షోడశి : రామాయణ రహస్యములు : : గుంటూరు శేషేంద్ర శర్మ - Saatyaki

షోడశి : రామాయణ రహస్యములు :  : గుంటూరు శేషేంద్ర శర్మ

షోడశి

గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన “షోడశి : రామాయణ రహస్యములు” గ్రంథానికి

విశ్వనాథ సత్యనారాయణ

( రామాయణ కల్ప వృక్షం. వేయి పండగలు రచయిత )

 

రాసిన(1967) ముందుమాట

--------

 

- కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ

https://en.m.wikipedia.org/wiki/Viswanatha_Satyanarayana

ఈ గ్రంథము పేరు ''షోడశి''. ఈ పేరు శ్రీవిద్యకు సంబంధించినది. ఇదియొక మహామంత్రము, గొప్పవిద్య. ఈ రచయిత తన గ్రంథము నందు ప్రధానముగా సుందరకాండ వ్యాఖ్యతో శ్రీ విద్యా విషయమును పేర్కొనుట చేత దాని యందలి యభిమానము చేత నీ గ్రంథమునకు షోడశి యని నామకరణము చేసి యుండును. ఒక గ్రంథకర్త తానొక గ్రంథమును వ్రాసి దానిలో పదునేనధ్యాయము లుండుట చేత దానికి పంచదశియని పేరు పెట్టవచ్చును. పంచదశి విద్యారణ్యముని కృత గ్రంథమందు రూఢమైనది. అట్లే షోడశియు. ఇది యోగమునందు తీసికొన వలయును. ఈ గ్రంథము నందు పదునారధ్యాయములుకలవో? చివరనున్న ''యాసృష్టిః స్రష్టురాద్యా'' యన్నది తీసివేసినచో పదునారు భాగములు కావచ్చును. కాని ఆ శ్లోకములో గూడ శ్రీ విద్యా ప్రస్తావనయే యున్నది.

ఈ గ్రంథములో ప్రధానముగా వాల్మీకి రామాయణము తదనుబంధిగా వ్యాసభారతము; రామాయణమధికముగా భారతమల్పముగా పరామర్శింపబడినవి.

తొలుత ''యాసృష్టిః స్రష్టురాద్యా'' యన్న ఈ గ్రంథములోని చివరి యధ్యాయమును గూర్చి చెప్పి తరువాత గ్రంథమునకు వత్తును. ఆ శ్లోక వ్యాఖ్యానము నమ్మవారి పరముగా శర్మగారు వ్యాఖ్యానము చేసిరి. వ్యాఖ్యానము చాల బాగుగా నున్నది. ''శివ'' అన్న శబ్దము పుంలింగము. అయినను విశేషణ విశేష్యములకు తత్రతత్ర భిన్న లింగత్వము యొక్క కలిమిని వీరు తగినట్టుగా నిరూపించిరి. దీనిని ''నిగమాగమ'' సంప్రదాయమని చెప్పుచున్నారు. న్యాయముగనే యున్నది. శివశక్తుల కభేద ప్రతిపత్తి గనుక మరియు శివుడు శక్తియొక్క ప్రతిబింబము గనుక శివశక్తులిద్దరు నన్యోన్య ప్రతిబింబములు.

ఇంక బ్రధాన గ్రంథములో బహువిషయములున్నవి. ఒకటికాదు. ఏది ఎట్లున్నను శ్రీ శర్మగారు చేసిన పరిశోధనగాని వారి మేధా విశేషము గాని ఆశ్చర్య జనకములుగానున్న వనుటకు సందేహము లేదు. ఆశ్చర్యములలో నాశ్చర్య మేమనగా భారతము రామాయణమునకు ప్రతిబింబమని చేసిన ప్రతిపాదన. సంపూర్ణముగా ప్రతిబింబము కాకపోయినను శ్రీ శర్మగారు చూపించిన స్థలములలోని ప్రతి బింబత్వమునా కాహా పుట్టించినవి. శ్లోకములు శ్లోకములు చరణములు చరణములు వానియంతట వానినే భగవంతుడైన వ్యాసుడు వాడుకొనెను. లౌకికమైన సంస్కృతభాష యంతయు వాల్మీకి చేసి పెట్టినదే ! అందుకనియే కల్పవృక్షములో ''ఈ సంసారమిదెన్ని జన్మలకు నేనీ మౌనివాల్మీకి భాషాసంక్రాంత ఋణమ్ము దీర్పగలదా?'' అని వ్రాయబడినది. వాల్మీకిని యథేచ్ఛముగా వాడుకొన్న వారిలో మొదటి వాడు వ్యాసుడు. అంతకంటే విశేషమేమియు లేదు. ఇంక తరువాతి వారి మాట చెప్పుట యెందులకు? ఈ భాగము చదువుచుండగా నెవరైన నాశ్చర్యపోదురు. వారు కూడ రెండు గ్రంథములను దగ్గర పెట్టుకొని శ్రీ శర్మగారివలె పోల్చి చూచినవారైనచో వారి బుద్ధివిశేషము మెచ్చుకొనవలసినదే.

ఇంక తరువాత రెండు విషయములకు నీ గ్రంథము నందు గొప్ప ప్రాధాన్యము గలదు. ఈ గ్రంథము యొక్క వ్రాయవలసిన యవసరము ఆ రెండు విషయములే. తక్కిన వనుసరించి వచ్చిన వనవలెను. ఈ రెండు విషయములలో మొదటిది సుందరకాండకు సుందరకాండయను పేరువచ్చుట. సుందరకాండము నందు కుండలినీ విద్య ప్రతిపాదింపబడినదని చెప్పుట. రెండవది త్రిజటా స్వప్నము. వీనిని గురించి చెప్పుటకు పూర్వము దీనిని గురించిన ఈ రహస్యములు వీరు చూపించి ఋజువు చేసిన యాధిక్యము వీరి కున్నదిగాని తన్మూల విషయము పండితుల యొక్క ప్రవాదములో నుండనే యున్నది. సుందర కాండము నందు గాయత్రీ మంత్రము నిక్షేపింపబడి యున్నదని పండితులైనవారు శ్రీ మద్రామాయణము నందభిమానము కలవారు చెప్పి కొనుట యున్నది. ఇది క్రొత్తగాదు. ఎక్కడ నున్నది? ఎట్లున్నది ? అన్నవియే ప్రశ్నలు. సుందర కాండము పారాయణము చేయువారు దినమున కేడు సర్గలుగా పారాయణము చేయుదురు. గాయత్రీ మంత్రములోని యర్థముగాని యా యక్షరములుగాని యీ యేడింట కొంత కొంతగాని యొక్క టొక్కటిగాని నిక్షేపింపబడిన వేమో పరిశీలించి యట్లున్నచో తెలిపిన వారు నాకు తెలిసినంతవరకింతకు ముందు లేరు. నేనొకప్పుడు సుందర కాండమునందు గాయత్రీ మంత్రాక్షరముల కొరకు వెదకితిని. ఓపికతో గూడిన ఇట్టిపనికి నేను చాలను. ఉన్నవేమో ? నాకు కనిపించలేదు. అట్టివి నాకు కనిపించవు.

శ్రీ శర్మగారు త్రిజటా స్వప్నమును గాయత్రీ మంత్రములోని పాదముల సంఖ్యయు నక్షరముల సంఖ్యయు తీసికొని అది గాయత్రీ మంత్రమునకు నొక విధమైన వ్యాఖ్యయని నిరూపించుట మిక్కిలి యూహాస్ఫోరకముగా నున్నది; వారి శ్రద్ధను నిరూపించు చున్నది. ఇది పారాయణము చేయ నెంచెడి వారికి శ్రీ శర్మగారు చేసిన యుపకార మింతయని చెప్పరాదు.

ఒక గ్రంథకర్త ఒక మహావిషయమును వ్రాయును. సహజముగా నతడెంత గొప్పపనిచేసెనని పరులు ప్రశంసింపవలెనని యతనికుండుట వాడెంత గ్రంథ కర్తయై నను జీవిలక్షణము. ప్రశంసించెడి వారుగూడ నెట్లు ప్రశంసింతురు. పెదవితో ప్రశం సింతురు. నిజముగా వాడెవడనగా త్రిజటా స్వప్నములోని యీ రహస్యమును తెలిసికొని దానిని ప్రధానముగా తన పారాయణములో పెట్టుకొనెడివాడు.

ఇంక మొదటిది. సుందరకాండ విషయము. అమ్మవారు సౌందర్యనిధి. సౌందర్య నిధికాదు, ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల యొక్క యర్ధము దేవియందు పర్యవసించునట్లు సౌందర్యమనగా దేవి - అందుచేత ఈకాండమునకు సుందరకాండమని పేరు వచ్చినదని శ్రీ శర్మగారి ప్రతిపాదన. ఇది యొక వ్యాఖ్యానము. ఇష్టాపత్తి కలుగవలసిన విషయమే. కాని కాదనుటకు వీలులేదు కదా. ఎందుచేత ననగా సుందరకాండ మంతయు కుండలినీయోగమని నిరూపించి నారు గదా.

రామాయణమునందు తక్కినకాండలకు తత్తత్కాండాంతర్గత కథా సూచకములైన నామములుండగా దీనికి సుందరకాండ మన్నపేరు విడిగా నేల పెట్ట వలసి వచ్చెనన్న ప్రశ్న నిచ్చలు వినిపించునదియే. ఈ సందియము పలుమందికి కలదు. నేనొక సారి నేటికి ముప్పది యేండ్ల క్రింద కావచ్చును, కీ.శే. పూజ్యులైన శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారిని ఈ కాండమునకు సుందరకాండమను పేరెందుకు వచ్చినదని అడిగితిని. వారిట్లు సమాధానము చెప్పిరి, సుందరహనుమన్మంత్రమని యొకటున్నది. ఆ మంత్రమును మహర్షి యాకాండమున నిక్షేపించెను. అందుచేత దానికి సుందరకాండమని పేరు వచ్చినది''. అనగా నేను ''మూలమంత్రమేమి? అంగన్యాస కరన్యాసములేమి ? ధ్యాన శ్లోకమేమి ?'' మొదలగునవి యడుగలేదు. అప్పుడడుగుటకు వీలైన సమయముగాదు. ఇద్దరము రైలు రాలేదని ఎదురు చూచుచు నిడుదవోలు ప్లాటుఫారము మీద కూర్చున్న సమయము. నేను పోయి వారినీసంగతి తరువాత యడుగలేదు. మహా మంత్రముల యొక్క నిరూపణము కలిగిన కొన్ని గ్రంథములు కలవు. వానిలో నున్నదేమో ? నే నా గ్రంథములను చూడలేదు. నేను కొన్ని తంత్ర గ్రంథములను చూచితిని. వానిలో నిది కన్పించలేదు.

ఇది యట్లుండగా నెవరో చెప్పిన మాటయొకటి యున్నది. ఈ మాటను మరికొందరు గూడ ననగా నేను వింటిని. హనుమంతులకు హనుమంతుడు, ఆంజనేయుడు, మారుతి మొదలైన నామములు వాడుకగా వచ్చినవి. కాని తల్లియైన యంజనాదేవి తనకొడుకునకు తాను పెట్టుకొనిన పేరేమి ? అర్జునునకు పది పేర్లున్నవి. అర్జునుడో, కృష్ణుడో అయి ఉండవలెను. ద్రౌపది యొక్క అసలు పేరు కృష్ణ. భగవంతుడైన వ్యాసుని అసలు పేరు కృష్ణుడు. అట్లే ఆంజనేయుల వారికి తల్లి పెట్టిన పేరు సుందరుడు. ఇది వాల్మీకి చెప్పెనా ? చెప్పెను. ఇట్లు చెప్పలేదు. మహర్షి తాను చాల పరమగూఢమైన రచన చేయును. శూర్పణఖకు శూర్పణఖ యన్న పేరు బిరుదనామము. ఆమె యొక్క అసలు పేరు బాల. బాలయనగా మూర్ఖురా లని గూడ యర్థము చెప్ప వచ్చును. ''బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణుకై పడి నుండ మాని'' అని పోతన్నగారు. ''పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు'' అని నన్నయ్యగారు. అట్టి సందర్భములో నున్న ఈ బాలా శబ్దము శూర్పణఖయన్న నిజమైన పేరనుటకు నితర ప్రతిపత్తులే సహాయము కావలెను. అట్లే సుందర శబ్దము కూడ. ఇచ్చట నా ప్రతిపత్తులను నేను చూపించనేల వలయును ? అది వేరు విషయము.

ఒక బుద్ధిమంతుడు తన మేధాశక్తి చేత సోపపత్తికముగా మహా విషయమని చెప్పికోదగిన దానిని వ్రాసినచో దానిని ప్రశంసింపవలయును. దానిని జూచియానందింపవలయును గాని వెక్కిరించుట మిక్కిలి తేలిక. వీరు చెప్పిన యుపపత్తులు బాగుగా నున్నవి. సమంజసముగా నున్నవి. అన్నిటి కంటే ప్రధానమైన యుపపత్తి సుందరకాండ మంతయు కుండలినీ యోగమని నిరూపించుటయే ఈ నిరూపణ మాత్ర మాశ్చర్యజనకముగా నున్నది. శ్రీ శర్మ గారు దీని నూరకయే నిరూపించలేదు. గాలిలో దీపము పెట్టి దేవుడా నీ మహిమయనలేదు.

శ్రీ శర్మగారు రామాయణము ఇంద్ర పారమ్యమును బోధించు గ్రంథమని యొక యధ్యాయమును వ్రాసిరి. వారు వ్రాసిన దాని తాత్పర్యము పౌనఃపున్యమున నింద్రుడే సర్వాధి దేవతగా చెప్పబడుటయు అన్ని యుపమానములు నింద్రుని తోడనే చేయబడుటగా నున్నది. ఇట్టి పట్టులందు భగవంతుడైన శ్రీ శంకరాచర్యుల వారు తాత్పర్య నిర్ణయ హేతుకములైన మార్గములను తమ భాష్యము ద్వారా నిరూపించిరి. ఇచట తాత్పర్యసిద్ధియెట్లనగా రామాయణము నందింథ్రబ్దము వంద చోట్ల వచ్చినము. అన్ని ఇంద్ర శబ్దములు స్వర్గాధిపతియైన వాని గురించియే అని చెప్పుటకు వీలులేదు. వేదములందు గూడ ఇంద్రునకు సంబంధించిన కొన్ని ఋక్కులతో కొన్ని మంత్రములలో నచట చెప్పబడినది. స్వర్గాధిపతి కాదని తెలియును. ఇంద్రుడు వేరు విష్ణువు వేరు. విష్ణువు పలుచోట్ల నింథ్రబ్దము చేత చెప్పబడును. ఇంద్రుడు విష్ణు శబ్దముచేత చెప్పబడడు. కాని వాల్మీకి వేదముననుసరించి శ్రీ రామాయణము వ్రాసెననుట న్యాయమే అనిపించును. ఇది యొక పెద్ద గొడవ. ఇది నిరూపించుటకు నాకు శ్రీ శర్మ గారి కున్నంత యోపికలో సగమైన నుండవలయును. నాకు లేనిదే అది.

ఇంకొక విషయము చూచినచో కొన్ని సంగతులు విస్పష్టము కాగలవు. ఈ గ్రంథములో నున్నవి రెండు వందల యరువది పుటలు. అందులో నరువది పుటలు భారతముకంటె రామాయణమే అధునాతనము అన్న సిద్దాంత తిరస్కారము కొరకు వ్రాయబడినవి. తండ్రికి తాత పుట్టెనా ? తాతకు తండ్రి పుట్టునా ? అన్న ప్రశ్న వలెనున్నది. ఇట్టి ప్రశ్నకెవడు సమాధానము చెప్పును? న్యాయస్థానములో నభియో గముపెట్టి ఇట్టి రాజకీయపు కాగితముల కొరకు జిల్లా అధికారి రాజకీయభవనము నందు వంశవృక్షముల కొరకు వెదికెడి వానికి పట్టును. పనిలేని మంగలి పిల్లి తల గొరిగెనన్నట్లు వాదించెడి వారి కొరకు ఇంత శ్రమ యెందులకు ? పాశ్చాత్యుల యొక్క దుర్మేధ నుండి పుట్టిన యనేక సందేహములలో - ఆ సందేహములు వేలు - ఇది యొకటి.

శ్రీ శర్మ గారే ''రామాయణము భారతమున కంటె అధునాతనమను వాదము'' అన్న శీర్షికతో నిందులో నేడు పుటలతో ప్రారంభించిరి. ఆ ప్రారంభమునందొక పుటయంతయు పాశ్చాత్యులు మన గ్రంథముల నెట్లర్థము చేసి కొనలేరో వ్రాయబడినది. బ్రహ్మల సంఖ్యయే చాల యున్నది. వ్యాసుల సంఖ్య వారిపేర్లతో సహా యిరువదియెని మిది యున్నది. ఒక్కొక్క మహాయుగమున కొక్కొక్క వ్యాసుడు. మన సంప్రదాయము ప్రకారము మనకు నేడు లభించుచున్న వాల్మీకి రామాయణము ఈ మహాయుగములో వ్రాయబడినది కాదు. వెనుకటి మహా యుగములో త్రేతాంతమున వ్రాయబడినది. నేటికి (1-10-67) నలుబది యేండ్ల క్రింద నీ ప్రసక్తి బందరులో నొక జ్యోతిష్కుని వద్ద వచ్చినది. ఆయన ఈ రామాయణము పూర్వ మహాయుగ త్రేతాంతమునందే వ్రాయబడినదని చెప్పి యొక విషయమును చెప్పినాడు. తక్కిన శాస్త్ర గ్రంథము లెట్లున్నను భారతరామాయణముల కాలనిర్ణయము మాత్రము నేటి సాహిత్య విమర్శ సూత్రములైన లోపలి వెలిసాక్ష్యములతో పొసగెడివి కావు. వెలి సాక్ష్యము మన సంప్రదాయము; దీనిని నీవు నిరాకరింతువు. లోపలి సాక్ష్యము కావ్యములలో చెప్పబడిన విషయము. ఈ సాక్ష్యము పాశ్చాత్యమతులు చేసెడి పద్ధతి వేఱు. మన వాళ్ళు చేసెడిది వేఱు. అనగా పాశ్చాత్యమతులు శబ్దములు వాని ప్రయోగము పౌర్వాపర్యము మొదలైన వానిమీద నాధారపడుదురు. మన పండితులట్లు కాదు. ఆ కావ్యము నందు చెప్పబడిన ఖగోళ విషయములు మింటగ్రహముల సంచారము వలన రాత్రి యందు గలుగు గ్రహణములు భూకంపములు తుఫానులు మొదలైన వానిని లెక్కకట్టి చెప్పుదురు. సంవత్సరమునకు కొన్ని గ్రహణములు వచ్చును. ఈ గ్రహణము చంద్రగ్రహణమైనచో పూర్ణిమనాడు. సూర్య గ్రహణము పెఱతిథులందు కూడా వచ్చును. ఆనాడు గ్రహణము వచ్చునని మన జ్యోతిష్కులు లెక్కకట్టు చున్నారు గదా ! ఇది పాశ్చాత్యులకు నిన్న మొన్నటి వరకు అవిదితమైన విషయము కదా ! లెక్క ముందునకు కట్టవచ్చు వెనుకకు కట్టవచ్చు. రామాయణ భారతములందు తిథులతో సహా తుఫానులు చిన్న చిన్న ప్రళయములు ఉత్తర దక్షిణాయణ సంక్ర మణముల కాలములు గ్రహములసంయోగము గ్రహణములు నిరూపింపబడి యున్నవి. వాల్మీకి రామాయణమున యుద్ధ కాండములో రామరావణులు యుద్ధము చేయు చున్నప్పుడొకప్పుడు రావణుని చేయి పై చేయియయ్యెను. అప్పుడు రాముడమ్ముల పొదిలో నుండి బాణమును తీసికొనలేక పోయెను. అప్పుడు వాల్మీకుల వారు గ్రహముల స్థితిని చెప్పినారు. ఆ స్థితి కోసల దేశముల కరిష్ఠదాయకములని యన్నారు. ఆ గ్రహములట్లుండుట కోసలదేశమునకే ఎందు కరిష్ఠదాయకమో దేశ కాల గ్రహముల యొక్క సార్వత్రికమైన విజ్ఞానము కలవారు చేయవలెను. అట్లు చేసిన వారున్నారు. వారు దురదృష్టవశాత్తు ప్రమాణము కారు. వారు డాక్టరులు కారు. కనీసము ఐ.ఐ.ఉ.్పు. అయినా తప్పలేదు.

ఆ జ్యోతిష్కుడు తానట్టి లెక్కలు కట్టినవాడు. రామాయణములో చెప్పబడిన లంకలో సంఘటిల్లిన యొక ఝంఝూమారుతము కలుగవలయుననగా ఇన్ని లక్షల సంవత్సరములకు పూర్వమే యది జరుగవలయునని లెక్కకట్టి చూపించి నారు. శ్రీ శర్మ గారు ''రామాయణమున ఇంద్రపారమ్యము'' అన్న యధ్యాయము చివర ''బ్రహ్మాపి నరం న రంజయతి'' అన్నారు. అచ్చట నట్లు వ్రాయుట వారు చేసిన పరిశోధనము నందలివారి విశ్వాసము. కాని యీ 'జ్యోతిర్గణితము నమ్మని వారిని గురించి మాత్రము ఈ మాట నిస్సంశయముగా చెప్పవచ్చును.

మొత్తము మీద నొక్కటిని నిస్సంశయముగా చెప్పవచ్చును. వీరి పాండిత్యము చాల లోతుగలది. వీరి శ్రీ విద్యా రహస్య వేతృత సర్వం కష్టమని చెప్పుట కభ్యంతరముండకూడదు. భారత రామాయణములను కలిపి వీరు చదివినట్లు చదివిన సంఖ్య లేదనియే చెప్పవలెను. మహామేధావులైన వారితో నిండియుండిన యీ ప్రపంచములో లేరనుటకు వీలులేదు గాని యున్నచో భారతదేశమున నొకరిద్ద రుందురేమో!

శ్రీ శర్మగారు గొప్ప గ్రంథమును వ్రాసిరి. మొదటి భాగ మధికారులకు గూడ నుపయోగించునది. చివరి భాగము మందాధికారుల కుపయోగించునది.

శ్రీ శర్మగారికి నాకు నేడెనిమిదేండ్ల నుండి చెలిమి గలదు. వారింత లోతైన మనిషియని నేననుకొనలేదు. అప్పుడప్పుడు నైషధము నుండి కొన్ని శ్లోకములు దేవీ పరముగా వారు సమన్వయించినప్పుడు నేను వారి కవి యాదృచ్ఛికముగా తోచిన విషయములను కొన్నాను గాని శ్రీ విద్యా విషయము నింతలోతుగా తెలిసిన వారనుకొనలేదు. వారీ గ్రంథము వ్రాసినందుకు తెలుగువారే కాదు, భారతీయు లందరును కృతజ్ఞులుగా నుండవలసిన విషయము.

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం