అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి

annamayya pada seva

002.భావములోన బాహ్యమునందును

భావములోనా  బాహ్యమునందును
గోవింద గోవిందయని కొలువవో మనసా

1.హరి యవతారములే యఖిల దేవతలు
హరిలోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవోమనసా

2.విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదుకవో మనసా

3.అచ్యుతుడితడే ఆదియునంత్యము
అచ్యుతుడే యసురాంతకుఁడు
అచ్యుతుఁడు శ్రీ వేంకటాద్రి మీఁదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా   (03-561)

ముఖ్యమైన అర్థాలు
భావము=ఆత్మ , అభిప్రాయము, భావన ;బాహ్యము=వెలుపల ;  గోవింద =గోవుల కధిపతి; హరి= విష్ణువునకు నామాంతరము; బ్రహ్మాండంబు=భూగోళ ఖగోళాదికము, అందలి లోకములు. చరాచరాఖిలము; విష్ణువు = విశ్వమును వ్యాపించియుండువాడు ;మహిమ=గొప్పతనము  ; విహిత= విధింపఁబడినది.; విశ్వాంతరాత్ముడు= విశ్వము తన యందు కలవాడు; అచ్యుతుడు=స్థిరుడు. శరణ=శరణుజొచ్చు;

తాత్పర్యము
అన్నమయ్య ఈ కీర్తనలో  మనస్సుకు   కర్తవ్యాన్ని నిర్దేశిస్తున్నాడు.

ఓ మనసా ! నీవేది తలిచినా, చేయదలిచినా  గోవిందుని సేవించు. ఆ నామస్మరణ చేయి. తరువాత మిగిలిన పనులు చేయి.

1.ఓ మనసా ! నీకు తెలుసా ! సమస్త దేవతలు హరి అవతారాలే. ఈ బ్రహ్మాండములన్నీ హరిలోపలే ఉన్నాయి. అన్ని మంత్రములు హరికి సంబంధించిన పేర్లే. ఇప్పటికైనా హరి హరి హరి హరి అని పలుకుతుండు.

2.ఓ మనసా ! పిచ్చిదానిలా భౌతిక భోగాలు వెతుక్కొంటున్నావేమిటే !    లోకంలో  విధింపబడిన కర్మలన్నీ విష్ణు దేవుని గొప్పతనాలే. వేదాలన్నీ విష్ణుని పొగుడుతున్నాయి. ఈ విశ్వమంతా   నిండి ఉన్నవాడు విష్ణుడొక్కడే. ఆ విష్ణువుని నీలో వెతుక్కోవే.

3.ఓ  తెలివి తక్కువ మనసా ! వాడిని రక్షించు , వీడిని రక్షించు అని వాళ్ల చుట్టూ వెంపర్లాడతావేమిటే !   ఈ లోకానికి మొదలు, చివర అచ్యుతుడు. రాక్షసాంతకుడు అచ్యుతుడు. మన వేంకట పర్వతము మీద వేంకటేశ్వరునిగా కొలువై ఉన్నాడు  అచ్యుతుడు. ఆ  అచ్యుతుడిని శరణు కోరవే.

ఆంతర్యము

మనసా!
తెలిసినట్లుండి తెలియని ఒక వింత పదం మనస్సు.  మనస్సంటే ఆలోచనల సమాహారం. మనస్సు స్వాధీనమైతే  బంధువవుతుంది.  స్వాధీనంలో లేకపోతే  శత్రువవుతుంది. మనస్సును తనమీద నిలిపి శ్రద్ధగా సేవించిన భక్తుడు ఉత్తముడని స్వామి బోధించాడు. (భగవద్గీత06-47)  మనస్సును నశింపచేసిన వాడు  జ్ఞాని. ఇది అంత తేలిక కాదుగాని, ప్రయత్నిస్తే  కష్టం కూడా కాదు. అందుకు చాలా మార్గాలున్నాయి. ఒక మార్గం భౌతికమైన ఆలోచనలు వచ్చినప్పుడు - దానికి వ్యతిరేకమైన ఆధ్యాతికమైన ఆలోచన చేయటం.  అన్నమయ్య ఈ కీర్తనలో మనకు ఆ సాధనా మార్గాన్ని ప్రబోధించాడు. ఉదాహరణకి ఏవేవో పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడాలని  మనస్సులో ఒక ఆలోచన వస్తుంది. దీనిని నిరోధించాలంటె –(ఆలోచనని అంతం చేయటం) అసాధ్యం కాబట్టి , ఆలోచనా  మార్గాన్ని మళ్లించాలి.  హరి హరి అని మాట్లాడు. మాట్లాడటమనే క్రియ జరుగుతుంది. నీ మనస్సు సంతోష పడుతుంది. పిచ్చి మాటలు మాట్లాడితే వచ్చే ఫలితాల పర్యవసానం  తప్పుతుంది.

గోవిందా గోవిందా
గోవిందా అన్న గోపాలకా అన్నా ఒకటే అర్థం. గోవులను రక్షించేవాడు గోపాలకుడు. గో అంటే సంస్కృతంలో వేదాలు, ఉపనిషత్తులు, ఆవులు - ఇలా రకరకాల అర్థాలున్నాయి. గోవిందుడంటే  వేదాలు, ఉపనిషత్తులు, ఆవులను రక్షించేవాడు అని ఫలితార్థం. వేదాలు రక్షించే స్వామిని కొలువమంటున్నాడు అన్నమయ్య.  వేదాలను రక్షించటమంటే  ఆ వేద పుస్తకాలను ఇంట్లో  జాగ్రత్త పెట్టమని కాదు. వేదాలలో చెప్పిన ధర్మాలను పాటించమని ప్రబోధం. వేదాలు , ఉపనిషత్తులలో చెప్పిన వాటిని ఆచరిస్తే , గోవులను రక్షిస్తే -ఆ గోవిందుడు నిన్ను రక్షిస్తాడు. అలా చేస్తే ఆయననుకొలిచినట్టే లెక్క అని కవి సందేశం.    నామ పారాయణ గొప్పదే. దాని లోని ఆచరణా ప్రబోధం ఇంకా గొప్పది.

హరిలోనివే బ్రహ్మాండంబులు
బ్రహ్మాండమంటే ప్రపంచము. ఆకాశానికి  శబ్ద గుణము ఉంది.  వాయువుకి శబ్ద, స్పర్శ  గుణాలు ఉన్నాయి.అగ్నికి శబ్ద, స్పర్శ రూప  గుణాలు ఉన్నాయి. నీటికి శబ్ద, స్పర్శ రూప, రస గుణాలున్నాయి. భూమికి  శబ్ద, స్పర్శ రూప, రస , రస గంధ గుణాలున్నాయి.ఇవన్నీ  కలిస్తే బ్రహ్మాండమైందని బ్రహ్మ పురాణంలో ఉంది. (23 వ అధ్యాయము) ఈ బ్రహ్మాండము వెలగ పండు విత్తనంలా ఉంటుందని పోలిక చెప్పారు. ఈ మానవ శరీరము బ్రహ్మాండము యొక్క  సూక్ష్మ రూపం. హరి బ్రహ్మాండములో వ్యాపించినట్లే ఈ శరీరములో కూడా వ్యాపించి హృదయ సీమలో అలంకరించి ఉంటాడని ప్రశ్నోపనిషత్తు చెబుతోంది. (ఆరవ అధ్యాయము)

ఇటువంటి బ్రహ్మాండాలు వేలకు వేలు  . ఇవన్నీ హరిలోపల ఉన్నాయని అన్నమయ్య గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే జీవుల అల్పత్వాన్ని, శ్రీ హరి ఉన్నతత్వాన్ని చెప్పటానికి. ఈ పిండాండాన్ని (శరీరము) చూసి మురిసిపోకురా ! ఈ పిండాండము బ్రహాండములో చాలా సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపము. “ఇటువంటి బ్రహ్మాండాలు అనేకం తనలో నింపుకొన్న హరిని శరీరపు నిగారింపులో మరిచిపోకురా ! స్మరించేవారి దోషాలను హరించేవాడు హరిరా ! హరి అని పలకటం నేర్చుకోరా ! ” అని కవి హిత బోధ.

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విహిత కర్మలు అంటే మానవజాతికి విధించబడిన కర్మలు. ఇవి మూడు రకాలు.

1. నిత్య కర్మలు.:నిత్యము చేయవలసినవి స్నానము, జపము మొదలైనవి.
2. నైమిత్తిక కర్మలు.:కారణము వలన కలిగే కర్మ. గ్రహణం వచ్చినప్పుడు చేసే ప్రత్యేక స్నాన తర్పణాలు మొదలైనవి.
3. కామ్యకర్మలు.:కోరిక తీరాలని చేసే కర్మలు. ఉదా. వర్షం కురవాలని చేసే వరుణ జపం మొ.

ఇవి చేయాలంటే, చేసినా వాటి ఫలితం రావాలంటే విష్ణు దేవుని మహిమ ఉండాలి.

స్నానం చేయాలనుకొంటాం. నీళ్ల చెంబు ఎత్త వలసిన చేయి కిందికివాలిపోయింది. ఆ కర్మ చేసే శక్తి పోయింది. అంటే స్వామి అనుగ్రహం తప్పుకొంది. కనుక మనము చేయవలసిన అన్ని కర్మలు ఆయన అనుగ్రహము ఉంటేనే చేస్తాము. కనుక  ఆయన్ని చేసే ప్రతి పనిలో వెతుక్కో. తప్పకుండా లభించి నీ కోర్కె నెరవేరుస్తాడని కవి ప్రబోధం.

అచ్యుతుడితడే ఆదియునంత్యము
అన్నమయ్య కీర్తనల్లో పరస్పర విరుద్ధ భావాలేమో అనిపించే-లేదా-భ్రమించే- పాదాల్లో అచ్యుతుడితడే ఆదియునంత్యము'అనేది. ఈ లోకానికి మొదలు, చివర అచ్యుతుడు. తనను ఆశ్రయించిన వారిని నాశనము పొందనీయకుండా రక్షించువాడు అచ్యుతుడు అని అర్థం చెప్పుకొంటాం. కాని రెండవ సంపుటములోని 122 వకీర్తనలో 'ఆదినంత్యము లేని అచ్యుత మూరితివి’ అన్నాడు. ఒకచోటా అచ్యుతుడు ఆది, అంతము ఉన్నవాడని, వేరొక చోట లేనివాడని కవి ఎందుకు వ్రాసాడు? ఈ ప్రశ్నకు  జవాబు ఇది:

మాయాహ్యేషా మయాసృష్టా యన్మాం పశ్యసి నారద.
సర్వభూత గుణై ర్యుక్తం మైవం మాం జ్ఞాతుమర్హసి.
(ఓ నారదా! ఈ ప్రపంచమంతా మాయ .నాకొక హద్దు లేదు.రూపం లేదు.  అయినా నీకు ఒక రూపం ధరించి కనబడుతున్నాను. ) అని అచ్యుతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ భాగవతోపదేశము.

భగవంతుడు  రూపము లేనివాడు. రూపము కలవాడు. ఆది వాడే. అనాది వాడే.అంతము గల వాడు, అంతము లేనివాడు వాడే. అర్థమయ్యేంతవరకు ఇదంతా గందరగోళము. భక్తితో అర్థం చేసుకొంటే - ప్రయత్నిస్తే - స్వామి తత్వం పరమానందం. అందుకే చిద్విలాసి అన్నమయ్య ఆదికలవాడిగా, ఆదిలేనివాడిగా అచ్యుతస్వామిని వర్ణించాడు.

శరణనవో మనసా
ఈ మనస్సు అంత తొందరగా స్వామి దగ్గర తలవంచదు. ఆయనను శరణు కోరాలనుకోదు. మనలో ఎక్కువమందిమి 'కలడు కలండనేదివాడు కలడో లేడో  అని సందేహించే   వర్గంలో వాళ్ళం. నలుగురితో పాటు మనం కూడా నమస్కారం చేద్దాం. నలుగురితో పాటు గుడికి వెళ్దాం .  అంతే. మనస్సు శుద్ధి కాదు. ఆకర్షణల జారుపాటుల కోసం ప్రయత్నిస్తుంటుంది. మనలాంటి వాళ్లను ఉద్ధరించటం కోసమే- శరణనవో మనసా- అన్నాడు కవి. ఇష్టం లేక పోయినా బలవంతంగా అయినా శరణు శరణు అంటూ ఉండు. కొన్నాళ్టికి  మనస్సు దైవ చరణాలయమవుతుంది. ఇది కవి చెప్పినఆచరణీయమైన ప్రబోధం. ఆచరించటం  మన వంతు. స్వస్తి.

మరిన్ని వ్యాసాలు

కేదారనాధ్ .
కేదారనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బదరీనాధ్ .
బదరీనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.