మరో ప్రపంచాన్ని సాధించటానికి అడుగులేస్తున్న వేదభూమి - పిళ్లా కుమారస్వామి

మరో ప్రపంచాన్ని సాధించటానికి అడుగులేస్తున్న వేదభూమి

భారతదేశ పరిస్థితులను అధ్యయనం చేసి కారల్ మార్క్స్ 'భారతదేశ ప్రజలు తమ పాత ప్రపంచాన్ని పోగొట్టుకున్నారు. అయితే వారికి కొత్త ప్రపంచమేదీ లభించలేదు' అని అన్నారు. ఆ కొత్త ప్రపంచాన్ని సాధించటానికి వేదభూమి తన సుదీర్ఘ ప్రస్థానానికి ఒక్కో అడుగు ముందుకు వేస్తూపోతోంది. ఇ.యం.యస్. నంబూద్రిపాద్ రచించిన 'వేదభూమి' గ్రంథాన్ని ప్రజాశక్తి బుక్ హౌస్ తెలుగులో యతిరాజులుగారి అనువాదంతో ప్రచురించింది. ఈ గ్రంథంలో ప్రాచీన భారతీయ సంస్కృతి మనకేమి మిగిల్చింది, అది సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేసింది, అది ఎలా విచ్ఛిన్నమైంది మొదలైన విషయాలను చర్చించారు. పాత సంస్కృతిలో గర్వించదగ్గ అంశాలేవో చెప్పి, అందులోని తిరోగమన భావాలను ఎలా తిరస్కరించాలో కూడా ఆయన చెప్పినారు. చిన్న గ్రంథంగా కనిపించినా ఇందులో చర్చించిన విషయాలు విస్తృతంగా ఉన్నాయి. అవిచ్ఛిన్నంగా సాగిన భారతీయ సంస్కృతి అనేక ఒడిదుడు కుల్లోనూ ఎదిగి నిలదొక్కుకొని ఆర్థిక సాంస్కృతిక రంగాలలో ఉన్నత స్థితిని పొందినా, పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరిస్తున్న కాలంలో ఎందుకు పతనం చెందుతూ వుందో పరిశీలిస్తుంది ఈ గ్రంథం. అందువల్ల దేశప్రేమికులందరూ తప్పకుండా చదవాల్సిన గ్రంథమిది. ఆర్యులు రాకపూర్వం దేశంలో వున్న సింధూ సంస్కృతి గురించి తవ్వకాలలో బయటపడిన ఆనవాల్ల ద్వారా కొంత తెలిసింది. అప్పటికే సింధూలిపి కూడా ఉండింది. దాన్ని ఇప్పటివరకు అర్థం చేసుకోలేకపోయారు. ఆనాటి ప్రజలకు రాయడం, చదవడం కూడా తెలుసు. వారు ఇటుకలతో రెండంతస్థుల మేడలు కూడా కట్టుకున్నారు. మురుగుకాలువలు నిర్మించారు. ఇళ్ళలో స్నానాలగదులుండేవి. స్విమ్మింగ్ పూల్ లాంటి ఒక కోనేరు ఒకటి ఉండేది. రుగ్వేదగానం చేసే ఆర్యుల కన్నా సింధు ప్రజలే నాగరికులని చరిత్రకారుల అభిప్రాయం. అయితే సింధూ సంస్కృతి ఎలా పతనమైందో ఇప్పటికీ ఎవ్వరూ కనుగొన లేకపోయారని రచయిత నంబూద్రిపాద్ చెప్పినారు. భారతదేశానికి వచ్చిన ఆర్యులంతా ఒకే మానవ వంశానికి చెందినవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వీళ్ళల్లో పలుగోత్రీకులున్నారు. బ్రతుకు తెరువు కోసం వలస వచ్చినవారు వీళ్ళంతా. వీరు ఇక్కడున్న ద్రావిడులతో సంఘర్షించారు. అయితే వారిరువురి మధ్య సయోధ్య ఏర్పడిన తరువాత అనేక గణ సమూహాలు ఏర్పడినాయి. ఆర్యుల దగ్గర గుర్రాలుండేవి. రథాలుండేవి. వ్యవసాయంలో నాగలి వాడటం ఎలాగో వారికి తెలుసు. సహజంగానే ఆర్యులు స్థానికంగా ఉన్న ద్రావిడులకన్నా ఆధిక్యంలో ఉండేవారు. అందువల్ల అప్పటి అభివృద్ధిని అందిపుచ్చుకున్న ఒకానొక గణసమూహం సాంస్కృతికంగా భాష పరంగా ఉన్నత స్థాయిలోకి పోయింది. వారే ఆర్యులు. వారి భాష ఆర్యభాష.నేడు మనం దాన్ని సంస్కృతమని పిలుస్తున్నాం. వారే తొలుత రుగ్వేదాన్ని రచించిన వారు. ద్రావిడులకు ఆర్యులకు మధ్య జరిగిన సంఘర్షణలో ఓడినవారు దాసులు(బానిసలు) అయినారు. గెలిచినవారు ఆర్యగణాల్లోకి చేరిపోయారు. గెలిచినవారు ఆర్యులుగా, ఓడినవారు బానిసలుగా సమాజం చీలిపోయింది. ఆనాటి సమాజంలో ఒక్కొక్కరు ఒక్కో పని చేసి జీవించేవారు.కొందరు వ్యవసాయం మరొకొందరు వ్యవసాయధారిత పనిముట్ల తయారీ, ఇంకొందరు దేవతారాధన, ప్రకృతి పరిశీలన చేసేవారు. కొంతమంది వారి గణానికి రక్షణగా నిలిబడి శత్రువులతో పోరాడేవారు.ఇదే తరువాత కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థగా మలచబడింది. ఇతర దేశాల్లో యజమానులు, బానిసలనే రెండు వర్గాలు స్పష్టంగా ఏర్పడితే మనదేశంలో ఆర్యులు, దాసుల రూపంలో వర్గ తారతమ్యాలు ఏర్పడినాయి. ఉత్తరాదిన ఆర్య సంస్కృతి ఉంటే దక్షిణాదిన ద్రావిడ సంస్కృతి ప్రబలంగా ఉండేది. దక్షిణభారత దేశంలో ఇక్కడే వుండిన కొన్ని గోత్రియ గణ సమూహాలు ఇతర గణసమూహాలపై దాడులు జరిపేవారు. వీటికి నాయకత్వం వహించిన నాయకు లను, రాజులను కీర్తిస్తూ ద్రావిడ భాషైన“ఇంతిమిళ్" లో అనేక కావ్యాలు వెలిసాయి. ఈ 'ఇంతిమిళ్' భాష ద్వారా తమిళ, తెలుగు, కన్నడ,మళయాళ భాషలు మాండలికాల రూపంలో ప్రారంభమైనాయి. ఆనాడు ఉత్తరాదివారు దక్షిణాదివారిపై దక్షిణాదివారు ఉత్తరాదిపై ఆక్రమణ యుద్ధాలు జరిగాయి. ఇలా పరస్పర సంఘర్షణ, సమ్మేలనాల వల్ల కొత్త సమ్మిళిత సమాజం ఏర్పడింది. ఆనాటి సమాజం బానిసల పనిని బట్టి వర్ణ(కుల) వ్యవస్థను ఏర్పరచారు. ఈ వర్ణవ్యవస్థలో దోపిడీ అణచివేత కనిపించకుండా ఉంటాయి. క్రింది కులాలవారు పై కులాలవారికి అణగిమణగి ఉండినా ఒక్కొక్క కులానికి మధ్య సోదరభావాన్ని, సమానత్వాన్ని పెంపొందించు కున్నారు. వ్యవసాయ సమాజం కావడం వల్ల ఒకరితో ఒకరికి అవసరాలు ఉండటంవల్ల ఇది సాధ్యపడింది. ఇతరదేశాలలో బానిస సమాజం మెల్లగా భూస్వామిక సమాజం వైపుకు దారితీసింది. భూస్వామిక సమాజం సాంకేతిక అభివృద్ధితో మెల్లగా పెట్టుబడిదారి సమాజం వైపు అడుగులు వేసింది.కానీ మనదేశంలో ఇలాంటి అభివృద్ధి క్రమం జరుగలేదు. మనదేశంలో వున్న కులవ్యవస్థ నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఉండిపోయింది. ఒక్కోకులం కన్నా ఇంకోకులం అధికం అన్న రీతిలో సాగి క్రింది కులాల వారిని పైకులం తొక్కిపెట్టి ఉంచుతుంది. ఇలాంటి వర్ణవ్యవస్థను సవాలుచేసే విధంగా తిరుగుబాట్లు భారతదేశంలో జరుగలేదు. వర్ణవ్యవస్థ భూస్వామిక సమాజంలో బాగా ఇమిడిపోయింది. మన దేశంలో వర్ణ వ్యవస్థ ఆధారంగా ఏర్పడిన గ్రామీణ సమాజం బ్రిటీష్ వారు వచ్చేటంతవరకు ఎలాంటి మార్పులు లేకుండా సాగింది. భూమి, ఇతర సంపదలపై ఆధిక్యం సంపాదించిన వారి ఆస్తులు, ఆదాయం ఎక్కువ ఉండేవి. దాంతో వాటి పై వచ్చిన అదనపు సంపదను అమ్ముకుంటూ ఉండేవారు. వారికి కావాల్సిన వస్తువులను ఇతరుల దగ్గర నుంచి వస్తు మారకం పద్ధతిలోతీసుకునేవారు. ఇలా వ్యాపారం అభివృద్ధి చెందింది. అలాగే వ్యవసాయం పనుల కోసం కమ్మరి, కుమ్మరి మొ||లగు వృత్తులు ఏర్పడినాయి. సమాజ అవసరాలైన చాకలి, మంగలి, మేదర మొ||నవి చేతి వృత్తులు అభివృద్ధి అయినాయి. ఈ మూడింటిని రక్షించటానికి పాలనా వ్యవస్థ ఏర్పడింది. దీన్నే స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ అన్నారు. సంపదల మీద ఆధిక్యం సంపాదించిన వారే గ్రామాల్లో పాలకులుగా మారినారు. గ్రామ పాలకులను రక్షిస్తూ సామంతులూ, రాజులు ఏర్పడ్డారు. వీరుకూడా ఉన్నత కులాలకు చెందినవారుగా ఉండేవారు. ఇలా సమాజంలో ఆర్థిక రాజకీయ రంగాలతో పాటు సాంస్కృతిక రంగంలోనూ ఉన్నత కులస్థులు ప్రవేశించారు. వీరి తోడ్పాటుతోనే హిందూముస్లిం పాలకులు దేశాన్ని పాలించారు. ఇలాంటి పరిస్థితి క్రీ.శ.1వ శతాబ్దం నాటికి భారతదేశంలోఏర్పడింది. యూరప్ దేశాల్లో సమాజం బానిసలు, యజమానులుగా రూపొందినట్లు భారతదేశంలో ఏర్పడలేదు. దానికి బదులుగా ఉన్నత కులాలు, దాసులు (శూద్రులు) అనే రెండు శాఖలు రూపొందాయి. అయితే ఇది కూడా బానిస యజమాని లాంటి సంబంధమే. దాసుల్లో (శూద్రుల్లో) వృత్తినిబట్టి కులాన్ని నిర్ణయించారు. దాంట్లో ఎన్నో ఉపశాఖలు ఏర్పడినాయి. ఈ వృత్తులను చేసేవారి కుటుంబాలు వంశపారంపర్యంగా చేస్తూ వచ్చాయి. వేరే వృత్తిలోకి మారే పనిలేదు. అలా మారాలన్న ఆలోచన కూడా వారికి రాలేదు. అలా మారకుండా ఒక ప్రాపంచిక దృక్పథాన్ని హిందూ తాత్వికులు ప్రచారం చేసినారు. భగవంతుని ఆదేశంవల్లే ఇలా జరుగుతోందని దీన్ని మార్చడానికి ఎవరివల్లా వీలు కాదని ప్రచారం చేసినారు. కర్మ సిద్ధాంతాన్ని, తలరాత సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతం లాంటి వాటిని ప్రవేశపెట్టినారు. స్వర్గంనరకం సృష్టించారు. కర్మసిద్ధాంతం ఆధారంగా ఏర్పడ్డ వృత్తివిభజన భారతీయ సమాజాన్ని ఎదగనీకుండా,కదలబారకుండా చేసిందని రచయిత గుర్తించారు. వేదకాలంలోలేని ఇలాంటి భావన రావడానికి కారణం సమాజం వేదకాలంలో ఉన్న ఆహార సేకరణ దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకు చేరుకోవడం వల్ల వచ్చిందని కోశాంబి భావించారు. అదెలా అంటే విత్తనం భూమిలో విత్తి సాగు చేసి తిరిగి ఫలాన్ని పొందటాన్ని గుర్తించిన ఆనాటి సమాజం కర్మసిద్ధాంతాన్ని విత్తన దశలాగా ప్రతిపాదించింది. ఈజన్మలో చేసిన కర్మ మరుసటి జన్మలో తగిన ఫలితాన్ని ఇస్తుందనే భావనను తీసుకువచ్చిందని, ఇది ఆహార సేకరణ సమాజం, ఆహారోత్పత్తి సమాజంలోకి మారడం వల్లనే వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కర్మ సిద్ధాంతం పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా నేటి జన్మలోని సుఖదుఖాలకు కారణమని చెప్పింది. ఇది చాలా పకడ్బందీగా ప్రవేశపెట్టిన సిద్ధాంతం. ఇది ప్రజల మనస్సుల్లో బాగా నాటుకు పోయి వర్ణవ్యవస్థనే కాదు ఏవ్యవస్థనూ ధిక్కరించే దశకు చేరుకోలేక పోయింది. బౌద్ధ, జైన, ఇస్లాం మతాలు భారతదేశంలోకి ప్రవేశించినపుడు వర్ణవ్యవస్థ పైనున్న అసంతృప్తితో వీటిని ఆహ్వానించారు తప్ప తిరుగుబాటుగా కాదని నంబూద్రిపాద్ అంటారు. అలాగే తత్వశాస్త్ర రూపంలో, భక్తి ఉద్యమాల రూపంలో మాత్రమే కులవ్యవస్థ పట్ల నిరసన వ్యక్తమైందని చెపుతారు. ఈ ప్రాపంచిక దృక్పథానికి భిన్నమైన సిద్ధాంతం ముస్లిం తాత్వికుల వద్ద లేకపోయింది. కేవలం అల్లా ఒక్కడే దేవుడు అనేవారు. విగ్రహారాధన లేదు. అందువల్ల ముస్లిం రాజులు, మొగల్ సామ్రాజాధీశులు కూడా వైదిక సంస్కృతిని ఏమాత్రం కదిలించలేక పోయారు. సమానత్వం పునాదిగా ఉన్న ఇస్లాం మతం కూడా హిందూవర్ణ వ్యవస్థను బద్దలు కొట్టలేక పోయింది. ఇస్లాం రాజులు అల్లాను నమ్మినారు. గుప్తులు, మౌర్యులు హిందూ దేవుళ్ళను పూజించారు. అంతేతేడా. పాలకులు ఎవరున్నా సమాజంలో పైస్థాయిలో ఉన్నవారు తాము మాత్రమేనని వారు నిశ్చింతగా ఉన్నారు. కులాధిక్యత ఆధారంగా వారికి భూమిపై హక్కులు, పాలనాధికారంలో భాగం సంపాదించారు. పాలకులు మారినా వైదిక సంస్కృతికి ఎలాంటి విఘాతం కలుగలేదని నంబూద్రపాద్ గుర్తించారు. క్రైస్తవ తాత్విక బోధనలో కూడా ఎలాంటి భిన్నసిద్ధాంతం లేదు. బ్రిటీష్ పాలకులు ఏవో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టినా వారుకూడా కులవ్యవస్థతో అభివృద్ధి వ్యతిరేక ప్రాపంచిక దృక్పథంతో రాజీపడి తమపాలనను బలం చేసుకోవడానికి ప్రయత్నించారు తప్ప మరేమీ సమాజంలో మౌలికమైన మార్పులు తీసుకురాలేకపోయారు. యూరప్ లో వచ్చిన బానిసల తిరుగుబాట్లు, భూస్వాముల ప్రతిఘటన, పెట్టుబడిదారుల అభివృద్ధి అసమాజాల్ని శక్తివంతం చేసినాయి. కానీ భారతదేశంలో మాత్రం సమాజంలో ప్రతిఘటన లేకుండా ఒక పద్ధతి ప్రకారం జరిగిన నిర్మాణం దానికనుగుణంగా ఏర్పడిన భావజాలం వల్ల సమాజం ఎలాంటి మార్పులేకుండా ఏకశిలా సదృశంగా తయారైంది. విదేశీ ఆక్రమణలవల్ల భారతదేశం వాటిని తట్టుకునే శక్తిని సంపాయించు కోలేక పోయింది. పైగా చాలా సునాయసంగా విదేశీపాలనకు, సంస్కృతికి, ఆర్థిక ప్రభావానికి బానిస అయింది వేదభూమి. మధ్య యుగాలలో వచ్చిన భక్తి ఉద్యమం ఊపందుకోవడంతో ఈ ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందినాయి. ఈ భక్తి ఉద్యమంలో తక్కువ కులాలుగా భావించే వాటిలో పుట్టినవారే ఎక్కువ. నామదేవ్, మీరాబాయి, సూరదాస్, కబీర్, బ్రహ్మర్షి, వేమన మొ||నవారు. అయితే భాష పరంగా విభజన అనాటికి జరుగలేదు. మతం కులాలే సమాజాన్ని విభజించివున్నాయి ఆనాటికి, క్రీ. శ. 15వ శతాబ్దంలో ఆంగ్లేయుల రాకతో అప్పటివరకు స్తబ్దంగా సాగిన స్వయం పోషక గ్రామీణ వ్యవస్థ బద్దలైంది. గ్రామాల్లో ఉత్పత్తి అయిన వస్తువులు గ్రామందాటి ఇతర చోట్ల అమ్మే పెట్టుబడిదారీ విధానం విస్తరించింది. వ్యాపార విస్తరణకు సహాయం చేసి వ్యాపారస్థులు వైశ్యులు వర్ణ వ్యవస్థలో అభివృద్ధి చెందినారు. పాలనావసరాలకు వస్తుమార్పిడి అవసరమైంది. వడ్డీకి డబ్బు ఇచ్చే పద్ధతి అమలులోకి వచ్చింది. ఎప్పుడైతే పెట్టుబడిదారీ పద్ధతి వచ్చిందో భూస్వామిక సంబంధాలలో, వర్ణవ్యవస్థలో కదలిక మొదలైంది. ప్రజలు చెల్లించాల్సిన భూమి పన్నులను డబ్బు రూపంలో చెల్లించే విధానం బ్రిటిష్ పాలకులు తీసుకువచ్చారు. దాంతో డబ్బు లావాదేవీలు ప్రాముఖ్యం పెరిగింది. ప్రజలు తమ జీవితావసరాలను తీర్చుకోవడానికి భూమిని లేదా ఇతర ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వచ్చేది. రైతులు,చేతివృత్తుల వారు, దివాళా తీసినవారు వాటిని విడిపంచుకోలేక తెగనమ్మి వలస వెళ్ళిపోయారు. యూరప్ లో ఇలా వలసవెళ్ళిన వారంతా పట్టణాల్లో ఏర్పడిన పరిశ్రమల్లో తక్కువ కూలీకి కార్మికులుగా చేరినారు. కానీ భారతదేశంలో అలా జరుగలేదు. రోజు రోజుకు నిరుద్యోగం పెరగడం తప్ప ఇంకేమీ దొరకలేదు నేటికీ. క్రీ.శ. 1857లో గొప్ప ప్రజా తిరుగుబాటు జరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించిన సామాజిక, సాంస్కృతిక విధానాలను భారతదేశం అనుసరించా లని ఒక వర్గం కోరుకుంటే మరోవర్గంవ్యతిరేకించింది. అయినప్పటికి పెట్టుబడిదారీ వ్యవస్థ బలంగా వేళ్ళూనడానికి అనువుగా విద్యావిధానాన్ని మార్చివేసినారు బ్రిటీషుపాలకులు. తంతితపాలా, రైల్వే వ్యవస్థలు ఏర్పడినాయి. రవాణా, కమ్యూనికేషన్ పెరగడంతో గ్రామాల స్వయం పోషకత్వం మెల్లగా దెబ్బతినింది. అదే సమయంలో దినవార పత్రికలు వెలువరించడానికి అచ్చుయంత్రాలను నెలకొల్పినారు. ఇవన్నీ ప్రజల్లో జాతీయతా భావం పెరగడానికి, భాషా వికాసానికి ఇవితోడ్పడినాయి. రైతులు, చేతివృత్తులవారు దివాళా తీస్తుండటంతో హిందూ ముస్లిం మతనాయకులతో కలిసి కొత్త విదేశీ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేయసాగారు. అయితే బ్రిటీష్ పాలకులు అన్ని కులాల వారికీ ముఖ్యంగా నిమ్న కులాల వారికి కూడా సమాన అవకాశాలు ఇవ్వడంతో అంటరాని కులాలవారు తమను ఉద్దరించేవారు బ్రిటీష్ పాలకులే నన్న భావం పెరిగింది. అదే సందర్భంలో భారతీయ సంస్కృతిని ఆధునికం చేయటానికి ఇంగ్లాండులో మాదిరి భారతదేశంలో కూడా స్వాతంత్ర్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కావాలని రాజరామమోహనరాయ్ లాంటి వారు సంఘసంస్కరణోద్యమాలు లేవదీశారు. వేష భాషలు భారతీయుల ఆత్మగౌరవ సమస్యగా మారి జాతీయోద్యమానికి ఊపిరి పోశాయి. అలాగే ప్రజాప్రతినిధుల సభను ఏర్పాటుచేయాలన్న‌ ప్రజల కోరిక పెరిగింది. వీటన్నింటిని జాతీయోద్యమంగా తీసుకువచ్చింది భారత జాతీయ కాంగ్రెస్. జాతీయ కాంగ్రెస్ కు నూతన నాయకత్వం పగ్గాలు తీసుకోవడంతో స్వాతంత్ర పోరాటం ఉధృతమైంది. అంటరానివారుగా ముద్రపడినారు, ఆదివాసులు, వెనుకబడిన కులాలవారు జాతీయ నాయకులు స్వరాజ్యాన్ని రామరాజ్యంగా చిత్రించారు. ఇస్లాం ఆధిక్యతా భావంతో వున్న ముస్లిం నాయకులు డిల్లీ సింహాసనంపై ముస్లింలే ఉండాలన్న కోరికను ముందుకు తీసుకొచ్చారు. దాంతో జాతీయ కాంగ్రెస్ కు పోటీగా అఖల భారత ముస్లింలీగ్ ను ప్రోత్సహించారు. వీరినిజాతీయోద్య మానికి వ్యతిరేకంగా నిలబెట్టినారు. అయినప్పటికి అంతర్జాతీయంగా వివిధ దేశాలలో వచ్చిన మార్పులు, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటన్ బలహీనపడటం అదే సమయంలో మనదేశంలో జాతీయోద్యమం ఉదృతం కావడం వలన 90 ఏళ్ళలోపునే బ్రిటీష్ వారి పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. అయితే వాళ్ళు పోతూపోతూ ఇండియన్ యూనియన్, పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విభజించి వెళ్ళిపోయారు. దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణమైన హత్యలు, దోపిడీలు, మానభంగాలు, గృహదహనాలు జరిగాయి. రెండు దేశాలలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున సైన్యాలు ఒకరితో ఒకరు తలపడే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం జమ్మూకాశ్మీర్ సంస్థానం మీద ఎవరికి హక్కుండాలనే తగాదా రావడమే. గాంధీజీ ప్రజల కన్నీళ్ళను తుడవడానికి, హిందూ-ముస్లింల ఐక్యతకు తన జీవిత చరమాంకం లో కృషి చేసినారు. ఆ ఐకృత తన కళ్ళముందే చెదిరి పోతున్నప్పుడు వేదన చెందిన గాంధీ మాటలను, కార్యక్రమాలను హిందూ మతోన్మాదులు సహించలేక పోయారు. ఆయన్ను అంతం చేశారు. జాతీయోద్యమ కాలంలో జాతీయ కాంగ్రెస్ హిందూ-ముస్లింల ఐక్యత, హరిజనాభివృద్ధి వంటి ఆదర్శాలను ముందుకు తెచ్చింది. వీటిపై విశ్వాసంతో ప్రజలు జాతీయ కాంగ్రెస్ కు పట్టం కట్టినారు. కానీ ఆచరణలో జరిగింది వేరు. వర్ణవ్యవస్థను, వైదిక సంస్కృతిని రక్షిస్తూ పెట్టుబడి దారీ వ్యవస్థను నిర్మించడానికి భూస్వాములకు తక్కువ నష్టం కలుగజేసే సంస్కరణలు చేపట్టారు స్వతంత్ర భారత పాలకులు. వీటిఫలితంగా భారతదేశంలో పెట్టుబడిదారీవర్గం, భూస్వామిక వర్గం రెండూ మిళితమైన ఒక వ్యవస్థ ఏర్పడింది. కులవ్యవస్థలో కొన్ని పైపై మార్పులు జరిగాయి. కాని అవి క్రింది కులాల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేదు. వారి కోసం 'రిజర్వేషన్లు' తీసుకు వచ్చారు. దానివల్ల కిందికులాలనుంచి కొంతమంది ఎం.ఎల్.ఏలు,ఎం.పి.లు, మంత్రులుగా పదవులు పొందినారు. కానీ వారి వెనుకబాటుతనం అలాగే ఉండిపోయిందని రచయిత స్పష్టంచేసినారు. నూటయాభై ఏళ్ళపాటు బ్రిటీష్ వారి దోపిడికి గురైన దేశం తన కాళ్ళమీద తాను నిలబడటానికి ఇంకా పోరాడుతూనే ఉంది. అంటరాని ప్రజలు సామాజికంగా గురవుతున్న అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా అగ్రకులాలవారిని కూడా సమీకరించాల్సివుంది. పైగా 'వేదభూమి' పేరుతో దేశానికి పవిత్రతనే ముసుగు వేసి పవిత్ర భూమి పేరుతో సమాజాన్ని మార్చాలని చూచే ఏప్రయత్న మూ దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించ లేదని రచయిత అభిప్రాయం. పెట్టుబడిదారీ సాంఘిక సంస్కరణల పరిణామాలవల్ల భారతీయ రాజకీయ రంగం ఒక సంక్షోభం నుండి మరొక సంక్షోభంలోకి పోతోంది. ప్రభుత్వ మార్పులు, పార్టీల చీలికలు, పునర్నిర్మాణం, పార్టీ మార్పిడీలు మొ||వి అన్ని స్థాయిల్లో రాజకీయరంగాన్ని గందరగోళపరుస్తు న్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే గతకాలపు గొప్ప విషయాలకు గర్విస్తూనే, అధమంగా నిలిచిన విషయాలకు దృఢంగా ఎదురు నిలిచి పోరాడటం ద్వారా భారతదేశం తిరిగి పునరుజ్జీవనం పొందు తుందని నంబాద్రిపాద్ తన గ్రంథంలో ఆశాభావం వ్యక్తం చేసినారు. __

మరిన్ని వ్యాసాలు

ద్వీపాలు-వర్షాలు.పురాణకథ.
ద్వీపాలు-వర్షాలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మాస్క్ బాంబులు
మాస్క్ బాంబులు
- చంద్ర శేఖర్ కోవూరు
Lahiri Lahiri Lahirilo -2
లాహిరి లాహిరి లాహిరిలో-2
- కర్రా నాగలక్ష్మి
మన సినిమాల్లో గోదావరి గీతాలు.
మన సినిమాల్లో గోదావరి గీతాలు.
- డా.బెల్లంకేండ నాగేశ్వరరావు.
తెలుగు నాటకరంగ విషేషాలు.
తెలుగు నాటకరంగ విషేషాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కోరికలే గుర్రాలు ఐతే
కోరికలే గుర్రాలు ఐతే
- చంద్ర శేఖర్ కోవూరు