కాశీ ప్రయాణ కథలు - చతురాశ్రమ ధర్మాలు - సమాశ్రయాలు.
పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.
రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.
"సోదరి శ్రీలక్ష్శి ఈరోజు మాకు చతురాశ్రమాలుగురించి చెప్పు "అన్నది సరస్వతి.
"సోదరి అలాగే నాకకు సమాశ్రాయాలు గురించికూడా తెలియజేయి" అన్నది పార్వతి.
అలాగే వివరిస్తాను వినండి...
చతురాశ్రమ ధర్మాలు - సమాశ్రయాణం.
హిందూ సంస్కృతిని అనుసరించి మానవుడు నాలుగు ఆశ్రమ ధర్మాలలో ఏదో ఒకదానిని స్వీకరించి జీవన్ముక్తిని పొందవచ్చు. అవి:
- బ్రహ్మచర్యము
- గృహస్థము
- వానప్రస్థము
- సన్యాసము
ఈ ఆశ్రమములను చతుర్వర్ణాలలో మానసిక సంస్కారమును బట్టి అందరూ ఆచరించవచును.
- బ్రహ్మచారికి వేదాధ్యయనము, గురు శుశ్రూష, ఇంద్రియ నిగ్రహము, పెద్దలయందు గౌరవము ప్రధాన ధర్మములు.
- గృహస్థునకు ఏకపత్నీవ్రతము, తల్లిదండ్రుల సేవ, అతిథి సత్కారము, ధర్మ సంతానము, ఆచార నిర్వహణము, ఆనాథులయందు ఆదరణ, బీదలకు సహకారము ప్రధానములు.
- వానప్రస్థుడు ధర్మ వ్యవహారబద్ధుడై వయోభారాన్ని దృష్టిలో ఉంచుకొని, కర్మలయందు స్వార్ధమును వీడి సంతానమునకు వ్యవహార మప్పగించి ధర్మపత్నితో కందమూలాదుల నాహారించి తపమాచరించడం ధర్మము.
- వైర్యాగ్యము కలిగి ధర్మపత్నిని సంతానమున కప్పగించి కామక్రోధాదులను జయించి నిర్లిప్తుడై శేష జీవితమును లోకొద్ధరణకై ధర్మ ప్రబోధనైక లక్ష్యముతో ఆత్మ సాక్షాత్కారంతో సన్యసించుట సన్యాసాశ్రమము.
బ్రహ్మచర్యం,గార్హస్ధ్యం,వానప్రస్ధం,సన్యాసం అనేవి ఆశ్రమధర్మలు.
బ్రహ్మచర్యం:బ్రహ్మచర్యాన్ని 'సావిత్రం'అంటారు.ఎందుకంటే గాయత్రీ మంత్రోపదేశాన్ని పొంది దాన్ని జపిస్తారు కాబట్టి.ఉపనయం అయిన తరువాత బ్రహ్మచారి మొదటి మూడురోజులు గాయత్రీ మంత్రాన్ని జపించడాన్ని 'ప్రజాపత్యం'అంటారు.తరువాత వేదంలో చెప్పబడిన వాటిని ఆచరించడాన్ని'బ్రహ్మమని'వేదాన్నిసంపూర్ణంగా అధ్యాయనంచేసి అనుష్టానం చేయడాన్ని'నైష్ఠికమని'అంటారు.
గృహస్ధాశ్రమం:గృహస్తులు నాలుగు రకాలుగా విభజింపబడ్డారు.పొలం పండించుకు తినేవారిని'వార్త'అంటారు.యజ్ఞ సామాగ్రిని సమకూర్చు కోవడాన్ని'సంచయం'అంటారు.గృహస్తుడు ఇతరులను యాచించకుండా జీవించడాన్ని'శాలీనం'అంటారు.పొలంలో రాలిన గింజలు ఏరుకు తిని జీవించేవారిని'శిలోంఛం'అంటారు.
వానప్రస్తం:కందమూలాలు తిని జీవించేవారిని.'వైఖానసులు'అంటారు. కొత్తపంటచేతికి అందగానే ఇంటఉన్న పాత ధాన్యాన్ని దానంచేసేవారిని 'వాఖల్యులు'అంటారు.రోజుకు ఒక దిక్కున యాచనద్వారా జీవించేవారిని ' ఔదుంబరులు'అని,పండ్లను,ఆకులను భుజించి జీవనం చేసేవారిని 'ఫేనవులు'అంటారు.
సన్యాసులు:సొంతకుటీరంలో తగు కర్మలు ఆచరించేవారిని' కుటీచకులు' అని.కుటీరం లేకుండా కర్మలు నిర్వహించకుండా సంచరించేవారిని ' బహుదకులు' అని,కేవలంజ్ఞానం మాత్రమే కలిగి సంచరించేవారిని 'హంసలని' జ్ఞానంకూడా పొందకుండా,పరబ్రహ్మ తత్వంలో లీనమయ్యేవారిని 'పరమహంసలు ' అంటారు.
సమాశ్రయణం.
సమాశ్రయణం అంటే వైష్ణవ దీక్ష అని అంటారు. దీన్నే పంచ సంస్కారం అని కూడా అంటారు. ఒక అరటి పండును తీసుకుంటే, తినే ముందు దాని తొక్క తీసివేసి తినే యోగ్యమైన సంస్కారం దానికి ఏర్పరిచి అప్పుడు తింటాం. ఏ పక్రియ ద్వారా అయితే ఒక వస్తువుకు దాని లక్ష్యాన్ని చేరే స్థితి ఏర్పడుతుందో దాన్నే సంస్కారం అని అంటారు.అయితే మనిషికి జరగాల్సినవి 5 రకాల సంస్కారాలు ఉంటాయి అని పాంచరాత్ర ఆగమాలు తెలుపుతున్నాయి. అవి మనం ధరించే బొట్టుని పుండ్ర సంస్కారమని, రెండు బుజములకు భగవంతుడి గుర్తులుగా చెప్పబడే శంఖ-చక్రాదులను ధరించడాన్ని తాపసంస్కారమని, మనకు లభించే కొత్త పేరుని నామ సంస్కారమని, గురువు ద్వారా మూడు మంత్రములు అందును దాన్ని మంత్ర సంస్కారమని, జీవనాన్ని క్రమబద్దం చేసుకోవడాన్ని యాగ సంస్కారమని ఇలా ఈ ఐదింటిని కలిపి పంచ సంస్కారాలు అని అంటారు.
1. పుండ్ర సంస్కారం
ఆగమ పద్దతుల ద్వారా జ్ఞానానికి గుర్తుగా బొట్టును సరియైన విధంగా ధరిస్తాం. మామూలుగా లోకంలో కొన్ని రంగులు కొన్ని విషయాలని సూచిస్తాయి. ఎరుపు ప్రేమని, పసుపు మంగళాన్ని, తెలుపు ప్రశాంతతని సూచిస్తాయి. మనిషి తన లోని ప్రపంచం నుండి జ్ఞానం ద్వారా బయటి ప్రపంచాన్ని చూస్తాడు. కన్ను జ్ఞానానికి గుర్తు, ఆ రెండు కన్నుల మద్య స్థానాన్ని జ్ఞాన కేంద్రం అని అంటారు. మొదట ఆధారంగా ఒక గీత దానిపై అర్ధ వృత్తాఆకారంలో తెల్లగా ఉన్న గుర్తును ధరిస్తాం ప్రశాంతతకు సూచకంగా. దానిపై ప్రేమకు చిహ్నంగా లేత ఎరుపు రంగు లో ఉన్న చిహ్నాన్ని ధరిస్తాం. ఆ ప్రేమ మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకు పోవాలి అందుకు అది పైకి చూపుతున్నట్టుగా ఉండాలి. తెలుపు సత్వానికి కూడా సూచకం. బ్రహ్మ రజో గుణ సంపన్నుడు, శివుడు తమో గుణ సంపన్నుడు, విష్ణువు సత్వ గుణ సంపన్నుడు. మనం సత్వానే కోరుకుంటాం. అందుకు సంభందించిన విష్ణువునే ఆరాదిస్తాం. విష్ణు సంభందిత రూపాలనే స్వీకరిస్తాం. అందుకు మనల్ని వైష్ణవులుగా భావించుకుంటాం. మిగతా వారిని ద్వేశించం. అన్నింటిలోనూ విష్ణు రూపాన్నే చూస్తాం. విష్ణువుని శిరసాధరిస్తాం. అర్ధవృత్త ఆకార గుర్తు ఆయన పాదాలకు చిహ్నం. సత్వాన్ని పెంచుకొనే ప్రక్రియలో భాగం ఇది. ప్రేమతో మంచి మార్గాన్ని చూపేది తల్లి, ఆ తల్లి రూపంలో భగవంతుడి లోంచి ప్రేమను, దయను పైకి వెలువరించేది శ్రీ కాబట్టి, ఆ శ్రీ ద్వారా మనం భగవంతుడిని చేరుతాం. అందుకు గుర్తు లేత ఎరుపు రంగు లో ఉన్న చిహ్నం. ఆ ప్రేమ మంగళ కరంగా ఉండాలి కనుక పసుపు కల్గి ఉంటుంది, దాన్నే 'శ్రీ చూర్ణం' అంటారు.
2 తాప సంస్కారం
ఎన్నో జన్మలుగా మనం కర్మలు చేస్తూ వస్తున్నాం, అందువల్ల మనను అంటిపెట్టుకొని ఉన్న పాపాలను తొలగించుకోవాడానికి, ఉపనిషత్తులలో చెప్పినట్లుగా భగవంతుడి గుర్తులుగా చెప్పబడిన శంఖ-చక్రాలని మన భుజమున అద్దిన నిప్పులో వేసిన దూది ఎట్లా బస్మం అవుతుందో అట్లా బస్మం అవుతాయి. దీన్నే తాప సంస్కారం అని అంటారు.
3 నామ సంస్కారం
ఇక నుండి ఎట్లాంటి తప్పులని చెయ్యక, చేసే ప్రతి పని ఇది నేను చేస్తున్నాను, నేను తింటున్నాను అని భావించక ఇది భగవంతుడి కోసం అని చేస్తాం. ఆ భావన కోసం మంత్రాలను అనుసంధానం చేస్తాం. ఆ భావన తో అన్ని పనులు చేస్తాం. అందుకే యముడు తన దూతలని వైష్ణవుల జోలికి వెల్లవద్దని తన దూతలకు చెప్పాడు, ఇది మహాభారతంలో అజామయుడి సన్నివేశంలో ఉంది. మరి వైష్ణవులకు గుర్తు ఎమిటి అన్న ప్రశ్నలకు యముడు 3 పై పైకి కనిపించే గుర్తులు, 3 లోన కనిపించే గుర్తులు చెప్పాడు. అవి వైష్ణవులు ధరించే బొట్టు, భుజాన శంఖ చక్రముల ముద్ర మరియు మెడలో తులసి మాల. లోన మరో మూడు గుర్తులు. అవి కష్టం కలిగినా, సుఖం కలిగినా భగవంతుడిని మరచి పోనివారు, ఎవ్వరిని ద్వేశించనివారు, ఎవ్వరికి కష్టం లేక సుఖం కల్గినా తమకే కలిగిందని భావించువారిని వైష్ణవులుగా గుర్తించవచ్చునని. అన్నో జన్మలు తీసుకున్నాం ఇంతవరకు, కానీ భగవంతుడు అనే జ్ఞానం ఇప్పుడు కలిగింది, దీన్నే జ్ఞాన జన్మ అంటారు. ఇక ఈ జ్ఞానం కలిగాక మల్లీ పుట్టాల్సిన పని ఉండదు. మనకు ఈ వైష్ణవ జన్మ అందించిన ఆచార్యుడి నామాన్ని మనం మన నామంగా స్వీకరిస్తాం. వేదాల్లోని రహస్యాలని అంతకుముందు ఎవ్వరు సాహసించి బయటికి చెప్పలేదు. శరణూ అంటూ వచ్చిన వాడిని ఎవ్వరినైనా రక్షిస్తానని భగవంతుడు చెప్పిన మాటలే కదా. రామానుజాచార్యులు రుచి ఉంటేచాలు వారికి వైష్ణవాన్ని అందించండి అంటూ 74 మంది తన శిష్యుల ద్వారా లోకాన్ని తరింపజేసారు. వారి ఉపకార కృతజ్ఞతగా వారి నామాన్ని మనం శిరసా ధరిస్తాం. అందుకే రామానుజ దాస లేక రామానుజ దాసి అని మన పేరు చివరన దరిస్తాం.
4 మంత్ర సంస్కారం
ఈ జ్ఞాన జన్మకి గురువు తండ్రి అయితే, మత్రం తల్లి. పరంపరగా వచ్చే గురువులనే మనం స్వీకరిస్తాం. వారి ద్వారానే మనం మంత్రాన్ని పొందుతాం. ఆ మంత్రార్థాలతో మనం జీవనం కొనసాగిస్తాం.
5 యాగ సంస్కారం
ఎప్పుడైతే మనం ఈ శరీరం భగవంతుడు ఉండే స్థలమని భావిస్తున్నామో, ఆ శరీరంతో చేసే ప్రతి పని యాగం అవుతుంది. దీన్నే పూజ అని కూడా అంటారు. పూజ అంటే కేవలం భగవంతుడి ముందర కూర్చొని చేసేది కాదు అని గుర్తించాలి. అలా చేయడానికి మనం శరీరానికి ఏది తగునో
దాన్నే ఆహారంగా ఇస్తాం. సాత్విక ఆహారాన్నే స్వీకరిస్తాం.
'సం' అంటే ఒక గురువు ద్వారా లేక మంచిగా అని అర్థం, 'ఆశ్రయణం' అంటే అశ్రయించడం అని అర్థం. మంచి మార్గాన అడుగు పెట్టడాన్నే సమాశ్రయణం అని అంటారు" అన్నది శ్రీలక్ష్మి.
విషయం తెలుసుకున్న అందరూ నిద్రకు ఉపక్రమించారు.

