Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aditya Hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

ఓకే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలు!

Same name movies in Tollywood

గతంలో వచ్చిన సినిమాల పేరుతో తిరిగి ఇప్పుడు వస్తున్న సినిమాలకు అదే పేరు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో అలా ఒకే పేరుతో వచ్చిన తెలుగు సినిమాల గురించి కొన్ని విశేషాలు :

దేవదాసు : ట్రాజెడీ చిత్రాలలో నెంబర్ వన్ చిత్రం 'దేవదాసు' - నాగేశ్వరరావుకు గొప్ప పేరును సంపాదించి పెట్టడమే కాకుండా సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఇదే 'దేవదాసు' పేరుతో కృష్ణ హీరోగా విజయనిర్మల దర్శకత్వంలో ఓ సినిమా వచ్చింది. పరాజయం పాలయ్యింది. ఈ మధ్యనే 'దేవదాస్' పేరుతోనే రామ్, ఇలియానా లతో వై.వి.యస్. చౌదరి స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్టయ్యింది.

ఘర్షణ : పాతికేళ్ళ కిందట మణిరత్నం తీసిన 'అగ్ని నచ్చితరం' అనే తమిళ చిత్రం తెలుగులో 'ఘర్షణ' పేరుతో విడుదలై మంచి విజయం సాధించడమే కాదు ఆడియో కూడా సూపర్ హిట్టయ్యింది. ఇదే 'ఘర్షణ' పేరుతో గౌతమ్ మీనన్ తమిళ చిత్రం 'కాక కాక' ను తెలుగులో రీమేక్ చేస్తే సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. కానీ పాటలు హిట్టయ్యాయి.

సోగ్గాడు : 'సోగ్గాడు' అనగానే శోభన్ బాబు గుర్తుకు వస్తాడు. అప్పట్లో ఘనవిజయం సాధించింది 'సోగ్గాడు'. రవిబాబు తరుణ్, ఆర్తి అగర్వాల్ లతో 'సోగ్గాడు' పేరుతో ఈ మధ్యనే ఒక సినిమా వచ్చింది. సినిమా బావున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది.

మాయాబజార్ : విజయ ప్రొడక్షన్స్ అంటేనే 'మాయాబజార్' సినిమా తీసిన నిర్మాణ సంస్థగా మనకు గుర్తుకు వస్తుంది. అపూర్వ కళాఖండం 'మాయాబజార్'. ఈ పేరుతో ఈ మధ్యన రాజా, భూమిక జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాగా తీస్తే ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

బృందావనం : రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, శుభలేఖ సుధాకర్ ల కాంబినేషన్ లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 'బృందావనం' సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇదే 'బృందావనం' పేరుతో ఈ మధ్యన వచ్చిన సినిమాలో జూ.ఎన్.టి.ఆర్, కాజల్, సమంతలు నటించగా దిల్ రాజు నిర్మించిన చిత్రం ఫర్వాలేదనిపించింది.

మల్లీశ్వరి : బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, భానుమతి లతో వచ్చిన 'మల్లీశ్వరి' సినిమా అప్పటి ప్రేక్షకులను అలరించింది. ఇందులోని పాటలు ఘన విజయం సాధించాయి. 'సాలూరి' రాజేశ్వరరావు సంగీతం, దేవులపల్లి కృష్ణశాస్త్రి ల సాహిత్యం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర వహించాయి. ఈ మధ్యన 'మల్లీశ్వరి' పేరుతోనే వెంకటేష్, కత్రినా కైఫ్ లతో విజయభాస్కర్. కె దర్శకత్వంలో వచ్చిన సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది.

పూలరంగడు : అన్నపూర్ణ ఫిలిమ్స్ పై ఆదూర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని, జమున, గుమ్మడి నటించిన 'పూలరంగడు' హిట్ కాగా గత సంవత్సరమే వచ్చిన కమెడియన్ సునీల్ హీరోగా చేసిన 'పూలరంగడు' కూడా విజయం సాధించింది.

అందాల రాముడు : దర్శకుడు బాపు దర్శకత్వంలో అక్కినేని, లత, నాగ భూషణం, రాజబాబు, అల్లు రామలింగయ్య మొదలైనవారు నటించగా విడుదలైన 'అందాల రాముడు' విజయం సాధించింది. ఇదే పేరుతో కమెడియన్ సునీల్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా సూపర్ గుడ్ కంబైన్స్ నిర్మించిన 'అందాల రాముడు' కూడా విజయం సాధించింది.

గమ్యం : అల్లరి నరేష్, శర్వానంద్, కమలినీ ముఖర్జీలతో క్రిష్ తీసిన 'గమ్యం' మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇదే 'గమ్యం' పేరుతో శ్రీకాంత్, రవళి జంటగా వచ్చిన సినిమా పరాజయం పాలయ్యింది.

నాయకుడు : హాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటైన 'గాడ్ ఫాదర్' సినిమా స్ఫూర్తితో దర్శకుడు మణిరత్నం కమల్ హాసన్ తో తమిళంలో తీసిన 'నాయగన్' తెలుగులో 'నాయకుడు'గా విడుదలై విజయం సాధించింది. 'నాయగన్' చిత్రానికి గాను కమల్ హాసన్ కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది.
ఈ మధ్యన వచ్చిన రాజశేఖర్, నమితలతో వచ్చిన 'నాయకుడు' అట్టర్ ఫ్లాపైంది.

సీతాకోక చిలుక : 1982 లో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పై భారతీ రాజా దర్శకత్వంలో మురళీ, ముచ్చెర్ల అరుణలతో వచ్చిన 'సీతాకోక చిలుక' సూపర్ హిట్టయ్యింది. మళ్ళీ 'సీతాకోక చిలుక' పేరుతోనే నవదీప్, షీలా లతో వచ్చిన సినిమా అపజయం పాలయ్యింది.

మరో చరిత్ర : కమల్ హాసన్, సరిత లతో కె. బాల చందర్ తీసిన 'మరో చరిత్ర' ప్రేమకథా చిత్రాల్లో టాప్ టెన్ లో ఒకటిగా నిలిచింది. సినిమా కూడా మంచి విజయం సాధించడమే కాకుండా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదే 'మరో చరిత్ర' సినిమానే రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు నిర్మాత దిల్ రాజు.

మిస్సమ్మ : ఎన్.టి.ఆర్, అక్కినేని, సావిత్రి, జమున లతో విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన 'మిస్సమ్మ' ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదే 'మిస్సమ్మ' పేరుతో  శివాజీ, లయ, భూమికలతో నీలకంఠ తీసిన సినిమా కూడా విజయం సాధించింది.

అన్వేషణ : సీనియర్ దర్శకుడు వంశీ తీసిన 'అన్వేషణ' అప్పట్లో సూపర్ హిట్టయ్యింది. ఈ సినిమా పాటలు ఇప్పటికీ అక్కడక్కడ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ 'అన్వేషణ'. ఇదే పేరుతో రవితేజ హీరోగా సాగర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎక్కడా పట్టుమని పదిరోజులు కూడా ఆడలేదు.

అడవి రాముడు : దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావును పూర్తి కమర్షియల్, మాస్ దర్శకునిగా మార్చిన సినిమా 'అడవి రాముడు'. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్, జయప్రద, జయసుధలు నటించగా సినిమా కలెక్షన్స్ వర్షాన్ని కురిపించింది. ఇదే 'అడవి రాముడు' పేరుతో బి.గోపాల్ దర్శకత్వంలో ప్రభాస్, ఆర్తి అగర్వాల్ లు నటించిన సినిమా పరాజయం పాలయ్యింది.

గోరింటాకు : శోభన్ బాబును మహిళా ప్రేక్షకులకు మరింత దగ్గర చేర్చిన సినిమా 'గోరింటాకు'. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో మహిళా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ మధ్యన వచ్చిన 'గోరింటాకు' లో రాజశేఖర్, మీరా జాస్మిన్, ఆర్తి అగర్వాల్ నటించగా సినిమా బాగానే ఆడింది.

స్టేట్ రౌడీ : బి.గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి, రాధ, భానుప్రియ లతో అప్పట్లో 'స్టేట్ రౌడీ' సినిమా వచ్చి చిరంజీవి అభిమానులను అలరించింది. మళ్ళీ 'స్టేట్ రౌడీ' పేరుతోనే శివాజీ హీరోగా ఒక సినిమా ఇలా వచ్చి అలా వెళ్ళింది.

ఏది ఏమైనా గతంలో వచ్చిన సినిమాల పేర్లను ఇప్పటి సినిమాలకు పెట్టడంలో ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ పేరు పెట్టినంత మాత్రానే సినిమా హిట్ కాదు. చక్కని కథ, కథనం. వీనుల విందైన సంగీతం, మంచి దర్శకత్వ ప్రతిభ, ఉత్తమ నటన, ఉత్తమమైన నిర్మాణపు విలువలు ఉంటే తప్ప సినిమాలు విజయం సాధించవు.

కె. సతీష్ బాబు

మరిన్ని సినిమా కబుర్లు
Award is for Srimani or Ramajogayya Sastry?