కాశీ ప్రయాణ కథలు - మంత్రజలం.
పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.
రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.
ఈరోజు మీకు మంత్రజలం అనే కథ చెపుతాను అన్న సరస్వతి కథ చెప్పడం ప్రారంభించింది.
మగధ రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు.
ఓకరోజు రాజు అడవి జంతువులను వేటాడుతూ దారి తప్పి అడవి లోనికి చాలాదూరం వెళ్ళాడు. గుర్రాన్ని పచ్చిగడ్డి మేసేలా కట్టివేసి దాహం తీర్చుకోవడానికి నీటికోసం వెదుకుతుండగా,ఒక సాధువు కనిపించాడు. ''స్వామి దాహంగా ఉంది మంచి నీళ్ళు ఈప్రాంతంలో లభిస్తాయా?'' అన్నాడు.రాజు.
"మహారాజా నేను నాతపోశక్తిచే ఆకలి దాహంలేకుండా ఉండేలా వరం పొందాను.ఈ కమండలంలోని నీరు ఓక్కచుక్క తమ నాలికపై వేసుకుంటే జీవితంలో ఎన్నడూ ఆకలి దాహం వేయదు. ఈకమండలం లోని నీరు ఎంత వాడినా తరగదు.ఒక్కసారి ఈ మంత్రజలం తీసుకుంటే ఏప్రాణి అయినా తమ జీవితాంతం ఆకలి దప్పులకు దూరంగా ఉంటుంది.దీన్ని మన రాజ్య ప్రజానీకానికి ఉచితంగా పంపిణీ చేయాలి అనుకుంటున్నాను. అన్నాడు సాధువు.
రాజును వెదుకుతూ వచ్చిన సైనికులు అప్పటికే అక్కడికి చేరారు.భటుడు అందించిన నీళ్ళతో దాహంతీర్చుకున్నరాజు "స్వామి నాతో రండి" అని సాధువును తనతోపాటు రాజ్యానికి తీసుకువెళ్ళాడు.
మంత్రి కాశీ యాత్రకు వెళ్ళినందున రావడానికి మూడు నెలలు సమయం అవుతుంది కనుక రాజుగారే స్వయం నిర్ణయం తీసుకుని తన రాజ్యంలోని బావులు,చెరువులు,తదితర నీటి నిల్వలలో మంత్రజలం భటుల చేత కలిపించాడు.
ఆకలి లేకపోవడంతో ప్రజలు పంటలు పండించడం మానివేసారు.అన్ని వృత్తులవారు తమవృత్తిని మాని వేసారు.మేతలేక పసువులు అల్లాడసాగాయి.
మగవారంతా బారెడు గడ్డంతో తిరగసాగారు. ఆదాయం లేని ప్రజలు పన్నులు కట్టడం మానివేసారు.ప్రజలు తమవృత్తి మాని ఆట పాటలతో కాలక్షేపంచేయసాగారు. రాజుగారి కోశాగారం ఖాళీ అయింది. రాజ్యం లోని ప్రజలు అందరికి ఆకలి లేకపోవడంతో సోమరితనం అలవడింది.
అప్పుడు కాశీయాత్రకు వెళ్ళిన మంత్రి తిరిగి వచ్చి రాజుగారితో సమావేసమై 'మహరాజా తమరి ఆలోచనవలన ఎంతటి విపత్తు మనరాజ్యానికి వాటిల్లిందో చూసారుగా! శ్రమలో ఆరోగ్యం,ఆనందం దాగిఉంది.మనిషి తన శ్రమకు తగిన ఫలితం పొందినప్పుడు కలిగే అనుభూతి వర్ణాతీతం.ఈసృష్టిలో ప్రతి ప్రాణి శ్రమించి పొట్ట నింపుకోవలసిందే! అది ప్రకృతి నియమం.మనిపి కాలానికి తలఒగ్గి జీవించ వలసిందే.తప్పుడు దారులు వెదికితే ముప్పుతప్పదు. ఇప్పటికైనా మించిపోలేదు మనం ఆసాధువును కలసి దీనికి విరుగుడు తెలుసుకుందాం!'అనిరాజు మంత్రి సాధువునికలసి మంత్రజలానికి విరుగుడు అడిగారు.
'మహారాజా సున్నం ప్రజలు తాగేనీళ్ళలో కలపండి ఎప్పటిలాగా ప్రజలు యథాస్ధితికి వస్తారు'అన్నాడు సాధువు.వెంటనే ప్రజలు దాహంతీర్చుకునే అన్ని నీటి ప్రాంతాలనీటిలో సున్నం కలిపించాడు మంత్రి.
ఎప్పటిలా ప్రజలు తమపనులు చేసుకుంటూ రాజుగారికి సుకం చెల్లించారు ' అన్నది '.
నిజమే సోమరితనం అత్యంత ప్రమాదకరం శ్రమలో స్వర్ణం దాగిఉంది అని తెలుసుకున్నవారు తమ జీవితం ఆనందమయంగా గడుపుతారు " అన్నది పార్వతి.
కథ ముగియడంతో అందరూ నిద్రకు ఉపక్రమించారు.

