కర్మ ఫలం - జీడిగుంట నరసింహ మూర్తి

Karma falam

ఆ కాలనీలో నారాయణ రావు సుమారు పదిహేనేళ్ళుగా ఉంటున్నాడు. ఇల్లు సొంతమే. ఎక్కువ దూరం పోకుండానే అందుబాటులో ఎన్నో షాపులున్నాయి. ఒక ఉడుపి హోటల్ కూడా ఉంది . ఇంట్లో ఆడవాళ్ళకు టిఫిన్ చెయ్యడానికి ఓపికలు లేనప్పుడల్లా పాపం ఆ హోటల్ వాడే వేడి వేడి పార్సిల్స్ చేసి ఇచ్చే వాడు. నారాయణ రావుకు చెట్నీ పిచ్చి ఎక్కువ.

“సార్. మీరు టిఫిన్ కన్నా ఎక్కువ పచ్చడే తింటారని అర్ధం అయ్యింది. వచ్చేటప్పుడు ఏదైనా ఒక బాక్స్ తెచ్చుకోండి...” అని నవ్వుతూ అనే వాడు హోటల్ అతను.

చిన్నో చితకో ఏదో ఉద్యోగం చేసుకుంటూ సాలిడ్ గా వచ్చే ఆదాయంతో బ్రతకడంలో ఉన్న వెసులుబాటు వ్యాపారాలు పెట్టి నెగ్గుకురావడం చాలా కష్టం అని ఎంతోమంది నోట వింటూ ఉంటాం. అలాంటి పరిస్థితులలో కూడా ఆ కాలనీలో ఒక ఆరునెలల వ్యవధిలో ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్లు వెలిసాయి. అందులో చాలా షాపులు ప్రజల అవసరాలతో సంబంధం లేకుండా అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి.

నారాయణ రావు గతంలో మార్కెటింగ్ డిపార్టుమెంటులో పనిచేసిన అనుభవం ఉండటం వల్లనే ఏమో . ప్రతి షాపులోనూ ఏదో ఒక వస్తువు కొనడం, వాళ్లకు వ్యాపారం వృద్ది చెందటానికి కావలసిన సలహాలు అడిగినా, అడగకపోయినా అతని నిత్యకృత్యంలో ఒక భాగమైపోయింది.

వింటే వచ్చే నష్టమేముందిలే అని కొంతమంది వాళ్ళ పనులు చేసుకుంటూనే ఒక చెవి ఇటుపడేసి వింటున్నట్టు నటించే వాళ్ళు. వాళ్ళల్లో కొంతమంది యాగ్రెసివ్గా సమాధానాలు ఇచ్చే షాపు ఓనర్లు కూడా ఉండే వారు.

“ప్రతివాడూ వెధవ సలహాలు ఇవ్వడానికి తయారైపోతూ ఉంటారు. వీళ్ళకేం తెలుసు మేం పడుతున్న టెన్షన్లు ?” అని అనుకుంటూ ఆసక్తి లేనట్టుగా మొహం తిప్పుకునే వాళ్ళు కూడా ఎక్కువే. .

“బాబూ ! నీ షాపులో నిండుగా సామాన్లు నింపేసావు. చాలా సంతోషం. కానీ ఏది అడిగినా లేదంటావు. నీ దగ్గరున్న సరుకు మాకు నిరుపయోగం. ఉన్న వస్తువులు కూడా ఎన్ని ఎక్స్పైర్ అయ్యాయో చూసుకునే ఓపిక మీకు లేదు. ఆ పనికి మాలిన సామాను మాకు అంటగట్టాలని ప్రయత్నం చేస్తారు. మాకు కావాల్సిన వస్తువులు తెప్పించమని చెపితే మీరు వినిపించుకోరు. ఈ కాలనీలో ఉన్నవాడినిగా చెపుతున్నాను. ఇప్పటికే మీ దగ్గర ఏ సరుకులూ దొరకవు. రెస్పాన్స్ కూడా సరిగ్గా ఉండదు అని చాలా మంది నుండి వింటున్నాను.ముందు ముందు మీరు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి నా వంతు సలహా ఇవ్వదల్చుకున్నాను. ..” అన్నాడు నారాయణ రావు ఒక రోజు ఒక షాపులో కుర్ర యజమానితో .

“అంకుల్. మీరు మాటికి మాటికీ మా షాపు దగ్గరకు కొచ్చి లొల్లి పెడుతూ ఉంటే మా కష్టమర్లు వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీరు మా దగ్గర కొనకపోతే మాకు పోయింది ఏమీ లేదు . పైగా మీరు రావడం వల్ల అంతా నష్టమే . ” అంటూ మొహమ్మీదే దులిపేసాడు ఆ ఓనరు.

నారాయణ రావు ఆత్మాభిమానం దెబ్బతింది. ఇలాంటి మూర్ఖులతో వాదించడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదు అని ఆయనకు అనిపించింది.

షాపు వాడి తండ్రి ఎక్కడో కొబ్బరికాయలు హోల్ సేల్ వ్యాపారం చేసుకుంటూ ,ఈ షాపును కొడుక్కి అప్పగించాడు. కొడుక్కు ఉడుకు రక్తం. ఏం చదువుకున్నాడో తెలియదు. అసలు చదివాడో లేదో కూడా తెలియదు. మనిషిలో సంస్కారం ఏ కోశానా కనిపించడం లేదు. ఉచ్చనీచాలు తెలియకుండా కష్టమర్లను పురుగులుగా చూసి మాట్లాడే అతని వ్యవహార శైలికి తప్పు చేసిన వాడిలా తలవంచుకుని వచ్చేస్తే వాడు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ఎవరో ఒకరు ఇటువంటి వాళ్లకు గడ్డి పెట్టాలి . అప్పటికి గానీ వీళ్ళకు బుద్ధి రాదు అని ఆ షాపు లోని కుర్రాడి పైన తిరుగుబాటు చెయ్యాలని నారాయణ రావు తనలో తను అనుకున్నాడు కానీ ఆశుద్దంలో రాయి వేసినట్టవుతుందని తన్నుకువస్తున్న ఆవేశాన్ని అదిమిపట్టి సాద్యమైనంతవరకు మంద్రస్వరంతోనే అన్నాడు .

“బాబూ ! ఎందుకు అంత కోపం? పెద్దలు ఏదైనా చెపితే పిల్లలు వినే ఆ కాలం నాటి రోజులా ఇవి? నేను చెప్పేది చెప్పాను. ఇక మీ ఇష్టం . ..” అంటూ అక్కడ ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు నారాయణ రావు .

మరో రోజు షాపుల వైపునుండి వెళ్తూ అప్రయత్నంగా తనతో తగాదా వేసుకున్న కుర్రాడి షాపు దగ్గర ఆగాడు నారాయణ రావు. ఆ రోజు కుర్రాడితో పాటు అతని తండ్రి కూడా షాపులో కూర్చుని ఉన్నాడు. కొడుకు ఒక పక్కన ఉండి సరుకులు సర్దుతున్నాడు .

నారాయణ రావు అసలే చాదస్తపు మనిషి. ఎంత వద్దనుకున్నా ఎవరేనా ఆయన్ని అవమానిస్తే సరిగ్గా భోజనం చెయ్యడు నిద్ర పోడు..

అంతకు ముందు ఆ కుర్రాడి చేత తిట్లు తిన్నా కూడా తిరిగి వాళ్లకు మొహం మాడిపోయే టట్టు రిప్లై ఇవ్వాలని రాత్రంతా ఆలోచించి ఆలోచించి ఇదే మంచి అవకాశం అని “ బాబూ ! చూస్తూంటే మీ అబ్బాయికి అసలు వ్యాపారం చెయ్యడం రాదని తెలుస్తోంది. వచ్చిన వాళ్ళందరికీ సరైన సమాధానం ఇవ్వడు. మీ షాపులో ఉన్న వస్తువులను కూడా తియ్యడానికి బద్దకించి లేవని చెపుతున్నాడు. లెక్కలు కూడా రావని తెలుస్తోంది. కొంతమందికి ఎక్కువ బిల్లు వెయ్యడం, మరి కొంతమందికి తక్కువ వెయ్యడం నేను గమనించాను. మీ వ్యాపారం కుదుట పడే అంతవరకు మీరు కూడా వచ్చి కూర్చుంటే బాగుంటుందని నా ఉద్దేశ్యం “ అన్నాడు కొంత సౌమ్యంగానే .

“చాలు చాల్లే పోవయ్యా ! నీ వెధవ నీతులు చెప్పొచ్చావు. నీ గురించి మా అబ్బాయి అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. నువ్వు దుష్ప్రచారం చేసి వచ్చే కష్టమర్లను రానియ్యకుండా చెడగొడుతున్నావటగా . నీ పనికిమాలిన సలహాలు వినడానికి మేము ఇక్కడ వ్యాపారం పెట్టుకోలేదు ... నీలాంటి వాళ్ళు మా షాపుకు రాకుండా ఉంటే మీ కళ్ళముందే పది కొబ్బరికాయలు కొడతాను ...” అంటూ ఒక దణ్ణం పెట్టి బలవంతంగా అక్కడనుండి నారాయణ రావును పంపించేసాడు ఆ షాపు యజమాని.

రోజులు గడుస్తున్నాయి. ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో మిగిలిన షాపులు అన్నీ బాగానే పుంజుకున్నాయి. కానీ నారాయణ రావును అవమానించిన షాపులో ఎవరో కొత్త వాళ్ళు ఉన్నట్టు గమనించి పక్క వాళ్ళను అడిగాడు నారాయణ రావు.

“ వ్యాపారంలో నష్టం వచ్చిందిట . సరుకు అమ్ముడు కావడం లేదుట.ఉన్న సరుకంతా ఎక్స్పైర్ అయిపోయిందిట . షాపు వేరే వాళ్లకు ఇచ్చేసి వెళ్ళిపోయారు ...” ఆన్నాడు పక్క షాపతను గల్లాపెట్టెలో డబ్బులు లెక్కపెట్టుకుంటూ .

నారాయణ రావుకు చాలా రోజులుగా చూస్తున్న వాడిగా ఒకింత బాధ వేసినా , కూసే గాడిదలు మేసే గాడిదలను చెడగొట్టినట్టు ఇటువంటి మూర్ఖులు, మొండివాళ్లకు తగిన శాస్తి జరిగితే కానీ అవతల వాళ్లకు బుద్ధి, జ్ఞానం రాదు ..కర్మను అనుభవించక ఎవరికైనా తప్పదు. ” అనుకుంటూ మరో షాపులో సరుకులు కొనడానికి అటువైపుగా కదిలాడు. *****

సమాప్తం

మరిన్ని కథలు

Aatmeeya poushyam
ఆత్మీయ పౌష్యం
- మణి వడ్లమాని
Badhyatha
భాధ్యత
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Manavatwam bratike vundi
మానవత్వం బ్రతికేవుంది
- డా:సి.హెచ్.ప్రతాప్
Jeevamrutham
జీవామృతం
- డా:సి.హెచ్.ప్రతాప్
Nirnamyam
నిర్ణయం
- జి.ఆర్.భాస్కర బాబు
Manchi snehiitulu
మంచి స్నేహితులు
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Kaanuka
కానుక
- డా:సి.హెచ్.ప్రతాప్
Manavatwama nuvuu ekkada
మానవత్వమా నువ్వు ఎక్కడ?
- హేమావతి బొబ్బు