బయట హోరున వర్షం కురుస్తోంది. ఆకాశం ముసురుపట్టి మూడురోజులవుతోంది. ఇంటి ముందు వాకిలి నీటితో నిండిపోయింది. గోదావరమ్మ గుమ్మం దగ్గర నిలబడి వీధివైపు చూస్తోంది. "ఒక్క రోజులో వస్తానమ్మా" అని వెళ్లిన తన కూతురు పద్మ మూడు రోజులైనా తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే కట్ చేస్తోంది. ఎక్కడికి వెళ్లింది? ఏమైంది? ఎంటా అర్జెంటు పని? కనీసం విషయం చెప్పి వెళ్లొచ్చు కదా! అని పరిపరివిధాల ఆలోచిస్తున్న కొద్దీ మనసు కీడు శంకిస్తోంది. వాన చినుకులు పైకప్పును తడుముతూ ఒక వింత శబ్దంతో తన ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఏడాది వయసున్న మనవరాలిని ఆడిస్తున్నా ఆలోచన నిలకడగా లేదు. అల్లుడు కిరణ్ రేపు క్యాంపు నుంచి వస్తాడు. అతను వచ్చాక పద్మ కనిపించకపోతే ఏమంటాడో అన్న భయం మరోవైపు తన ఆందోళనను రెట్టింపు చేస్తోంది. కిరణ్ ఒక చిట్‌ఫండ్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగి. తరచూ క్యాంపులకు వెళ్తుంటాడు. అనుమానపు మనిషి. అభిజాత్యం, కోపం పైగా చేయి చాలా తేలిగ్గా పెరుగుతుంది. బయటి చికాకులను కూడా ఇంటికొచ్చాక బెల్టు తో పద్మ వీపుపై తీర్చుకుంటాడు. అందుకే అతడు ఊర్లో లేనప్పుడు మాత్రమే గోదావరమ్మ కూతురి వద్ద ఉంటుంది. అతడు రాగానే తిరిగి తన ఊరికి వెళ్తుంది. గత రెండేళ్లుగా ఇదే జరుగుతోంది — కానీ ఈసారి పద్మ వెళ్లిన తీరు ఆమెకు అర్థం కాలేదు. ఒక ఫోన్ వచ్చింది. ఆ తర్వాత పద్మ తన కూతురిని కూడా వదిలేసి, "అర్జెంటు పని" అని మాత్రమే చెప్పి వెళ్లిపోయింది. --- గోదావరమ్మకు చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. పద్మ ఒక్కతే కూతురు. అన్న రామరాజు అండతోనే జీవితం నెట్టుకొచ్చింది. రామరాజు ఊరికి పెద్ద. మోతుబరి రైతు. ఆయన మాటంటే ఊరందరికీ శిరోధార్యం. మనసు మంచిదైనా కోపానికి బానిస. తన చెల్లికి మగదిక్కు లేడని ఎప్పుడూ అండగా నిలిచాడు. పద్మకు పెద్దగా చదువు అబ్బకపోవడంతో తనే సంబంధం చూసి కిరణ్‌తో పెళ్లి చేశాడు. ఇప్పుడు పద్మ రాజమండ్రిలో కాపురం చేస్తోంది. --- ఆలోచనల మధ్యలో కాలింగ్ బెల్ మోగడంతో గోదావరమ్మ పరుగెత్తుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా పద్మ. ఆమె పక్కనే రెండేళ్ల వయసున్న ఒక చిన్న బాబు. కూతురిని చూసిన ఆనందం క్షణంలోనే అయోమయంగా మారింది. "ఎవరే వాడు?" అని గట్టిగా అడిగింది. "కొద్దిసేపు ఆగమ్మా..." అంది పద్మ. లోపలికి వెళ్లి పిల్లలిద్దరికీ అన్నం పెట్టి నిద్రపుచ్చింది. తర్వాత వచ్చి తల్లి ఎదురుగా కూర్చుంది. గోదావరమ్మ ఆందోళన అసహనంగా మారింది. "నిన్నే అడుగుతున్నా — ఎవడా పిల్లాడు?" అని నిలదీసింది. పద్మ తలొంచుకొని లో గొంతుకతో, ఉబికివస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ గద్గద స్వరంతో అంది — "నా పాపానికి ప్రాయశ్చిత్తం." గోదావరమ్మ ఉలిక్కిపడింది. "ఏమిటది?" "నేను చేసిన తప్పుకు దిద్దుబాటు" స్థిరంగా పలికింది పద్మ. "అంటే..??." బ్రుకుటిముడివేసి కూతురిని తీక్షణంగా చూస్తూ అడిగింది. "నేను చేసిన అతి పెద్ద తప్పుకు ప్రాయశ్చిత్తం!" ప్రశాంతంగా బదులిచ్చింది పద్మ. "అసలు నువ్వేమి మాట్లాడుతున్నావు పద్మా?" ఈసారి భయంతో ఏడుస్తూ అడిగింది గోదావరమ్మ. పద్మ నెమ్మదిగా తలెత్తిచూసింది తల్లిని. పద్మ భావము అర్థం కాక పద్మ భుజం పట్టుకొని "ఏంటి పద్మ ఏమంటున్నావు? విషయమేమీ చెప్పకుండా ఒక రోజులో వస్తానని చెప్పి, చంటి బిడ్డను కూడ వదిలి ఉన్నపాటుగా ఎక్కడికి పోయావు?. మొన్న పొద్దున్న పోయిందానివి ఇప్పుడు వచ్చావు అదీ ఒక చిన్న బిడ్డతో!!! ఎవరి బిడ్డ అంటే నా ప్రాయశ్చిత్తము అంటావు. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏమిటే" ఏడుస్తూ అనునయంగా పద్మ తలనునిమూరుతూ అడిగింది. "ప్రాయశ్చిత్తం అంటే నేను చేసిన తప్పుకు దిద్దుబాటు అని అర్థం" నింపాదిగా బదులిచ్చింది పద్మ. " అంటే ఏవిటే! . పెళ్లి కాకుండానే ఎవరితో అయినా!!!" అని దబ్బున నిలబడి పద్మ భుజాలను ఊపుతూ కోపంతో అరిచింది గోదావరమ్మ . "ఎం! అమ్మవమ్మా!!.. కూతురిమీద అంత మాత్రం నమ్మకం లేదా. నీ కంటి ముందు నుంచి ఒక నెల రోజులు కూడా బయటకు పోనిదాన్ని... తొమ్మిదినెలలు నీకు తెలియకుండ దాచగలనా. అయినా! కన్న కూతుర్ని అలా ఎలా అడుగుతావు" చిరాగ్గా చూస్తూ బదులిచ్చింది పద్మ. "అసలు నీవేమి మాట్లాడుతున్నావో నీకైనా అర్థమౌతోందా!! డొంకతిరుగు వద్దు.నాకు సూటిగా సమాధానం చెప్పు" అని ఆయాసపడుతూ గుండమీద చేత్తో రాసుకుంటూ పద్మ పక్కన కూచుంది. "అమ్మా! ఎందుకు అంత గట్టిగా అరుస్తావు పిల్లలు జడుసుకుంటారు. కొంచం మెల్లిగా మాట్లాడమ్మా". "సరే పద్మ — అసలు విషయం ఏమిటో త్వరగా చెప్పు. లేకపోతే గుండెపోటు వచ్చేట్టు ఉంది." పద్మ తల్లిని కూర్చోబెట్టి అసలు విషయం చెప్పటం మొదలుపెట్టింది... --- "అమ్మా! నీకు తెలిసిందే కదా — చిన్నప్పటి నుంచి నాకు బావ అంటే చాలా ఇష్టం. 'బావే నీకు మొగుడు' అని నీవు అనే మాటలు నాకు ఇంకా బలాన్నిచ్చాయి. నేను పెరిగే కొద్దీ ఆ ప్రేమ మరింత పెరిగింది. ఏదో ఒక రోజు బావ నా భర్త అవుతాడని నమ్మాను. కానీ క్రమంగా ఒక నిజం తెలిసింది. బావ నన్ను కాదు... లలితను ప్రేమిస్తున్నాడు." పద్మ గొంతు వణికింది. "తట్టుకోలేకపోయాను అమ్మా. అసూయ నన్ను అంధురాలిని చేసింది. లలిత మీద తెలియని పగ పెంచుకున్నాను. ఒక రోజు వాళ్లు కలిసి ఉన్నప్పుడు కావాలనే మామయ్యకు కనిపించేలా చేశాను. నేను అనుకున్నట్టే జరిగింది — ఇల్లు కురుక్షేత్రం అయ్యింది. ఈ విషయం మామయ్యకు తెలిసేట్టు చేసింది నేనే అని ఎవ్వరికి తెలీదు. అసలే పట్టింపులు ఎక్కువగా ఉన్న మామయ్య తన బలం ఉపయోగించి, నాలానే తండ్రిలేని పేదవాళ్ళైన లలిత వాళ్ళను ఊరు నుంచి పంపించేశాడు. 'లలిత పీడ వదిలింది, ఇక బావ నావాడే' అనుకున్నాను. ఒకసారి నా స్నేహితురాలు పెళ్లికని అనకాపల్లి వచ్చాను. అక్కడ నుంచి స్నేహితులందరం విశాఖ చూద్దామని వెళ్ళాము. అక్కడ అనుకోకుండా బావను, లలితను చూశాను. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారని అర్థమైంది. బావ పై చదువులకు కాదు — లలిత కోసమే విశాఖ వచ్చాడని తెలిసింది. మళ్లీ నాలో అసూయ, పగ, కోపం నిద్ర లేచాయి. వారి ఫోటో తీసి నా ఫ్రెండ్ ఫోను నుంచి మామయ్యకు పంపాను. మామయ్య బావను తిట్టి వాళ్ళను విడదీస్తాడని, ఆ దెబ్బకు పరువు పోయి నాతో పెళ్లి చేస్తాడని అనుకున్నాను. ఎంతసేపూ బావను ఎలా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే కానీ., బావ నన్ను ఇష్టపడటం లేదన్న ఆలోచనే నాకు రాలేదు. కానీ నేను ఊహించని విధంగా మామయ్య ఏకంగా వారిద్దరినీ చంపి పాతెయ్యడానికి విశాఖకు బయలుదేరాడు. భయం వేసి బావకు ఫోన్ చేసి హెచ్చరించాను. కానీ అప్పటికే మామయ్య అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రయత్నంలో బావకు యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో చేరాడు. లలిత తప్పించుకుంది. ఆ రోజు ఆసుపత్రిలో కొనఊపిరితో ఉన్న బావ అందరినీ బయటకు పంపి, నా చేతులు పట్టుకొని 'లలితను కాపాడు. తను నా బిడ్డకు జన్మనివ్వబోతోంది.' అని చెప్పి నా చేతుల్లోనే కన్నుమూశాడు. బావ చనిపోయిన తర్వాత కాని... నేను చేసిన తప్పు అర్థం కాలేదు. నేను హెచ్చరించి మేలు చేశాననుకుని వెళ్లాడు — అసలు మంట పెట్టింది నేనే అని తెలియకుండా. ఆ క్షణం నుంచి ఈ రోజుటి వరకు లలిత గురించి వెతికాను. ఇప్పుడు దొరికింది." ఇంకా ఏదో చెప్పబోతున్నంతలో గోదావరమ్మ పద్మ చెంప చెళ్లుమనిపించింది. "ఓసి పాపి!! తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దావు కదే. పక్కలో పాముందని వారికి తెలియలేదు కదే. వదినకు గర్భశోకం మిగిల్చి తన చావుకు కూడా కారణమయ్యావు కదా. నా కడుపున ఎలా పుట్టావే!!" అని నోటికొచ్చిన తిట్లు తిట్టసాగింది గోదావరమ్మ. తల్లి కొట్టిన చెంపను రుద్దుకుంటూ చిన్నగా నవ్వి, "ఆ రోజే నా తప్పు అర్థమైంది అమ్మా. నా అసూయ మూడు జీవితాలను నాశనం చేసింది. నాటి నుంచి లోలోనే ఏడుస్తూనే ఉన్నాను. ప్రతిరోజూ బావను క్షమాపణలు కోరుతూనే ఉన్నాను" అని అప్పటివరకు పెదవిదాటని బాధ ఒక్కసారిగా గుండెల్లోంచి బయటకు వచ్చి తల్లి భుజంపై తలవాల్చి గట్టిగా ఏడ్చింది పద్మ. కూతుర్ని ఓదార్చే ప్రయత్నమేమీ చేయలేదు గోదావరమ్మ. ఏడ్చి గుండెబరువు కొద్దిగా దించుకున్న పద్మ, తల్లిని చూస్తూ "అమ్మా! నన్ను క్షమించు" అని చేతులు జోడించి అడిగింది. కూతురి బాధను అర్థం చేసుకున్న గోదావరమ్మ — తన తప్పు కూడా ఉందని తెలిసి — బాధతో మూలుగుతూ కొంగుతో పద్మ కళ్ళు తుడుస్తూ, "మరి లలిత!!?" --- "బావ చెప్పగానే లలిత ఇంటికి వెళ్ళాను. తాళం వేసి ఉంది. ఇరుగుపొరుగు అడిగాను — కొత్తదంపతులు ఆ మధ్యే కాపురం పెట్టారుట, ఎవరికీ పెద్దవివరాలు తెలియవుట. అప్పటి నుంచి ఆమె కోసం వెతికాను. బావ ఫోనులో ఉన్న లలిత, తన తల్లి నంబర్లకు ఎన్నోసార్లు కాల్ చేశాను — ఎటువంటి స్పందనా లేదు. పరిచయస్తులందరికీ చెప్పి పెట్టాను. ఇదిగో ఇప్పుడు రెండేళ్ల తరువాత నా అలుపెరుగని ప్రయత్నం ఫలించింది — నా స్నేహితురాలు లలితను విజయవాడ ఆసుపత్రిలో చూశానని కాల్ చేసింది. అందుకే ఆలస్యం చేయలేదు." "మరి లలితేది??!!" గాబరాగా అడిగింది గోదావరమ్మ. పద్మ వెంటనే బదులివ్వలేదు. నేలచూపులు చూస్తూ వెక్కింది. "లలిత చనిపోయిందమ్మా." గోదావరమ్మ "నారాయణ నారాయణ" అంటూ తనూ ఏడ్చేసింది. ఇద్దరిమధ్యా మౌనం. కాసేపటికి తెప్పరిల్లిన గోదావరమ్మ "ఎప్పుడు? ఎలా?" అని దీనంగా అడిగింది. "కామెర్లు సోకి, సరైన వైద్యం అందక నెలరోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండి నిన్న కన్నుమూసింది. ఒక్క వారం ముందుగా వెళ్ళుంటే తను మనకు దక్కేదేమో. నన్ను చూసి కొడుకుని నా చేతుల్లో పెట్టి ప్రశాంతంగా తన భర్తను చేరుకుంది" వెక్కుతూ చెప్పింది పద్మ. "దేవుడా!" గట్టిగా నిట్టూర్చింది గోదావరమ్మ. "లలితకు పద్ధతిగా దహనసంస్కారాలు చేయించాను. లలిత తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాను. బాబుని నాతో తీసుకొచ్చాను." "మరి ఇప్పుడేం చేస్తావు?" "ఈ బాబుని నా కొడుకులా పెంచుతాను" స్థిరంగా బదులిచ్చింది పద్మ. "నీకేమైనా పిచ్చా! అల్లుడి గురించి తెలిసికూడా ఏమిటా పిచ్చి నిర్ణయం. ససేమిరా కుదరదు. బాబుని అనాథాశ్రమంలో చేర్పించి అప్పుడప్పుడు వెళ్ళి చూసుకో" అరిచింది గోదావరమ్మ. "అసాధ్యం" దృఢంగా పలికింది పద్మ. "నీ మొగుడు ఒప్పుకోడు." "ఒప్పుకోకపోతే బయటకు పంపించేస్తాడు. పంపించనివ్వు." అంటూ తన వీపున ఉన్న బెల్టు గాయాలను తల్లికి చూపింది. గోదావరమ్మ మాటలురాక చేష్టలుడిగి మౌనంగా ఉండిపోయింది. కాసేపటికి పద్మ తల్లిని చూస్తూ గట్టిగా ఊపిరి తీసుకొని అంది — "అమ్మా! నేను చేసిన తప్పుకు క్షమాపణ లేదు. కానీ దాన్ని సరిదిద్దే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని వదులుకోను." గోదావరమ్మ కూతురిలో ఒక కొత్త మనిషిని చూసింది. ఆ వీపుమీది గాయాలు, ఆ స్థిరమైన కళ్ళు — అన్నీ చూసి చివరికి ఒక నిర్ణయానికొచ్చి పద్మ భుజంపై చేయి వేసింది. "సరే. ఈ తప్పులో నాకూ భాగం ఉంది. నేనూ నీతోనే ఉంటాను." తల్లి ఇచ్చిన భరోసాతో సంతోషంగా కన్నీళ్లు తుడుచుకుంది పద్మ. --- వారిరువురు ఊహించినట్టుగానే కిరణ్ ఆ బాబును ఇంట్లో ఉంచుకోవడానికి ఒప్పుకోలేదు. పద్మ తన పిల్లలతో సహా ఇంటి నుంచి స్వేచ్ఛా జీవితంలోకి అడుగుపెట్టింది. తల్లి సాయంతో చిన్న ఉద్యోగంలో చేరి తన కూతురితో పాటు లలిత కుమారుడినీ సమానంగా పెంచసాగింది. --- కాలం గడిచింది. రామరాజు వృద్ధాప్యం అతని కోపాన్ని కరిగించింది. గత జ్ఞాపకాలు అతనిని వేధించడంతో మనిషి కృంగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పద్మ ఒక శుభముహూర్తాన లలిత కుమారుడిని వెంట తీసుకుని అతని ఇంటి గడప తొక్కింది. తన మామయ్య ఎదుట నిలబడి అన్నీ చెప్పింది — తన అసూయ, తన స్వార్థం, తన వల్ల జరిగిన విషాదం, తన పశ్చాత్తాపం, తన ప్రాయశ్చిత్తం. అన్నీ చెప్పి చివరగా ఆ బాలుడిని అతని ముందుకు నెట్టింది. "మామయ్యా... ఇతడే మీ కొడుకు వారసుడు. నేను చేసిన పాపానికి క్షమాపణ అడిగే హక్కు కూడా నాకు లేదు. అయినా ఈ బిడ్డను కాపాడి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు ఏ శిక్ష వేసినా సిద్ధమే." పక్కనే అపరాధిలా తలొంచుకొని గోదావరమ్మ. రామరాజు చాలాసేపు మాట్లాడలేదు. ఆ బాలుడి కళ్లలో తన కొడుకును చూశాడు. అతని గుండె కరిగిపోయింది. "తప్పు చేసింది నువ్వు మాత్రమే కాదు పద్మా. నా అహంకారం కూడా ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది." బాలుడిని ఒడిలోకి తీసుకున్నాడు. కాసేపు ఆ చిన్ని మొహాన్ని చూస్తూ ఉండిపోయి — "నువ్వు నీ జీవితాన్ని కాల్చుకుని ప్రాయశ్చిత్తం చేశావు. ఇక చాలు. ఈ ఇంటిని వదిలి ఎక్కడికీ వెళ్లవద్దు. నువ్వూ నా కూతురే." ఆ మాటలు విన్న పద్మ కళ్లలో ఎన్నేళ్లుగా పేరుకున్న బాధ కన్నీటి రూపంలో జారిపోయింది. మౌనంగా ఆకాశం వైపు చూసింది. ఎన్నేళ్లుగా తన గుండెలో మండుతున్న పాపభారం ఆ క్షణంలో కొద్దిగా తేలికైంది. క్షమాపణ కోరే అర్హత తనకు లేకపోయినా — తప్పును సరిదిద్దుకునే అవకాశం మాత్రం భగవంతుడు ఇచ్చాడనే తృప్తి ఆమె కళ్లలో మెరిసింది. ఆ రోజు నుంచి ఆమె జీవితం శిక్ష కాదు — ప్రాయశ్చిత్తం ద్వారా పొందిన విముక్తి.

