సింహాసనం - యు.విజయశేఖర రెడ్డి

Simhasanam

ఉదయగిరి రాజ్యాన్ని రత్నదీపుడు పాలించేవాడు అతని భార్య కళావతి. వారికి ముందుగా ఇద్దరు కవలలు గుడ్డివాళ్లుగా జన్మించారు వారి పేర్లు రాముడు,లక్ష్మణుడు తరువాత ఇద్దరు కవలలు మూగవారుగా జన్మించారు వారి పేర్లు సూర్యుడు,చంద్రుడు చివరకు ఒక్క పిల్లవాడు మరుగుజ్జుగా జన్మించాడు అతని పేరు విజయుడు.

తన తదుపరి వంశాన్ని నిలబెట్టేవారు ఇలా పుట్టడం రాజుకు ఎంతో బాధ కలిగించింది, మహారాణి మంచం పట్టింది. ఈ విషయాలు ఎప్పటికప్పుడు గమనిస్తున్న పొరుగున ఉన్న సూర్యగిరి రాజు విక్రముడు ఉదయగిరి కోటను తన సైన్యంతో చుట్టు ముట్టాడు.

విషయం తెలిసిన రత్నదీపుడు మంత్రి సుశర్మ సహాయంతో మొత్తం కుటుంబంతో రహస్య మార్గం గుండా బయటపడి, నావ ద్వారా కోయెల గూడెం చేరుకున్నాడు. గూడెం దొర నాగరాజు రాజుకు ఆశ్రయం కల్పించి ఈ విషయం పొక్కకుండా జాగ్రత పడ్డాడు.గూడెంలోని వైద్యుడు మహారాణికి చక్కటి వైద్యం అందించడం వల్ల పూర్తిగా కోలుకుంది.

యువరాజులంతా పెరిగి పెద్దవారు అవ్వసాగారు. మరుగుజ్జు అయిన విజయుడు, దొర ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నాడు. విజయుడు గూడెంలో అన్ని శిక్షణలతో పాటు ఆయుర్వేద విద్యలో కూడా నైపుణ్యం సంపాదించాడు. ముందుగా గుడ్డివారైనా పెద్ద అన్నలు రాముడు,లక్ష్మణుల మీద ఆకు పసరులతో ప్రయోగాలు చేసి కళ్ళు వచ్చేలా చేశాడు,తరువాత చెట్ల వేర్లు, లేపనాలు తయారు చేసి మూగ వారైనా ఇద్దరు అన్నలు సూర్యుడు,చంద్రుడు మీద ప్రయోగించి మాటలు వచ్చేలా చేశాడు.

మరుగుజ్జు అయినా అన్నల పట్ల ఎంతో అభిమానం చూపిస్తున్న విజయుణ్ణి చూసి రాజు,రాణి ఎంతో సంతోషించారు.అన్నలందరికీ యుద్ద విద్యలలో మంచి శిక్షణ దొర ద్వారా ఇప్పించి గూడెం ప్రజలతో పెద్ద దండును తయారు చేశాడు విజయుడు.

విక్రముడు రాజు అయ్యాక ప్రజల పైన అనేక విధాలుగా పన్నుల భారం మోపాడు, కట్టని వారిని హింసలకు గురిచేయించేవాడు. ప్రజలంతా విక్రముణ్ణి చీదరించుకో సాగారు.అదే సమయంలో మంత్రి సుశర్మ మారువేషంలో ఉదయగిరి రాజ్యంలోని గ్రామాధికారులతో సమావేశమయ్యి విషయం చెప్పి విక్రముడిపై తిరుగుబాటుకు రంగం సిద్ధం చేశాడు.

విక్రముడు సభ కొలువు తీరి ఉండగా విజయుడు తన తల్లిదండ్రులు,అన్నలు,మంత్రి మరియూ కోయ దొరతో వచ్చాడు. “ఎవరు నువ్వు? మీరంతా దేనికి వచ్చారు?” అన్నాడు విక్రముడు.

మంత్రి అసలు విషయం చెప్పాడు. సభలోని వారంతా ఎంతో సంతోషించారు. “శత్రు శేషం ఇంకా మిగిలే ఉన్నదన్న మాట వీరినందరినీ బంధించండి” అన్నాడు విక్రముడు. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు.

“రాజా! అనవసర రక్త పాతం వద్దు నువ్వు నేను కత్తి యుద్దం చేద్దాము... ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం!” అన్నాడు విజయుడు. సభలోని వారంతా ఇదే సమంజసమైన విషయం అని విజయుడికే వత్తాసు పలికారు.

విక్రముడు ఇక తిరగబడి లాభం లేదని “నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధం..మరి నువ్వు మరుగుజ్జువు కదా? నాతో సమఉజ్జీ ఎలా అవుతావు? అన్నాడు విక్రముడు. “నీకు ఆ భయం లేదు... నీకు నేనే సమఉజ్జీని” అన్నాడు విజయుడు. “అయితే సరే” అని మంత్రితో ఏదో చెప్పి రెండు కత్తులు తెప్పించి “వీటితోనే మనం యుద్దం చేయాలి” అని అన్నాడు విక్రముడు. అందుకు సరే అని రాజు ఇచ్చిన కత్తిని తీసుకున్నాడు విజయుడు.

కత్తి యుద్దం మొదలైంది... ఎవరికీ తీసి పోనంతగా పోరు జరిగింది. చివరకు విక్రముడి చేతిలోని కత్తి పొరపాటున అతని కాలికే గుచ్చుకుంది.. కాసేపటికే అతని శరీరమంతా నల్లబారి కన్నుమూశాడు విక్రముడు. అంటే విషం పూసిన కత్తితో విజయుణ్ణి చంపాలనుకున్నాడు విక్రముడు. కానీ చివరకు ‘తను తీసిన గొయ్యిలో తనే పడ్డాడు’ అని సభలోని వారు అన్నారు.

అందరూ విజయుణ్ణి ఎంతో ప్రశంషించి. విజయుడే యువరాజుగా పట్టాభిశక్తుడు అయితే బాగుంటుందని అన్నారు. దీనిని రత్నదీపుడు సమర్దించాడు, కానీ విజయుడు అందరికీ నచ్చజెప్పి, ఒక శుభ ముహూర్తాన పెద్ద అన్న రాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయించి రెండో అన్న లక్ష్మణుడిని మంత్రిగాను మిగతా ఇద్దరు అన్నగార్లు సూర్యుడు,చంద్రుడులను సైన్యాధికారులు గాను తను ముఖ్య సలహాదారుగాను రాజ్యానికి సేవలు అందిస్తామని సభలో ప్రకటించాడు.

విజయుడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ అభినందించారు.రత్నదీపుడు,కళావతి ఎంతో సంతోషించారు.

****

మరిన్ని కథలు

Veerini emani pilavali
వీరిని ఏమని పిలవాలి!
- సిహెచ్.వి.యస్. యస్. పుల్లంరాజు
SankalpaSiddhi
సంకల్ప సిద్ధి
- రాము కోలా.దెందుకూరు.
Voohala pallakilo
ఊహల పల్లకిలో
- కందర్ప మూర్తి
Vishanaagulu
విషనాగులు
- కొల్లా పుష్ప
Manishi nallana manasu tellana
మనిషి నల్లన..మనసు తెల్లన..
- బోగా పురుషోత్తం
Sandatlo Sademiya
సందట్లో సడేమియా
- అంబల్ల జనార్దన్
Viharayatralo vinodam
విహారయాత్రలో వినోదం
- కందర్ప మూర్తి