కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను పండదా .
పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.
రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.
"సోదరులారా ఈరోజు మీకు నవ్విన నాప చెను పండదా అనే కథ చెపుతాను వినండి " అని కథ చెప్పడం ప్రారంభించాడు...
భువనగిరిని గుణవర్ధనుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు ,ఉతని మంత్రి పేరు సుబుధ్ధి. గుణవర్ధనుడు తన అంతరంగిక సలహదారులను నియమించటాని పోటీ నిర్వహించగా ఎందరో పాల్గొన్నప్పటికి రాజుగారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు.
ఒకరోజు రాజుగారు సభతీరి ఉండగా ఒక యువతి సభలో ప్రవేసించి నమస్కరించి ' ప్రభు నాపేరు కన్యక తమరాజ్యంలోని సిరిపురం గ్రామ నివాసిని నా తల్లి,తండ్రి వ్యవసాయకూలీలు నేను ఉన్నత విద్యలు అభ్యసించాను తమరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలను అనే నమ్మకం ఉంది దయచేసి నాకు అవకాశం కలిగించండి,తమరు ఇచ్చే పదవితోపాటు నామరో కోరిక కూడా తీర్చవలసినదిగా నావిన్నపం ' అన్నది .
ఫక్కున నవ్విన సభికులలో కొందరు "అమ్మాయి గొప్ప గొప్ప పండితులే సమాధానాలు చెప్పలేక వెళ్ళిపోయారు నీవల్లకాదు వెళ్ళు "అన్నారు.
"అయ్య మనిషికి ఆత్మవిశ్వాసం విజయం వైపు నడిపిస్తుంది, భయం పతనానికి మొదటి మెట్టు అవుతుందని తమకు తెలియనిది కాదు నవ్విన నాపచేనుపండదా నలుగురు మెచ్చురోజు ఉండదా ? "అన్నది కన్యక.
"అమ్మయి నీ ఆత్మవిశ్వాసం మెచ్చదగినదే అమొదటి ప్రశ్న వేళ్ళులేకుండా గోర్లు ఎవరికి ఉంటాయి? "అన్నాడు రాజుగారు.
"ఏనుగుకు వేళ్ళు ఉండవు కానీ కాళ్ళకి గోళ్ళు ఉంటాయి "అన్నది కన్యక.
సభలో కరతాళ ధ్వను మారుమొగాయి. " ఆవు ఎలా ఉంటుంది ? " అన్నాడు రాజుగారు .
"ఆవు మెడలోని పలుపు తాడుతో దేనికి కట్టివేసినా స్ధిరంగా ఉంటుంది "అన్నది కన్యక.
"తల్లి,తండ్రులకు భోజనం ఎందుకు పెట్టకూడదు "అన్నాడు రాజుగారు.
"ప్రభు మనం వడ్డించిన ఆహర పదార్ధాలు వారికి రుచించకపోవచ్చు అందుకే అన్ని పదార్ధాలు వారిముందు పెడితే వారికి నచ్చినది తమకు కావలసినంత వడ్డించుకు తింటారు అందుకే తల్లి,తండ్రులకు మనం భోజనం వడ్డించకూడదు " అన్నది కన్యక.
సభలో ఆనంద కేరింతలతో కలకలంసాగింది.
"అప్పు ఇచ్చి అడగకూడదు ఎందుకని " అన్నాడు రాజుగారు.
"ప్రభు దీని అర్ధం అడగకనే అప్పుతీర్చేవారికే ఇవ్వమని దీని అర్ధం " అన్నది కన్యక.
"భళా కన్యకా నవ్విన నాపచేను పండింది, నలుగురు నిన్ను మెచ్చుకునేలా సమాధానాలు చెప్పావు , ఇప్పుడు చెప్పు నీ కోరిక ఏమిటి తప్పక తీరుస్తాను " అన్నాడు రాజుగారు.
"ప్రభు మాసిరిపురమేకాదు పరిసర గ్రామాలన్ని తాగునీటికి చాలా శ్రమ పడుతున్నాయి ,చెరువులు ,బావులు ఎండిపోయాయి మనుషులు,పసువులు నీరులేక చాలా బాధ పడుతున్నారు మాఅందరి దాహర్తిని తీర్చాలని వేడుకుంటుంన్నాను "అన్నది కన్యక.
తక్షణమే వారికి చేరువగా ప్రవహిస్తున్న కృష్ణానది నుండి అక్కడిగామాలను కలుపుతూ వెళ్ళేలా నీటిని మళ్ళించవలసినదిగా రాజు గారు ఆజ్ఞాపించాడు " అన్నాడు.
"కన్యక నిస్వార్ధమైన కోరికను గమనించిన రాజు గారు తక్షణం స్పందించడం హర్షణీయం " అన్నాడు బ్రహ్మయ్య .
అంతా నిద్రకు ఉపక్రమించారు.

