“ఇంకా ఫోన్ రాలేదేంటి?” అన్నాడు అరవై ఐదేళ్ల రామయ్య, నేలమీద కూర్చుని పచ్చి మామిడికాయలు తురుముతున్న యాభై ఎనిమిదేళ్ల తన భార్య జానకమ్మతో. రామయ్య చేతులు వెనక్కి కట్టుకుని హాల్లో టేబుల్ మీదున్న ఫోన్ ఏ క్షణంలోనైనా మోగుతుందేమో అన్నట్టు కంగారుగా అటూ ఇటూ నడుస్తున్నాడు. “నీకు తెల్లారితే అందరికీ అయినట్లేనా సంబడం? ఇంకా టైముంది. గడియారం చూడు,” అంది జానకమ్మ, తురమడం ఆపి గోడ మీదున్న పెద్ద చెక్క గడియారాన్ని చూపిస్తూ. కాలంతోబాటు రంగు వెలిసిన ఫ్రేమ్‌తో, తుప్పుపట్టిన ముళ్లతో ఆ గడియారం టిక్‌టిక్‌మంటూ తిరుగుతోంది—రామయ్య అడుగుల్లాగే. “నాకు రాత్రవుతుంది. తెల్లవారాల్సింది వాడికే,” అంటూ రామయ్య ఆగి, కళ్లద్దాలు సరిచేసుకుంటూ మళ్ళీ గడియారం వైపు చూశాడు. అసలు ఆయనకు గడియారంతో పని లేదు. ఎనిమిదిన్నర ఎప్పుడవుతుందో ఆయన మనసుకు బాగా తెలుసు. “పక్షులకు గింజలు వేశావా ఈ రోజు?” అంది జానకమ్మ, ఆయన ధ్యాస మళ్లిద్దామని. “ఎప్పుడో వేసేశానులే!” అన్నాడు రామయ్య. గొంతులోని అసహనం జానకమ్మకు వినిపించకుండా జాగ్రత్త పడ్డాడు. “ఏదో పనిలో పడి ఉంటాడేమో... లేకపోతే టైముకే చేస్తాడని నీకూ తెలుసు కదా,” భర్తలోని ఆతురతను చల్లార్చే ప్రయత్నంలో జానకమ్మ అంది. “ఏం పని? కన్నోళ్ళకి ఐదు నిమిషాలు ఫోన్ చేయడం కన్నా ముఖ్యమయిన పనేమిటటా!” అని రామయ్య బొంగురు గొంతుతో వంటింట్లో ఉన్న జానకమ్మకు వినబడకుండా గొణిగాడు. భర్తకి సర్ది చెబుతున్నా, జానకమ్మ చూపు కూడా ఫోన్ మీదే ఉంది. వాళ్లు అంత ఆతృతగా ఎదురుచూసేది అమెరికాలో ఉన్న తమ కొడుకు అరవింద్ నుంచి రోజూ రాత్రి ఎనిమిదిన్నరకు వచ్చే ఫోన్ కోసం. అరవింద్ పుట్టినప్పుడు రామయ్యకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. ఒక చిన్న ఇల్లు, రెండు ఎకరాల పొలం, ప్రభుత్వ పాఠశాలలో చిన్న ఉద్యోగం... అంతే. అరవింద్ చిన్నప్పటి నుంచే చదువులో చురుకు. ఇంజనీరింగ్ చదవాలని పట్టుబట్టాడు. “మన ఊర్లోనే డిగ్రీ చదివితే సరిపోతుంది,” అన్నాడు రామయ్య మొదట. కానీ కొడుకు కళ్లలోని పట్టుదల చూసిన తర్వాత పట్టు సడలించాడు. చదువు కోసం ఉన్న రెండు ఎకరాల్లో ఒక ఎకరం అమ్మేశాడు. అరవింద్ హాస్టల్‌కు వెళ్లిన మొదటి రోజు జానకమ్మ రాత్రంతా ఏడ్చింది. “మన దగ్గరే ఉంటే బాగుండేది” అని వాపోయింది. రామయ్య గట్టిగా అన్నాడు— “పిల్లల్ని మన దగ్గర అట్టి పెట్టుకోవడానికి పుట్టించామా? వాళ్ల అభివృద్ధికి మనమే అడ్డమయితే ఎలా?” ఆ మాట జానకమ్మను ఓదార్చడానికే అన్నాడు. కానీ ఆమెకు తెలియకుండా ఆ రాత్రి వరండాలో కూర్చుని రామయ్య కూడా చాలాసేపు ఏడ్చాడు. కొడుకు తన కళ్ల ముందే ఉండాలని అతనికీ ఉంది. కానీ తనకంటే పెద్ద జీవితం వాడికి ఉండాలన్న ఆశ అతని ప్రేమను వెనక్కి నెట్టింది. అరవింద్ చదువు పూర్తయింది. ఉద్యోగంలో చేరిన కొద్దికాలానికే విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. “నాన్నా… అమెరికా పంపుతామంటున్నారు.” “వెళ్లు.” “చాలా దూరం నాన్నా.” “దూరం దేశాల మధ్య ఉంటుందిరా, మనుషుల మధ్య కాదు.” అరవింద్ నవ్వి, “మీరు నన్ను మిస్ అవ్వరా?” అన్నాడు. “మేమయినా చిన్నపిల్లలమటరా?” అన్నాడు రామయ్య గంభీరంగా. కానీ విమానం ఎగిరిన తర్వాత ఇంటికి వచ్చి నేరుగా అరవింద్ గదిలోకి వెళ్లాడు. పాత షూలు, టేబుల్ మీద పుస్తకాలు, కుర్చీ మీద పాత జాకెట్... రామయ్య ఆ జాకెట్‌ను చేతిలోకి తీసుకుని చాలాసేపు నిశ్చేష్టంగా కూర్చుండిపోయాడు. కొడుకును తానే దూరం పంపుకున్నానన్న బాధ ఆ రాత్రి ఆయన్ని తొలచివేసింది. అలా అనుకోవడం అదే మొదటిసారి... చివరిసారి మాత్రం కాదు. ──────── అరవింద్ అమెరికా వెళ్లిన కొత్తల్లో రోజూ గంటసేపు ఫోన్ చేసేవాడు. తర్వాత అరగంట, తర్వాత పది నిమిషాలు... చివరికి రోజూ ఎనిమిదిన్నరకు ఐదు నిమిషాల మాటలే మిగిలాయి. రామయ్య మాట్లాడేది తక్కువే, కానీ ఒళ్లంతా చెవులు చేసుకుని వినేవాడు. “నాన్నా, బాగున్నారా?” “బాగున్నాం.” “అమ్మ?” “ఇక్కడే ఉంది.” “మందులు వేసుకుంటుందా?” “వేసుకుంటుంది.” “మీరు?” “నేనూ బాగున్నా.” అంతే. ఫోన్ జానకమ్మకి ఇచ్చేసేవాడు. అరవింద్‌కు ఆ ఫోన్ ఒక బాధ్యత. తల్లిదండ్రులకు మాత్రం అది ఒక ప్రాణవాయువు. ఆ ఐదు నిమిషాల కోసమే వాళ్లు రోజంతా ఎదురుచూసేవారు. జానకమ్మకు కొడుకు చిన్నప్పటి ఇష్టాలన్నీ ఇప్పటికీ గుర్తే. మామిడికాయ పప్పు అంటే ప్రాణం. పప్పులో నెయ్యి ఎక్కువగా ఉండాలి. చల్ల మిరపకాయ లేకుండా పప్పన్నం ఒక్క ముద్ద కూడా తినేవాడు కాదు. వర్షం పడితే బయట నిలబడి తడవడం అతని చిన్ననాటి సరదా. స్కూలుకు వెళ్లిన పాత సైకిల్‌ను కూడా రామయ్య ఇప్పటికీ పారేయలేదు. “ఇంకా దేనికి ఇది?” అని జానకమ్మ అడిగితే, “ఉండనీలే… వాడు వచ్చినప్పుడు అడుగుతాడేమో,” అంటాడు. అతను వస్తాడో రాడో తెలియదు, వచ్చినా ఆ సైకిల్ గుర్తుంచుకుని అడుగుతాడో లేదో తెలియదు. కానీ ఇంట్లో అరవింద్ జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ ఊపిరిపోసుకుంటూనే ఉంటాయి. అతని గది, అతని పుస్తకాలు, అతనికి ఇష్టమైన కప్పు... వస్తువులు పాతబడుతున్నాయి కానీ జ్ఞాపకాలు మాత్రం నిత్యనూతనాలే. ──────── ఒక రోజు రామయ్యకు తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. స్థానిక ఆసుపత్రిలో చూపిస్తే పరీక్షలు చేసి, “గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయి, వెంటనే స్టెంట్ వేయాలి. ఆలస్యం చేయకండి,” అన్నారు. ఖర్చు పెద్దది. జానకమ్మ భయంతో, “అరవింద్‌కి చెబుదాం,” అంది. రామయ్య తల అడ్డంగా ఊపాడు. “వద్దు.” “ఎందుకు?” “వాడికి అక్కడ సంసారం ఉంది, పిల్లల చదువులు ఉన్నాయి, ఇల్లు కొన్నాడు. అంత దూరంలో ఉన్నాడు. వాడి నెత్తిన ఇంకో బరువు పెట్టడం ఎందుకు? మన పెన్షన్ డబ్బులు, పొదుపు చేసుకున్నవి ఉన్నాయిగా... సరిపోతాయిలే.” “కానీ వాడు మన కొడుకు.” రామయ్య కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి, “అందుకే చెప్పకూడదు,” అన్నాడు. అదే సమయంలో అమెరికాలో అరవింద్ జీవితం కూడా అంత సులభంగా లేదు. ఇల్లు కొనడానికి చేసిన అప్పులు, పిల్లల ఫీజులు, కంపెనీలో లే-ఆఫ్‌ల భయం... ఉద్యోగం ఏ క్షణాన ఊడుతుందో తెలియని పరిస్థితి. అయినా తల్లిదండ్రులకు ఏమీ చెప్పేవాడు కాదు. “వాళ్లు వృద్ధులు, నా కష్టాలు చెప్పి వాళ్లకు నిద్ర లేకుండా చేయడం ఎందుకు?” అనుకునేవాడు. భార్య అడిగితే, “మాట్లాడాను, ఎప్పటిలాగే బాగున్నామన్నారు,” అని చెప్పేవాడు. అరవింద్‌కు తెలియదు తల్లిదండ్రులు ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారని. వాళ్లకు తెలియదు కొడుకు ఉపాధి సంక్షోభంలో ఉన్నాడని. ఇరువైపులా ఒకరినొకరు బాధపెట్టకూడదనే ప్రేమతో నిజాలను దాచుకుంటున్నారు. ఆపరేషన్ అవసరమని తెలిసినా రామయ్య ఎనిమిదిన్నర సమయానికి మాత్రం మామూలుగానే ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాడు. జానకమ్మకు ఎన్నోసార్లు చెప్పేయాలనిపించేది, కానీ ఫోన్ మోగగానే గొంతులోనే ఆగిపోయేది. ఆ ఐదు నిమిషాలు వాళ్ల అనారోగ్యాన్ని కూడా మరిపించేలా చేసుకున్నారు. ──────── ఒక రాత్రి ఎనిమిదిన్నర దాటింది. 8:40... 8:50... 9:00. జానకమ్మ కంగారుపడింది. “ఈరోజు ఎందుకు చేయలేదో?” “పని ఎక్కువై ఉంటుందిలే…” అన్నాడు రామయ్య. కానీ అతని చూపు గడియారం ముళ్ల మీదే ఉంది. నిమిషం గడిచేకొద్దీ ఏదో తెలియని దిగులు. రాత్రి 9:17కి ఫోన్ మోగింది. రామయ్య వెంటనే అందుకున్నాడు. “హలో!” “నాన్నా…” అరవింద్ గొంతులో విపరీతమైన అలసట. “ఏమైంది రా? ఎందుకు ఆలస్యం?” అవతల కొద్దిసేపు నిశ్శబ్దం. “కంపెనీలో మార్పులు జరిగాయి నాన్నా... నా ఉద్యోగం పోయింది.” రామయ్య ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. గుండెలో ఏదో కదిలినట్టయింది. అయినా వెంటనే సర్దుకుని, “పర్లేదురా, ఇంకో ఉద్యోగం వస్తుందిలే,” అన్నాడు. “అంత సులభం కాదు నాన్నా, ఇక్కడ మార్కెట్ చాలా దారుణంగా ఉంది.” రామయ్య ఏదో ధైర్యం చెప్పబోతుంటే అరవింద్ అడిగాడు, “నాన్నా… మీ గొంతు ఎందుకో నీరసంగా ఉంది? మీరు ఏదో దాస్తున్నారు నా దగ్గర.” “ఏమీ లేదురా,” అన్నాడు రామయ్య శ్వాస సరిచేసుకుంటూ. అప్పుడే వంటింట్లోంచి మంచినీళ్ల గ్లాసుతో వచ్చిన జానకమ్మ, భర్త ముఖం చూసి కంగారుగా, “ఛాతిలో నొప్పి మళ్లీ ఎక్కువైందా ఏంటి? డాక్టర్ చెప్పినట్టు వెంటనే అడ్మిట్ అవ్వాల్సింది...” అంది. రామయ్య భార్య వైపు అదిలింపుగా చూసేలోపే అరవింద్ వినేశాడు. “నొప్పా? ఎవరికి? నాన్నకా? నాన్నా, నిజం చెప్పండి!” ఫోన్ అవతల మౌనం. అరవింద్ నిశ్చయంగా అన్నాడు— “నేను బయలుదేరి వస్తున్నాను.” “ఈ పరిస్థితుల్లో వద్దన్నాను కదా రా...” “లేదు నాన్నా, నేను వస్తున్నాను.” ఫోన్ కట్ అయింది. ──────── రెండు రోజుల తర్వాత అరవింద్ ఇంటి గుమ్మంలో నిలబడ్డాడు. అలిసిపోయిన కళ్లు, చేతిలో చిన్న బ్యాగ్. కొడుకును చూసి జానకమ్మ కన్నీళ్లతో హత్తుకుంది. “నాన్న ఎలా ఉన్నారు?” అన్నాడు అరవింద్ నేరుగా మంచం వైపు చూస్తూ. “నువ్వు వస్తున్నావని తెలిశాక మొన్న రాత్రే ఆసుపత్రికి వెళ్లాంరా. నిన్ననే స్టెంట్ వేశారు. ప్రమాదం తప్పిందని ఇవాళే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాం,” అంది జానకమ్మ కళ్లు తుడుచుకుంటూ. అరవింద్ వెళ్లి తండ్రి మంచం పక్కన కూర్చున్నాడు. తండ్రి పాలిపోయిన ముఖం చూసి తట్టుకోలేకపోయాడు. “నాకు ముందే చెప్పాల్సింది కదా నాన్నా?” రామయ్య నెమ్మదిగా నవ్వి, “నువ్వూ ఉద్యోగం పోయిన బాధను ముందే చెప్పలేదు కదరా... పిల్లలకి కష్టం వస్తే కన్నవాళ్లు తట్టుకోలేరని నీ ఆలోచన. మా వల్ల నీకు భారం కాకూడదని మా ఆరాటం. ఇద్దరం ఒకే తప్పు చేశాంరా... మన ప్రేమను మనమే నిర్ణయించుకున్నాం. ఎదుటివారి కష్టాన్ని పంచుకోకుండా దాచుకోవడమే ప్రేమ అనుకున్నాం,” అన్నాడు. ఆ మాట అరవింద్ గుండెల్లో బలంగా తాకింది. ──────── ఆ రాత్రి ఇంట్లో పాత చెక్క అల్మారా తెరిచాడు అరవింద్. అందులో ఒక పాత బ్యాంక్ పాస్‌బుక్ కనిపించింది. పేజీలు తిప్పి చూస్తే తల తిరిగిపోయింది. తాను అమెరికా వెళ్లినప్పటి నుంచి నెలనెలా పంపిన డబ్బుల్లో అత్యధిక భాగం బ్యాంకులోనే ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా మూలుగుతోంది. “ఇంత డబ్బు ఉంచుకుని కూడా ఆపరేషన్ ఖర్చులకు ఆలోచించారా నాన్నా? మీకోసం పంపిన డబ్బు మీ ఆరోగ్యం కోసం వాడుకోవడానికి కూడా వెనుకాడారా?” అన్నాడు అరవింద్ నిలదీస్తున్నట్లుగా. మంచంపై నుంచి లేచి కూర్చున్న రామయ్య అన్నాడు, “నువ్వు ఎప్పుడైనా విసిగిపోయి వెనక్కి తిరిగి రావాలనుకుంటే... ఇక్కడ నీకో ఆధారం ఉండాలి కదా అని దాచాను రా. నీ భవిష్యత్తు కోసం.” అరవింద్ చేష్టలుడిగి చూశాడు. “భవిష్యత్తా నాన్నా? ఇరవై ఏళ్ల తర్వాత ఎక్కడో వచ్చే భవిష్యత్తు కోసం వర్తమానంలో బతుకును తాకట్టు పెట్టడమేనా జీవితం? నేను పోగొట్టుకున్నది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు నాన్నా... మీ పక్కన ఉండి మీకు తోడుగా గడపాల్సిన ఈ విలువైన కాలాన్ని కూడా.” రామయ్య కంగారుగా, “అదేంటి రా, మళ్లీ పాత తప్పు చేయకు. నీ భార్యాపిల్లల భవిష్యత్తు, వాళ్ల స్థితిగతులు...” “అవును నాన్నా, వాళ్ల గురించే ఆలోచిస్తున్నాను,” అరవింద్ గొంతులో ఒక స్పష్టమైన సంకల్పం కనిపించింది. “నా కొడుక్కి వాళ్ల తాతయ్య ప్రేమో, నాయనమ్మ గోరుముద్దల విలువో తెలియకుండా డాలర్ల బ్యాంక్ బ్యాలెన్సే జీవితం అనుకుని పెరగడమేనా గొప్ప భవిష్యత్తు? వాడు రేపు నన్ను వదిలేసి ఇలాగే ఎనిమిదిన్నరకి ఐదు నిమిషాల ఫోన్ కాల్‌కే పరిమితం కావడమేనా సంస్కారం? ఈ పరాయి దేశాల పరుగును ఇక్కడితో ఆపకపోతే మన తరాలన్నీ ఒంటరితనం అనే రోగానికి బలవుతాయి.” రామయ్య, జానకమ్మ నిశ్చేష్టులయ్యారు. “మరి అక్కడ నీ ఇల్లు? అప్పులు?” జానకమ్మ అడిగింది. “రేపు ఉదయమే మా ఆవిడతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానమ్మా. ఆ ఇంటిని అమ్మేస్తే అప్పులన్నీ తీరిపోతాయి. నాకున్న అనుభవానికి మన హైదరాబాద్‌లోనే మంచి కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఉద్యోగం వస్తుంది. వారానికి మూడు రోజులు ఇంటినుంచే పనిచేసే అవకాశం ఉన్న పోస్టులే ఇప్పుడు బోలెడు ఉన్నాయి. పొద్దున ఆఫీస్ పని చేసుకుంటాను, సాయంత్రం మీతో కూర్చుని కాఫీ తాగుతాను. వీకెండ్స్‌లో ఇక్కడే మన మిగిలిన ఎకరం పొలంలో నా పిల్లలకు మట్టి విలువ చూపిస్తాను.” రామయ్య కళ్లల్లో ఏదో భయం. “నువ్వు మా కోసం నీ కెరీర్‌ను చిన్నది చేసుకుంటున్నావా రా?” అరవింద్ తండ్రి భుజంపై ఆప్యాయంగా చేయి వేశాడు. “ఇంతకాలం నేను అక్కడ ఉండింది నా కలల కోసం కాదు నాన్నా... నలుగురిలో మీరు గొప్పగా చెప్పుకోవాలనే మీ ఆశల కోసం. మీరూ నాకోసం బతికారు, నేనూ మీకోసం బతికాను. కానీ మనమెవరమూ ‘కలిసి’ బతకలేదు. ఇప్పుడు నేను తీసుకుంటున్నది మీకోసం త్యాగం కాదు... నా స్వార్థం. నా మనశ్శాంతి కోసం, నా కుటుంబం వేర్లను నిలబెట్టుకోవడం కోసం తీసుకుంటున్న నిర్ణయం!” ఆ మాటలకు రామయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. కొడుకు చేతిని గట్టిగా అదిమి పట్టుకున్నాడు. ──────── ఆరు నెలల తర్వాత... సాయంత్రం ఎనిమిదిన్నర కావస్తోంది. గోడ గడియారం ఎనిమిదిన్నర కొట్టింది. కానీ హాల్లో ఆ టిక్‌టిక్ శబ్దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర అరవింద్ కూతురు జానకమ్మ ఒళ్లో కూర్చుని మామిడికాయ పప్పు అన్నం తింటూ మురిసిపోతోంది. వంటింట్లోంచి నేతి వాసన ఘుమఘుమలాడుతోంది. వరండాలో రామయ్య, అరవింద్ కూర్చుని పాత సైకిల్ చైన్‌కి గ్రీజు పెడుతున్నారు. “రేపు ఉదయాన్నే బాబుని దీనిమీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పాలి నాన్నా,” అన్నాడు అరవింద్ చొక్కా చేతులు మడతపెడుతూ. అప్పుడే టేబుల్ మీద ఉన్న అరవింద్ లాప్‌టాప్ పక్కన మొబైల్ వైబ్రేట్ అయ్యింది. రామయ్య అటు చూసి, “అరేయ్ అరవింద్, నీ ఆఫీస్ ఫోన్ మోగుతోంది... టైమ్ ఎనిమిదిన్నర అయ్యింది కదా,” అన్నాడు. అరవింద్ లేచి ఫోన్ అందుకున్నాడు. స్క్రీన్ చూసి, ఒక్క క్షణం మాట్లాడి కాల్ కట్ చేసి ఫోన్‌ను టేబుల్ మీద బోర్లించాడు. “ఏమైంది రా? ఎవరది?” అన్నాడు రామయ్య. “ఏం లేదు నాన్నా... మా మేనేజర్ కాల్ చేశాడు. ‘నాకు ఇప్పుడు ఫ్యామిలీ టైమ్. ఏదైనా అర్జెంట్ అయితే మెయిల్ చేయండి, రేపు ఆఫీస్ అవర్స్‌లోనే చూస్తాను’ అని చెప్పేశాను.” జానకమ్మ వరండా వైపు చూసి తృప్తిగా నవ్వింది. రామయ్య ముఖంలో ఎన్నడూ లేని ప్రశాంతత మెరిసింది. గోడ గడియారం ఎనిమిదిన్నర దాటి తన దారిన తాను తిరుగుతోంది. డాలర్ల వేటలో పడి విదేశీ హోదాలనే ఎండమావుల వెంట పరుగుతీసే భ్రమల కంటే... కన్నవారి కళ్లలోని తృప్తి, కంటికి ఎదురుగా నిలిచే తోడు, కుటుంబంతో కలిసి గడిపే క్షణాలే జీవితంలో అసలైన ఇంద్రధనుస్సులని ఆ ఇంటి గడప సాక్షిగా అరవింద్ గుండెల్లో రూఢీ అయింది. జీవితం అనేది వేల మైళ్ల దూరం నుంచి చేసే 'ఐదు నిమిషాల పలకరింపు' కాదు, పక్కనే ఉండి ఒకరికొకరం ఇచ్చే 'సమయం' మాత్రమే! (సమాప్తం)

