సూతకపు మనిషి - రాము కోలా.దెందుకూరు

Sutakapu manishi

"అమ్మగోరూ" అన్న పిలుపు వినిపించడంతో,వంట గదిలో కూరగాయలను తరుగుతతూ, అసహనంగా ఉన్న సువర్చల వరండా వైపు దృష్టి సారించి, "ఎవ్వరదీ!"అంటూ తొంగి చూసింది "నేనమ్మ గోరు! రత్తాలు" బదులు పలికింది రత్తాలు. "ఓ !రత్తాలా? "ఏంటీ!ఇలా వచ్చావ్?" "ఏం లేదమ్మగోరు! ఇంటి దగ్గర కార్యక్రమాలు అంతా సక్కబెట్టెసుకున్నాను.." "ఇక రేపటి నుండి పనిలోకి వద్దామని! ,మీతో ఓ మాట సెప్పిపోదామని వచ్చినానమ్మ.!" అంటూ చెప్పుకోవలసింది చెప్పేసి, తలవంచుకుని మౌనంగా నిలబడి పోయింది రత్తాలు.. "అవునా!" "నేనే నీకు కబురు చేద్దామనుకున్నాను!,ఇలోగా నువ్వే వచ్చినవ్"! "నిన్ననే అత్తయ్యగారు గుర్తుచేసారు!.రత్తాలు ఒక వేళ వస్తుందేమో?తనకు ఇవ్వవలసినవి లెక్కచూసి,ఇచ్చి పంపించేయండి." "అసలే సూతకపు మనిషి," "మనకేమో!మడి, ఆచారాలు సంప్రదాయాలు పాటించక తప్పదు." "మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా?"అని. సువర్చల నోటి వెంట వచ్చిన మాటలతో.... రత్తాలుకు తన కాళ్ళ క్రింద భూమి కదిలిపోతున్నట్లు....,తను అందులోనికి ఒక్కసారి గా జారిపోతున్నట్లు అనిపించిందేమో!. గేటును ఆసరాగా పట్టుకుంది. కళ్ళ నీళ్ళు తిరుగుతుంటే. ఇది రత్తాలు ఊహించని పరిస్థితి. భరోసాగా నిలుస్తారనుకున్న ఇంటి యజమాని నుండి ఊహించని మాట. ఇదే ఇంటిని నమ్ముకుని ,గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉంది. . చాలీ చాలని సంపాదనతో ,ఇల్లు గడవడం కష్టంగానే ఉన్న సమయంలో ,కూడా మరో చోట పనికోసం ఆలోచించక ఇక్కడే పనిచేస్తూంది . ఇంటిలోని ఇద్దరూ ఆఫీసుకు వెళ్ళిపోగానే ఇంటి పనంతా చేసుకుని ,పిల్లల్ని ఆడించుకుంటూ. మంచంలో ఉన్న ,సువర్చల అత్తగారిని కంటికి రెప్పలా చూసుకుంటూనే, వాళ్ళు ఇచ్నిన జీతం రాళ్లతో కుటుంబంనం నెట్టుకు వస్తుండేది గత కొంత కాలంగా. ఇంటోడు తాగుడుకు బానిసైనా, ఇల్లు గుల్ల చేస్తున్నా! ఇక్కడ వచ్చె జీతం డబ్బులతో పిల్లల్ని సర్కారు బడిలో చేర్పించి, కష్టమైనా ఇక్కడే పని చేసుకుంటూ ఉండిపోయింది. "ఇక్కడే ఉండు!డబ్బులు తెచ్చిస్తా." "ఇంట్లోకి రాకు,అత్తయ్యగారికి మడి ఆచారం మీద పట్టు ఎక్కువ. నీకు తెలుసుగా"... "ఇంటిని మైలచేసావని గోలగోల చేస్తుంది.ఇల్లు కడుక్కోలేక నేను చావాలి"అనుకుంటూ లోపలకు వెళ్ళింది సువర్చల... *** పవిట చెంగులో జారవిడిసిన డబ్బులను తీసుకుని ,దిగాలుగా ఇంటి బాట పట్టింది రత్తాలు. చేతిలో ఉన్న ఒక్కగానొక్క ఉపాధి చేజారింది. తోడున్న మావ ఒంటరిని చేసి తన దారి తాను చూసుకున్నాడు,ఇప్పుడు ఏటిసేయాల? అనేక ఆలోచనలు చుట్టుముట్టేస్తుంతే,ముఖంలో నిస్సహాయతను నిలుపుకుంది రత్తాలు. "అమ్మగోరు చెప్పినట్లుగా,ఎవ్వరి ఆచారాలను వారు పాటించక తప్పదు కదా?" "మునుపట్లా తను బొట్టూ, కుంకుమలతో ఇంట తిరుగలేదు. ఒకరోజున కాకున్నా ! మరో రోజైనా బయటకు వెళ్ళే వారికి తను ఎదురుపడక తప్పదు." "అమ్మగారు సర్దుకున్నా!ఇంట్లో వారు సర్దుకుంటారని లేదు కదా?ఇదే అమ్మగారు ఆలోచించిందేమో.?" అనుకుని ఉంటుంది రత్తాలు మనుసులో. ******* రత్తాలు చిన్న షాపు నడుపుకుంటూ,తన పిల్లలను చదివించుకుంటుంది. సువర్చల ఉద్యోగం చేస్తున్న కాలేజీ దగ్గరరే. కానీ!రత్తాలుకు ఇలా చేయమని చెప్పింది ఎవ్వరో? రత్తాలుతో షాపు పెట్టించింది ఎవ్వరో? నేటి వరకు ఎవ్వరికీ తెలియదు.! రత్తాలుకు మాత్రమే తెలిసిన విషయం. సువర్చల కొంగులో జారవిడిచిన డబ్బులు తీసుకుని, చేసేందుకు పని లేదు ఎలా? పనిలోకి తిరిగి పెట్టుకుంటారనే ఆశలేదు ఎన్నాళ్ళు ఈబాధ అని దేవుడితో మొరపెట్టుకోవాలని వారం తరువాత , ఇంటి దగ్గర్లో ఉన్న గుడికి దగ్గర కూర్చుంది రత్తాలు. గుడి బయట మెట్లదగ్గర కూర్చుని కన్నీళ్లు పెట్టులుంటున్న రత్తాలుకి "ఒసే రత్తాలు" అన్న పిలుపు వినిపించిన వైపు తల తిప్పి చూసింది... ఎదురుగ్గా ముసలామే! సువర్చల అత్తగారు. "హు..!ఈమెకెంత సేవ చేసానూ!..కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా! చాదస్తపు పట్టింపులతో నా కడుపు కొట్టింది ఈయమ్మే కదా!" అనుకుందేమో మనసులో.. కనీసం తొలి ఎత్తి కూడా చూడలేదు రత్తాలు. "ఏంటి రత్తాలు ఉలకవు పలకవు!" అన్న ఆమె పిలుపుతో ఆలోచనల నుండి బయటపడి "ఆ.. పెద్దమ్మ గోరు! బాగున్నారా?" అంటూ పలకరించింది రత్తాలు.. మనసులో ఆమెపట్ల ఉన్న కాస్త కోపంను అదుపు చేసుకుంటూ. "నువ్వు కనిపిస్తావో లేదో అనుకుంటూనే.! గుడికి వస్తున్నా!...నీకోసం" అంది అదో ఆనందం ఆమె ముఖంలో.. "అదేంటమ్మగోరు" మీరు నాకోసం గుడికి రావడం ఏంటి, ఆశ్చర్యంగా అన్న రత్తాలుతో.. "అవునే.రత్తాలు. నువ్వు పని మానేసినట్టు నాకు తెలియదు" "నాపేరు చెప్పి కోడలు మాన్పించేసింది నిన్ను,అనే విషయం అర్థమైంది. "ఏ పనిమీద బయటికి వెళ్తున్నా! నీ ముఖం ఎదురుపడతదేమో?.. పైగా సూతకపు మనిషి ఇంట్లో ఎందుకని ,తను నీకు పనికి రావద్దని చెప్పేసింది.,అని అర్థం చేసుకున్నాను" "ఈ వయసులో వారితో వాదించే లేను" "ఇన్నాళ్లు నువ్వు నాకు ఎంతో సేవ చేశావ్..ఎప్పుడూ నీకు ఏమైనా ఇద్దామని మనసులో ఉండేది".. "ఎప్పటికప్పుడు వీలుపడేది కాదు" "చేతిలో పని లేక , కష్టాల్లో ఉన్న నీకు ఒక ఉపాధి చాలా అవసరం,అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను." కష్టంలోనే మనిషికి మనిషి తోడుగా నిలవాలి,అదే మానవత్వం.ఇది ఉంచు" అంటూ కొంత డబ్బు తీసి రత్తాలు చేతిలో పెట్టింది సువర్చల అత్తగారు. ఆప్యాయంగా రత్తాలు తొలి నిమురుతూ. "పెద్దమ్మ గోరు మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు మన్నించండి." చేతులెత్తి కన్నీళ్ల పర్యంతం అయింది రత్తాలు. నీ స్థితిలో నేను ఉన్నా అలాగే అపార్థం చేసుకుంటాను, రేపటి నుండి ఏం చేయాలో ,ఎలా చేయాలో నీకు అన్నీ వివరంగా చెపుతా!అలా చెట్టు క్రింద కూర్చుందాం పదా!"అంటుంటే గుడిలో దేవత తనకోసం బయటకొచ్చి వరమిచ్చినట్టు అనిపించింది రత్తాలుకి.. "మానవ సేవలోనే మాధవుని సేవ దాగున్నది" అంటే ఇదేనేమో! దైవం సువర్చల అత్తగారి రూపంలో ఆదుకున్నాడని మనసులోనే దండాలు పెట్టుకుంది రత్తాలు.. రత్తాలు షాప్ వెనుక కథ..మానవత్వపు కథ . రత్తాలుకు,సువర్చల అత్తగారికి మాత్రమే తెలిసిన వాస్తవం. //శుభం.//

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి