సూర్యం తనను పెంచి పోషించిన మామయ్య కూతురు కాంతాన్ని పెళ్లి చేసుకుని హైదరాబాద్ భాగ్యనగర్ కాలనీలో ఒక అపార్ట్‌మెంట్లో అద్దెకు దిగాడు. అక్కడ నాలుగు అంతస్తుల్లో ఇరవై ఇళ్లు ఉన్నాయి. సూర్యం, కాంతంతో కలసి అందరి ఇళ్లకు వెళ్లి పరిచయం చేసుకుని, ఊరు నుంచి తెచ్చిన పూతరేకులూ, జంతికలు ఇచ్చాడు.
ఎప్పుడూ ఎవరి ఇళ్ళలో వారు తలుపులు వేసుకునే ఆ అపార్ట్‌మెంట్‌లో కాంతం అందరితో బాగా కలసిపోయి ఇళ్ల తలుపులు ఎప్పుడూ తెరచి ఉంచేలా చేసింది. శుక్రవారం వస్తే చాలు ఆడవాళ్లందరినీ ఒక చోట కలిపి లలితా సహస్రనామ పఠనం చేయించేది.
కుట్లు, అల్లికలూ కాంతానికి బాగా వచ్చు, ఆకారణంగా ఆడవాళ్లంతా కాంతం ఇంట్లో తిష్ట వేసి నేర్చుకునేవారు. ఆ సందులో కాయగూరలు అమ్మే బండ్ల వాళ్ళు వస్తే అందరితో పాటు కాంతం కూడా దిగేది. వారు తూచే త్రాసులో మోసం ఉందని గమనించి “ఇది కిలో ఉండదు.. మూడు పావులు ఉంటుంది” అని గద్దించేది. తాను కూడా తెచ్చిన త్రాసుతో తూచేది అవి సరిగ్గా మూడు పావులు ఉండేవి. “నీవు అడిగినంత డబ్బు ఇచ్చి కొంటున్నాము కదా ఇలా చేయడం బాగులేదు” అనేది అమ్మే వారితో.
“కాంతం నువ్వు కొత్తగా వచ్చినా కూరగాయలు తూస్తున్న వారి మోసం ఇట్టే కనిపెట్టావు సుమీ..” అని అనే వారు ఆడవాళ్లంతా
. కూరగాయలు అమ్మేవారు ఆ వీదిలోకి రావడం మానేశారు. ఉదయం పూట పాల డబ్బాలతో పాలు పోసే వారి వద్ద పాలు ఒక చుక్క పాలు చేతి మీద వేసుకుని మీరు సగానికి సగం నీళ్ళు కలుపుతున్నారు, అని వాదనకు దిగేది.
“ఎలా చెబుతావమ్మా.. మేము నీళ్లు అంతలా కలిపాము” అని వారంటే “మాకూ పాడి ఉంది చిక్కటి పాలు పిండి ఒక్క చుక్క కూడా నీళ్లు కలపకుండా అమ్మిన చేతులు ఇవి” అనేది. దాంతో విడిగా క్యాన్‌లలో పాలు తెచ్చే వారి వద్ద పాలు పోయించుకోకుండా, ప్యాకెట్ పాలు తెప్పించుకునేవారు ఫ్లాట్‌లలోని వారు.
అపార్ట్మెంట్ ముందుకు వచ్చి పాత దినపత్రికలు, పుస్తకాలు అవి కొనే వాళ్లు మూడు కేజీల కాగితాలను కేజీకి తూచడం గుర్తించి వాళ్ళను కూడా వారి వీధికి రాకుండా చేసింది కాంతం
“అమ్మాయీ.. కాంతం ఇన్నాళ్లు మేము చాలా విషయాల్లో మోసపోయాము... పట్నంలో ఉన్నా గమనించ లేక పోయాము... పల్లెటూరు నుండి వచ్చిన నువ్వు ఎంతో గొప్పదానివి.. మా కళ్లు తెరిపించావు” అన్నారు పెద్దా,చిన్నా ఆడవాళ్లు. “అయ్యో నన్ను ఆకాశానికి ఎత్తకండి.. నాకు తెలిసింది చేశాను” అంది కాంతం. అపార్ట్మెంట్‌లోని మగవాళ్లు “ఏమోయ్ సూర్యం...మీ ఆవిడ పేరు, మా ఆడవాళ్లు ప్రతి రోజూ జపం చేయడం భలేగా ఉంది” అనడంతో భార్య చేసిన ఘనకార్యాలకు తబ్బిబ్బయ్యే వాడు సూర్యం.
నీవు కొత్త అపార్ట్మెంట్ కొనుక్కున్నా, మా అపార్ట్మెంట్లోనే ఉండాలి సుమా! అనే స్థాయికి వచ్చింది కాంతం.
***

