శిశిర వల్లకి - పుస్తక సమీక్ష - సిరాశ్రీ

shishira vallaki - book review

శిశిర వల్లకి (గజళ్లు)
కవి: పెన్నా శివరామకృష్ణ
వెల: 70/-
ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ, ప్రజాశక్తి, నవయుగ
కవి దూరవాణి: 94404 37200

నాశిక్ లో పుట్టిన గోదావరి రాజమండ్రిలో విస్తరించుకున్నట్టు, పార్శీలో పుట్టిన గజల్ తెలుగు భాషలో విప్పారుతోంది. ఎందుకంటే గజల్ పార్శీ, ఉర్దూల్లో ప్రధానంగా ప్రేమ, విరహం కవితా వస్తువులుగా ఉంటే తెలుగులో మాత్రం నవరసాలు చిలుకుతోంది.

సి నా రె కలం ప్రాభవం, గజల్ శ్రీనివాస్ గళం ప్రభావం కలిసి తెలుగు సహితీ వనంలో గజల్ కదం తొక్కుతోంది. కనిపించేంత తేలిక కాకపోవడం, ఛందో నియమాలు బలంగా ఉండడం, ప్రతి రెండు పంకుల్లోనూ గుండెకు తాకే భావం పలికించాల్సిన అగత్యం ఉండడం కారణంగా ఔత్సాహిక కవులు గజల్స్ రాసేందుకు ముందుకు వచ్చినా మునుముందుకు సాగడంలో విఫలం అవుతున్నారు.

అయితే కొందరు కవులు మాత్రం తెలుగు గజల్ కవితా సేద్యం చేస్తూ పుస్తకాలు వెలువరిస్తున్నారు. వారిలో పెన్నా శివరామకృష్ణ గారిని ప్రముఖంగా చెప్పుకోవాలి. వీరు గతంలో 'సల్లాపం' అనే ఒక గజల్ సంకలనాన్ని మన ముందుకు తెచ్చారు. ఇప్పుడు 'శిశిర వల్లకి’ వారి తాజా గజల్ గుచ్చం. 76 గజళ్లు తో గుబాళించే ఈ ‘శిశిర వల్లకి’ పేరుకు తగ్గట్టుగా భగ్న ప్రేమ ప్రధాన వస్తువుగా సాగుతుంది.

గజల్లో కవి నామ ముద్ర తఖల్లుస్ ఉండడం తెలిసిందే. పెన్నా వారి తఖల్లుస్ 'పెన్నా'. అయితే పలు గజల్స్ లో ఈ ముద్ర కనపడదు. తఖల్లుస్ లేకుండా గజల్స్ వ్రాయడం కూడా పరిపాటే. అయితే ఒక గజల్లో

"నా పేరే నచ్చక, చీదరించుకుని ఈ 'మక్తా'
చోటివ్వక, చెలి హృదయంలాగే బాధిస్తూ ఉంది"

అంటూ భగ్న ప్రేమ వలన తన పేరు కూడా తనకు నచ్చని విధాన్ని తఖల్లుస్ లేకుండా ఇలా చమత్కారంగా వ్యక్తీకరించారు.

"ప్రేయసి ముందర గజలును గానం చేయాలనుకుంటే
మాటకు మాటకు మధ్యన శూన్యం వ్యాపిస్తూ ఉంది"

అనేది చాలా బరువైన భావం.

అలాగే మరో గజల్లో

"ఆడ శిశువుకు కొత్త పేరును చెప్పమని ఎవరడిగినా
ఎప్పుడూ అందముగ మనసుకు తోచినది నీ నామమే"

వంటి మక్తా వ్రాయాలంటే స్వానుభవంలో ప్రేమానుభవం మెండుగా ఉండి తీరాలనిపిస్తుంది.

"మూఢవిశ్వాసాలు అసలే లేని 'పెన్నా' ఎందుకో!
ప్రతి కొత్త లేఖిని తోటి, తొలిగా రాసినది నీ నామమే"

కూడా ఇదే కోవకు చెందే మక్తా.

తన భగ్న ప్రేమ నలుగురికీ తెలిసిపోయిందన్న బాధను

"గజలు వల్లనె ఇంత కష్టం కలిగె ఈనాడు
లోకులకు, నా ప్రేమ భగ్నత తెలిసిపోయింది"

అంటూ తేలిక పదాలతో మనసును బరువెక్కించే గుణం పెన్నా వారి పెన్నులో ఉంది.

"కథలు కంచికి వ్యథలు మంటికి చేరునంటారు
ఆరంభ బిందువు వద్ద నా కథ ముగిసిపోయింది"

ఇంతకంటే భగ్న ప్రేమ గురించి ఇంకేం చెప్పాలి. ఇలా 76 గజళ్లలోనూ అనేక భావాలు మనసుని తాకి ఊరుకోవు..కుదుపుతాయి.

ఇది పాఠకులకి, కవితా ప్రియులకి శిశిర వల్లకే అయినా గజల్స్ రాయాలనుకునే అనేకమంది ఔత్సాహికులకి మాత్రం కొత్త భావాలు చిగురిస్తుంది..అంటే వారికి మాత్రం ఇది వసంత పల్లకి అన్నమాట.

మరిన్ని వ్యాసాలు

మొధెరా సూర్య దేవాలయం.
మొధెరా సూర్య దేవాలయం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
హవామెహల్ .
హవామెహల్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్
సాలార్ జంగ్ మ్యుజియం.
సాలార్ జంగ్ మ్యుజియం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు