గురుదక్షిణ - పిళ్లా కుమారస్వామి

Guru dakshina
మహా భారతంలో అసలు కథ కన్నా ఉపకథలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే వాటిని అసలు కథలోకి చాకచక్యంగా ప్రవేశపెట్టినారు. కురు పాంచాల ప్రాంతం (నేటి ఢిల్లీ, మీరట్, మధుర)లో కురువంశంవారు,
హస్తినాపురాన్ని పాలించారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో క్రీ.పూ 1000-700 నాటి నివాసాలుబయటపడినాయి. వీరు తమకు సోదరులైన పాండవులతో రాజ్యం కోసం క్రీ.పూ 950లో ఢిల్లీ కి దగ్గర
కురుక్షేత్రం వద్ద యుద్ధం చేసినారు. ఈ యుద్ధమే మహాభారతానికి మూలం. ప్రారంభంలో మహాభారతంను
వ్యాసుడు 'జయ' పేరుతో దాదాపు 50 పేజీల కథగా మాత్రమే రాసినాడు. అది క్రీ.పూ. 400 - క్రీ.శ. 400
మధ్యకాలంలో ఆనాటి సమాజములో జరుగుతున్న నీతినియమాలు, రాజనీతి సూత్రాలు, వర్ణవ్యవస్థ
వేల్లూనుకుంటున్నప్పుడు ఏర్పడే చట్టాలు మొదలైన వాటిన్నటిని, అలాగే ప్రజలనోళ్ళలో నానే కథలను అన్నింటిని
కలుపుకుని 'జయ'లో చేర్చినారు. దాంతో అది పెద్ద గ్రంథంగా మారి 'మహాభారతం'గా పేరొందింది.
ఇతిహాసమైంది.
ఉపకథలన్నీ ఎక్కువగా సూతులు చెప్పే కథలు. యజ్ఞం జరిగేటప్పుడు కథ చెప్పుతుండేవారిని సూతుడు అనేవారు.
ఇది కేవలం ఒకరు చెప్పేది. అందరూ వినేది. సూతుల కథలు జనంలో బాగా నాటుకుపోయేవి. ఆకథలను
కొంతమంది కవులు భారతంలో చేర్చినారు. ఆ కథలను తీసివేసినా మహాభారత కథకు ఏలోటూ రాదు. కానీ
ఆకథలనే పెద్ద పెద్ద కావ్యాలుగా కవులు విడివిడిగా రాసినారు. ఉదాహరణకు నలదమయంతుల కథ,
అభిజ్ఞానశాకుంతలము, కచదేవయానుల కథ మొదలైనవెన్నో ఉన్నాయి.
మనమిప్పుడు ఇలాంటి చిన్నచిన్న ఉపకథలను చదవడం ద్వారా మానసిక వికాసాన్ని పొందవచ్చు.
అయితే వాటిని యధాతథంగా గాక నేటి పరిస్థితుల కనుగుణంగా కొద్దిగా మార్చి మనం సామాజిక, వైజ్ఞానిక
అవగాహనను పెంచుకోవటానికి దోహదం చేసేవిధంగా కథలను మలిచినాను. వీటిని సహృదయంతో
స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను)
పైలుడు అనే గురువు దగ్గర ఉదంకుడు శిష్యుడిగా చేరినాడు. ఉదంకుడు యౌవన ప్రాయంలో
ఉన్నాడు. గురువు ఒకసారి పొరుగూరికి వెళుతూ ఇంటిలో ఉండమని శిష్యునికి చెప్పి వెళ్ళిపోయాడు.
గురుపత్ని ఉదంకుని అందాన్ని చూచి మోహించి తనతో సుఖాన్ని అనుభవించమని అతన్ని కోరింది. కాని ఉదంకుడు మాత్రం ఆమెకు తల్లిగా భావించానని చెప్పి ఆమె కోరిక తిరస్కరించాడు.
గురువు వచ్చాక ఉదంకుడు ఈ విషయాన్ని గురువుకు చెప్పినాడు.
పైలుడు తన శిష్యుడు ఉదంకుని మంచితనాన్ని మెచ్చుకున్నాడు. అతనిపై మరింత విశ్వాసం
పెరిగింది. భార్యను మందలించాడు.
ఉదంకుని విద్య ముగిసింది. అతడు తన గురువు పైలునితో 'గురు వర్యా!" మీకు నేనేమి
దక్షిణ ఇవ్వాలో కోరితే దానిని సమర్పిస్తాను" అని అన్నాడు గురువు మీ అమ్మగారిని అడిగి ఆమె కోరినది ఇవ్వ మన్నాడు.
గురుపత్నిని అడిగాడు ఉదంకుడు. అదృష్టవశాత్తు గతంలో లాగా ఆమెతో గడపమని ఆమె
అడగలేదు. “మన దేశపు మహారాజు పౌష్యని భార్య చెవులకు బంగారు కుండలాలు ఉన్నాయి.
వాటిని నాలుగు రోజుల్లో తెచ్చి పెట్టు, నాకు వాటిని ధరించాలని చాలా కోరికగా ఉంది" అనిచెప్పింది.
రాజు దగ్గరకు వెళ్లడానికి పయనమయినాడు ఉదంకుడు. మార్గమధ్యమంలో పశువుల పాకలో పడుకుని మరుసటి రోజు రాజు దగ్గరకు వెళ్లాడు. పౌష్యరాజును గొప్పగా పొగిడినాడు.
తను వచ్చిన విషయాన్ని చెప్పినాడు. రాజు ఉదంకుని ధైర్యాన్ని, తెలివి తేటల్ని గుర్తించి, “రాణి
దగ్గరకు వెళ్ళి ఆకుండలాలను నేనిమ్మన్నానని చెప్పి తీసుకుపో" అని చెప్పినాడు.
రాణి అతని వాలకాన్ని చూసింది. అపరిశుభ్రంగా ఉన్న ఉదంకుని చూచి దగ్గరకు రానివ్వలేదు.
మళ్ళీ రాజు దగ్గరకు వెళ్లాడు ఉదంకుడు.
ఆమెకు శుచి శుభ్రత చాలా ముఖ్యం. నీవు పేడను తొక్కి వచ్చావు. నీ దగ్గర వాసన
వస్తోంది. శుభ్రంగా స్నానం చేసి ఆమెను అర్థించమని చెప్పినాడు. నువ్వు భవిష్యత్తులో ఎవరిదగ్గరకు
వెళ్ళినా శుభ్రంగా వెళ్లడం చాలా ముఖ్యమని బోధించాడు రాజు.
ఉదంకుడు ఈసారి స్నానం చేసి చాలా శుభ్రంగా మంచి దుస్తులు ధరించి రాణి దగ్గరకు
వెళ్లినాడు. ఆమె ఈసారి ఎంతో ఆనందంగా తనకుండలాలు అతనికి దానమిచ్చింది. వాటిని
జాగ్రత్తగా తీసుకెళ్లు. మధ్యలో దొంగలుంటారు. ఎవరైనా ఎత్తుకెళ్ళి పోతారని తగు జాగ్రత్తులు
చెప్పి పంపినారు రాజు, రాణి దంపతులు.
తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఒక నీళ్ళ మడుగు కనపడితే దాంట్లో కాళ్ళు ముఖం కడుక్కోవడానికి
మడుగులోకి దిగినాడు. దిగేముందు ఆకుండలాల్ని ఒడ్డు మీద పెట్టినాడు. అతను నీళ్ళలోకి
దిగగానే అక్కడ నక్కలా పొంచివున్న తక్షకుడు అనే నాగజాతికి సంబంధించిన ఒక దొంగ వాటిని ఎత్తుకెళ్ళాడు. ఉదంకుడు అది గమనించి తక్షకున్ని వెంటపడ్డాడు.
తక్షకుడు దగ్గరలో ఉన్న ఒక అడవిలోకి పరుగెత్తినాడు. ఉదంకుడు అతన్ని వెంటపడినా
తక్షకుడు మాత్రం తప్పించుకున్నాడు. ఉదంకుడు అడవిలో అతన్ని వెతుక్కుంటూ పోగాపోగా
నాగజాతి నాయకుడు ఆదిశేషుడు కనిపించాడు. ఆయనతో ఉదంకుడు తన బాధను చెప్పి మొర పెట్టుకున్నాడు. అక్కడ చాలామంది స్త్రీలు తెలుపునలుపు దారాలతో బట్టలు నేస్తున్నారు.
పన్నెండు ఆకులు తో ఉన్న చక్రాన్ని తిప్పుతున్నారు. గుర్రాలు, కుక్కలు మొదలైన జంతువులు
వారి దగ్గర ఉన్నాయి. చీకటి పడుతున్నందున ఉదంకుడు తనకు గురువు నేర్పించిన విద్యను ఉపయోగించాడు. చెకుముకి రాళ్ళతో నిప్పును రాజేసి ఒక దివిటీని తయారు చేసినాడు. నాగజాతి
నాయకుడు ఆదిశేషుడు ఆశ్చర్యపోయినాడు. దాంతో తమకు వెలుగు నిచ్చిన ఉదంకుని మెచ్చుకుని
తన భటుల ద్వారా తక్షకుని దగ్గర ఉన్న కుండలాలను తెప్పించినాడు. ఉదంకునికి ఒక గుర్రాన్ని కూడా బహుమతిగా ఇచ్చి అతన్ని సత్కరించి పంపినాడు. ఉదంకుడు తిరిగి గురువు దగ్గరకెళ్ళి
గురుపత్నికి కుండలాలను సమర్పించుకున్నాడు. పైలుడు ఉదంకుని గురుభక్తికి మెచ్చి కొన్ని ప్రకృతి రహస్యాలు బోధించాడు.భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయి. దాంతో ఆరు రుతువులు కూడా ఏర్పడినాయి. రుతువులు ఉండటం వల్ల ప్రజలు వ్యవసాయం చేయగలుగుతున్నారు.
అడవిలో చూచిన నాగజాతికి దేవుడు నాగుపాము. నువు వాళ్ళ లోకంలోకి పోయి బయటపడటం
నీ అదృష్టం. నీకున్న తెలివితేటలతో నీ లక్ష్యాన్ని సాధించావు. నీకు అంతా మంచి జరుగుతుంది"
అని అతన్ని ఆశీర్వదించాడు.
నీవిద్య పూర్తయింది కాబట్టి నువు మీ ఇంటికి కెళ్ళి పోవచ్చని ఉదంకునితో చెప్పినాడు గురువు. గురువు పాదాలకు వందనంచేసి ఉదంకుడు తన ఇంటిముఖం పట్టినాడు.

మరిన్ని కథలు

Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati