మామూలుగా ఓ సినిమాకి సీక్వెల్ చేయాలంటేనే చాలా ఆలోచించాలి. అలాంటిది కింగ్ నాగార్జున సీక్వెల్స్ మీద సీక్వెల్స్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. 'బంగార్రాజు' సీక్వెల్‌పై నాగార్జున ఎప్పటి నుండో స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టాడు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా కథ మీద వర్క్ చేస్తున్నాడు. త్వరలో ఆ కథ ఓ కొలిక్కి రానుంది. వీలైనంత త్వరగా 'బంగార్రాజు'గా మళ్లీ తెరపై కనిపించేందుకు నాగార్జున సన్నాహాలు చేస్తున్నాడు. మరో పక్క 'మన్మధుడు' సినిమాకి సీక్వెల్ చేయాలని నాగార్జున డ్రీమ్. ఇన్నేళ్లకు ఆ అవకాశాన్ని నాగార్జున 'చిలసౌ' ఫేం రాహుల్ రవీంద్రన్‌కి అప్పగించాడు.
'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రాహుల్ రావీంద్రన్ 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా నాగార్జునకు బాగా నచ్చేసింది. 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా రాహుల్ లోని టాలెంట్‌ని గుర్తించిన నాగార్జున 'మన్మధుడు' సీక్వెల్ బాధ్యతను ఆయనకు అప్పగించాడు. ఇదిలా ఉంటే, లేటెస్టుగా 'దేవదాస్' సీక్వెల్ చేయాలన్న తన మనసు లోని కోరికను బయట పెట్టాడు. 'దేవదాస్' సినిమాలో నాని-నాగార్జున నటించారు. ఈ సినిమా విడుదలకు ముందే సీక్వెల్ ఆలోచనను తెర పైకి తీసుకు రావడం గమనార్హం. మొత్తం మూడు సినిమాల సీక్వెల్స్ పై నాగ్ కన్నేయడం అభిమానుల్నే కాదు, సగటు సినీ ప్రేక్షకుల్ని ఆశ్చర్య పరుస్తోంది. అదీ నాగార్జున ప్రత్యేకత.
|