రాత్రి 2.17 అయ్యింది.
ఓ మహానగరం గాఢనిద్రలో ఉంది.
నగరం మధ్యలో ఉన్న నందనవనం రెసిడెన్సీలో మాత్రం సెక్యూరిటీ గార్డు శంకర్ మెలకువగానే ఉన్నాడు. పన్నెండు అంతస్తుల ఆ భవన సముదాయం చుట్టూ అసాధారణమైన నిశ్శబ్దం. గాలి కూడా లేనట్లు చెట్లు కదలడం లేదు.
అప్పుడే— ట్రింగ్... ట్రింగ్...
సెక్యూరిటీ గదిలో ఇంటర్‌కామ్ మోగింది.
సగం నిద్రలో వున్న సెక్యూరిటీ గార్డు శంకర్ గడియారం చూశాడు.
2.17.
ఈ సమయంలో ఎవ్వర్రా అని విసుక్కుంటూ రిసీవర్ ఎత్తాడు.
“సెక్యూరిటీ... చెప్పండి.”
అటువైపు నిశ్శబ్దం.
కొన్ని క్షణాల తర్వాత ఎవరో ఊపిరి తీసుకుంటున్న శబ్దం. ఆ తర్వాత చాలా మెల్లగా ఓ మగ గొంతు.
“ఫ్లాట్ నెంబర్ 66-బి...ఒకసారి పైకి రా...”
కాల్ కట్ అయింది.
శంకర్ వెన్నులో చలి పాకింది.
66-బి?
ఆ నంబరు ఎక్కడో విన్నట్లు అనిపించింది.
టార్చ్ తీసుకుని బయటకు వచ్చాడు. లిఫ్ట్ బటన్ నొక్కబోతుండగానే—
తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. లోపల ఎవరూ లేరు.
శంకర్ లోపలికి అడుగు పెట్టాడు.
తలుపులు హఠాత్తుగా వాతంతట్ అవే మూసుకున్నాయి.
అతడు ఏ అంతస్తు బటన్ కూడా నొక్కలేదు.
అయినా లిఫ్ట్ పైకి కదలడం ప్రారంభించింది.
ఒకటి...
రెండు...
మూడు...
హఠాత్తుగా లైట్లు ఆరిపోయాయి.
చుట్టూ దట్టమైన చీకటి. ఏమీ కనిపించడం లేదు.
శంకర్ టార్చ్ వెలిగించాడు.
ఎదురుగా ఉన్న అద్దంలో తన ముఖం కనిపించింది.
అతడు ఒక్కసారిగా బిగుసుకుపోయాడు. అద్దంలో తన వెనుక మరో వ్యక్తి నిలబడి ఉన్నాడు.
తెల్లటి చొక్కా. వాలిపోయిన తల. కాని ముఖం కనిపించడం లేదు.
శంకర్ మెరుపువేగంతో వెనక్కి తిరిగాడు.
ఎవరూ లేరు.
మళ్లీ అద్దం వైపు చూశాడు. ఈసారి ఆ వ్యక్తి అతనికి మరింత దగ్గరగా ఉన్నాడు.
అతని చేయి శంకర్ భుజాన్ని తాకబోతున్నట్లుగా ఉంది.
అప్పుడే—
టింగ్!
లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. శంకర్ దాదాపు దూకినట్లుగా బయటకు వచ్చాడు.
ఎదురుగా ఒకే ఒక్క తలుపు. దానిపై తుప్పుపట్టిన అక్షరాలు.
ఫ్లాట్ నెంబర్
66-బి.
తలుపు కొద్దిగా తెరిచి ఉంది.
లోపలి నుంచి శబ్దం.
టక్...
కొన్ని క్షణాల నిశ్శబ్దం.
టక్... టక్...
ఎవరో చెప్పులు లేకుండా నెమ్మదిగా నడుస్తున్నట్లు.
“ఎవరున్నారు?”దాదాపుగా అరివ్హినట్లు అడిగాడు.
సమాధానం లేదు.
శంకర్ తలుపును తోశాడు.
లోపల దుమ్ముతో కప్పబడిన ఫర్నిచర్. గోడలపై బూజు. పైకప్పు నుంచి వేలాడుతున్న సాలెగూళ్లు.
కానీ గోడకు ఉన్న పాత గడియారం మాత్రం నడుస్తోంది.
టిక్క్... టిక్క్... టిక్క్...
శంకర్ దాని దగ్గరకు వెళ్లాడు.
సరిగ్గా 2.17కు ముళ్లు ఆగిపోయాయి.
వెనుక నుంచి తలుపు మూసుకుంది.
ధడేల్!
శంకర్ ఉలిక్కిపడి తిరిగాడు. అప్పటివరకు ఖాళీగా ఉన్న గోడపై ఏదో కనిపించింది.
తడి వేలితో అప్పుడే రాసినట్లుగా మూడు మాటలు—
“నన్ను ఎవరు తోశారు?”
శంకర్ శరీరం చెమటతో తడిసిపోయింది. అప్పుడే బాల్కనీ వైపు నుంచి అడుగుల శబ్దం.
టక్... టక్... టక్...
అతడు నెమ్మదిగా అటువైపు చూశాడు. చీకటిలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు.
అతని ముఖం కనిపించలేదు.
“ఎ... ఎవరు నువ్వు?”భయం భయంగా అడిగాడు.
ఆ ఆకారం తల పైకెత్తింది.ఎంతో వికృతంగా ఒక్కసారి చూస్తే వెన్ను గడ్డకట్టేలా వుంది.
ముఖం మీద గాయాలు. కళ్ల స్థానంలో రెండు నల్లటి గుంటలు.
పెదవులు మాత్రం కదిలాయి.
“ఆ రాత్రి... తలుపు తెరిచింది ఎవరు?”
శంకర్ వెనక్కి తగ్గాడు.
“నాకు తెలియదు!”
ఆ ఆకారం మరో అడుగు ముందుకు వేసింది.
“నీకు కాదు...”
క్షణం ఆగింది.
“నీ తండ్రికి తెలుసు.”
శంకర్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.
అతని తండ్రి కూడా ఎన్నో సంవత్సరాల క్రితం ఇదే రెసిడెన్సీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. చిన్నప్పటి నుంచి ఈ భవనం గురించి తండ్రి చెప్పిన ఎన్నో కథలు శంకర్‌కు గుర్తున్నాయి. కానీ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు తీవ్రమైన జ్వరంలో ఆయన పదేపదే ఒకే మాట కలవరించేవాడు—
“ఆ తలుపు తెరవకపోయి ఉంటే... అతడు బతికేవాడు...”
అప్పట్లో ఆ మాటల అర్థం శంకర్‌కు తెలియలేదు. కానీ ఇప్పుడు 66-బి తలుపు ముందు నిలబడగానే, ఎన్నేళ్ల క్రితం తండ్రి పలికిన ఆ మాటలు హఠాత్తుగా అతని చెవుల్లో మార్మోగాయి. ఎందుకో తెలియదు... ఆ మాటలకు, ఈ మూసివున్న ఫ్లాట్‌కు ఏదో సంబంధం ఉందన్న అనుమానం తొలిసారిగా అతని మనసులో మెదిలింది.
అతని చూపు తలుపు మీదే నిలిచిపోయింది.
అంతలో జేబులోని మొబైల్ ఫోన్ ఒక్కసారిగా మోగింది. సెక్యూరిటీ గది నుంచి కాల్.
“శంకర్! ఎక్కడున్నావు?”
శంకర్ తలుపు వైపు చూస్తూనే నెమ్మదిగా సమాధానమిచ్చాడు.
“66-బిలో...”
అటువైపు నిశ్శబ్దం.
“ఏమన్నావు?”
“66-బి!”
అవతలి వ్యక్తి గొంతు వణికింది.
“శంకర్... మన రెసిడెన్సీలో 66-బి అనే ఫ్లాటే లేదు.”
శంకర్ చేతిలోని ఫోన్ జారిపోయింది.
అదే క్షణంలో ఎదురుగా ఉన్న ఆకారం మాయమైంది.
గది ఖాళీ.
కానీ శంకర్ మెడ వెనుక ఎవరో వేడిగా ఊపిరి వదిలారు.
అతడు కదల్లేకపోయాడు. చెవి దగ్గర ఓ గుసగుస—
“అయితే... నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు?”
మరుసటి ఉదయం సెక్యూరిటీ సిబ్బంది భవనం మొత్తం వెతికారు.
శంకర్ కనిపించలేదు.
అతని టార్చ్ మాత్రం లిఫ్ట్‌లో దొరికింది. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు.
రాత్రి 2.17కు శంకర్ లిఫ్ట్‌లోకి ప్రవేశించడం స్పష్టంగా కనిపించింది.
కానీ విచిత్రం ఏమిటంటే— అతడు లిఫ్ట్‌లో ఒంటరిగా లేడు.
అతని వెనుక తెల్లటి చొక్కాతో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.
అంతకంటే భయంకరమైన విషయం మరొకటి ఉంది. రికార్డింగ్‌ను వెనక్కి తీసి చూసినప్పుడు తెలిసింది—
లిఫ్ట్‌లోకి మొదట ప్రవేశించింది శంకర్ కాదు. తలుపులు తెరవడానికి మూడు నిమిషాల ముందే...
ఆ తెల్లటి ఆకారం లోపల నిలబడి ఉంది. శంకర్ కోసం ఎదురుచూస్తూ.
ఆ రోజు నుంచి నందనవనం రెసిడెన్సీలో ఒక నియమం పెట్టుకున్నారు.
రాత్రి 2.17 తర్వాత ఇంటర్‌కామ్ మోగితే—
ఎవరూ ఫోన్ ఎత్తరు. ఎందుకంటే అప్పుడప్పుడూ ఇప్పటికీ అది మోగుతుంది.
ఎవరైనా తెలియక రిసీవర్ ఎత్తితే...
అవతలి వైపు మొదట ఊపిరి శబ్దం వినిపిస్తుంది.
తర్వాత శంకర్ గొంతు—
“66-బి... పైకి రా... నేను ఒంటరిగా ఉన్నాను...”

