అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి

annamayya pada seva

008. అబ్బురంపు శిశువు

అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు
దొబ్బుడు రోల శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి

1.పుట్టు శంఖు చక్రముల బుట్టిన యా శిశువు
పుట్టక తోల్లే మారుపుట్టువైన శిశువు
వొట్టుక పాలువెన్నలు నోలలాడు శిశువు
తొట్టెలలోని  శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి

2.నిండిన బండి దన్నిన చిన్ని శిశువు
అండవారి మదమెల్ల నణచిన శిశువు
కొండలంతేససురులగొట్టిన యా శిశువు
దుండగంపు శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి

3.వేగైన వేంకటగిరి వెలసిన శిశువు
కౌగిటి యిందిర దొలగని శిశువు
ఆగి పాలజలధిలో నందమైన పెనుబాము
తూగుమంచము శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి (05-220)

ముఖ్యమైన అర్థాలు
అబ్బురంపు              =ఆశ్చర్యము కలిగించు
శిశువు                     =బిడ్డ, పిల్ల.
దొబ్బుడు                   =నెట్టడం, తోయడం
త్ప్రువ్వి                      =శిశువు చేసే ధ్వనికి అనుకరణ శబ్దం
పుట్టు                        = పుట్టుకతోనే
పుట్టక తోల్లే               = పుట్టుకకు ముందు
మారు                       = బదులు
ఒట్టుక                       = ఒట్టు పెట్టుకొను
ఓలలాడు                   =స్నానముచేయు;2. ఓలఓల యనుచు ఆడు.
తొట్టెల                       =ఉయ్యాల తొట్టి
అండవారు                 = దగ్గరగా చేరి చంపదలిచిన రాక్షసులు
దుండగంపు               =కొంటెతనపు
వేగైన                        =శుభోదయమగు
ఆగు                         = కాపాడు.
పెనుబాము               =ఆదిశేషుడు
తూగుమంచము        =ఉయ్యాలమంచము

తాత్పర్యము
ఆకుమీద పడుకొన్న చిన్ని కృష్ణుని చూస్తూ , పరవశించిన అన్నమయ్య ఆనందానుభూతి ఇలా కీర్తనలోని అక్షరాలుగా మారింది.

మర్రి ఆకు మీద పడుకొన్న ఈ బిడ్డ ఎంత ఆశ్చర్యము  కలిగించాడో  తెలుసా  ! వీడు  తేలికగా ఉన్నాడని  అనుకొంటున్నారా !  ఎంతో బరువైన రోలును తోసిన వాడు వీడు. ఏమి తెలియని నంగనాచిలా త్ప్రువ్వి త్ప్రువ్వి అంటున్నాడు. నేనూ అంటాను.

1. ఎవడైనా పుట్టిన తర్వాత వాళ్ల అమ్మో, నాన్నో, బంధువులో ఆభరణాలు  చేయిస్తే  ఒంటి మీదికి చేరతాయి. కాని ఈ కిట్టయ్యకి -పుట్టుకతోనే శంఖ  చక్రాలు ఒంటి మీదికి చేరాయి. ఎవరైనా ఒకేచోట పుడతారు. కాని ఈ కిట్టయ్య  దేవకి  గర్భంలో పుట్టడానికి ముందే , యశోదకి పుట్టిన వాడిగా చెలామణీ చేసుకోవటానికి ఏర్పాటు చేసుకొని( యోగ మాయగా)  మరీ పుట్టాడు తల్లీ ! ఎవరైనా నీళ్లలో హాయిగా ఉందని మునిగి తేలుతుంటారు. కాని వీడికిదేమి  బుద్ధో ! ఒట్టు పెట్టుకొన్నట్లుగా పాలు వెన్నలలో తేలిపోతుంటాడు. ఆ నాడు యశోదమ్మ  ఉయ్యాల  తొట్టెలోని శిశువు ఇప్పుడు మర్రి ఆకు మీద పడుకొన్నాడు. అదిగో ! నన్ను చూసి  త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి అంటున్నాడు. నేనూ అంటాను.

2. చిన్నవాడి లేత పాదం ఎంత ఉంటుందండి! ఎలా ఉంటుందండి! ముట్టుకొంటేనే కందిపోతుంది. అటువంటి పాదంతో రాక్షసుడి మాయతో నిండిన బండిని ఒక్క  తన్ను తన్నాడు. ఇంతే   సంగతులు చిత్తగించవలెను. ముక్కలు ముక్కలు!   తన దగ్గరగా చేరి చంపదలిచిన రాక్షసుల మదాన్ని  అణిచివేసిన బిడ్డ. ఆకారంలో ఇంత చిన్నగా  ఉన్నాడు. కాని కొండలంత ఆకారంలో ఉన్న రాక్షసులను కొట్టిన వాడు   వీడు. ఏమీ తెలియని వాడుగా ఉన్నాడు కాని కొంటెవాడు ఈ పిల్లవాడు  త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి.

3. శుభోదయాలు కలిగించే వేంకటాద్రి మీద  వేంకటేశునిగా వెలసిన వాడు ఈ శిశువు. తన కౌగిటిలో (వక్షస్థలంలో) ఎప్పుడూ లక్ష్మిని ఉంచుకొనే వాడు ఈ శిశువు.   పాల సముద్రంలో అందమైన ఆదిశేషుడనే    ఉయ్యాలమంచము మీద ఉండే ఆ విష్ణు మూర్తి ఈనాడు మర్రి ఆకుమీద ఉన్నాడు. ఆ బిడ్డ అన్నట్లు నేను కూడా  అనగలను. త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి

ఆంతర్యము

పుట్టు శంఖు చక్రముల బుట్టిన యా శిశువు
కృష్ణునికి పుట్టుకతోనే అతని పొడవైన నాలుగు చేతులలో గద, శంఖం, చక్రం, పద్మం వెలుగొందుతున్నాయని భాగవతంలో  ఉంది.(చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు-భాగ-10-112వ ప)  దీనినే అన్నమయ్య శంఖు చక్రములతో పుట్టాడని చెప్పాడు.

దొబ్బుడు రోల శిశువు
అన్నమయ్య భావనలలో  ఎంత తీపి ఉంటుందో భాషలో అంత స్వేచ్చ ఉంటుంది.  దొబ్బటం అనేది తెలంగాణా  ప్రాంతంలో తోయటం అనే అర్థంలో వాడే మాండలిక పదం. దీనిని తన కీర్తనలో హాయిగా వాడుకొన్నాడు కవి.

కొండలంతేసి , అసురుల  ఈ రెండు పదాలకు సంధి  రాదు. కాని అన్నమయ్య భాషలో  అసాధ్యం సుసాధ్యం. కొండలంతేసి + అసురుల =  కొండలంతేససురుల  అయింది. (ఈ సంధి  విషయం దూరభాషణంలో   నాకు సముద్రాల లక్ష్మణయ్యగారు వివరించారు)యశోద శ్రీకృష్ణుని నడుముకి రోలుకి కట్టింది. కృష్ణుడు రోలు లాగుకొంటూ  రెండు చెట్ల మధ్యకు వచ్చాడు. నడుముతో ఒక్క లాగు లాగ గానే, చెట్లు మొదళ్ళతో కూలిపోయాయి.నలకూబరుడు, మణిగ్రీవుడు ఇద్దరు గంధర్వులకు శాపం పోయింది. ఇది రోలు 'దొబ్బిన’ కథ.

పుట్టక తోల్లే మారుపుట్టువైన శిశువు
కృష్ణుడు పుట్టిన అష్టమి తిథి నాడే , యోగ మాయ (దుర్గా దేవి ) పుట్టింది. కృష్ణునికి , దుర్గకు తేడా లేదు. ఇద్దరూ ఒకటే. అంటే ఒకే అంశ, ఇటు దేవకీదేవి గర్భాన, అటూ యశోద గర్భాన పుట్టింది. అందువలననే అన్నమయ్య మారు పుట్టువు కలిగినవాడని కృష్ణుని పిలుస్తూ , కృష్ణుడు, దుర్గ ఒకటే అను  ఒక అద్భుతమైన రహస్యాన్ని ఆవిష్కరించాడు.

దుండగంపు శిశువు
మనస్సు అనే పెరుగును విచారణ అనే కవ్వంతో చిలికితే జ్ఞానమనే వెన్న, ఆత్మానుభూతి అనే నేయి లభిస్తాయి అని పెద్దల మాట. భక్తులమైన మనందరికీ ఇది తెలియచేయటానికే కృష్ణుని  పాలు, వెన్నల దొంగతనాలు.  కృష్ణుని కొంటె దొంగతనాలలో ఇలా ప్రతీకాత్మకమైన సందేశాన్ని  అర్థం చేసుకోవాలి. కృష్ణ పరమాత్మ లీలలను భక్తి భావముతో గ్రహించాలి కాని , కుతర్కము పనికి రాదని పోతన్న హెచ్చరిక (2-111)

ఆశ్చర్యకరమైన శిశువు,  దుండగంపు శిశువు , లక్ష్మీ దేవి కౌగిట్లో ఉన్న శిశువు  ముగ్గురూ ఒకరే.  కృష్ణుని ప్రతి చేష్టలోనూ భక్తిని దర్శించాడు కాబట్టే అన్నమయ్య  ‘దుండగంపు శిశువు’ అన్నాడు. లక్ష్మీదేవి కౌగిట్లో ఉన్న శిశువు అన్నాడు. భక్తితో కృష్ణుని  చేష్టలను ఆంతర్యాన్ని దర్శించలేకపోతున్నాము కాబట్టే మనము  కృష్ణుడు వెన్నదొంగగా , 16 వేల మంది గోపికలతో రాసక్రీడ చేసిన వానిగా  ఇంకా చెప్పుకొంటూ ఇహిహీ అని నవ్వుకొంటున్నాము. స్వస్తి.

మరిన్ని వ్యాసాలు

Ankitam
అంకితం
- మద్దూరి నరసింహమూర్తి
Peru lone pennidhi
పేరులోనే పెన్నిధి
- తోట సాంబశివరావు
పండరి విఠలుడు.
పండరి విఠలుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
ఇది నిజమా ???.
ఇది నిజమా ???.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మన రామాయణాలు .
మన రామాయణాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
జైనతత్వ శాస్త్ర ం
జైనతత్వ శాస్త్ర ం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.