కులవృత్తి - ARADHYULA Pranav

Kulavrutti

మధ్యాహ్నం ఎండ చుర్రుమంటోంది. ఊరికి మరీ దూరంగా లేని ఆ ఇంటి వసారాలో వడ్రంగి బల్ల, పనిముట్లు ఒక ప్రక్కన విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇంకోవైపున వాల్చిన నులక మంచంలో పడుకున్న వడ్రంగి రామయ్య... బుర్రలో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలతో... నిద్ర పట్టక గింజుకుంటున్నాడు. తన తాత నుండి తన తండ్రి, తన తండ్రి నుండి తను... వారసత్వంగా ఈ విద్యను అందిపుచ్చుకొని బతుకు బండిని లాగారు. ఈ పని చేసి ఏం మిగుల్చుకున్నారో ఆ భగవంతుడికే తెలియాలి కానీ... మర్యాద కోల్పోకుండా ఇంతకాలం గుట్టుగా సంసారం లాక్కొచ్చారు. తన తాత నుండి నేటి తన తరం దాకా... ఎవరైనా అప్పగించిన పనిని శక్తి వంచన లేకుండా పూర్తి చేయడం, ప్రాణం లేని చెక్కలకి తామిచ్చిన రూపాన్ని... తమకు పని అప్పగించిన వాళ్ళు... అద్భుతంగా, అపురూపంగా చూసినప్పుడు...వారి కళ్ళలోనే తాము...తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని కోరుకున్నారే గాని, రూపాయి నోట్లలో కాదు. అలాగని తమ శ్రమను ఎవరూ దోపిడీ చేయలేదు. ఊళ్లో వడ్రంగులు చాలామందే ఉన్నా... "తమకు పని అప్పగిస్తే నిశ్చింతగా ఉండవచ్చు"... అన్న పేరు సంపాదించుకున్నారు. తన తాత నుండి నేటి తన దాకా ఆ పేరు కాపాడుకోవడానికే కృషి చేసారు. ఇప్పుడు రామయ్య దీర్ఘాలోచనకు కారణాలు రెండు. మొదటిది, ఊరంతటికీ పెద్ద మోతుబరైన వీర్రాజు గారు సరిగ్గా రెండు వారాల క్రితం తనను పిలిపించి, నాణ్యమైన టేకును అప్పగించి, బయానాగా కొంత రొఖ్ఖం కూడా ముట్టజెప్పి... తన కూతురి కొత్త కాపురానికి పంపటానికి... పందిరి మంచం, బీరువాలు వగైరా పురమాయించారు. పది రోజులలో పని పూర్తి చేస్తానన్న మాటైతే ఇచ్చాడు కానీ, ఇంకా పాతిక శాతం పని మిగిలే ఉంది. నిన్న సాయంత్రం వీర్రాజు గారు తన కూతురి ప్రయాణానికి రెండు రోజులలో ముహూర్తం పెట్టాం, ఎల్లుండిలోగా సామాను అందజేయమని పాలేరుతో కబురు పంపించారు. ఇక రెండవ కారణం... వారం రోజుల నుండి తెరిపి లేకుండా వస్తున్న దగ్గుతో పని చేయడం కష్టమై ఇవాళ వైద్యుడికి చూపించితే..."క్షయ ప్రారంభంలో ఉంది. అత్యవసరంగా వడ్రంగం పనికి విశ్రాంతినిచ్చి మందులను క్రమం తప్పకుండా వాడితే తప్ప ముప్పు తప్పించలేము... కాదూకూడదని పనిలోకి దిగి ఆ దుమ్ము,ధూళి పీలిస్తే ఊపిరితిత్తులకు మరింత నష్టం", అని మరిమరీ చెప్పారు. "ఎలాగోలా గడువు లోపల వీర్రాజు గారికి సామాను అందించవచ్చు, వైద్యుడి సూచన ప్రకారం ఆరోగ్యం కూడా బాగు చేసుకోవచ్చు. రెక్కల్లో సత్తువ, మనసులో మక్కువతో ఇంతకాలం పనిచేస్తూ వచ్చాను. ఒకవేళ నా ఆరోగ్యం మెరుగవక పని మానేయవలసిన పరిస్థితి వస్తే?".... ఆ ఊహనే భరించలేకపోయాడు రామయ్య. అతని దిగులు అంతా...వేరే బ్రతుకుతెరువు తెలియకపోవడం కాదు. శరీరం సహకరించినంతవరకు తాను,తన ఇంటిది... ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్న ఒక్కగానొక్క కొడుకుని చదివించుకోగలరు. వాడు చేతికి అందివస్తే ఆ తరువాత తమకేం బెంగ లేదు. తాము ఇంతవరకు ప్రాణ సమానమైన ఆస్తిగా భావిస్తూ వచ్చిన "వడ్రంగం పని, దానిలో మెలకువలు, తమకు మాత్రమే ప్రత్యేకమైన ఒడుపూ... సులువు, తన తదనంతరము ఎవరు అందిపుచ్చుకుంటారు?"... అన్నదే. రామయ్యకు పట్నంలో చదువుతున్న తన కొడుకు భద్రం స్ఫురణకు వచ్చాడు. "ఇంతకాలం ఈ పని చేసి మనమేం సుఖపడ్డామో నాకు తెలియదు కానీ.... మన బిడ్డ మాత్రం ఈ కష్టం పడకూడదు", అని ఎంతో పట్టుదలగా వాడిని పెద్ద చదువులు చదివిపిస్తుంది తన భార్య సీతమ్మ. పనిలో కష్టాన్నే గాని... కళను ఆస్వాదించలేని అమాయకురాలు. "తమ వారసత్వ విద్య అయిన "వడ్రంగం పని" తనతో ఆగిపోకూడదు. ఈమధ్య దుకాణాల్లో... తయారుగా ఉన్న వస్తువులు విరివిగా విక్రయిస్తున్న మాట నిజమే... జనం వాటినే ఎక్కువగా ఆదరిస్తున్న మాటా నిజమే. కానీ అవి కూడా ఎవరో ఒక వడ్రంగి తయారుచేసినవే కదా. నాకు ఆదరణ లేకపోతే నేమి వడ్రంగం పనికి ఆదరణ ఉంది కదా". దీర్ఘాలోచనలో ఉన్న రామయ్య వాకిట్లో అలికిడైతే అటువైపు చూసి, "ఏమయ్యా! ఎండన పడి వచ్చావా... చల్లపొద్దున రాకపోయావా?", అని కొడుకు భద్రంతో అంటూ, "సీతమ్మా! అబ్బాయి వచ్చాడు" అని భార్యను కేకేసాడు. నిన్న రంగారావు మాస్టారుగారు పట్నం వస్తుంటే, "నీకు ఒంట్లో బాగాలేదని అమ్మ కబురంపింది నాన్నా! ఉండబట్టలేక ఇవాళ పొద్దున్నే బయలుదేరా", అంటూ భద్రం కాళ్లు కడుక్కున్నాడు. "ఏరా భద్రం! ఇదేనా రావడం?" అంటూ సీతమ్మ కొడుక్కి మంచినీళ్లు ఇచ్చింది. "ఇప్పుడు ఎలా ఉంది నాన్నా ...నీ ఆరోగ్యం?" తండ్రి పక్కనే కూర్చుంటూ అడిగాడు భద్రం. "పరవాలేదురా! మందులు వాడుతున్నా" అని రామయ్య సమాధానం చెప్పేలోపే మధ్యలో అందుకున్న సీతమ్మ... "ప్రాణం బాగా లేనప్పుడు పని ఒప్పుకోవడం ఎందుకు? పూర్తి చేయలేకపోయానని బెంగ పెట్టుకోవడం ఎందుకు? ఇంత మొహమాటం అయితే ఎలారా... నువ్వయినా చెప్పు మీ అయ్యకి, నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోమని" అంటూ లోపలికి వెళ్ళింది. "అది కాదురా భద్రం! మనకి అప్పగించిన పని, మనం ఇచ్చిన మాట... ఇవేరా నీ ముత్తాత నుండి నేటిదాకా మన కుటుంబానికి శ్రీరామరక్ష. ఈ అనారోగ్యంతో మాట తప్పుతానేమోనని బెంగగా ఉందిరా అయ్యా"... వసారాలో ఒక పక్కన అసంపూర్తిగా మిగిలిపోయిన పనిని చూస్తూ అన్నాడు రామయ్య. "మరేం పర్లేదు నాన్నా! నేను వచ్చేసాగా... గడువు లోపల సామాను ఇచ్చేద్దాం. నువ్వలా కూర్చుని చూస్తూ ఉండు. నేను మిగిలిన పనిని పూర్తి చేస్తా. ఏదైనా అవసరం అయితే సలహా ఇవ్వు. నాకు తెలియని పని అయితే కాదు కదా... చిన్నప్పటినుండి తాతను, నిన్ను... చూస్తూ వస్తున్నాను కదా"... భరోసాగా అన్నాడు భద్రం. "నువ్వు ఈ పని చేయడం మీ అమ్మ చూసిందో, ఇంకేమైనా ఉందా... నా మీద శివాలెత్తుతుంది రా", అని కొడుకుని హెచ్చరించాడు రామయ్య. "అదేంటి నాన్నా!చదువుకున్నంత మాత్రాన కులవృత్తి చేయకూడదా? చదువుకున్నోడు కులవృత్తి చేస్తే... చదువుకు చిన్నతనమా, వృత్తికి అవమానమా... చదువు విజ్ఞానానికి, వృత్తి బ్రతుకుతెరువుకి... అని అనుకోకపోవడం వల్లనే సమాజంలో ఇంత అసమానత ఉంది. అమ్మకు నేను సర్దిచెబుతాను గాని, నువ్వు ధైర్యంగా ఉండు"... అంటూ పనిలోకి దిగాడు భద్రం. భద్రం మాటలతో రామయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. ఇందాకటి నుండి తను పడిన వేదన అంతా మంచులా కరిగిపోతుంటే... చేయి తిరిగిన వడ్రంగిలా ఒడుపుగా, లాఘవంగా... పనిచేస్తున్న కొడుకుని తృప్తిగా చూస్తూ... తాతల నుండీ సంప్రదాయంగా వస్తున్న తమ పనికి, అనుభవానికి, నైపుణ్యానికి ఢోకా లేదని.... ధీమాగా మీసాలు సవరించుకున్నాడు రామయ్య. ____

మరిన్ని కథలు

Santrupthi
సంతృప్తి
- మండా సూర్యనారాయణ
Sanmanam
సన్మానం!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Apramatthata
అప్రమత్తత
- డా:సి.హెచ్.ప్రతాప్
Samskaram
సంస్కారం
- మద్దూరి నరసింహమూర్తి
Chivari vuttaram
చివరి ఉత్తరం
- డా:సి.హెచ్.ప్రతాప్
Manavatwam gelichindi
మానవత్వం గెలిచింది
- డా:సి.హెచ్.ప్రతాప్
Dinadina gandam noorella ayusshu
దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు
- కాశీ విశ్వనాథం పట్రాయుడు