దూరపుకొండలు - శింగరాజు శ్రీనివాసరావు

Doorapu kondalu

దూరపుకొండలు ‘దూరపుకొండలు నునుపు’ అన్న సామెతకు అర్థమేమిటో అమెరికాకు వచ్చాక గానీ తెలియలేదు వర్చలకు. సంవత్సరానికి అరవై వేల డాలర్లంటే రూపాయలలోకి మార్చుకుని సంబరపడి పోయింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే గానీ అసలు విషయం బోధపడలేదు. ఇంటి అద్దె, కరెంటు, ఇన్స్యూరెన్సు కలిపి మూడువేల డాలర్లు ఢమాల్. తిండి చూద్దామంటే కనీసం పదిహేను వందల డాలర్లు కావాలి. మోజుపడి నెలకొక సారి హోటలుకు వెళితే కనీసం వంద డాలర్లు గోవింద. నాలిక చవిచెడి కరివేపాకు కారం కొట్టుకుని తినాలని అనిపించి షాపుకెళ్ళి చూస్తే నాలుగు రెబ్బలు గట్టిగా లేవు డాలరు గుంజాడు పింజారి వెధవ. ఏమిటో అమెరికాలో ఉన్నామన్న పేరే గానీ, ఒక పనిమనిషా పాడా, ఇంటెడు చాకిరీ తనే చేసుకోవాలి. అన్ని ఆశలు చంపుకుని గీచి గీచి ఖర్చుపెడితే చివరకు నెలకు అయిదు వందల డాలర్లు కూడా మిగలడం లేదు. అమెరికాకు వచ్చిన ఆనందం కూడ లేకుండా ఇంటికే అతుక్కుపోయిన దుస్థితికి తెగ కుంగిపోయింది వర్చల. పులి మీది పుట్రలా ఇప్పుడు మరొక ఇబ్బంది వచ్చిపడింది. వచ్చేవారం తన మేనత్త రాధ వస్తున్నాని ఫోను చేసింది. అమెరికాలో కూడ అంటురోగంలా వదిలిపెట్టడం లేదు ఈ బంధువులు. పాపం ఇందులో వాళ్ళ తప్పేమున్నది. అమెరికాలో అడుగడుగునా భారతీయులే కాళ్ళకు అడ్డం తగులుతుండిరాయె. బీరకాయ పీచు అనుబంధం ఉన్నా సరే అలా వాలిపోతున్నారు బంధుజనం ఇక్కడ. మరల ఖర్చు వచ్చిపడిందని బాధపడసాగింది వర్చల. ఆ విషయం పక్కన పెడితే వచ్చిన వాళ్ళు కూర్చోను కుర్చీ కూడ లేదు కొంపలో. అదే విషయమై చర్చ జరిగింది ఇంటిలో. “ బాబీ మా అత్తయ్య వాళ్ళు వస్తే కూర్చోను కుర్చీ కూడ లేదు. ఎలాగైనా ఒక సోఫా కొందాం. అటు కూర్చోను, ఇటు పడుకోను రెండింటికీ పనికి వస్తుంది” అడిగింది వర్చల. “ఆఫీసులో అడిగాను వర్చలా. ఇక్కడ ఫర్నిచరును కొంటే దాని ఖరీదును కంతుల వారిగా కట్టవచ్చట. ఒకవేళ నచ్చకపోతే తిరిగి ఇచ్చేయొచ్చట. టైమ్ లిమిట్ లేదుట. అందుకే ఇక్కడ చాలా మంది అలా తెచ్చి వాడుకుని పనయిపోగానే తిరిగి నచ్చలేదని చెప్పి ఇచ్చేస్తారట” చెప్పాడు బాబీ. ఆ మాటలు అమృతవాక్కులలా వినిపించాయి వర్చలకు. వెంటనే వెళ్ళి సోఫా తెచ్చేశారు. నెలకు యాభై వందల డాలర్లు చొప్పున చెల్లించే పద్దతిన, నచ్చకపోతే థిరిగి ఇచ్చేసేలా కొన్నారు. అడ్వాన్సుగా అయిదు వందల డాలర్లు కట్టారు. మనసులో ఎలాగైనా తిరిగి ఇచ్చేసే కదా అనే ధైర్యంతో. ఇదేదో బాగుందే ఇక్కడ అని సంబరపడి పోయింది వర్చల. ****** మేనత్త మనవడితో సహా రావడం, ఒక వారం ఉండి పోవడం జరిగిపోయింది. అత్త సంగతెలా ఉన్నా, ఆమె మనవడు మాత్రం పిల్ల రాక్షసుడిలా ఇంటిని భీభత్సం చేసి వదిలిపెట్టాడు. వాడి గోలకు తల బట్టకట్టింది వర్చలకు. వాళ్ళు వెళ్ళడంతో వాన కురిసి వెలిసినట్టయింది. ఇక సోఫాతో పని అయిపోయింది కదా అని దాన్ని తీసుకెళ్ళి షాపులో ఇచ్చేశారు. ఇచ్చిన అడ్వాన్సు తిరిగి వసూలు చేసుకుందామని కౌంటరు దగ్గర నిలుచున్నారు. ఇంతలో సేల్సుమెన్ వచ్చి వాళ్ళను సూపర్ వైజరు రమ్మంటున్నారని చెప్పాడు. వెళ్ళి చూస్తే అక్కడ సోఫాను శల్య పరీక్ష చేసి ‘అడుగుభాగంలో ఎవరో బ్లేడుతో కోశారు, ఇలాంటి డామేజయిన సోఫాను తిరిగి తీసుకోమని’ అతను చెప్పాడు. ఒక్కసారిగా బిత్తరపోయింది వర్చల. అంత అడుగుకు వెళ్ళి ఎవరు కోసి ఉంటారు? ఇంకెవరు ఆ పిడుగురాముడే. వీడ్ని తగలెయ్య. నా కొంప ముంచాడు. చేసేదిలేక సోఫాను ఇంటికి పంపమని చెప్పాడు బాబి. కొన్నప్పుడు మాత్రమే ఫ్రీ సర్వీసు, ప్రతిసారి కాదని చెప్పడంతో మరో వంద డాలర్లు చెల్లించి సోఫాను ఇంటికి తెచ్చుకున్నారు. భార్య అతి తెలివికి ఫలితంగా అదనంగా పడ్డ భారాన్ని తలుచుకుని బేరుమన్నాడు బాబి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లయిందని తలగొట్టుకుంది వర్చల.

మరిన్ని కథలు

Pakkinti Anitha
పక్కింటి అనిత
- తాత మోహన కృష్ణ
Vruthi dharmam
వృత్తిధర్మం
- - బోగా పురుషోత్తం
నది తోసుకుపోయిన  నావ!
నది తోసుకుపోయిన నావ!
- కొత్తపల్లి ఉదయబాబు
Kadivedu neellu.2
కడివడు నీళ్ళు . ముగింపు
- రాము కోలా.దెందుకూరు.
Kadivedu neellu.1
కడివెడు నీళ్ళు. మొదటి భాగం.
- రాము కోలా.దెందుకూరు.
Lat Lat aar
లట లట ఆర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Ettuku pai ettu
ఎత్తుకు పైఎత్తు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Devudu soottaantadu
దేవుడు సూత్తాంటడు..! (క్రీమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్