గురువు గారికి బహుమతి - దుర్గమ్ భైతి

gift to teacher

నగరానికి దూరంగా కొండల చివర విసిరి పారేసినట్లుండే గోపాలపురం గ్రామానికి ఉదయం నుండే ఖరీదైన వాహనాల రాకతో సందడి నెలకొంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా అరు వందలకు పైగా వాహనాలను చూసిన ప్రజల సంతోషానికి అవధులు లేవు.

ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం మంత్రి గారు వచ్చినప్పుడు నలభై కార్లు వస్తే ఊరంతా కథలు కథలుగా చెప్పుకున్నారు. అన్ని వాహనాలు పాఠశాల వైపు దూసుకు పోతున్నవి. వచ్చింది కోటయ్య శిష్యులు. ముప్ఫై ఆరేళ్ళు ఉపాధ్యాయ విధులు నిర్వర్తించి, వేలాది మంది విద్యార్థులను అత్యున్నత స్థాయిలో నిలిపిన కోటయ్యగారు ఈరోజు ఉద్యోగ విరమణ చేయుచున్నారు.

సమావేశంలో కోటయ్య శిష్యులు గురువు గారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆశీస్సులు పొందుతున్నారు. బాలు వేదిక పైకి రాగానే అందరు లేచి నిలబడినారు. బాలు జిల్లా కలెక్టర్. ముందుగా గురువు గారికి పాదాభివందనం చేసి తన మనోభావాన్ని సభముందు ఆవిష్కరించాడు.

" గౌరవనీయ గురువర్యులు కోటయ్య గారికి నమస్కారములు. వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పి, వందలాది మందిని ఉన్నత స్థానంలో నిలిపి ఉద్యోగ విరమణ చేయుచున్న శుభ తరుణంలో పాతికేళ్ల క్రితం మీ దగ్గర విద్యార్ధిగా చేరిన బాల కార్మికుడు రాజు నేడు జిల్లా అత్యున్నత అధికారిగా మీకు శిరస్సు వంచి చెబుతున్నాను..

తల్లిదండ్రులు తర్వాతి మహత్తర స్థానం గురువుది అంటారు పెద్దలు. తల్లిదండ్రులు బాల్యంలోనే చనిపోయిన నన్ను దూరపు బంధువు ఎవరో భారమనుకుని హోటల్లో పనికి కుదిర్చి చేతులు దులుపుకొన్నాడు. అక్కడికి ప్రతిరోజు సాయంత్రం ఛాయ్ త్రాగటానికి వచ్చే మీరు ఒకరోజు నా గురించి వివరాలు యజమాని ద్వారా తెలుసుకుని "చదువుకోవడానికి బడికి వస్తావా బాబు" అని అడిగారు.

అరేయ్, ఒరేయ్ అనే పిలుపులతో అలవాటు పడిన నా చెవులు మొదటి సారిగా బాబు అనే మాట వినే సరికి ఆశ్చర్యమేసింది..నన్ను మీతో పాటు ఇంటికి తీసుకెళ్లి బడిలో చేర్పించారు. మీ పిల్లలతో సమానంగా మీరు పని చేస్తున్న బడి లోనే నన్ను చదివించారు. నేను ఒక్కడినే అదృష్టవంతుడిననుకున్నాను. కానీ నాలాంటి అనాథలను చాలా మందిని చేరదీసి మీ ఇల్లును అనాథ శరణాలయంగా మార్చారు.

చాలా మంది ఉపాధ్యాయులు కుటుంబము, అదనపు వ్యాపారాలకు ప్రాముఖ్యతనిస్తుంటే మీరు మాత్రం పాఠశాల విధులు పూర్తి కాగానే బాలకార్మికుల గురించి వెతికి మరీ బడిలో చేర్పించడం, అనాధలను ఇంటికి తీసుకువచ్చి విద్య నేర్పించడం చూసి మీ బంధువులు, స్నేహితులు సామాజిక సేవ పిచ్చి పట్టిందని ఎగతాళి చేసిన మీరు నవ్వుతూ ముందుకు వెళ్లారు కానీ వారి ఈసడింపులు ఏమాత్రం లక్ష్యపెట్టలేదు.

పాఠశాలలో నిత్యం వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులకు చదువుపైన ఆసక్తి కలిగేలా చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఎంతో ఉత్సాహంగా ప్రోత్సాహాన్ని అందించేవారు. మాకు ఏ విషయంలో శ్రద్ద ఉంటే అందులో ముందడుగు వేయాలని మా వెన్నంటి నిలిచేవారు. పాఠశాలను వదిలి ముఖ్యంగా మిమ్మల్ని వదిలి వెళ్ళిన విద్యార్థులు ఎంతగా ఏడ్చేవారో!

మీ సహా ఉపాధ్యాయుల పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తుంటే, మీ పిల్లలు మీ దారిలోనే ఉపాధ్యాయులు కావడం చూస్తుంటే వారికి కూడ సంపాదన కంటే సమాజసేవ ముఖ్యమని అర్థమవుతుంది. అనుక్షణం మీ అభిప్రాయాలను గౌరవించి సహకరించే అమ్మగారు, మీ పిల్లల కారణంగా చదువుకు నోచుకోని వందలాది పిల్లలు చదువు నేర్చి ఉన్నత ఉద్యోగాలు సాధించారు.

ముప్పది సంవత్సరాలు  పని చేసి ఉద్యోగ విరమణ చేయుచున్నావు కదా కనీసం ఇల్లు కూడ నిర్మించలేదని మిమ్మల్ని విమర్శించే వారికి మీరు ఇచ్చిన సమాధానం ఎంత ఆలోచనాత్మకంగా ఉంది..

"నేను ఇల్లు నిర్మించుకునే డబ్బుతో ఇరవై మందికైనా ఉన్నత విద్య ను అందించవచ్చు. అందులో పదిమంది విజయం సాధించినచో ఆ సంతృప్తి ముందు సొంత ఇల్లు ఏపాటిది? "

ఎన్నో మంచి పనులు చేసినా, మీ కృషి ని ఎవరు గుర్తించకపోయినా, మీరు ఎంచుకున్న మార్గాన్ని విడువలేదు. అవార్డులు మిమ్మల్ని వెతుకుతూ వచ్చినా సున్నితంగా తిరస్కరించారు. పేరు కోసం ప్రాకులాడని గొప్ప వ్యక్తి మీరు.

మీ శ్రమ వృధా కాలేదు. మీ శిష్యులు ఎందరో అత్యున్నత ఉద్యోగాలు సాధించారు. ఎప్పుడు వినూత్న కార్యక్రమాలతో మమ్మల్ని ఆకర్షించే మీరు, ఇప్పుడు ఉద్యోగ విరమణ చేయుచున్న సందర్భంగా మేము కూడ వినూత్నమైన ప్రణాళికతో మీ ముందుకు వస్తున్నాము. దయచేసి కాదనకండి.

మొదటిది మీ శిష్యులందరం కలిసి కోటి రూపాయల నిధులు జమచేసి మీ పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేశాము. అనాథ పిల్లలకు, బాల కార్మికులకు చేయూత నివ్వడానికి ఈ నిధులు ఖర్చు చేస్తాము. ఇది  మీ శిష్యులు నిజాయితీగా సంపాదించిన విజయమని గర్వంగా చెబుతున్నాము

రెండవది వందలాది అనాధ లకు ఆపద్బాంధవులుగా నిలిచిన మీ పుణ్య దంపతుల శేష జీవితం హాయిగా గడపడానికి వీలుగా మేము ఒక సంవత్సరం పాటు కూలీలుగా మారి  స్వతహాగా ఒక ఇల్లు నిర్మించాము. ఇప్పుడు డబ్బు మాకు సమస్య కాదు. మీరుండే ఇంటిలో మేము ఇటుకల వలె ఉండాలనే స్వార్థం తో చేసిన చిన్న ప్రయత్నమిది.

మా హృదయంలో  మీకు తల్లిదండ్రుల కంటే ఉన్నత స్థానాన్ని పదిల పరచుకున్నాము. పిల్లల కోరిక తీర్చడం పెద్దలుగా మీ ధర్మం. మీరు చేసిన నిస్వార్థ సహాయానికి ఇది కృతజ్ఞత కాదు, మీరు నేర్పిన విద్యకు మేమిచ్చే గురుదక్షిణ కూడా కాదు. ఇది మా బాధ్యత. మీ శిష్యులుగా ఈ సమాజానికి చేసే చిరు ప్రయత్నం. సహృదయంతో  స్వీకరించండీ.

కోటయ్య కళ్ల నుండి ఆనందభాష్పాలు నేల రాలాయి. లేచి బాలుని హృదయానికి హత్తుకున్నాడు. వేలాది శిష్యుల కరతాళ సవ్వడులు ఆ ఊరి కొండలన్ని ప్రతిధ్వనించేలా మారు మ్రోగాయి.

మరిన్ని కథలు

love affections
మమతానురాగాలు
- మల్లవరపు సీతాలక్ష్మి
Madhava seva
మాధవ సేవ (బాలల కథ)
- సరికొండ శ్రీనివాసరాజు
Bawa Bawa rose water
బావా బావా పన్నీరు....
- గొర్తి.వాణిశ్రీనివాస్
New cousins
కొత్త కోడలు
- యు.విజయశేఖర రెడ్డి
i hate my room mate
ఐ హేట్ మై రూమ్మేట్
- గంగాధర్ వడ్లమన్నాటి
gurupreet singh
గురుప్రీత్ సింగ్
- యు.విజయశేఖర రెడ్డి
pity sundaram
పాపం సుందరం!
- పద్మావతి దివాకర్ల
Listening to what is being said
చెప్పుడు మాటలు వింటే...!
- మీగడ.వీరభద్రస్వామి