విజయ్ దేవరకొండ ఏం చేసినా అదో పెద్ద సెన్సేషన్ అయిపోయి కూర్చుంటోందిప్పుడు. ముఖ్యంగా సోషల్ మీడియా స్టార్ విజయ్ దేవరకొండ. దసరాకి విజయ్ నుండి రానున్న సినిమా 'నోటా' ప్రమోషన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో రచ్చ రంభోలా చేస్తున్నాయి. 'రౌడీస్' పేరుతో ఆయన ఫ్యాన్స్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా 'నోటా'. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నోటా'కు జ్ఞాన్‌వేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అందాల భామ మెహ్రీన్ కథానాయిక. 'గీత గోవిందం' సినిమాతో 60 కోట్లు కొల్లగొట్టిన విజయ్ దేవరకొండ, 'నోటా'తో 100 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ దిశగానే ప్రమోషన్స్ ఇరగదీసేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్‌లో కూడా విజయ్ దేవరకొండ సినిమాలకు పిచ్చ క్రేజ్ ఏర్పడింది.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 'నోటా' విడుదల కానుంది. ఓ యంగ్‌స్టర్ సినిమా ఒకేసారి నాలుగు భాషల్లో విడుదలవుతుండడం అంటే ఆషామాషీ విషయం కాదిది. ప్రతీ రాజకీయ నాయకుడు చూడవల్సిన సినిమా 'నోటా' అని విజయ్ దేవరకొండ చెబుతున్నాడు. ప్రస్తుత రాజకీయాల్లో నెలకొన్న అనూహ్య పరిస్థితుల దృష్టి కోణం నుండి ఈ సినిమాని రూపొందించడం జరిగింది. ప్రచార చిత్రాలతో ఆల్రెడీ విజయ్ దేవరకొండ సగం దోచేశాడు. ఇక సినిమాతో బాక్సాఫీస్‌ని ఎంతమేర కొల్లగొడతాడో చూడాలిక. అక్టోబర్ 5న 'నోటా' ప్రేక్షకుల ముందుకు రానుంది.
|