ఉన్నట్టుంది కడుపులో ఏదో వికారం. ఆపుకోలేక, వెంటనే కక్కేసాను. ఏమీ తినకూడనిది తినలేదే...? చూస్తుంటే, ఇదేదో అనుమానించాల్సిన విషయమే. ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. లేదు..లేదు..ఇంట్లో మెషిన్ తెచ్చుకుంటేనే చాలా సేఫ్. ఇంటికి దూరంగా ఉన్న మెడికల్ షాప్ కు వెళ్లి ..అక్కడ ప్రేగ్నన్చి టెస్ట్ కిట్ తీసుకుని, టెస్ట్ చేసుకుంది రాజీ..పాజిటివ్ వచ్చింది.
ఇది ఆ మూర్ఖుడు రాజు చేసిన పనే. ఎప్పుడూ వెధవ కక్కుర్తే. వద్దురా అని చెబితే వినడు. మూడ్ వచ్చింది అపుకోలేనని రొమాన్స్ చేసాడు. అది కాస్త ఇప్పుడు నాలో పురుడు పోసుకుంటోంది. ఆ రాజుగాడు ఈ పని చేసి దుబాయ్ చెక్కేసాడు. ఇప్పట్లో మళ్ళీ రాడు.. ఏం చెయ్యను?
ఈ విషయాన్ని ఎంతకాలం అని దాచగలను. ఏదో రోజు తెలిసిపోతుందే. అయినా సరే, బయట పడకుండా చూడాలి. ఇన్నాళ్ళు ఎలాగో, ఏదో చెప్పి, మేనేజ్ చేస్తూ వచ్చాను. ఇంకో నెలలో, బిడ్డ పుట్టాకా, ఎక్కడో జాయిన్ చేసి...నేను మాములుగా ఉంటాను.
ఎంత మేనేజ్ చేసినప్పటికీ..పొట్ట పెరగటం తో, ఈ విషయం నాన్నకు తెలిసిపోయింది. కోపంతో నా మీద చేయి చేసుకోబోయాడు...అమ్మ అతను ఎవరో కనుక్కోమని అడ్డుపడింది. నాకేం చెప్పాలో అర్ధం కాలేదు. అప్పుడు రోజూ నాకు ఎదురు వచ్చే పూజారి గుర్తొచ్చాడు. కొండమీద ఉండే పూజారి..ఇంకా పెళ్ళి కాలేదు. నిత్యం ఆ గుడిలో ఆ దేవుడుకి సేవ చేసుకుని ఉంటాడు. ఎప్పుడూ భక్తి తప్పితే వేరే ధ్యాసే ఉండదు అతనికి. ఆయన మాట్లాడలేడు..నిజం చెప్పలేడు..నేను తప్పించుకోవచ్చు. అదే అసలు నిజం తెలిస్తే, మా నాన్న నన్ను, రాజుని ఇద్దరినీ బతకనివ్వడు. అసలే రాజుది వేరే కులం. వెంటనే పూజారి పేరు చెప్పేసాను.
"చూడడానికి మంచివాడు, అమాయకుడులాగ ఉండే ఆయనా ఈ పని చేసాడంటే నమ్మబుద్ది కావట్లేదు" అన్నాడు తండ్రి
"ఈరోజుల్లో బయటకు చూడడానికి అందరూ అలాగే ఉంటున్నారు లెండి. కర్రకు చీరకట్టినా.. వెంటపడే లోకం తయారైంది" అని పెళ్ళాం అందుకుంది
"నువ్వు అన్నదీ నిజమే.."
"ఈ విషయం బయటకు తెలియకముందే ఆ అబ్బాయిని పిలిపించి..చేయాల్సింది చూడండి. బయటకు ఈ విషయం పొక్కకుండా చూడండి"
పూజారిని ఇంటికి పిలిచి తండ్రి విచారించాడు..గట్టిగా నిలదీశాడు. "ఒక పూజారి అయిఉండి.. ఇలాంటి పని చెయ్యడానికి సిగ్గుగా లేదు..?"
"నేను అమాయకుడని..అలాంటి పని నేను కలలో కూడా చెయ్యను" అని సైగలతో చెప్పాడు పూజారి
"నువ్వు ఈ పని చేసావని మా అమ్మాయే చెప్పింది. అంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? నువ్వు మా అమ్మాయిని పెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది"
"నాకు కొంత టైం ఇవ్వండి...నేను నిర్దోషిని అని నిరూపించుకుంటాను" అని సైగలతో వేడుకున్నాడు
అయినా..ఇప్పుడు ముహూర్తాలు కూడా లేవు..ఒక నెలలో పెళ్ళి. అంతవరకు మా అమ్మాయి బయటకు వెళ్ళదు.
ఆ ఈశ్వరుని కృపో మరేమో...పిల్లాడు తొందరపడి ముందే పుట్టేసాడు. పుట్టినవాడు నల్లగా, రాజు పోలికలతో పుట్టాడు. నిజం బయటపడింది. రాజీ నిజం చెప్పక తప్పలేదు.
తనని ఆ దేవుడే కాపాడాడని కృతజ్ఞతలు చెప్పి..మంచివారికి ఇది చోటు కాదని, ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఆ పూజారి. వెళ్ళేటప్పుడు రాజీతో రాజుకు పెళ్ళిచేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని.. గాని కక్ష తో వ్యవరిస్తే, ఎవరికీ మంచి జరగదని చెప్పి వెళ్ళిపోయాడు. అతని మాటలకు మారిన తండ్రి రాజుకి, రాజీకి పెళ్ళి చేసాడు.
*******

