కోతికి తిక్క కుదిరిన వేళ - మీగడ.వీరభద్రస్వామి

When the monkey is crushed

కోతికీ తిక్క కుదిరిన వేళ (కథ) ఒక తోటలో ఒకకోతి వుండేది. ఆ తోటలో ఆ కోతే మిగతా జీవరాశి మీద పెత్తనం చెలాయిస్తూవుండేది.ఆ తోటలో ఆ కోతికి ఎదురు తిరిగే సాహసం ఏ జీవీ చేసేది కాదు. తన హవాకి తిరుగులేదని దానికి గర్వం పెరిగిపోయింది. దాని అల్లరికి అడ్డూ అదుపు వుండేది కాదు.అకారణంగా చిన్నాచితకా జీవులను హేళన చేసేది ,హింసించేది. ఒకరోజు ఒకనాగుపాము తోటలోకి వచ్చింది. దానికి సహజ ఆహరమైన ఎలుకలు , కప్పలు కోసం వెదకసాగింది. దానికి కోతి ఎదురుపడింది.కోతికి నమస్కారం చేసి చిరునవ్వుతో పలకరించింది పాము. "పాము బాగా అమాయక ప్రాణిలా వుంది,దీన్ని ఆటపట్టించి ఆనందపడాలి" అని ఆలోచించింది కోతి. వెంటనే ఆ తోటచివర ఒకచెట్టునీడలో బుట్టలు అల్లకుంటున్న ముసలి మేదరిని బెదిరించి ఒక బుట్టను లాక్కొచ్చి చీమకుకూడా హాని చెయ్యకుండా ప్రశాంతంగా మటంవేసుకొని ద్యానంచేసుకుంటూ వున్న పాముని మేదరి బుట్టతో మూసివేసింది కోతి. ద్యానం నుండి లేచిన పాము ఈ అల్లరి పని చేసింది కోతే అయివుంటుందని గ్రహించి "మిత్రమా నన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు, దయచేసి నన్ను వదిలేయ్ నేను ఈ తోటకు దూరంగా వెళిపోతాను" అని ప్రాదేయపడింది పాము.కోతి వెటకారంగా నవ్వుతూ నువ్వు ఇకపై నా బానిసవు నీకోరలు పీకి నిన్ను ఆటలాడించి అందరినీ ఆనందపరిచి,గారిడీ విద్యలు చేసి నా ఆహారం కొనుక్కోడానికి డబ్బులు సంపాదించుకుంటాను" అని, పాముని ఉక్కిరిబిక్కిరి చెయ్యడానికి కోతి పాముని మూసి ఉంచిన బుట్టపై కూర్చోని వెటకారంగా మాట్లాడుతూ పాముని రెచ్చగొట్టింది. కోతిని ఎన్ని విధాలుగా బ్రతిమిలాడినా తనకు బుట్ట బంధిఖానా నుండి విముక్తి కలగకపోవడంతో పాముకి కోపం వచ్చి తన కోరలతో బుట్టను కొరకడం మొదలు పెట్టింది. పాము చర్యలను తేలిగ్గా తీసుకున్న కోతి కూనిరాగాలు తీస్తూ...కునుకు తీసింది. పాము ప్రయత్నం ఫలించి బుట్ట పైభాగంలో కన్నం పడగా, కేవలం కోతిని బెదిరించడానికి పాము కోతిని కాటువేస్తూ కోతి శరీరంలోనికి తన విషం దించకుండా జాగ్రత్తలు తీసుకుంది. పాము కాటుకి కోతి బెంబేలెత్తిపోయింది. భయంతో అరుస్తూ "నన్ను పాము కాటువేసింది నన్ను కాపాడండి"అంటూ కనిపించిన ప్రతిజీవినీ బ్రతిమిలాడింది, కోతి వేషాలు తెలిసిన కొన్నిజీవులు "ఓరి! దీని వేషాలూ...!"అనుకుంటూ పట్టించుకోకుండా పోతే ,మరికొన్ని జీవులు "ఈ కోతి ఆగడాలకు తగిన శాస్తి జరిగింది" అని సంబరపడ్డాయి.ఇంకొన్ని జీవులైతే "పోయి పోయి అసలు సిసలు నాగుపాముతో పెట్టుకున్నావు లడాయి ఆ నాగుపాము విషం చాలా ప్రమాదకరం ఇకనీకు చావు తప్పదు" అని భయపెట్టి,"నీ శరీరం నుండి విషాన్ని తీసేయమని పాముని వేడుకుంటాము,ఇప్పటికైనా బుద్దిగా ఒక మూల కుదురుగా వుండు"అని హితవు పలికాయి. కోతి కిమ్మనుకుండా ఒక చెట్టు కొమ్మ ఎక్కి కూర్చొని ధీనాతి ధీనంగా బిత్తర చూపులు చూడటం మొదలు పెట్టింది, తోటలోని జీవరాశి నాగుపాముకీ దండం పెట్టి "కోతి బుద్ధి తక్కువ తనాన్ని మన్నించి దాని ప్రాణాలు కాపాడు" అని కోరాయి."కోతికి ప్రాణాపాయం లేదని" మిగతా జీవులకు సైగలు చేస్తూ...కోతికి తాను కాటువేసిన భాగంనుండి కోతి శరీరం నుండి విషాన్ని వెనక్కి లాగినట్లు నటించింది పాము. కోతి బ్రతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకొని, తన అల్లరి చిల్లర పనులకు తోటలోని మిత్రులకు క్షమాపణ చెప్పి ,లెంపలేసుకొని "ఇకపై అందరితో సరదాగా వుంటాను తప్ప అల్లరి చెయ్యను"అని హామీ ఇచ్చింది. "శుభం" అని తోట జీవులు ఆనందంగా చప్పట్లు కొట్టాయి.

మరిన్ని వ్యాసాలు

నాన్న కి ప్రేమతో...
నాన్న కి ప్రేమతో...
- ఉషాభగావతి పేరి
కట్టమంచి రామలింగారెడ్డి.
కట్టమంచి రామలింగారెడ్డి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్.
పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
పాలగుమ్మి పద్మరాజు.
పాలగుమ్మి పద్మరాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
హరికథా చక్రవర్తి ఆదిభట్ల నారాయణదాసు.
హరికథా చక్రవర్తి ఆదిభట్ల నారాయణదాసు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.