కవి ఎవరు?(కవిత) - యస్.ఆర్. పృథ్వి

కవి అంటే మరో బ్రహ్మే
మానవ శ్రేయం కోసం
కొత్త లోకాన్ని ఆశిస్తున్న విశ్వకర్మ
అక్షర విన్యాసంతో చైతన్యాన్ని పెంచి
సమాజ ఉన్నతి కోసం ఆదర్శాలను
నేల మీద విత్తనాలుగా చల్లే హాలికుడు

నిప్పులాంటి నిజాలెన్నో
ఊహల్తో పదును పెట్టి
వేళ్ళ నంటి వున్న కలం కత్తిలోంచి
నిక్షిప్తాక్షరాలుగా మొలక లెత్తిస్తాడు

కవిని గుర్తించేందుకు ఎన్నెన్నో పేర్లు
నిజాయితీకి నిలువెత్తు ఉదాహరణ
సమాజ సంక్షేమాన్ని రక్షించే ఉక్కు కవచం
ఆదర్శాల ఆచరణకి ఆత్మబంధువు

కూలిపోతున్న సంస్కృతి శిఖరాన్ని
భావ చైతన్యంతో నిలిపే అమరశిల్పి
వ్యవస్థని గుప్పిట్లోకి తీసుకుని
సంస్కరణ దీక్ష నెరపే గురువు

చీకటి కోణాన్ని చీల్చేందుకు
సమాజం మీద కాంతి రేఖల్ని
ప్రసరింపజేసే కవి ఎప్పుడూ
సాంఘిక కట్టుబాట్ల దుస్తుల్ని ధరిస్తాడు

కంటి చూపులోని తేజాన్ని
మెదడులోని ఊహా శక్తిని గలిపి
అక్షర సిపాయిలుగా చేస్తాడు
దుర్వ్యవస్థ పై సమర శంఖాన్ని పూరిస్తాడు.

మరిన్ని వ్యాసాలు