వాస్తు - వాస్తవాలు - సూర్యదేవర వేణుగోపాల్. M.A(జ్యోతీష్యం)

 

 కొన్ని దిక్కులందు శుభ గ్రహాలు బలంగాఉంటాయి. కొన్ని దిక్కులందు అశుభ గ్రహాలు బలంగా ఉంటాయి. శుభగ్రహాలు బలంగా ఉన్న దిక్కులు శుభఫలితాలను, అశుభగ్రహాలు బలంగా ఉన్న దిక్కులు అశుభఫలితాలను భూమి పైకి ప్రసరింపచేస్తాయి. ఇదే దిక్కులలోని శుభ అశుభ ఫలితాల మర్మం. ఏయే దిక్కులందు ఏ గ్రహం బలంగా ఉంటుందో ఈ క్రింది శ్లోకం తెలియజేస్తుంది.

ప్రాచ్యామ్ శక్తౌసౌమ్యాజీవాయామ్యాయాం రవి మంగళౌ
మందో బలీప్రతిచ్యాంచ కుబేర్యామ్ చంద్ర భార్గవౌ

ఈ శ్లోకం ప్రకారం బుధుడు, గురుడు తూర్పున బలవంతులు. రవి కుజులు దక్షిణాన బలవంతులు. శని గ్రహం పశ్చిమంలో బలవంతుడు. ఉత్తరం నందు చంద్ర శుక్రులు బలవంతులు. వీటిని గ్రహ దిగ్బలములు అంటారు. అదే విధంగా నవగ్రహాలను దిక్కులకు అధిపతులుగా మన మహర్షులు నిర్ణయించారు. ఈ విధమైన విభజనలో ఏకాశితపదవిన్యాసంలో రాహువు నైరుతి లో, కేతు వు వాయవ్యంలో ఉంటారు. పై వర్గీకరణ ప్రకారం శుభగ్రహాలు తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కులలో బలంగా ఉండుట వలన ఈ దిక్కులు పూజనీయమైనివి గా పరిగణింపబడుచున్నవి. అదే విధంగా దక్షిణం పడమర నైరుతి మొ| దిక్కులలో పాప గ్రహాలు బలంగా ఉండుటవలన ఈ దిక్కులుతో జాగ్రత్తగా ఉండాలని వాస్తు తెలుపుతుంది. ఏ గృహాన్నైనా తూర్పు ఉత్తరాలను, పశ్చిమ దక్షిణాల కన్నా అధిక ఖాళీ ఉంచి నిర్మించాలని వాస్తు ఆదేశిస్తుంది. నవగ్రహ మండలాన్ని మనం గమనించినట్లైతే ఈ దిక్కులందు శుభగ్రహాల బలం ఉంటుంది.ఈ శ్లోకం గమనించండి....

                       మధ్యే వర్తులాకార మండలే రవి:

                   ఆగ్నేయ దిగ్భాగే చతురస్రమండలే చంద్ర:

                   దక్షిణ దిగ్భాగే త్రికోణాకార మండలే కుజ:

                   ఈశాన్య దిగ్భాగే బాణాకార మండలే బుధ:

                   ఉత్తర దిగ్భాగే దీర్గ చతురస్రమండలే గురు:

                   ప్రాగ్ భాగే పంచకోణాకార మండలే శుక్ర:

                   పశ్చిమ దిగ్భాగే ధనురాకార మండలే శని:

                   నైరుతి దిగ్భాగే సూర్పాకారమండలే రాహు:

                   వాయవ్య దిగ్భాగే ధ్వజాకార మండలే కేతు:  ----  

“సూర్యసిద్ధాంతం”                                                              

నవగ్రహ మండలంలో తూర్పు, ఉత్తర ,ఈశాన్యంలో శుభ గ్రహాలైన గురు, బుధ శుక్రులు ఉంటారు. ఈ గ్రహాలు   శుభమైన కిరణాలను లేదా cosmic rays ప్రసారం చేస్తాయి. వీటి వలన గృహస్తుకు శుభఫలితాలు వస్తాయి. ఈ గ్రహాల శుభదృష్టి మనిషి మనుగడకు, సుఖ జీవనానికి అవసరం. కనుక ఈ దిక్కులందు అధిక ఖాళీ స్థలం వదిలినట్లైతే అధిక ప్రదేశంలో ఈ గ్రహ దృష్టి పడి సుఖ శాంతులు కలుగుతాయి.ఈ దిక్కులలో  అధిక ఖాళీ ఉంచి ఇంకా తేలికగా బరువులు వేయకుండా ఉంచితే అధికంగా శుభ గ్రహాల మరియు దిక్పతుల ప్రభావం పడి గృహస్తుకు అధిక సుఖ శాంతులు లభిస్తాయి. కనుకనే ఈ దిక్కులందు అధిక మైన ఖాళీ స్థలం వదలమని వాస్తు చేపుతుంది. ఈ గ్రహ దృష్టి కోసమే ఈ దిక్కులను విశాలంగా మరియు పవిత్రంగా ఉంచాలి.

అశుభ గ్రహాల దృష్టి లేదా cosmic rays వీలైనంత తక్కువగా పడాలి కనుక నవగ్రహామండలంలో  పాపగ్రహాల బలం కలిగిన దక్షిణ పశ్చిమ నైరుతి ఆగ్నేయ వాయవ్య  దిక్కులందు తక్కువ స్థలం వదలాలి. ఈ గ్రహాల కిరణాలకు అవరోధం ఉండాలి. కనుకనే ఈ దిక్కులలో బరువులు వుంచి తక్కువ స్థలం వదిలితే గృహస్తుకు సమస్యలు రావు. అంటే చెడును ప్రసాదించే దిక్కులలో తక్కువ ఖాళీ స్థలం వదలి, మంచిని కలిగించే దిశలలో ఎక్కువ ఖాళీ స్థలం వదిలినట్లైతే మనిషి జీవితం శుభ గ్రహ దృష్టి వలన సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. కనుకనే మంచి దృష్టిని ప్రసాదించే తూర్పు ఉత్తర ఈశాన్యంలో ఎక్కువ ఖాళీ స్థలం వదలి ప్రతికూల దృష్టిని ప్రసారం చేసే దక్షిణ పశ్చిమ మొ|లగు దిక్కులలో తక్కువ ఖాళీ స్థలం వదలమని వాస్తు  ఆదేశిస్తుంది.

గ్రహం మరియు దిక్పతుల ప్రభావం సరిగా ఉండటానికి ఇంటికి 4 ప్రక్కల ఖాళీ స్థలాన్ని వదలాలి. హద్దులపై నిర్మాణం ఉండకూడదు. చెడును ప్రసాదించే దిక్కులను కూడా కావలసినంత మేరకు ఉపయోగించుకోవాలి. అప్పుడే  మంచి ఫలితాలు వస్తాయి. సమస్యలు దక్షిణం పడమర దిశల నుండి ఉంటాయని ఈ దిశలకు ఇంటిని ఖాయం చేసి ఖాళీ వదలకుండా నిర్మించకూడదు. ఈ విధంగా ఇంటిని నిర్మిస్తే నైసర్గిక వాస్తు దోషం సోకుతుంది. మన మహర్షులు 4 ప్రక్కల ఖాళీ స్థలాన్ని వదలిన ఇంటికి వాస్తుదోషం ఉండదని చెప్పడం జరిగింది.

                       చతుర్ద్వారే గృహేచైవ వాస్తు దొషో న విద్యతే.------   నారద సంహిత.

 4 ప్రక్కల స్థలం వదలి ద్వారాలను అమర్చితే గృహానికి వాస్తు దోషం ఉండదని పై శ్లోకం తెలుపుతోంది. ఇంటికి 4 ప్రక్కల ద్వారాలను అమర్చితే శుభఫలితాలు వస్తాయి. తూర్పు ద్వారం వలన దైవ భక్తి, ఉత్తర ద్వారము వలన సిరి సంపదలు దక్షిణ ద్వారం వలన సకల సౌఖ్యాలు, ఇంకా పశ్చిమ ద్వారం వలన ధనం ధాన్యం వంటి లాభాలు కలుగుతాయని మన మహర్షులు చెప్పడం జరిగింది. కనుక శుభ ఫలితాలకు గృహానికి 4 ప్రక్కల పిశాచ భాగం వదలి గృహాన్ని నిర్మించుట మంచిది. 

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Prabhu Bhakthi
కాశీ ప్రయాణ కథలు - ప్రభు భక్తి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Mukhesh mills mystery
ముఖేష్ మిల్స్ మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Kashi Prayana Kathalu - Gaddi vamu vadda Kukka
గడ్డివామి దగ్గర కుక్క
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaashi Prayana Kathalu - Thalli Thandrulu daivalu
తల్లి -తండ్రి ప్రత్యక్ష దైవాలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srikrishnuniki Gandhari sapam
శ్రీకృష్ణునికి గాంధారి శాపం
- విష్ణుభొట్ల రామకృష్ణ