అనుమానం - తటవర్తి భద్రిరాజు

Anumanam

సుబ్బయ్య ఇంటి నుండి వెళ్ళిపోయి రెండు సవంత్సరాలు అయ్యింది. సుబ్బయ్య భార్య నర్సమ్మ సుబ్బయ్య కోసం వెతుకుతూనే ఉంది. సుబ్బయ్య ఎదో ఒక రోజు వస్తాడు అని. సామర్లకోట లోని భీమేశ్వర స్వామి గుడి పక్కనే ఉండే రైలు పట్టాలు పై సుబ్బయ్య బలవంతం గా ప్రాణాలు తీసుకున్నాడు అని నర్సమ్మ కు తెలియదు. ఊరు చివర చిన్న తాటి ఆకు పాక లో సుబ్బయ్య హోటల్ ఉండేది. ఇంకా సూర్యుడు మేల్కోక ముందే సుబ్బయ్య, నర్సమ్మ లేచి వేడి వేడి ఇడ్లీ, పూరీ , మైసూర్ బజ్జి సిద్ధం చేసేవారు. ఇడ్లీ లోకి శనగపప్పు పచ్చడి చేసి , పూరీ లోకి బంగాళదుంప కూర చేసి ఉదయాన్నే అందించే వారు. మైసూరు బజ్జి ల లోకి బొంబాయి చట్నీ తయారు చేసే వారు. సుబ్బయ్య హోటల్ లో పలహారాలు అంటే ఊర్లో చాలా మంది ఇష్టపడేవారు. తెల్లవారు జామునే పనిలోకి వెళ్లే కూలీలు సుబ్బయ్య హోటల్ లొనే టిఫిన్స్ చేసి , టీ లు తాగి బయలుదేరేవారు. స్కూల్ పక్కనే బార్బర్ షాప్ ఉన్న మంగలి నాగన్న సుబ్బయ్య హోటల్ లో పూరీ తినకుండా ఏ రోజు కూడా షాప్ తెరవడు. ఒకప్పుడు పెద్ద వీధి లో ఇంటి ఇంటి కి వెళ్లి క్షవరాలు చేసేవాడు ఈ నాగన్న . వయసు పెరగడం తో ఇంటి ఇంటి కి తిరగలేక ఈ మధ్యనే స్కూల్ పక్కన ఉన్న కాళీ స్థలం లో చిన్న బార్బర్ షాప్ పెట్టుకున్నాడు. రామాలయం వెనుక మర్రి చెట్టు కింద సైకిల్స్ రిపేర్ చేసే బాషా ఇంటి నుండి బయలు దేరేటప్పుడే సుబ్బయ్య హోటల్ కేసి వెళ్లి ఇడ్లీ పొట్లం కట్టించుకుని తన పనికి బయలుదేరావాడు. కాండ్రకోట హైస్కూల్ లో లెక్కల మాస్టర్ గా పని చేసే రాజారావు మాస్టారు ఉదయం 7 గంటలకు సుబ్బయ్య హోటల్ దగ్గర టిఫిన్ చేస్తేనే కానీ బయలుదేరేవారు కారు. సాయంత్రం 4 గంటల నుండే వేడి వేడి మిరపకాయ బజ్జీలు , చల్ల పుణుకులు కారపు పొడితో అందించేవాడు. పనులకు వెళ్లి అలిసిపోయి ఇంటికి వచ్చే వాళ్ళు సుబ్బయ్య హోటల్ దగ్గరే ఆగి ఆ చల్ల పుణుకులు , బజ్జీలు ఆరగించి ఇళ్లకు వెళ్లే వారు. కొన్నేళ్లే క్రితం ఎక్కడ నుండో ఈ ఊరు వచ్చిన సుబ్బయ్య చిన్న తాటి ఆకు పాక వేసుకుని , తనకు ఉన్న పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని ఇక్కడి వారికి రుచి చూపించాడు. సుబ్బయ్య అందించే రుచులకు మైమరచి పోయి తినేవారు పిల్లలు, పెద్దలు. ఈ హోటల్ మీద నెమ్మది నెమ్మది గా బాగానే సంపాదించి ఒక ఇల్లు కట్టుకున్నాడు. కానీ హోటల్ మాత్రం తాటి ఆకుల పాక లొనే నడిపించేవాడు. ఊరి ప్రెసిడెంట్ గారు " ఎరా సుబ్బయ్య బాగానే సంపాదించావు కదా ఇంకా ఆ పాక ఎందుకు రా ? పెద్ద బిల్డింగ్ లోకి హోటల్ మార్చరా అంటే .... నాకు బాగా అచ్చువచ్చింది అయ్యగారు అంటూ నవ్వుతూ చెప్పేవాడు. సుబ్బయ్య హోటల్ లో ఉండి టిఫిన్స్ అమ్ముతుంటే నర్సమ్మ తరవాత రోజు కు కావాల్సిన కిరాణా సామాను తేవడానికి పక్కనే పట్నం వెళ్ళేది. రోజూ ఉదయం పది గంటలకు అలా వెళ్లి కావలిసిన సామాను అన్నీ తెచ్చేది. మధ్యాన్నం నుండి కావాల్సిన పిండి రుబ్బుకోవడం మిగిలిన పనులు చూసుకొనేది. ఎన్నేళ్ళు ఐనా పిల్లలు లేక పోవడం తో సుబ్బయ్య , నర్సమ్మ కాకినాడ లోని చాలా హాస్పిటల్ ల చుట్టూ తిరిగారు. ఐనా పిల్లలు కలగలేదు. ఇంక విసిగిపోయి హాస్పిటల్ ల చుట్టూ తిరగలేక పిల్లలు వద్దు అనుకున్నారు. మర్రిపూడి లోని ధాన్యం వ్యాపారం చేసే మల్లిరెడ్డి పెద్ద అప్పార్రావు ఒకసారి సుబ్బయ్య హోటల్ కి టిఫిన్ చేయడానికి వచ్చి కాకినాడ లో ఒక మంచి డాక్టర్ గారు ఉన్నారు నేను అడ్రస్ ఇస్తాను ఒకసారి వెళ్ళు అని చెప్పాడు. మల్లిరెడ్డి పెద్ద అప్పారావు ఇచ్చిన అడ్రస్ పట్టుకుని కాకినాడ బానుగుడి జంక్షన్ రెండో వీధి లో ఉండే డాక్టర్ వాడ్రేవు వాణి దగ్గరకి వెళ్ళాడు సుబ్బయ్య. వాడ్రేవు వాణి అనే గైనకాలిజిస్ట్ ఇద్దరికీ చాలా టెస్టులు చేసి ఇంక మీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసారు. అప్పటికే పిల్లల మీద ఆశ వదిలేసుకున్న సుబ్బయ్య ఇక ఈ జన్మ కు ఇంతే అని తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పటిలాగే నర్సమ్మ కిరాణా సామాలు తెస్తూ ఉంది. సుబ్బయ్య టిఫిన్స్ అమ్ముతూ ఉన్నాడు. ఓరోజు వడ్లమూరు నుండి ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా ఊళ్ళో కి వచ్చిన పోస్టుమాన్ వెంకటేశం సుబ్బయ్య హోటల్ దగ్గరకి టిఫిన్ చేయడానికి వచ్చాడు. ఇక్కడ టిఫిన్ రుచి చూసిన వెంకటేశం అక్కడ నుండి ప్రతీ రోజు ఇక్కడే టిఫిన్ చేసేవాడు. అలా పరిచయం అయిన వెంకటేశం ఖాళీగా ఉన్నప్పుడు అల్లా రోజూ వచ్చి సుబ్బయ్య తో కబుర్లు చెప్పేవాడు. ఓరోజు వెంకటేశం సుబ్బయ్య తో మాట్లాడుతూ పక్కనే ఉన్న పట్నానికి వెళ్ళడానికి నర్సమ్మ కు మూడుగంటలు ఎందుకు పడుతుంది ? నేను ఐతే ఒక గంట లో వెళ్లి వస్త్తాను అన్నాడు. సుబ్బయ్య మనసులో ఎదో అనుమానం నాటుకుంది. అక్కడి నుండి నర్సమ్మ ను రోజు 'ఎందుకు లేట్ అయ్యింది' అని అడుగుతూ ఉండేవాడు. ఈ ప్రశ్నకు విసుగెత్తిన నర్సమ్మ ఏంటి నీకు అనుమానం నా మీద అని గట్టిగా అడిగింది. అవును మరి పక్కనే ఉన్న పట్నానికి వెళ్లి రావడానికి నీకు ఇన్ని గంటలు ఎందుకు ? అక్కడ నువ్వు ఎవరితో నో తిరుగుతున్నావు అన్నాడు కోపంగా ..! నేను ఆటో లో వెళ్లి రావాలి కదా అని తన వెర్షన్ నర్సమ్మ చెప్పినా సుబ్బయ్య పట్టించుకోలేదు. అక్కడి నుండి సుబ్బయ్య కు నర్సమ్మ పై అనుమానం పెరుగుతూనే ఉంది. నర్సమ్మ ఏం చేసినా సుబ్బయ్య అనుమానం గానే చూసే వాడు. సుబ్బయ్య వ్యవహారం తో విసిగిపోయిన నర్సమ్మ తన బాధ అంతా ఊళ్ళో ఉన్న గుడి పూజారి గారితో చెప్పుకుని బాధ పడింది. నర్సమ్మ బాధ కు కరిగిపోయిన పూజారి గారు సుబ్బయ్య ను పిలిచి నచ్చ చెప్పారు. అంతే కాకుండా ఇక నుండి నర్సమ్మ పట్నానికి వెళ్ళడానికి ఒక ఆటో ఏర్పాటు చేయమని కూడా పూజారి గారు సర్దుబాటు చేశారు. పూజారి గారి మాటలు నచ్చిన సుబ్బయ్య ఒక ఆటో మాట్లాడి దాని లొనే పట్నానికి పంపేవాడు. ప్రతీ రోజు అదే ఆటో లో వెళ్లి వస్తూ ఉండేది నర్సమ్మ. ఆటో డ్రైవర్ కాశీ నర్సమ్మ ను ప్రతీ రోజు తీసుకు వెళ్లి వస్తూ ఉండేవాడు. ఇలా కొంత కాలానికి నర్సమ్మ కాశీ మధ్య సాన్నిహిత్యం పెరిగి , స్నేహం గా మారి ఆ స్నేహం ప్రేమ గా మారింది. చాలా కాలానికి ఆ విషయం తెలుసుకున్న సుబ్బయ్య ఆ విషయం ఎవరికి చెప్పలేక, తనలో తానే కుములిపోతూ ఇంటి నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు. 'సుబ్బయ్య కు కాశీ తో తన ప్రేమ విషయం తెలుసు' అని తెలియని నర్సమ్మ సుబ్బయ్య కోసం ఎదురు చూస్తూ కాశీ ఆటో లో వెళ్లి వస్తూ హోటల్ నడిపిస్తూ ఉంది. ఊళ్ళో జనం ఎప్పటిలానే ఆ హోటల్ రుచులు ను ఆస్వాదిస్తూనే ఉన్నారు.

మరిన్ని కథలు

Nene apaadhini
నేనే అపరాధిని
- సరికొండ శ్రీనివాసరాజు
Parasuraamudu
భాగవత కథలు - 16 పరశురాముడు
- కందుల నాగేశ్వరరావు
Jeevitaniki maro vaipu
జీవితానికి మరోవైపు ......
- జీడిగుంట నరసింహ మూర్తి
Sumangali
సుమంగళి
- మద్దూరి నరసింహమూర్తి
Yagnam
యజ్ఞం
- శింగరాజు శ్రీనివాసరావు
Chandra vamsham
భాగవత కథలు – 15 చంద్ర వంశం
- కందుల నాగేశ్వరరావు