ప్రగతి నగర్ పార్క్ వద్ద ఒక టీ బంకు ఉంది. దానిని రవి అతని తల్లి సీతమ్మ నడుపుతున్నారు. కరోనా సమయంలో రవి తండ్రి చనిపోయాడు. ప్రగతి నగర్ కాలనీ సెక్రెటరీ రవికి టీ బంకు పెట్టుకోవడానికి అనుమతి ఇప్పించాడు. ప్రతి రోజు ఉదయం ఉదయం ఆరు గంటల నుండి పదివరకు సాయంత్రం నాలుగు గంటల నుండీ రాత్రి తొమ్మిది గంటల వరకు టీ బంకు నడుపుతారు.
రవీ ఉదయం పూట రెండు గంటలు అమ్మకు సాయంగా ఉండి తరువాత కాలేజీకి వెళతాడు. అప్పుడు సీతమ్మ టీ బంకును చూసుకుంటుంది. సాయంత్రం మాత్రం రవి అమ్మకు సాయంగా ఉంటాడు. సాయంత్రం టీతో పాటు మిర్చీ బజ్జీ,ఆలూ బజ్జీ అమ్ముతారు. ఒక రోజు ఉదయం పూట టీ కొట్టు తీసి, చుట్టూ పక్కల పడ్డ ఎండుటాకులను చీపురుతో చిమ్మసాగాడు రవి.
ఒక చోట పర్సు దొరికింది. అందులో సుమారు ఐదు వేల రూపాయలు ఉన్నాయి. అమ్మకు చెప్పి దానిని భద్రం చేశాడు రవి. సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి అక్కడ రోడ్డు మీద వెదకసాగారు. “ఏంటీ వెదుకుతున్నారు?” అన్నాడు రవి
“మీ కొట్టు పక్కగా నిన్న రాత్రి నా స్కూటర్ పార్క్ చేశాను. అటు పక్కగా ఉన్న ఐస్ క్రీమ్ బండి అతని వద్ద ఐస్ క్రీమ్ కొని తిన్నాక మళ్లీ ఇటు వచ్చి స్కూటర్ తీసి వెళ్లిపోయాము అప్పుడు నా పర్సు పడిపోయింది” అని చెప్పాడు ఒకతను.
ఆ ఇద్దరూ అప్పుడప్పుడూ సమోసాలు తిని టీ తాగి వెళుతుంటారు. వారం రోజుల క్రితం ఒక్కో సమోసా తిని చెరో టీ తాగి రవికి ఐదు వందలనోటు ఇవ్వబోయాడు అతను. “నా వద్ద చిల్లర లేదు సార్!.. ఎనభై రూపాయలు తరువాత ఇవ్వండి” అన్నాడు రవి. అతను రోజూ కొట్టు ముందు నుండే వెళుతున్నాడు కానీ వారమైనా డబ్బు ఇవ్వలేదు అతను.
“ఇదేనా సార్?” అని రవి దొరికిన పర్సు అతనికి ఇచ్చాడు. “అవును ఇదే నా పర్సు” అన్నాడు అతను. “డబ్బు సరి చూసుకోండి సార్!” అన్నాడు రవి.
“డబ్బు సరిగ్గా ఉంది..నీకు ధన్యవాదాలు, నిజాయితీగా పర్సు ఇచ్చినందుకు ఇదిగో నీకు వందరూపాయలు” అని ఇవ్వబోయాడు అతను.
”వద్దు సార్! వారం క్రితం మీరు సమోసాలు తిని, టీ తాగారు.. దానికి మీరు ఎనభై రూపాయలు ఇవ్వాలి.. అది ఇస్తే పుస్తకంలో మీ పేరు కొట్టేస్తాను” అన్నాడు రవి. అతను కాస్త సిగ్గుపడ్డాడు
“అవును ఆ డబ్బు ఇవ్వడం మరచిపోయాను” అని వంద రూపాయలు ఇచ్చాడు. రవి ఇరవై రూపాయలు వెనక్కు ఇచ్చి పుస్తకంలో ఆతని బాకీ కొట్టేశాడు. “పర్సు జాగ్రత్త చేసి ఇచ్చినందుకు ధన్యవాదాలు” అని రవికి చెప్పి వెళ్లిపోయాడు అతను.
మనిషి తినడం, నిదురపోవడం మరిచి పోడు కానీ..ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే కచ్చితంగా మరచి పోతాడు.. కాదు మరచిపోయినట్లు నటిస్తాడు. ఇదీ లోకం తీరు.
రవి లాంటి నిజాయితీపరులు ఉండడం కూడా చాలా అరుదు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతారే గానీ పరరాయి సొమ్మును ఆశించారు.

