మధ్యయుగాల్లో రాజ్యమేలిన మను రాజ్యాంగం - Pillaa kumaraswaamy

మధ్యయుగాల్లో  రాజ్యమేలిన మను రాజ్యాంగం

భారతదేశంలో దాదాపు ముప్పై అయిదు స్మృతులున్నాయి. వీటిల్లో మను స్మృతి అగ్రగణ్యం. దీని తర్వాతనే యాజవల్క స్మృతి, పరాశరస్మృతి మొదలయినవి లెక్కకు వస్తాయి. మనుస్మృతి అనగానే మనువు రచించిన స్మృతి అని ఎవరికైనా తెలుస్తుంది. అయితే ఈ మను వెవ్వరో నిర్ణయించటం దుస్సాధ్యం. రుగ్వేదంలో పితృ మనువు ప్రస్తావన ఉంది. శతపథబ్రాహ్మణంలోని జలప్రళయ కథలో మనువు కనబడతాడు. పురాణాల ప్రకారం పద్నాలుగు మనువులు గోచరిస్తారు. వీరిలో మొదటివాడు బ్రహ్మ పుత్రుడైన స్వాయంభువ మనువు. ఇతని సంతతివారే మానవులు. అమరకోశం కూడా మనువు వలన పుట్టినవారు మానవులనీ (మనోద్ఘాతా మను-1) మనువుసంబంధమైనవారు మానవులనీ (మ కోరేమే మానవా!) పేర్కొంటున్నది. అయితే రామాయణం మాత్రం కశ్యప ప్రజాపతికి ఎనిమిది మంది భార్యలున్నారని, వారివల్ల మానవునితోపాటు సమస్త ప్రాణులూ జన్మించాయనీ (అరణ్య కాండం. 14 సర్గం) చెపుతోంది. కశ్యపప్రజాపతి భార్యల్లో మనువు ఒకటి. ఆమె బ్రాహ్మణాది వర్ణములతో కూడిన మనుష్యులను కన్నది. (గ 28) మనువుల్లో రెండవవాడు స్వారోచిషుడు. ఇతడు స్వరోచికి, వనదేవతకూ పుట్టినవాడు. అల్లసాని పెద్దన మనుచరిత్రలో ఇతని వృత్తాంత ముంది. మనువుల్లో ఏడవవాడు వైవస్వత మనువు. ఇతడు సూర్య పుత్రుడు. సూర్యవంశ రాజుల మూల పురుషుడు. కాళిదాను వేదాలకు ఓంకారం మాదిరిగా రాజులకు మొట్ట మొదటి వాడయిన వైవస్వతుడని ప్రసిద్ధికెక్కిన మనువున్నాడని రఘువంశంలో (సర్గం 1. శ్లోకం 11) వర్ణిస్తాడు. ఒక్కొక్క మనువు జీవిత కాలానికి మన్వంతరం అని పేరు. ఒక్కొక్కబ్రహ్మకల్పం లో పద్నాలుగు మంది మనువులు మారతారు. ఒక మనువు పరిపాలనా కాలం 4,32,000 మనుష్య సంవత్సరాలని భాగవతం మూడో స్కంధంలో ఉన్నది. మనువు విశ్వపరిపాలనం చేసే ధర్మ నిర్ణేత అని భారతీయుల విశ్వాసం. ఇది మను వృత్తాంతం. ఇప్పుడు మనకు లభించిన మనుస్మృతిని రచించిందెవరు? పౌరాణిక విశ్వాసం వేరు. చారిత్రక పరిశోధనం వేరు. మనుస్మృతి క్రీ.పూ. 500లో అవతరించిందని కొందఱు పరిశోధకులు పేర్కొన్నారు. మరి కొందరు క్రీ. పూ. 2వ శతాబ్ది,క్రీ.శ. 2వ శతాబ్ది మధ్య కాలంలో ఇప్పటి మనుస్మృతి రూపొందింద న్నారు. ఏది ఏమయినా భృగు వంశీయులు మనుస్మృతిని రచించి ప్రజలకు దానిపై భక్తి గౌరవాలు కలగటానికి మనువే దాన్ని సృష్టించారని ప్రచారం చేశారు. మనుస్మృతి మొదటి అధ్యాయమే దీనికి సాక్ష్యం. దీనిలో మనువు తన దగ్గరకు వచ్చిన రుషులకు సృష్టి క్రమాన్ని వివరించి తర్వాత సకల మానవుల కుపయోగకరంగా తాను సృజించిన స్మృతిని వారి కుపదేశింపుమని భృగువు నాజ్ఞాపించాడు. మనుస్మృతి భృగుసంహితగా పేరు పొందిందని మనం మరచిపోరాదు. మను ధర్మ గ్రంధం క్రీ.పూ. 1250-1000 కాలానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. సంస్క్రతంలో ఉన్న ఈ గ్రంధాన్ని 1794 లో సర్ విలియం జోన్స్ ఆంగ్లంలోకి అనువదించాడు. స్మృతి అంటే ధర్మశాస్త్రం. మనువు రాసిన ధర్మశాస్త్రాన్నే మనుస్మృతిగా పేర్కొంటున్నారు. దీనిలో మొత్తం 12 అధ్యాయాలు, 2,684 శ్లోకాలు ఉన్నాయని చరిత్రకారుడు నరహర్ కురుంద్కర్ (1932-1982) పేర్కొన్నారు. మనుస్మృతిని తగలబెట్టడాన్ని తాను సమర్థిస్తానని ఆయన గతంలో అన్నారు. ''దీనిని క్రీస్తు పూర్వం రెండు, మూడు దశాబ్దాలలో ప్రారంభించి ఉండొచ్చు. దీనిలో మొదటి అధ్యాయంలో నాలుగు శకాల గురించి, నాలుగు వర్ణాల గురించి, వారి వృత్తుల గురించి, బ్రాహ్మణుల గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. రెండో అధ్యాయంలో బ్రహ్మచర్యం గొప్పతనం గురించి, యజమానికి చేయాల్సిన సేవ గురించి పేర్కొన్నారు. మూడో అధ్యాయంలో వివాహ పద్ధతుల గురించి, పూర్వీకులకు చేయాల్సిన కర్మల గురించి రాసుకొచ్చారు. నాలుగో అధ్యాయంలో ఒక గృహస్థ ధర్మం గురించి, ఏమేం తినకూడదన్న దాని గూర్చి, 21 రకాల నరకాల గురించి వివరించారు.'' ''ఐదో అధ్యాయంలో మహిళల బాధ్యతల గురించి, ఆరో అధ్యాయంలో సన్యాసి యొక్క విధుల గురించి, ఏడో అధ్యాయంలో రాజు బాధ్యతల గురించి, ఎనిమిదో అధ్యాయంలో నిత్య జీవితంలోని విషయాల గురించి, నేరాలు, న్యాయం మొదలైన వాటి గురించి, తొమ్మిదో అధ్యాయంలో వారసత్వ వివరాల గురించి, పదో అధ్యాయంలో వర్ణ సాంకర్యం గురించి, పదకొండో అధ్యయంలో పాపాల గురించి, పన్నెండో అధ్యాయంలో మూడు రకాల పుణ్యాలు, వేదాల ప్రాశస్త్యం గురించి వివరించారు'' అని కురుంద్కర్ తెలిపారు.(bbc న్యూస్ నుండి 1.11.2018) భారతదేశం వర్ణవ్యవస్ధ కలిగిన దేశం. ఇటువంటి వర్ణవ్యవస్ధ అఖండ భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. భారత సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర సమాజంగా మనుస్మృతి విభజించింది. ఈ వ్యవస్ధ శూద్రులకు విద్య, ధనసంపాదన లోనే గాక చాలా విషయాల్లో అనేక నిషేదాలు విధించారు. “ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతడి నోటిలో, చెవుల్లో మరిగించిన సీసం పోయాలి”(మనుస్మృతి 8-272).“అగ్రవర్ణలతో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులు కోసివేయాలి లేదా ఇనుపకర్రలతో కాల్చాలి” (మనుస్మృతి 8-281) “శూద్రుడు ఆస్తి సంపాదించరాదు” (మనుస్మృతి 10-29). “హీన జాతి పురుషుడు ఉన్నత స్త్రీని తనను వలచినదాననైనను మొహమున పొందునో వానికి ‘లింగచ్చేదము, వధయను’ దండమునకు అర్హుడు” (మనుస్మృతి 8-366). మనుస్మృతిని మొదట సవాలు చేసింది మహాత్మా జోతిబా ఫూలే. వ్యవసాయ కూలీలు, నిరుపేద రైతులు, ఇతర పేదవారు, సమాజంలో దోపిడీకి గురవుతున్నవారిని చూశాక ఆయన బ్రాహ్మణులను, వ్యాపార వర్గాలను తీవ్రంగా విమర్శించారు. "వర్ణవ్యవస్థ ద్వారా మనువు కేవలం శ్రమను వేరు చేయలేదు. శ్రామికులను వేరు చేశారు'' అని అంబేద్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. "మనువు చతుర్వర్ణాలను ప్రవచించారు. వాటిని పవిత్రంగా కాపాడాలని వర్ణ వ్యవస్థను సమర్థించారు. మనువే వర్ణవ్యవస్థను సృష్టించాడని చెప్పలేం కానీ, దానికి విత్తనాలను నాటింది మాత్రం ఆయనే'' అని అంబేద్కర్ తన 'ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం'లో పేర్కొన్నారు. శూద్రుల కు వ్యతిరేకంగా అనేక నిబంధనలు విధించి వారిని సామాజికంగా ఆర్థికంగా అణచివేశారు. 1. శూద్రులు పాలకులుగా ఉన్న రాజ్యంలో బ్రాహ్మణులు నివసింపరాదు. ( మనుధర్మశాస్త్రం 4:61) 2. ఏ విధంగాను మత పరమైనా,లేక యాగ పరమైనా కూడా బ్రాహ్మణులు శూద్రుల నుండి యాచించ రాదు. ( మనుధర్మశాస్త్రం 11:24) 3. ఉన్నత వర్ణాల స్త్రీలతో లైంగిక సంబంధం గల శూద్రులను ఇలా శిక్షించాలి.ఆ స్త్రీ ఎవ్వరి రక్షణలో లేనట్లయితే ,అతడు నేరం చేసిన అవయవాన్ని ఖండించాలి. ఆ స్త్రీ ఎవరి సంరక్షణలో నైనా ఉన్నట్లయితే అతడికి మరణశిక్ష విధించాలి. ( మనుధర్మశాస్త్రం 8: 374) 4. బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే ధర్మ నిర్ణయం చేయగలడు.కానీ శూద్రులు ఎంత పాండిత్యం సంపాదించుకున్నా ఆ స్థానం చేరుకోలేడు. ( మనుధర్మశాస్త్రం 8:20) 5. ఏ రాజు యొక్క రాజ్యంలో శూద్రులు ధర్మ నిర్ణయం చేస్తారో ఆ రాజ్యం ఊబిలో పడిన ఆవు వలే కుంగిపోతోంది. ( మనుధర్మశాస్త్రం 8:21) 6. ఏ శూద్రుడైనా గర్వంతో ధర్మాన్ని ప్రవచించునో అతని నోటిలో,చెవులలో మసలుతున్న నూనె పోయించబడుతుంది. ( మనుధర్మశాస్త్రం 8: 272) 7. శూద్రులకు విద్య గరిపిన బ్రాహ్మణులు , శూద్రుల వద్ద విద్యాభ్యాసం చేసిన బ్రాహ్మణులు శ్రాద్ధ కర్మల నిర్వహణకు అనర్హుడు. ( మనుధర్మశాస్త్రం 3:156) 8. శూద్రుని సమక్షంలో వేదాలను పఠించరాదు. ( మనుధర్మశాస్త్రం 4:99) 9. శూద్రుడు ఆస్తులు సంపాదించే శక్తి ఉన్నప్పటికీ, అఉడు తన అవసరాలకు మించిన సొత్తును కలిగి ఉండరాదు. అలా సంపాదించి ధనాన్ని కూడబెట్టడం జరిగితే అతడు అహంకార పూరితుడై బ్రాహ్మణులను లక్ష్యపెట్టక పోవచ్చును. ( మనుధర్మశాస్త్రం 10:129) 10. బ్రాహ్మణుడు తన జీవనానికి ఎలాంటి లోపం ఏర్పడినా సందేహించకుండా శూద్రుని వస్తు,సంపదలను స్వాధీనం చేసుకోవచ్చు. ( మనుధర్మశాస్త్రం 8:417) 11. భగవంతుడు ఆదేశించినట్టుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులను సేవించడమే శూద్రుల వృత్తి ( మనుధర్మశాస్త్రం 1:9) 12. బ్రాహ్మణులకు సేవకులుగా ఉండడమే శూద్రులకు తగిన వృత్తి. మరీ పని కూడా దీనికి సాటిరాదు. ( మనుధర్మశాస్త్రం 10:123) 13. బ్రాహ్మణుడు జీతం భత్యాలతో నిమిత్తం లేకుండా శూద్రులతో సేవలు చేయించుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులకు బానిసలుగా ఉండడానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు. ( మనుధర్మశాస్త్రం 8:413) 14. ఎవరైనా శూద్రుడు ద్విజుణ్ణి దూషించినట్లయితే ఆ శూద్రుని నాలుక కత్తిరించబడుతుంది.ఎందుకంటే శూద్రులు అతి తక్కువ జాతి వారు కనుక ( మనుధర్మశాస్త్రం 8:270) 15. ద్విజులయెక్క పేర్లు,కులాలను తిరస్కరిస్తూ ప్రస్తావించిన శూద్రుల నోటిలో పది వేళ్ల పొడవు గల ఇనుప మేకును ఎర్రగా కాల్చి దూర్చాలి. ( మనుధర్మశాస్త్రం 8:271) 16. బ్రాహ్మణుని పేరు సంతోషాన్ని గుర్తుకు తెచ్చేదిగా,క్షత్రియుల పేర్లు రక్షణకు మారు పేరుగా,వైశ్యుల పేర్లు వృద్ధిని చూపేదిగా ఉండాలి. శూద్రుల పేరు సేవక వృత్తిని చూపునట్లు ఉండాలి. ( మనుధర్మశాస్త్రం 2:32) 17. బ్రాహ్మణుల ఇంటిపేరు శుభప్రదమైనదిగా, క్షత్రియుల ఇంటిపేరు శక్తిని చూపేదిగా,వైశ్యుల ఇంటిపేరు ధన సంపత్తిని సూచించేదిగా ఉండాలి.శూద్రుల ఇంటిపేరు హేయమైనదిగా ఉండాలి. ( మనుధర్మశాస్త్రం 2:31) (బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి రచనలు వాల్యూమ్ 5. పేజీ నంబరు 145 నుండి 149) శూద్రులంటే నేటి వెనుకాడిన కులాలు. వీరిని కాలక్రమంలో మహాశూద్రులుగా (బాగా వెనుకబడిన వాళు) అతి శుద్రులుగా (అంటరాని వాళ్ళు) తిరిగి విభజించారు. ఈ మధ్యకాలంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకుని పరిపాలించారు. అందరూ చదువుకోవడంతో కొన్ని నిర్భంధాలు కొద్దిగా సడలాయి. హిందూ మతంలోని శూద్రులను, మహిళలను కనీసం మనుషులుగా కూడా లెక్కించలేదు మనువు. కులాల వారీగా విధులను, బాధ్యతలను విభజించి శూద్రులకు బానిస బతుకును శాశ్వతం చేసింది మనుస్మృతి. పుట్టుక ఆధారంగా అసమానత్వం, కులం, లింగం ఆధారంగా శిక్షలను ఖరారు చేసింది మనుస్మృతి. చేసి, శిక్షల నుంచి ద్విజు (బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ)లు చేసిన నేరాలకు శిక్షల నుండి మినహాయింపులు ఇచ్చి, శూద్రులకు మాత్రం వారు నేరాలు చేయకున్నా ఘోరమైన శిక్షలకు బలి చేసింది. వారికి భవిష్యత్‌ అనేదే లేకుండా చేసి ఆజన్మ బానిసలుగా మార్చేసింది. “ఒక దేశ అభివృద్ధిని తూకం వేయాలంటే ఆ దేశంలో స్త్రీకి ఎంత స్వేచ్చ అభిస్తుందో గమనించాలి” అన్నారు అంబేద్కర్. అనేక మహిళా సంఘాలు మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించాయి. మనుధర్మ శాస్త్రం మహిళలను కించపరచేలా కొందరి చేత వ్రాయబడినదని కొందరు అభిప్రాయపడ్డారు. భారతీయ సమాజం పురుషాధిక్య సమాజమని వారు అభిప్రాయ పడుతున్నారు. శూద్ర కులాల వారిని మనుధర్మ శాస్త్రం చిన్న చూపు చూసింది. భారత దేశ రాజ్యాంగం ప్రజలందరికీ కులాలకు అతీతంగా సమాన హక్కులు ఇచ్చింది. అందువల్ల మనుధర్మ శాస్త్రం బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలవారికి తప్ప ఇతర కులాల వారికి అధర్మ శాస్త్రంగా కనిపిస్తుంది. ఆర్యుల కాలంలో వర్ణ వ్యవస్థ ఉండటానికి కారణం వృత్తిని బట్టి కుల విభజన అయితే మరో కారణం ఆనాటి ప్రజలపై మనుధర్మ శాస్త్రం బలవంతంగా రుద్దడం వల్ల అని చెప్పవచ్చు. మను ధర్మాన్ని కీర్తించే ఆధునికులు ఉన్నారు. దీనికి కారణం ఆధునిక విద్య ప్రజలకు ఆధునికమైన బుద్ధిని ఇవ్వలేకపోవడమే. ఆలోచనను పెంచడానికి బదులుగా ఆధునిక విద్య సంప్రదాయాలను సమర్థించుకోవడానికి, కొత్తగా వాదించడానికి ఉపయోగిపడింది. అందువల్లే వాళ్లు ఇంకా సంప్రదాయవాదులుగా, ఛాందసవాదులుగా మిగిలిపోతున్నారని పలువురు మేధావులు భావిస్తున్నారు.