సినిమా తీయడానికేముంది.? ఈ రోజుల్లో ఎలాంటోడైనా సినిమాని నిర్మించేయొచ్చు. క్వాలిటీ సంగతి అటుంచితే, ఓ సాదా సీదా కెమెరా పట్టుకుని, దర్శకత్వ ప్రతిభ చాటేసుకోవచ్చు. నిర్మాణం, దర్శకత్వం ఇంత తేలికైపోయింది. కథ గురించిన ఆలోచనకీ పెద్దగా టైమ్ కేటాయించక్కర్లేదు. అంత తేలికైపోయింది.
కానీ, సినిమా తెరకెక్కించి దాన్ని విడుదల చేయాలంటే ‘దమ్ము’ కావాలి. ఇది నిజం. యాభై కోట్లు ఖర్చుపెట్టే నిర్మాత కూడా ఈ రోజు తన సినిమాని విడుదల చేసుకోలేని పరిస్థితులున్నాయి. కారణాలనేకం. ఒకప్పుడు ఎంత బడ్జెట్ పెడితే అంత దమ్మున్నోడు నిర్మాత. కానీ, ఇప్పుడలా కాదు. సినిమా సకాలంలో రిలీజ్ చేయగల నిర్మాతే దమ్మున్నోడు. పరిస్థితుల ప్రభావంతో సినిమా నిర్మాణం చాలా కష్టమయిపోతోంది.
స్టార్ హీరో వరకూ ఎలాగోలా నడిచిపోతున్నప్పటికీ, ఓ మోస్తరు హీరోల పరిస్థితే దారుణంగా మారిపోతోంది. ఒకానొక కాలంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటుల సినిమాలు రిలీజ్ అవడం ప్రసహనంగా మారిపోతూ వస్తోంది. ఎవరూ ఆ సినిమాల్ని కొనేందుకు ముందుకు రాకపోవడం, తాము సొంతంగా ఆ సినిమాల్ని నిర్మాతలు రిలీజ్ చేసుకోలేకపోవడంతో చాలా సినిమాలు ల్యాబ్ లకే పరిమితమైపోతున్నాయి. నిర్మాత దమ్మున్నోడైతే సినిమా రిలీజ్ అవుతోంది, లేదంటే అటకెక్కిపోతోంది. సినిమా పరిశ్రమ అంటేనే అనేక విచిత్రాలకు కేంద్రం. ఇది కూడా అలాంటి విచిత్రమేనని సరిపెట్టుకోవాలేమో.
|