అది జూన్ ఒకటో తేదీ. భానుడి భగభగలకు ఊరంతా నిప్పుల కొలిమిలా మారిపోయింది. పక్కనే ఉన్న నగరంలోని ఒక కార్పొరేట్ స్కూల్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న నేను, వేసవి సెలవుల కోసం మా సొంత ఊరికి వచ్చాను. హాస్టల్ గోడల మధ్య, ఎప్పుడూ పుస్తకాలు, పరీక్షల ఒత్తిడితో గడిపే నాకు, అమ్మ చేతి వంట తింటూ మా పల్లెటూరి ప్రశాంతతలో గడపడం ఎంతో ఊరటనిస్తోంది. కానీ ఆ మధ్యాహ్నం ప్రకృతి అనూహ్యంగా స్పందించింది. ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకుని, చూస్తుండగానే కుండపోతగా అకాల వర్షం మొదలైంది. సాధారణ వర్షంగా ప్రారంభమై అది కుంభవృష్టి కింద మారింది. రెండు గంతలపాటు ఏకధాటిగా కురిసిన వర్షం వలన ఉక్కపోత నుండి ఉపశమనం దొరికినందుకు అందరం సంతోషిస్తున్న తరుణంలో, ఆ సంతోషం ఎంతటి విషాదంగా మారబోతుందో ఎవరూ ఊహించలేదు.
అమ్మ నేను మా ఇంటి వరండాలో కూర్చుని, వాన చినుకులు నేలను తాకుతున్నప్పుడు వచ్చే ఆ మట్టి వాసనను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటున్నాము. అప్పటివరకు మలమల మాడ్చిన ఎండలకు విరామం దొరికినట్లుగా ఉన్న ఆ వాతావరణం ఎంతో హాయిగా అనిపించింది. కానీ బయట వర్షం ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. వీధులన్నీ అప్పుడే చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో మా నాన్న ఫోన్ చేసి, "వర్షం చాలా ఎక్కువగా ఉంది, వీధుల్లో నీరు నిలిచిపోయింది, ఎట్టి పరిస్థితుల్లోనూ బయట అడుగు పెట్టకండి" అని ఆందోళనగా హెచ్చరించారు. నాన్న మాటల్లోని గంభీరత మమ్మల్ని కాస్త ఆలోచనలో పడేసింది. అయితే, ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదిస్తూ ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయేంతటి పెను కేక వినబడింది. అది సామాన్యమైన అరుపు కాదు, మృత్యువు గుప్పిట్లో చిక్కుకున్న ఒక జీవి వేసిన చివరి ఆర్తనాదంలా ఉంది.
ఆ కేక వినగానే గుండె ఒక్కసారిగా జారిపోయినట్లయింది. భయం భయంగానే మేము బయటకు వచ్చి చూసేసరికి, అక్కడ కనిపిస్తున్న దృశ్యం వర్ణనాతీతం. పన్నెండేళ్ల ఒక చిన్న బాలుడు మోకాళ్ల లోతు నీటిలో పడిపోయి ఉన్నాడు. అరిచే శక్తి కూడా లేక మౌనంగా ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. అతని మెడ చుట్టూ తెగిపడిన విద్యుత్ తీగలు ఒక మృత్యు పాశంలా చుట్టుకుని ఉన్నాయి. నీటి ద్వారా ప్రవహిస్తున్న విద్యుత్ ఘాతానికి ఆ బాలుడి చిన్నారి శరీరం విలవిల్లాడుతూ, నీటిలో జెల్ల చేపలా కొట్టుకుంటుంటే చూడటం మా వల్ల కాలేదు. ఆ దృశ్యం చూసి అక్కడున్న వారందరి రక్తం గడ్డకట్టిపోయింది. ఆ అబ్బాయి పక్కనే నీటిలో తేలుతున్న చిన్న చిన్న పాల క్యాన్లు చూసినప్పుడు నా కళ్ళు చెమర్చాయి. ఆ మండుటెండలో, ఈ భారీ వర్షంలో తన పొట్ట కూటి కోసం, ఇంటి బాధ్యత కోసం పాలు పోయడానికి వచ్చిన పసివాడని అర్థమై, మనసు కకావికలమైంది. చుట్టూ జనం ఉన్నా, ఆ నీటిలో అడుగు పెడితే తమ ప్రాణాలు కూడా పోతాయన్న భయంతో అందరూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఒక నిముషం కాలం యుగంలా గడిచింది, ఆ పసి ప్రాణం మా కళ్ళ ముందే గాలిలో కలిసిపోతుందేమో అన్న భయం నన్ను వణికించింది.
వర్షపు నీరు నిండి ఉన్న ఆ వీధిలో అడుగు పెట్టడమంటే మృత్యువును ఆహ్వానించడమే. విద్యుత్ సరఫరా నిలిపివేయమని బోర్డుకు ఫోన్ చేసినా, ఆ పసివాడికి గడువు చాలా తక్కువగా ఉంది. ఆ క్లిష్ట సమయంలో నలభై ఏళ్ల ఒక వ్యక్తి సాహసించి ముందుకు వచ్చాడు. ఒక పొడవైన వెదురు కర్ర సాయంతో ఎంతో చాకచక్యంగా ఆ తీగలను బాలుడి శరీరం నుండి వేరు చేశాడు. కానీ, అప్పటికే ఆ బాలుడు స్పృహ కోల్పోయాడు. ఎవరో "పిల్లాడు చనిపోయాడు" అని అరవడంతో నా ప్రాణాలు పోయినంత పనైంది. నా కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే, ఆ బాలుడి కోసం మనసులోనే దేవుడిని వేడుకున్నాను. అప్పుడే నేను గమనించాను, ఆ పిల్లాడి ఊపిరి చాలా నెమ్మదిగా ఆడుతోంది. "అతను బతికే ఉన్నాడు!" అని నేను కేక వేయగానే, మరో ఇరవై ఏళ్ల యువకుడు వెనుకాముందు ఆలోచించకుండా ఆ నీటిలోకి దూకి, బాలుడిని తన చేతుల్లోకి తీసుకుని ఆసుపత్రి వైపు పరుగు తీశాడు.
ఆ యువకుడెవరో, ఆ బాలుడెవరో ఎవరికీ తెలియదు. కానీ ఆ సమయంలో వారి మధ్య ఉన్న బంధం కేవలం 'మానవత్వం'. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నా మనసులో పదే పదే ఆ బాలుడి ముఖమే మెదులుతోంది. "అమ్మా, ఆ అబ్బాయికి ఏం కాదు కదా? అతను కోలుకుంటాడా?" అని నేను కన్నీళ్లతో అమ్మను అడుగుతుంటే, అమ్మ నా తల నిమురుతూ "ఏం కాదు కన్నా, దేవుడు అతడిని కాపాడుతాడు" అని ఓదార్చింది. కానీ నా ఆవేదన తగ్గలేదు. మరుసటి రోజు ఉదయం నేను కళ్ళు తెరవగానే, అమ్మ చిరునవ్వుతో నా దగ్గరకు వచ్చి, "నన్నూ, ఆ అబ్బాయి బాగున్నాడు. నేను స్వయంగా వెళ్లి కనుక్కున్నాను, అతను కోలుకుంటున్నాడు" అని చెప్పింది. ఆ మాట వినగానే నా గుండె మీద ఉన్న పెద్ద రాయి తొలగిపోయినట్లు అనిపించింది. అమ్మను గట్టిగా హత్తుకుని ఏడ్చేశాను.
అమ్మ చెప్పిన ఆ వార్త వినగానే, ఆ బాలుడి ఇంటి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలన్న కుతూహలం, ఆవేదన నన్ను ఆపలేకపోయాయి. ఆ సాయంత్రం నేను, అమ్మ కలిసి ఆ పిల్లాడి ఇంటికి వెళ్లాము. మా ఊరి శివార్లలో ఉన్న ఒక చిన్న రేకుల షెడ్డు అది. లోపలికి వెళ్లగానే, తెల్లటి బ్యాండేజీలతో మంచంపై పడుకుని ఉన్న ఆ పిల్లాడిని చూసి నా మనసు వికలమైంది. మమ్మల్ని చూడగానే ఆ బాలుడి తల్లి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఆమె పదే పదే మా చేతులు పట్టుకుని, "అమ్మా, ఆ రోజు మీరు ఫోన్ చేసి విద్యుత్ ఆపించకపోయి ఉంటే, నా బిడ్డ నాకు దక్కేవాడు కాదు" అని ఏడుస్తూ చెబుతుంటే, నా గొంతు మూగబోయింది.
ఆమె మాటల్లో ఒక పేద తల్లి పడే తపన, నిస్సహాయత స్పష్టంగా కనిపించాయి. ఆ బాలుడి తండ్రి అనారోగ్యంతో మంచాన పడటంతో, ఆ పన్నెండేళ్ల పసివాడే ఇంటికి పెద్ద దిక్కుగా మారి, తెల్లవారుజామునే లేచి పాలు పోస్తూ వేణ్ణీళ్ళకు చణ్ణీళ్ళుగా సంపాదిస్తున్నాడని తెలిసింది. ఆ రోజు జరిగిన ప్రమాదం గురించి చెబుతూ ఆ తల్లి వణికిపోయింది. "మా వాడు చనిపోయాడని అందరూ అనుకున్నారు, కానీ మీబాబు మా వాడు బ్రతికేవున్నాడని పెద్దగా కేకలు వేయగానే ఎవరో యువకుడు దేవుడిలా వచ్చి నా కొడుకును ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ బాబు ఎవరో కూడా మాకు తెలియదు" అని ఆమె అంటుంటే, మన దేశంలో ఇంకా మానవత్వం ఎందుకు బతికే ఉందో నాకు అర్థమైంది. మనుషులు ఆపదలో ఉన్నప్పుడు స్పందించే ఆ గుణమే నిజమైన సంపద.
తిరుగు ప్రయాణంలో నా మనసులో ఒకటే ఆలోచన మెదిలింది. మనం చదివే చదువులు, సంపాదించే డబ్బులు కేవలం మన కోసం మాత్రమే కాదు, ఇలాంటి కష్టాల్లో ఉన్న తోటి మనుషులకు అండగా నిలవడానికే అని నాకు జ్ఞానోదయం అయింది. ఆ పిల్లాడి కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞత, ఆ తల్లి కన్నీటిలో ఉన్న ఉపశమనం నేను జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు నుండి నా దృక్పథం పూర్తిగా మారిపోయింది. కేవలం మార్కుల కోసం చదివే చదువు కంటే, తోటి మనిషిని ప్రేమించే గుణం గొప్పదని అర్థం చేసుకున్నాను. ఆ సంఘటన నా జీవితంలో ఒక చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఆ రోజు జరిగిన సంఘటన నాకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పింది. ఆపదలో ఉన్న మనిషిని కాపాడటానికి కులం, మతం, ప్రాంతం లేదా హోదా అవసరం లేదు. కేవలం స్పందించే మనసు ఉంటే చాలు. ఏ శాస్త్రాల ప్రస్తావన అక్కర్లేకుండానే, నిస్వార్థంగా తోటి మనిషికి సాయం చేయడమే అన్నిటికంటే గొప్ప సంస్కారం అని ఆ అనామక యువకుడు నిరూపించాడు. మనుషుల మధ్య ఇంకా మమతానురాగాలు మిగిలే ఉన్నాయని, మానవత్వమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తోందని ఆ సంఘటన నాకు చాటి చెప్పింది.

