ఇంగ్లండ్ రాజు చార్లెస్ సమక్షంలో వేణుగానం చేసి ఆయన ప్రశంసలు అందుకున్న భారతీయుడు, ఆనాటి ప్రధాని వాజపేయ్ ముందు వేణువూది చప్పట్లు కొట్టించున్న తెలుగు వాడు, అంతర్జాతీయ స్థాయిలో పలు సంగీత సమ్మేళనాల్లో తన ప్రతిభ చాటి ఘనతకెక్కిన పింఛం లేని కృష్ణుడు నాగ్ శ్రీ వత్స. ఫ్లూట్ నాగరాజుగా సంగీత లోకానికి సుపరిచితుడు. ఈ మధ్యనే "జగద్గురు ఆదిశంకర" చిత్రానికి సంగీతాన్నందించి సినిమా రంగంలో కూడా తొలి అడుగు వేసారు. ఆయనతో గోతెలుగు డాట్ కాం జరిపిన సంభాషణ:
వేణుగానం మీద ఆసక్తి ఎలా కలిగింది?
అది నా పుర్వజన్మ సుకృతం, అమ్మవారి దయ. అంతకు మించిన కారణం నాకు ఏదీ కనపడదు. తొలిసారి వేణువుని పట్టుకుని సరదాగా ప్రయత్నించాను. చక్కగా పలికింది. సాధారణంగా తొలిప్రయత్నంలో వేణువు పలకడం అరుదు. మీరడిగిన ఆసక్తి, ఆ శక్తి రెండింటికీ నా ప్రమేయం లేదు.
కచేరీల దాకా మీ ప్రస్థానం ఎలా వెళ్ళింది?
వయోలిన్ విద్వాంసులు పద్మభూషణ్ ఎల్ సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహం. నేను ఈ దిశలో వెళ్లొచ్చా లేదా అనుకునే రోజుల్లో నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారాయన. ఆయన ప్రోత్సాహం తోనే తొలి సారి ఆయన కచేరీలోనే పాల్గొన్నాను. అది సాక్షాత్తూ అప్పటి ప్రధాని వాజపేయ్ సమక్షంలో. తర్వాత లండన్ టూరు, ఆ తర్వాత పార్లమెంటులో అబ్దుల్ కలాం, ప్రిన్స్ చార్లెస్ ల ముందు కచ్చేరీ చేయడం. తొలి అడుగులే అటువంటి వేదికల మీద పడడంతో నా జీవన గమ్యం నాకు అర్థమైపోయింది. వేణువే నా ప్రాణం.
సినిమా సంగీతం చేసిన అనుభవం ఎలా ఉంది?
భారవి గారికి నాపై ఉన్న నమ్మకం నాకు "జగద్గురు ఆదిశంకర" కు సంగీతాన్నందించే అవకాశం ఇచ్చింది. నాకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాల వల్లో, నాపై ఉన్న అనురాగం వల్లో మహామహులైన గాయకులు శంకర మహదేవన్ వంటి వాళ్లు కేవలం స్వరకల్పన విని "ఇటువంటి పాటలు పాడే అవకాశం రావడమే సరస్వతీ అనుగ్రహం. ఉచితంగా పాడతాం. డబ్బు ప్రసక్తి తీసుకురాకండి" అనడం ఆదిశంకరుడి దయ, వాగ్దేవి అనుగ్రహం.
మీరు భక్తి చిత్రాలకేనా.. లేక సాంఘికాలకి కూడా సంగీతాన్నందించే ఆలోచన ఉందా?
సంగీతం నా ఆలోచన, నా సర్వస్వం. అది సాంఘికమా, భక్తా, ప్రేమా అనేది కాదు. సినీ రంగం నాకు నచ్చింది. గతంలో పూరీ జగన్నాథ్ గారు ఇంక మరి కొందరు దర్శకుల చిత్రాలకి ఫ్లూట్ ప్లే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమా అనేది చాలా శక్తివంతమైన మాధ్యమం. ఏ కళాకరుడైనా తన కళ పామరుల దాకా చేరాలనుకుంటాడు. అది సినిమాతోనే సాధ్యమని గట్టిగా నమ్ముతాను నేను.
అంతర్జాతీయ స్థాయిలో కళను చాటిన మీకు, తెలుగు చిత్ర పరిశ్రమ చిన్న విషయంగా అనిపించట్లేదా?
మీ ప్రశ్నకు సమాధానం పై సమాధానంలో ఉంది. ఇక మీరు "తెలుగు చిత్ర పరిశ్రమ" అన్నారు. సంగీతానికి భాష అనే అడ్డుగోడలు ఉండవు. నేను ఏ భాషా చిత్రాలకైనా సంగీతం అందించడానికి సిధ్ధం.
ఇప్పటి సినిమా సంగీతంలో మీ ముద్ర ప్రత్యేకంగా ఎలా వెయ్యాలనుకుంటున్నారు?
ఎప్పటికప్పుడు కొత్త రీతులు అన్వేషించడం నాకు అలవాటు. నేను అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న కొత్త కొత్త వాయిద్య పరికరాలు, కీ బోర్డులు ఎన్నో చూస్తున్నాను. వాటిని వాడుతున్నాను. అలాగే జానపద బాణీలు కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వింటున్నాను. వేరు వేరు సంగీత విధానాలని మిశ్రమం చేసి కొత్త విధానాన్ని పుట్టించొచ్చు. అందరికీ తెలిసిన సింఫనీ మొదలైన రీతులతో పాటు నేను కొన్ని పధ్ధతులు కనిపెట్టుకుని ఉన్నాను. అవేమిటో అవకాశాలొచ్చినప్పుడు ప్రదర్శిస్తాను (నవ్వుతూ)
ఎక్కువ చెప్తే వేరే వాళ్లు మీ ఐడియాలు కొట్టేస్తారనా?
(మళ్లీ నవ్వుతూ) అలాంటిదేమీ లేదు. సంగీతం మహా సాగరం. ఆ సాగరంలో ఉన్నామన్న ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరెన్ని బకెట్లు తోడుకుపోతే మాత్రం భయమేముంటుంది, సాగరానికి తరుగేముంటుంది?!
మీ రాబోయే సినిమాలు?
ఉన్నాయి. త్వరలోనే చెప్తాను.
|