బాలకృష్ణ సరసన 'వీరభద్ర' సినిమాలో నటించిన అందాల భామ తనూశ్రీ దత్తా బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది. తమిళం లోనూ ఓ సినిమాలో నటించింది. చాలా కాలంగా ఆమె సినిమాలతో టచ్‌లో లేదు. అయితే తాజాగా ఈ భామ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. దాదాపు పదేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ సందర్భంగా తాను లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఆమెను లైంగికంగా వేధించాడట.
తెలుగు సినీ పరిశ్రమలో శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ కలకలం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న తరుణంలో తనూశ్రీ దత్తా ఆరోపణలు మళ్లీ ప్రకంపనలకు కారణమయ్యాయి. నానాపటేకర్ లాంటి వాళ్లు నేరస్థులనీ అలాంటి వారిని రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి వారు ఎంకరేజ్ చేయడం బాధ కలిగించిందనీ తనూశ్రీ దత్తా చెప్పింది. క్యారెక్టర్ బ్యాడ్ అయిన వాళ్లను సినీ పరిశ్రమలో ఉండనీయకూడదంది. అలాంటి వాళ్ల వల్ల సినీ పరిశ్రమలో మహిళలకు భద్రత ఉండదనీ, అలాంటి వారితో సినిమాలు చేసిన వారికి ఆ మకిలి అంటుకుంటుందనీ తనూశ్రీ దత్తా అభిప్రాయ పడింది. అయితే నానా పటేకర్ సన్నిహితులు మాత్రం తనూశ్రీ దత్తా ఆరోపణల్లో నిజం లేదంటున్నారు.
|