పాత్రధారి - బొల్లిముంత వెంకట రమణా రావు .

Paatradhaari

రాత్రి పది గంటలు-

వెన్నెల కాంతి, చీకటి ముసురు మద్య తారకలు ఒక కళాకారుడి నట విన్యాసం వీక్షించడానికి ఎదురుచూస్తున్నాయి. పిల్లవాయువులు అతని భుజం తడుతూ ఇక నీ నటన కౌశలం ప్రదర్శించమని భుజం తట్టాయి. అతనిలో కళాకారుడు నిద్రలేచాడు.

అపార్ట్‌మెంట్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. మూడో అంతస్తులోని ఒక గదిలో మాత్రం గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి.

శివానందం! త్వరలో ప్రదర్శించబోయే నాటికలోని తన పాత్ర డైలాగ్స్ “రిహార్సల్స్” మొదలు పెట్టాడు.

“నేను ఓడిపోలేదు... ఓటమి నా రక్తంలో లేదు. నరనరాన పౌరుషాగ్ని రగులుతూనే ఉంటుంది. కళకు అంకితమైన కళాకారుడిని కానీ, కళంకితుడ్ని కాదు. ఎవరూ ఏమన్నా, కళ నా ఊపిరి. నేను ఊపిరితో ఉన్నానంటే, ఇంకా నా కథ ముగియలేదు!” అని అర్థం.

కొద్దిసేపు నిశ్శబ్దం.

మళ్లీ మరో గంభీరమైన గొంతు.

“అమ్మా... బయట నేను నవ్వుతున్నాను... కానీ లోపల ప్రతి రోజు కుంగి కృశించిపోతున్నాను. ఈ పాడు లోకం అపవాదులతో, అవమానాల అనుక్షణం నన్ను చంపేస్తోంది...వేలివేస్తుంది. అయిననూ, కళాకారులు దరిద్ర దేవతకూ ముద్దుబిడ్డలే కదా. ఆ కొందరిలో నేను ఒకడ్ని. కళ కాసుల వర్షం కురిపించలేకపోవచ్చు. కానీ జనుల ప్రశంసలు, చప్పట్ల మధ్య ఎంతటి ఆనందం ఉంటుంది!”కొందరిమన్సు గెలుచుకున్నకళాకారుడి జీవితం ధన్యం” బిగ్గరగా అన్నాడు

శివానందం మాటలు అతని గది గోడలు దాటి ప్రతిధ్వనించడంతో పక్కింటి వాళ్లు ఒక్కసారిగా భయపడ్డారు. కొందరు ఉలిక్కిపడ్డారు.

“ఎవరితో మాట్లాడుతున్నాడు?” అతను.
“పాపం! ఆ గదిలో ఒక్కడే ఉంటాడట కదా...”
“ఏదో మతిస్థిమితం లేని వాడిలా ఉన్నాడు...” కొందరు.

ఆ గదిలోని శివానందం గురించి ఎవరికి తోచిన విధంగా మాట్లాడుకోవడం అతను విన్నాడు. అతను పకపక నవ్వేశాడు.

“లోకులు కాకులు... ఏమని అనుకున్నా నాకు అభ్యంతరం ఎందుకు?” అని అనుకునేవాడు.

అతను ఎవరికీ పెద్దగా కలిసేవాడు కాదు. ఉదయం బయటికి వెళ్లి రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. కొన్ని సార్లు అర్ధరాత్రి వరకూ గట్టిగా డైలాగ్స్ చెబుతుండేవాడు.

అతను మాట్లాడేది తనతో కాదు... తాను జీవించబోయే పాత్రలతో.

అతను ఒక థియేటర్ ఆర్టిస్ట్.

ఈ విషయం అక్కడివారికి పెద్దగా తెలియదు.

రంగస్థలంపై నటించడానికి ప్రతి భావాన్ని ఒంటరిగా సాధన చేసేవాడు. అద్దం ముందు నిలబడి ఒకే డైలాగ్‌ను పదిసార్లు కాదు... వందసార్లు చెబుతూ భావాన్ని పక్కాగా తీర్చిదిద్దేవాడు.

కానీ బయట ప్రపంచానికి అది తెలియదు. అతను ఓ పిచ్చివాడిగా జమ కట్టేవారు.

అపార్ట్‌మెంట్‌లో వాళ్లు అతని గురించి మెల్లగా చెవులు కొరుక్కునేవారు.

అక్కడివారు ఒకటి మాత్రం గ్రహించారు—అతని వలన ఎలాంటి ప్రమాదం లేదని... కానీ అతని ఒంటరితనాన్నే చూసి అందరూ అతన్ని ఒక అమాయకుడిగా, వెర్రివాడిగా ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకోవడం మొదలుపెట్టారు.

పిల్లలు కూడా అతన్ని చూసి భయపడేవారు. లిఫ్ట్‌లో అతను ఎక్కితే కొందరు దిగిపోయేవారు.

ఒక రోజు అపార్ట్‌మెంట్ వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ వచ్చింది:

“మూడో అంతస్తులో ఉన్న శివానందం ప్రవర్తన కొంచెం విచిత్రంగా ఉంది. అందరూ జాగ్రత్త.”

ఆ మెసేజ్ తర్వాత అతన్ని చూసి భయపడేవారు, కంగారుపడేవారు. అతనిని చూసి తప్పించుకుని తిరగడం మొదలుపెట్టారు.

కానీ అదే అపార్ట్‌మెంట్‌లో ఒక చిన్న సాంస్కృతిక కార్యక్రమం ప్లాన్ చేశారు. పిల్లల పాటలు, డ్యాన్స్‌లు, చివర్లో ఒక చిన్న నాటకం.

కానీ నటించాల్సిన వ్యక్తి చివరి నిమిషంలో రాలేదు.

అందరూ టెన్షన్‌లో ఉన్నారు.

అప్పుడు వాచ్‌మన్ మెల్లగా అన్నాడు—
“మన దగ్గరే ఒక నటుడు ఉన్నాడు కదా... మన శివానందం సార్. అతను మంచి నటుడు అన్నాడు.”

కొందరూ నమ్మలేదు. వాచ్‌మన్ అతని దగ్గర ఉన్న పాత పేపర్లలో శివానందం ఫోటోలు చూపించాడు.

అక్కడివారు ఆశ్చర్యపోయారు.

అందరి చూపులు ఒక్కసారిగా శివానందం ఫ్లాట్ వైపు తిరిగాయి.

మొదట ఎవరూ వెళ్లడానికి ధైర్యం చేయలేదు. చివరికి సెక్రటరీ వెళ్లి తలుపు తట్టాడు.

తలుపు తెరిచిన శివానందం ప్రశాంతంగా అడిగాడు—

“ఏమైంది సర్?”

“ఒక చిన్న నాటకం ఉంది... ఒక పాత్ర చేయాల్సిన వ్యక్తి రాలేదు. మీరు సహకరిస్తారా? మా నాటకానికి ఆ పాత్ర ప్రధానమైనది,” అన్నాడు సెక్రటరీ.

సెక్రటరీ మాటకు శివానందం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు.

సెక్రటరీ అతని మౌనాన్ని భంగం చేస్తూ అన్నాడు—
“మీ మౌనం అంగీకారం అనుకుంటాను.”

అతని కళ్లలో ఏదో పాత వెలుగు మెరుపు.

“గతం నుంచి వర్తమానంలోకి వస్తూ, స్టేజ్ మీద నిలబడి చాలా రోజులైంది... మా నాటకాలను చూసేవారు కరువయ్యారు, అభిమానించి ప్రోత్సహించేవారు లేరు.” అయినా రేపు ఏదో నాటక ప్రదర్శన ఉన్నదీ అనే భ్రమలో ఉంటాము’ బాధగా అన్నాడు.

“మనసు చంపుకోలేక పాత్రలోని డైలాగ్స్ గుర్తుచేసుకుంటూ, రేపు ఒక నాటకం ఉంది అనే భ్రమలో దానిలో జీవిస్తూ మరణిస్తున్నాను. అది మీలాంటి వారికి అర్థం కాదు,” అన్నాడు.

సెక్రటరీ అన్నాడు—

“మీ వంటి రంగస్థల నటుల బాధను అర్థం చేసుకోగలను. కాల ప్రవాహంలో అభిరుచులు మారిపోతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి. నిన్నటి తరం నేటిని అంగీకరీంచడం లేదు. అదే నేటి తరానికి తెలియాల్సిన సత్యం. మీలాంటి కళాకారులను సత్కరించుకునే అవకాశం ఇవ్వండి. అది మా అదృష్టంగా భావిస్తాము.”

శివానందం అన్నాడు—

“మీ సత్కారం కోసం కాదు సుమా... నాలో నటుడిని మేల్కొలపడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని స్వీకరిస్తున్నాను. మీ నాటకం పాత్ర స్క్రిప్ట్ పంపించండి. నటిస్తాను.”

ఆ రాత్రి అపార్ట్‌మెంట్ చిన్న హాల్ స్టేజ్ మీద రంగురంగుల లైట్లు వెలిగాయి.

శివానందం స్టేజ్ మీద నిలబడ్డాడు.

మొదటి డైలాగ్ చెప్పగానే హాల్ నిశ్శబ్దంగా మారిపోయింది.

అతని హావభావాలకు అక్కడివారు మంత్రముగ్ధులయ్యారు.

“అతను పిచ్చివాడు అనుకున్నాము... మనమే నిజమైన పిచ్చివాళ్లము. అతని గొప్పతనాన్ని గుర్తించలేకపోయాము,” అనుకున్నారు.

కొందరు చప్పట్లు కొడుతూ—

“అది నటన కాదు... జీవితం,” అన్నారు.

అతని కళ్లలో బాధ కనిపించింది. మాటల్లో నిజం వినిపించింది. ప్రతి భావం లోపల నుంచి బయటకు వచ్చి ప్రేక్షకుల గుండెలను పిండేసింది. కొందరి కళ్లలో నీళ్లు తిరిగాయి.

వాస్తవానికి అతను పాత్రలో లేడు... పాత్రే అతనిలో లీనమైపోయింది.

నాటకం ముగిసిన వెంటనే మొత్తం హాల్ చప్పట్లతో మార్మోగిపోయింది.

స్టేజ్ నుంచి దిగుతున్న శివానందం దగ్గరకు ఒక చిన్న పిల్లాడు వచ్చి అడిగాడు—

“మామయ్యా... నువ్వు నిజంగానే నీతో నువ్వు మాట్లాడుకుంటావా?”

శివానందం చిన్నగా నవ్వాడు.

“నాతో నేను కాదు బాబు... నేను నా పాత్రలతో మాట్లాడుతాను. ఎందుకంటే పాత్రలు ఎప్పుడూ నన్ను వదిలి పెట్టి వెళ్లవు. అవి వెళ్లిపోతే... నేను కూడా నిష్క్రమించినట్లే,” అన్నాడు.

ప్రతి ఒక్కరు అతని నటనకౌశలానికి చేతులెత్తి నమస్కరించారు.

ఆ రాత్రి అపార్ట్‌మెంట్ వాళ్లకి ఒక నిజం అర్థమైంది—

కొన్నిసార్లు మనుషులు మరణిస్తారు కానీ పాత్రలు మరణి౦చవు
అవి కళాకారుడి అంతరంగంలో నిశ్శబ్దం మాటల రూపంలో కాదు, పాత్రల రూపంలో మాట్లాడుతుంటాయి. అవి వేదిస్తాయి, బాధిస్తాయి.
మరణం మన గుర్తింపును మౌనంగా చెరిపేసినా…
రంగస్థలం మాత్రం ఆ మౌనానికే ఒక జీవితం ఇస్తుంది.”

మరిన్ని కథలు

Surigaadu
సూరిగాడు
- Anisa tabassum sk ( అనిసా తబస్సుమ్ sk )
Chintoo lo bhayam poyindi
చింటూలో భయం పోయింది
- నారంశెట్టి ఉమామాహేశ్వరరావు
Subhashini-Charavaani
సుభాషిణి - చరవాణి
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Maa manchi donga
మా మంచి దొంగ
- అనిసా తబస్సుమ్
Mali vayasu chivari majili
మలి వయసు చివరి మజిలీ..
- వరలక్ష్మి నున్న
Premanubandham
ప్రేమానుబంధం
- Kameswara Rao Rapaka
Vyavasayam
వ్యవసాయం
- డా:సి.హెచ్.ప్రతాప్