృద్ధుడివి!” బామ్మ మాటలకి అందరూగొల్లున నవ్వారు. “ప్రేమ పెళ్లి వీటి గురించి మీ అభిప్రాయం చెప్పండి అడిగాడు సాకేత్. “ప్రేమ… పెళ్లి ఈ రెండు పటిష్టమైనవే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ బంధం శాశ్వతం అవుతుంది! అలాగని ప్రేమ అంటే నాలుగు డైలాగులు, ఒక పాట అని కూడా అనుకోలేము.” “అంతకన్నా ఇంకేం అర్థం ఉంది! ప్రేమంటే వాలు జడ! పూల చెండు! అంతే! వెనకాల నుంచి ఎవరో అరిచారు! “మరి నీకు అంతకన్నా ఇంకేం తెలుసు! పెళ్లంటే డీజే! తీన్మార్! అంతే కదా!” “అవును! అవును!” అరిచారు వెనక నుంచి. “మరి మీ అభిప్రాయం చెప్పండి బామ్మ!” అడిగాడు సాకేత్. “ప్రేమంటే నమ్మకం! పెళ్లంటే బాధ్యత! ఈ రెండు కలిస్తేనే అనుబంధం! ఇంతకీ ప్రేమంటే వాలు జడ పూలచెండు అన్నావుగా! మరి ఆ వాలు జడ తలలో పెట్టుకునే పూల చెండు ఖరీదు ఎంతో తెలుసా? మూర యాభై! మామూలుగా మూడు మూరలు పెట్టుకునే అమ్మాయి పెళ్లి అయ్యాక నాలుగు మూరల పువ్వులు పెట్టుకుంటుంది! అంటే రోజుకి రెండు వందలు నెలకి ఆరు వేలు! మరి బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి! ఇంకా కాస్మెటిక్స్! మోడరన్ డ్రెస్సులు! బ్రాండెడ్ డ్రెస్సులు! హనీమూన్ కి వెళ్ళాలి! ప్రతిరోజు బయటికి వెళ్లాలి! ఇంకా చాలా ఖర్చులు ఉంటాయిలే! ఇవన్నీ ఖర్చులు కాకుండా మరి ఇంట్లో ఏసీలు వగైరాలు కూడా! ఇవన్నీ కలిపితే నీ ప్రేమ పెళ్లి విలువ నెలకి లక్ష దాటుతుంది! మరి ఆలోచించుకో!” అరిచి చెప్పింది బామ్మ. “ఇక పిల్లలు పుడితే కొంప కొల్లేరే!” ఎవరో అందించారు. అందరూ గొల్లున నవ్వారు.ఇక వెనక నుండి సౌండ్ రాలేదు.
కాసేపటికి బస్సు ఆగింది. రోడ్డుకి అడ్డంగా రాళ్ళు ఉన్నాయి. “ఇదేంటి బస్సుకి అడ్డంగా రాళ్ళు ఉన్నాయి!” గాబరాగా అన్నాడు డ్రైవరు.బస్సు ఆగగానే ఇద్దరు రౌడీలు బస్సులోకి ఎక్కారు.ఇద్దరూ తుపాకీ చూపించి బెదిరించారు. “ఇప్పుడే చెబుతున్నాం! ఎవరూ కదలకండి! కదిలారా! ఈ తుపాకీ గుండు మీగుండెల్లోకి దిగుతుంది! అందరూ నిశ్చేష్టులై ఉండిపోయారు. “మీదగ్గర ఉన్న నగలూ,డబ్బూబయటకి తియ్యండి! లేకుంటే ప్రాణాలు పోతాయి!” గట్టిగా అరిచిచెప్పాడు మరొక రౌడీ. “ఒరేయ్! రౌడీలూ!నామరచెంబు అక్కడ ఉంది మంచినీళ్లు తాగాలి.” అలా అంటూనే బాగా ఒంగుని కర్ర పట్టుకుని ఒక్క సెకనులో ముందుకి కదిలింది బామ్మ.దగ్గరికి వచ్చిన బామ్మని చూసి, “ఎవరూ కదలొద్దని చెప్పానా!” కర్కశంగా అరిచాడు ఒకరౌడీ! “అరే బేటా! నాలాంటి ముసిలి వాళ్ళకి కూడా భయపడు తున్నావా? దాహంగా ఉంది కాస్త దయ చూపించు బాబూ! అదిగో అక్కడే ఉంది నా మర చెంబు!” అంటూ చూపించింది! “సరేలే! ఎవరూ కదలకండి! గట్టిగా అరిచాడు ఒక రౌడీ. బామ్మ డ్రైవర్ కీ కండక్టర్ కీ సైగ చేసింది. కొద్దిగా దగ్గరగా వచ్చారు ఇద్దరూ! డ్రైవర్ మర చెంబు అందించాడు! “నేను వాళ్ళిద్దరినీ పడగొడతాను! మీరు రెడీగా ఉండండి!” లోగోంతుకతో అంది బామ్మ! మర చెంబుతో ఒకడి తలమీద, కర్రతో మరొకడి తలమీద ఒకేసారి రెండు చేతులతో అటాక్ చేసింది బామ్మ! ఇద్దరూ చెరొకవైపు పడ్డారు! వాళ్ళిద్దరినీ డ్రైవరూ, కండక్టరూ గట్టిగా పట్టుకున్నారు! అపర కాళికలా మారిన బామ్మని చూసి అందరూ ఆశ్చర్యపోయారు! ఆపై ఎంతో సంతోషించారు కూడా! “బామ్మా! ఏంచేద్దాం!వీళ్ళని!”అడిగాడు డ్రైవరు. “నా మనుమడు ఈ ఏరియా ఎస్సై! ఇప్పుడే మెసేజ్ పెట్టాను.లోకేషన్ షేర్ చేసాను! వస్తారు!”అందిబామ్మ. కాసేపటికి ఎస్. ఐ. కానిస్టేబుల్స్ రావడంతో రౌడీలను అప్పగించారు. “సరే! బామ్మా!జాగ్రత్త!” అన్నాడు ఎస్. ఐ. శంకర్. “లేదు బాబూ ఆవిడ మాకు తోడుగా ఉంటే మేమందరం జాగ్రత్తగా మా స్వస్థలాలకు వెళ్లగలం!” నవ్వుతూ అన్నాడు ఒక పెద్దాయన. బామ్మ మెడ నిఠారుగా పెట్టి, మనవడి కేసి ఓరగా చూసింది! “నీ సాహసాల గురించి నాకు తెలుసు గానీ! వీళ్ళకి తెలియదుగా!” నవ్వుతూ అన్నాడు శంకర్. “తను భార్గవి శాండిల్య! రిటైర్డ్ ఐ.పీ.ఎస్.!” అనడంతో అంతా ఆశ్చర్యంగా చూశారు. “మీరు భార్గవి శాండిల్య!” ఆశ్చర్యంగా అన్నాడు సాకేత్. “అవును!ఆమె సాహసాల గురించి మీరు వినే ఉంటారు! ఇప్పుడు ప్రత్యక్షంగా చూశారు!” అన్నాడు శంకర్. “మొత్తనికి భలే బామ్మవేలే!”అన్నాడు డ్రైవరు బస్సు స్టార్ట్ చేస్తూ! బస్సులో అందరూ ముసిముసిగా నవ్వారు. *****

