Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

Aditya Hrudayam

పా'త్రి'కాలజ్ఞులు (పార్టు - 1)

గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడు కాలాల్లోనూ జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది దాదాపు ఖచ్చితంగా చెప్పగలిగే వాళ్లని త్రికాలజ్ఞులు అంటాం. మన పాత్రికేయులు కూడా అంతే అని నా అభిప్రాయం.

వీరిలో, నా అనుభవాలన్నీ సినిమా పాత్రికేయులతోటే ముడిపడి ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన విశేషాలనే చర్చించుకుందాం.

ప్రింట్ మీడియా మాత్రమే ఉన్నప్పుడు పరిశ్రమలోకొచ్చాను నేను. చెన్నైలో 'పౌరాణిక బ్రహ్మ' కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో చందమామ విజయా కంబైన్స్ నిర్మించిన 'బేతాళ కథలు' టి.వి. సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఈటీవీ పెట్టిన కొత్తలో ప్రసారమైందది. కమలాకర కామేశ్వరరావు గారు జర్నలిస్ట్ గా, బి.ఎన్.రెడ్డి గారి సినిమాలు చూసి, ఏదో పత్రికలో రివ్యూలు (సమీక్షలు) రాస్తే, వాటిలో ఆయన సూక్ష్మ పరిశీలన, సునిశిత విమర్శ నచ్చి బి.ఎన్.గారు మద్రాసు పిలిపించి అసిస్టెంట్ డైరెక్టర్ గా తీసుకున్నారట. అలా డైరెక్టరయ్యి గుండమ్మ కథ, నర్తనశాల, పాండవ వనవాసం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలకు దర్శకుడయ్యాడు. ఇది 1950 లలో. ఇలాగే 2011 లో నేను కూడా నా సినిమాలకి రివ్యూ రాసిన జర్నలిస్ట్ ని నా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో తీసుకున్నాను. నేను బి.ఎన్.రెడ్డి గారంత గొప్ప దర్శకుణ్ణి కాకపోయినా, ఆ దారిలో నడిచిన స్ఫూర్తితో ఆ పనిచేశాను. ఆ మిత్రుడి పేరు రాజేష్. ఈ మధ్యే దర్శక, నిర్మాతగా మారారు. మామూలు చలనచిత్రం తీయమంటే సంచలన చిత్రం తియ్యాలని కష్టపడుతున్నారు జర్నలిజం అలవాటువల్ల. ముళ్ళపూడి వెంకటరమణ గారు పాత్రికేయునిగా ఉండి సినిమా సమీక్షలు రాసి, సినిమాల్లోకి వచ్చి, మొన్నటివరకూ జంధ్యాల గారి కలంలోను, ఈ రోజుల్లో త్రివిక్రమ్ కలంలోను కనపడేంత బలమైన ట్రెండ్ సెట్టింగ్ రైటరయ్యారు.

ప్రముఖ నటులు, రచయిత, నిర్మాణ సంచాలకులు శ్రీ రావి కొండలరావు గారు కూడా చందమామ, విజయచిత్ర పత్రికల్లో పాత్రికేయునిగా జీతం. రామారావు గారు, నాగేశ్వరరావు గార్ల వంటి అగ్రహీరోల చిత్రాల్లో పాత్రధారిగా జీవితం గడిపినవారే. ఆ తర్వాత కాలంలో బి.ఏ.రాజుగారు, సురేష్ కొండేటి గారు, తదితర పాత్రికేయ మిత్రులు పత్రికా సంపాదకులై, పంపిణీదారులై, నిర్మాతలయ్యారు. అలాగే మహేంద్ర గారు, అన్నే రవి గారు, నిర్మాణ భాగస్వాములయ్యారు. ఈతరం పాత్రికేయులు రచన, నటన, దర్శకత్వం వంటి సృజనాత్మక రంగాలకన్నా నిర్మాణం వంటి వ్యాపార రంగం వైపు ఎక్కువ మొగ్గుచూపడం సమాజంలో వచ్చిన మార్పుకి సూచన. భాస్కరభట్ల గారు, సిరాశ్రీ గారు, పెద్దాడ మూర్తి గారు, గోపరాజు రాధాకృష్ణ, సతీష్ కుమార్ (మా పెద్దన్నయ్య) వంటి కొద్దిమంది జర్నలిస్ట్ లు మాత్రం కథ, మాటలు, పాటల వంటి రచనా రంగం మీద దృష్టి పెట్టారు. అయినా ఎన్నాళ్ళు అందులో ఉంటారో చూడాలి. సినిమా సమీక్షల్లో చాలాసార్లు ప్రేక్షకుడికన్నా ఒక మెట్టుపైన నిలబడి పాత్రికేయుల మేథస్సు కనపడేది. ఇప్పుడు చాలా తక్కువమంది ఆ స్టాండర్డ్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు.

వాసిరాజు ప్రకాశం గారు, గుడిపూడి శ్రీహరి గారు, పచ్చా శరత్ కుమార్ గారు వంటి ముందుతరం సినీ జర్నలిస్ట్ ల సమీక్షలు చాలా వరకూ అర్ధవంతంగా, ఆలోచించేటట్టుగా ఉండేవి. ఇప్పుడు వెబ్ సైట్లలో ఐడిల్ బ్రైన్ జీ.వి, సునీతా చౌదరి, శ్రీ అట్లూరి, సిరాశ్రీ, దర్శకుడు, మిత్రుడు శ్రీ వీర శంకర్ లాంటి కొంతమంది మాత్రమే సినిమాల రివ్యూలని 'రి'వ్యూ చేసినట్లు రాస్తున్నారు. మిగిలిన వారిలో అధికశాతం వారి అభిమాన తారల్ని ప్రమోట్ చేసుకోవడమో, వారి కులం వారిని ఆకాశానికెత్తేయడం మీదనో కాన్ సన్ ట్రేట్ చేస్తున్నారు. 5 మార్కుల పరీక్షలైపోయాయి ఇప్పుడు సినిమాలు. 24 క్రాఫ్ట్ ల పనితనాన్ని, 200 మంది సమిష్టి కృషిని 5 మార్కుల్లో ఏఏ విభాగాల ప్రాతిపదికన నిర్ణయిస్తారో నాకర్ధం కాదు. వంద మార్కుల పరీక్షయితే కనీసం పాసు మార్కులు తెచ్చుకునే అవకాశముండేది అందరికీ. పోటీ పెరిగి, మార్కులు తగ్గేసరికి ఎవరు పాసవుతారు? ఎక్కువ ఖర్చుపెట్టి, ఎక్కువ టైము తీసుకున్న సినిమాలు సహజంగా చూడ్డానికి బాగానే ఉంటాయి. క్రియేటివ్ కంటెంట్ ఎలా ఉన్నా, సో, వాటికే 5 మార్కులు పరీక్షల్లో, సమీక్షల్లో ఎక్కువ మార్కులొస్తుంటాయి. ముఖ్యంగా ఈ మార్కు సమీక్షలు ప్రవాస భారతీయులకి చాలా ఉపయోగం. అవసరం. వారి టైము వేస్ట్ కాకుండా. కానీ ఎప్పుడైతే సినిమా తీసేవాడి భావుకతకి సంబంధం లేకుండా, రివ్యూ చేసేవాడి భావజాలం మీద ఆధారపడడం మొదలైందో సినిమాల్లో ఆత్మ చచ్చిపోవడం, ప్రేక్షకుల్లో ఆసక్తి చచ్చిపోవడం పరిపాటైపోయింది.

హాలీవుడ్ ఇండస్ట్రీలో 1960 ల ప్రారంభంలో కథాసంక్షోభం వచ్చి సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోతున్నాయని ఆందోళన చెంది, హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, రచయితలు, నటీనటులు ఒక మీటింగ్ పెట్టుకున్నారట. 'టెన్ కమాండ్ మెంట్స్' లాంటి అద్భుత క్లాసిక్ ఎపిక్ సినిమాల దర్శకుడు సిసిలీ.బి.డి.మిలీ ఆ సభలో చెప్పిన రెండు విషయాలలో మొదటి విషయం ఏమిటంటే, బైబిల్ గ్రంధం చూపించి, "నా దగ్గర వెయ్యికి పైగా కథలున్నాయి. కథల కొరత అంటారేంటి?". రెండో విషయం ఏమిటంటే, కథలెప్పుడూ అంకెల్లాగా సున్నా నుంచి తొమ్మిదివరకే ఉంటాయి. మిగిలిన కథలన్నీ అదే అంకెల్లాగ వాటి రిపీటెడ్ కాంబినేషన్లే. అంటే 10,11,12,13.. ఇన్ఫినిటీ వరకూ.. సినిమా అనేది, కథా వస్తువు బలంగా వుంటే, పదేళ్ల పాటు అదే వస్తువు మీద రకరకాల కథనాల కూర్పులతో (స్క్రీన్ ప్లేలతో) బతికేయగలదు. భారత, రామాయణ, భాగవత కథలు, ఖురాన్, బైబిల్, బౌద్ధ, జైన్, సిక్కు మత గ్రందాల ఆధారిత కథలు సినిమా పుట్టినప్పటినుండీ కథా వస్తువులో ఉంటూనే ఉన్నప్పుడు సమీక్షల్లో దర్శక, రచయిత, నిర్మాణ, నటనా విలువల గురించి ఏమీ లేకుండా, కెమెరా, ఎడిటింగ్, ఫైట్స్, ఫోటోగ్రఫీ, ఆర్ట్, మేకప్, కాస్ట్యూమ్స్ లాంటి సాంకేతిక ప్రతిభ గురించి రాయకుండా, కేవలం ఒక్క పేజీలో కథ రాసేసి, ఒక్క ముక్కలో అది బావుందో, బాలేదో రాసేసి ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టించేయడం సమీక్ష అవుతుందా? పరిశ్రమకి శిక్ష అవుతుందా? క్రికెట్ లాంటి మనీ స్పిన్నింగ్ గేమ్ లోనే కొత్తరకమైన సమీక్షాపద్ధతిని (డిఆర్ డిఎస్) మన దేశంతో సహా ఎన్నో దేశాలు వద్దని మొత్తుకుంటుంటే, ఎన్నో సున్నితమైన సమస్యలతో కుదేలై కష్టపడి, చచ్చి, బతుకుతున్న సినిమాలకి సమీక్షల కొలమానాలెందుకు?

గాసిప్స్ రాసుకుంటే ఎలాగూ కనకవర్షం కురుస్తుంది. సమీక్షలు రాస్తే ఏమొస్తుంది? మేటర్ కి వచ్చే ఆ నాలుగురూపాయలూ రాకపోవడం తప్ప. పైగా ఇటీవల సమీక్షల కింద డైరెక్ట్ గా ప్రేక్షకులు అభిప్రాయాలు - కామెంట్ల రూపంలో. నచ్చనివాడు బూతులైనా రాసేసే ఫెసిలిటీ... వీటికి సెన్సారుండదు.

మళ్లీ వచ్చేవారం మరిన్ని విశేషాలతో...

మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
Same name movies in Tollywood